Body Parts Found in Park: ప్రముఖ ప్యారిస్ పార్క్‌లోని వివిధ ప్రదేశాలలో ప్లాస్టిక్ సంచుల్లో ఛిద్రమైన మహిళ మృతదేహం లభించడంతో పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. మహిళ మరణానికి గల కారణాల గురించి ఫ్రెంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నెల ప్రారంభంలో ఫ్రెంచ్ రాజధాని ప్యారిస్‌కు ఉత్తరాన ఉన్న బుట్టెస్-చౌమాంట్ పార్కులో మహిళ శరీర భాగాలు లభించాయి. పార్క్‌లోని పలు ప్రాంతాల్లో మహిళ శరీర భాగాలు లభించడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. బుట్టెస్-చౌమాంట్ పార్క్ కొండలతో కూడిన చాలా అందమైన పార్కు. ఆ పార్కులో ఉదయమే జాగర్లు, ప్రకృతి ప్రేమికులు ఆ పార్కుకు వస్తుంటారు.
ప్యారిస్‌కు ఈశాన్యంగా ఉన్న సీన్-సెయింట్-డెనిస్‌లో భార్యాభర్తలతో పాటు ముగ్గురు పిల్లలు నివసిస్తూ ఉండే వారని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. 46 ఏళ్ల వయసు గల మహిళ ఫిబ్రవరి 6న తప్పిపోయినట్లు ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె అదృశ్యమైన వారం తర్వాత భర్త పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విచారణలో తేలింది. అనంతరం మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. పార్క్‌లో పని చేసే సిబ్బంది ఆకుల కింద దాచిన ప్లాస్టిక్ సంచిలో మహిళ మొండెం, తలతో పాటు మరిన్ని అవశేషాలను గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పార్క్‌లో క్షుణ్ణంగా తనిఖీ చేసి మహిళ శరీర భాగాలన్నింటిని కనుక్కొన్నారు. ఆ శరీర భాగాలు తప్పిపోయిన మహిళవేనని నిర్ధారించుకున్నారు.
Read Also: Simbu: ప్రియరాళ్లకు పెళ్లిలు చేసి.. పెళ్లి పీటలు ఎక్కుతున్న స్టార్ హీరో..?
అనంతరం భర్తను పిలిపించి పోలీసులు విచారించగా.. అతను పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన భార్యను తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. ఈ విషయాన్ని ఫ్రెంచ్ ఛానల్ బీఎఫ్‌ఎం టీవీ గతవారం నివేదించింది. ఈ సమాచారం ఛానెల్‌కు ఎలా లీక్ అయ్యిందనే దానిపై న్యాయవాదులు మరో విచారణ ప్రారంభించారు. ఈ పార్క్‌లో అనేక చిత్రాల షూటింగ్‌లు కూడా జరగడం గమనార్హం.