ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ ప్రాంతం.. క్రైమ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. మొన్నటికి మొన్న ఏకంగా ఎంబసీ ఏర్పాటు చేసి నిరుద్యోగులను చీట్ చేస్తున్న వైట్ కాలర్ క్రిమినల్‌ను పోలీసులు పట్టుకున్నారు. తాజాగా దోపిడీ దొంగలు సైతం ఘజియాబాద్‌ను గజగజా వణికిస్తున్నారు. ఇది.. ఘజియాబాద్‌లోని మాన్సి అనే జువెల్లరీ షాప్. ఈ షాపులోకి ఇద్దరు దోపిడీ దొంగలు చొరబడ్డారు. బ్లింక్ ఇట్, స్విగ్గీ ఫుడ్ డెలివరీ ఏజెంట్ల వేషంలో షాపులోకి వచ్చారు. లోపలికి రాగానే అక్కడ ఉండే సిబ్బందిని తుపాకీతో బెదిరించారు. గురువారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. తుపాకీ చూడగానే షాపులోని సిబ్బంది భయపడ్డారు. దీంతో దుకాణంలోని డిస్‌ప్లేలో ఉన్న ఆభరణాలను దోచుకున్నారు. వాటన్నింటినీ తమ బ్యాగుల్లోకి నింపుకుని అక్కడ నుంచి ఉడాయించారు..
READ MORE: Bananas: అరటి పండు మంచిదే.. కానీ ఇలా తింటే చాలా ప్రమాదం..!
మాన్సీ జువెల్లరీ నుంచి దాదాపు 20 కిలోల వెండి ఆభరణాలు, 125 గ్రాముల బంగారాన్ని దోచుకెళ్లినట్లు దుకాణం యజమాని తెలిపారు. ఐదారు నిమిషాల్లోనే మొత్తం ఊడ్చుకెళ్లినట్లు పేర్కొన్నారు. చోరీ జరిగిన సమయంలో మధ్యాహ్న భోజనం కోసం యజమాని ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో దోపిడీ దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ చోరీపై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు యజమాని తెలిపారు. కానీ పోలీసులు రావడానికి 20 నిమిషాలు పట్టింది. అప్పటికే దొంగలు పారిపోయారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐతే షాపులో పని చేస్తున్న సిబ్బంది హస్తం ఏదైనా ఉందేమో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు..