Pawan Kalyan: విసన్న పేట భూముల మీద కేంద్ర పర్యావరణ శాఖకు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విశాఖ జిల్లా కశింకోట మండలం విస్సన్నపేటకు చేరుకున్న పవన్.. వివాదాస్పద భూములను పరిశీలించారు.. సర్వే నెంబర్ 195/2లోని 609 ఎకరాలను అధికార పార్టీ నాయకుల అండతో ప్రైవేట్ వ్యక్తులు హస్తగతం చేసుకున్నారని ఇప్పటికే లోకాయుక్తకు ఫిర్యాదు చేసింది జనసేన పార్టీ.. మంత్రి అమర్నాథ్, ఆయన అనుచరులు ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు.. అయితే, జనసేన ఆరోపణలకు తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. విస్సన్నపేట భూముల్లో తనకు సెంటు స్థలం ఉందని నిరూపించాలని సవాల్ చేశారు. తన ప్రమేయం కానీ.. భూమి ఉన్నట్టు నిరూపించినా జనసేనకు రాసిచ్చేస్తానని ఓపెన్ ఆఫర్ ఇచ్చిన విషయం విదితమే.
ఇక, విసన్నపేటలో భూములను పరిశీలించిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. ఈ వ్యవహారంపై గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేస్తాం అని ప్రకటించారు.. విస్సన్నపేటలో
అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.. వోల్టా చట్టం తుంగలో తొక్కారని విమర్శించారు. ఉత్తరాంధ్ర మీద వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రేమ లేదని.. ఉత్తరాంధ్ర భూములు మీదే ప్రేమ అని ఆరోపించారు. ఇక్కడ పర్యావరణానికి విఘాతం కలుగుతోందన్నారు. విస్సన్నపేటకు రావడానికి ఇరుకు రోడ్ ఉంది.. కానీ, వీరి రియల్ ఎస్టేట్ కి మాత్రం పెద్ద రోడ్ వేసుకున్నారు అని ఆరోపణలు గుప్పించారు పవన్ కల్యాణ్. మంత్రి గుడివాడ అమర్నాథ్ ను కాదు.. నేను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డినే అడుగుతున్నాను.. ఏంటీ ఈ దోపిడీ, దాష్టీకం.. కొండలను పిండి చేశారు, ప్రభుత్వ భూములు, రైతులు భూములను ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయడం, అభివృద్ది జరగడం పట్ల మాకు అభ్యంతరం లేదు.. ఒక వైపు ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు మరో వైపు 13 వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను దోపిడీ చేస్తే ఎలా ఊరుకోవాలి అంటూ మండిపడ్డారు పవన్.. ప్రజలు ఉపాధి లేక ఇబ్బందులు పడుతుంటే.. వైసీపీ నాయకులు మాత్రం రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి వేల కోట్లు దోచేస్తున్నారన్న ఆయన.. విస్సన్న పేటలో 600 ఎకరాలకు పైగా పోరంబోకు, దళితుల భూములను దోచేసుకున్నారని ఆరోపించారు. ఇందులో వాటర్ బాడీస్ క్యాచ్ మెంట్ ఏరియా కూడా ఉంది. పకృతి విధ్వంసం, వోల్టా యాక్ట్ కు విరుద్ధం అన్నారు. ఇక్కడ వేస్తున్న రియల్ ఎస్టేట్ కు అనుమతులు లేవు.. ఉత్తరాంధ్ర భూములు దోచేస్తూ ఉంటే ముఖ్యమంత్రి పట్టించుకోరు అని విమర్శించారు. తెలంగాణను ఇలానే దోచేస్తూ ఉంటేనే తన్ని తరిమేశారంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్‌జీటీ లాంటి కేంద్ర ఏజెన్సీ లకు ఫిర్యాదు చేస్తా.. మంత్రులు చేసే దోపిడీకి ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలి అంటూ సవాల్ చేశారు పవన్ కల్యాణ్.