రాజధానిలో కీలక ప్రాంతం గుంటూరు. మున్సిపల్ కార్పొరేషన్‌లో చుట్టుపక్కల గ్రామాలను విలీనం చేస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిపై కోర్టుకు వెళ్లడంతో గుంటూరు కార్పొరేషన్‌కు పదేళ్లపాటు ఎన్నికలు జరగలేదు. ఆ సమయంలో అధికారులే కీలకంగా మారారు. గుంటూరు అభివృద్ది కూడా నత్తనడకన సాగింది. ఏడాదిన్నర క్రితం ఎన్నికలు జరగడంతో సమస్యలు పరిష్కారం అవుతాయని జనం ఆశించారు. కొత్త పాలకవర్గం కొలువుదీరింది కానీ.. సీన్ మాత్రం మారిపోయింది. ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసి గెలిచామని.. ఇప్పుడు పదవి ఉండగానే నాలుగు రాళ్లు వెనకేసుకోకపోతే ఎలా అని మెజారిటీ కార్పొరేటర్లు కౌంటర్లు తెరిచారట. సైడ్ ఇన్‌కం కోసం కొత్త దారులు తొక్కుతున్నారట. ఇదే ప్రస్తుతం గుంటూరులో హాట్ టాపిక్‌గా మారింది.
తమ పరిధిలో జరిగే వర్కులు చేసే కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకోవడం అన్ని చోట్లా జరిగే తంతే. కాకపోతే ఆదాయం కోసం కొంతమంది చేసే కక్కుర్తి పనులే అధికారపార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ఉన్నాయట. ఎక్కడైనా కొత్తగా నిర్మాణ పనులు మొదలుపెడితే.. అక్కడికి కూలీల కంటే ముందే కార్పొరేటర్లు లేదా వారి అనుచరులు వాలిపోతున్నారట. మీరు ఇల్లు కట్టుకుంటున్నారు సరే.. మా సంగతి ఏంటి అని ముఖం మీదే అడిగి జేబులు నింపుకొని వెళ్తున్నారట. నిర్మాణాలకు అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పినా.. లోపాలు వెతికి బరువు పెంచేస్తామని హెచ్చరిస్తున్నారట. అప్పటికీ మాట వినని వారి దగ్గరకు అధికారులను పంపి లేనిపోని హడావిడి చేస్తున్నారట.
ఆ మధ్య గుంటూరులో ఒకే సామాజికవర్గానికి చెందిన కొందరు కలిసి అపార్ట్‌మెంట్ కట్టుకుందామని భావించారు. ప్లాన్ కోసం దరఖాస్తు చేసుకున్నారట. వెంటనే ఆ ఏరియాలోని కార్పొరేటర్ కుమారుడు ఎంట్రీ ఇచ్చారట. ముందు మా వాటా సంగతి తేల్చాలని హుకుం జారీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. దాంతో ఆ విషయాన్ని ఆ సామాజికవర్గానికి చెందిన నాయకుడు దగ్గరకు తీసుకెళ్లారట. అదేంటీ అని ఆశ్చర్యపోయిన ఆ నాయకుడు.. తర్వాత రివర్స్ అయినట్టు తెలుస్తోంది. చివరకు ఏం చేసేది లేక.. కొంతమొత్తం అప్పగించి పనులు ప్రారంభించారట ఆ కమ్యూనిటీ ప్రతినిధులు.
నగరంలో రద్దీగా ఉండే వాణిజ్య ప్రాంతంలో వ్యాపారాలు నిర్వహించే వారిని పిలిపించిన ఓ కార్పొరేటర్ తన సంగతేంటని ప్రశ్నించారట. ఎప్పటి నుంచో తాము వ్యాపారాలు చేసుకుంటున్నామని.. ఇప్పుడేం చేయాలని వారు ఎదురు తిరగడంతో.. ఆ కార్పొరేటర్ ఇగో హర్ట్ అయిందట. వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను పంపించి షాపుల ముందు మెట్లను నేలమట్టం చేయించారట. దాంతో బెంబేలెత్తిపోయిన వ్యాపారులు ఆ నేతను గట్టి బరువుతోనే ప్రసన్నం చేసుకున్నారట. ఇదే విధంగా మరో కార్పొరేటర్ తన పరిధిలోని షాపుల నుంచి కొంత మొత్తం డిమాండ్ చేశాడట. ఆ విషయాన్ని నగరంలోని ప్రముఖ నేత వద్దకు తీసుకెళ్లారట వ్యాపారులు. వెంటనే ఆ నేత కార్పొరేటర్‌కు ఫోన్ చేసి.. ఇదేం పద్ధతి అని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. దీంతో మనస్తాపం చెందిన ఆ కార్పొరేటర్.. ఎన్నికల్లో లక్షలు ఖర్చు చేసి గెలిచింది ఇందుకేనా అని నిలదీశారట. అదే విషయం అనుచరుల దగ్గర చెప్పి వాపోయారట.
ఇటీవల ఓ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టిన వ్యక్తికి ఒక కార్పొరేటర్ నుంచి ఫోన్ వచ్చిందట. ఏంటా అని ఆరా తీస్తే నా సంగతేంటి అని అసలు విషయం బయట పెట్టాడట. ఆ సంగతి అధికారపార్టీ పెద్దల వద్దకు చేరింది. వెంటనే ఆ కార్పొరేటర్‌కు చీవాట్లు పెట్టినట్టు సమాచారం. ఇలాంటి ఉదాహరణలు గుంటూరులో చాలా ఉన్నాయనేది స్థానికంగా వినిపించే మాట. స్థానికులు కూడా వాటిని కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. ఇప్పటికే వసూళ్ల రాజాలపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోందట. పార్టీ పెద్దలు అది గమనించినట్టు తెలుస్తోంది. మరి.. సైడ్ బిజినెస్‌కు చెక్ పెడతారో లేదో చూడాలి.