తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించినా.. ముఖ్యమంత్రి ఎంపిక అంశం కొలిక్కి రాలేదు. సోమవారం భేటీలు, సమావేశాలు, చర్చలు, ఇంకాసేపట్లోనే ప్రమాణ స్వీకారమనే ప్రచారాల మధ్య ఈ వ్యవహారం ఢిల్లీకి చేరింది. నేటి మధ్యాహ్నం 12 గంటలకు మల్లికార్జున ఖర్గేతో థాక్రే, డీకేఎస్ భేటీ కానున్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎంలు, మంత్రివర్గ ఏర్పాటుపై చర్చ జరగనుంది. నేడు కాంగ్రెస్ అధిష్టానం కార్యాచరణ ఖరారు చేయనుంది.
ఎస్సై నియామకాల సవాల్ రిట్ పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఎస్సై నియామకాలలో అన్యాయం జరిగిందని అభ్యర్థులు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. గతంలో ఎత్తు అంశంలో అర్హత కలిగిన అభ్యర్థులను తాజా రిక్రూట్‌మెంట్‌లో అనర్హులుగా అధికారులు పరిగణించారు. నేడు జడ్జి సమక్షంలో అభ్యర్థుల ఎత్తు కొలిచే ప్రక్రియ జరగనుంది.
నేడు అనంతపురంలోని రాయదుర్గంలో వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామజిక సాధికార బస్సు యాత్ర జరగనుంది. ఈ సామాజిక సాధికార యాత్రలో పలువురు వైస్సార్‌సీపీ నేతలు పాల్గొననున్నారు.
Also Read: Today Gold Price: భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?
బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుపాను సోమవారం తీవ్ర రూపం దాల్చింది. గంటకు పది కిలోమీటర్ల వేగంతో దక్షిణ కోస్తాంధ్రకు సమాంతరంగా కదులుతుండడంతో తీరం వెంబడి ఉన్న జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏపీ అంతటా అధికారులు అప్రమత్తమయ్యారు.
తెలంగాణలో మరో ఎన్నికల సైరన్ మోగింది. సింగరేణిలో ఈనెల 27న కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రెండు రోజులు కాకముందే సింగరేణిలో ఎన్నికల నిర్వహణకు డేట్ ఫిక్స్ అయ్యింది.