YS Jagan: ఏపీలో జరుగుతున్న దాడులపై మోడీని కలుస్తామని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఏపీలో పరిస్థితులపై ఢిల్లీలో ధర్నా చేస్తామని ఆయన తెలిపారు. పల్నాడు జిల్లాలో వినుకొండలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని.. ఏపీలో పోలీసులు ప్రేక్షకపాత్రకు పరిమితమయ్యారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అండగా నిలవాల్సిన పోలీసులే బాధితులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఏపీలో ఆటవిక పాలన నడుస్తోందని.. 45 రోజుల పాలనలో 36 హత్యా రాజకీయాలు, 300కు పైగా హత్యాయత్నాలు, 560 ప్రాంతాల్లో ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం జరిగిందని మాజీ సీఎం జగన్ అన్నారు . వైసీపీ సానుభూతిపరుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. 490 ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారన్నారు. వెయ్యికి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయన్నారు. ఈ నెల 24న ఢిల్లీలో ధర్నా చేస్తామని.. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తామని వైఎస్ జగన్ అన్నారు.