తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడించాలని నిర్ణయించుకుంది బిజెపి. దక్షిణాదిలో మరో రాష్ట్రాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతోంది. రాష్ట్ర నేతలు కూడా ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణ విషయంలో వేగంగా పావులు కదుపుతున్నారు. తెలంగాణపై దృష్టి పెట్టామని..రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నామని ఇక్కడి నేతలకు బలమైన సంకేతాలు ఇచ్చేలా అడుగులు వేస్తున్నారు.
అందులో భాగంగానే ప్రధాని మోడీ హైదారాబాద్‌కు వచ్చినప్పుడు పార్టీ కార్యకర్తల మీటింగ్‌లో ప్రసంగించారు. పార్టీ ముఖ్య నేతలు సైతం తెలంగాణలో రెగ్యులర్‌గా పర్యటిస్తున్నారు. తెలంగాణ నేత లక్ష్మణ్‌కు రాజ్యసభ సీటు ఇచ్చింది బీజేపీ. జాతీయ కార్యవర్గ సమావేశాలను సైతం హైదారాబాద్‌లోనే పెడుతోంది పార్టీ హైకమాండ్.
మరోవైపు…తెలంగాణ విషయంలో మరిన్ని నిర్ణయాలు ఆ పార్టీ తీసుకోనుందని తెలుస్తోంది. కొన్ని కీలక నామినేటెడ్ పదవులు తెలంగాణ నేతలకు కట్టబెట్టబోతున్నట్టు సమాచారం. పార్టీ రాష్ట్ర నేతల బయోడేటాలను అగ్రనాయకత్వం పరిశీలిస్తోందట. త్వరలోనే కొందరికి పదవులు వస్తాయని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కేడర్‌లో కూడా విశ్వాసం కలిగించేందుకు నేతలకు కేంద్ర ప్రభుత్వ నామినేటెడ్ పదవులు ఇవ్వాలని అనుకుంటోందట. పదవులు ఇస్తే పార్టీ శ్రేణుల్లో కూడా ఉత్సాహం నెలకొంటుందనేది బీజేపీ ఆలోచనగా తెలుస్తోంది. అంతో ఇంతో ప్రోటోకాల్ ఉన్న పోస్టులు ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. పార్టీ నేతలు కూడా గత కొంత కాలంగా నామినేటెడ్ పదవులు ఇవ్వాలని పెద్దల దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నారు. అడపాదడపా తెలంగాణకు పోస్టులు వస్తున్నా..ఈసారి పెద్ద ఎత్తున ఉంటాయనే ప్రచారం జరుగుతోంది…ఎస్టీ కమిషన్ సభ్యుడుతో పాటు పలు నామినేటెడ్ పదవులు తెలంగాణ నేతలను వరించబోతున్నాయనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయ్.
తెలుగు రాష్ట్రాల నుండి ఒకరికి రాజ్యసభ వచ్చే అవకాశం ఉందని…తెలంగాణ నుండే మరో వ్యక్తికి అవకాశం రావొచ్చని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభకు లక్ష్మణ్‌ను పంపించిన పార్టీ హై కమాండ్..మరో రాష్ట్రం నుండి ఇంకో నేతను పెద్దల సభకు పంపించే ఛాన్స్ ఉందని అంటున్నారు. మొత్తానికి..తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో ఉన్న బీజేపీ భారీ స్కెచ్ వేసినట్లుగానే తెలుస్తోంది.