Nandamuri vs Akkineni: నటరత్న నందమూరి తారక రామారావు, నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమాకు రెండు కళ్ళు అని తెలుగు సినీజనం పదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు. అయితే ఆ ఇద్దరు మహానటులు నేడు లేరు. తెలుగు సినిమాకు వెలుగులు అద్దవలసిన బాధ్యత వారి నటవారసుల మీద ఎంతయినా ఉంది. కానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తోంటే ఆ రెండు కుటుంబాలకు చెందిన నటవారసుల మధ్య మాటల యుద్ధం మళ్ళీ మొదలయింది. ఇటీవల యన్టీఆర్ వారసుడు బాలకృష్ణ ఓ ఫంక్షన్ లో మాట్లాడుతూ “అక్కినేని… తొక్కినేని…” అంటూ వ్యాఖ్యానించడంపై రచ్చ రాజుకుంది. బాలయ్య వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టుగా అక్కినేని మనవడు నాగచైతన్య ఓ ట్వీట్ చేశారు. అందులో “యన్టీఆర్, ఏయన్నార్, యస్వీఆర్ కళామతల్లి ముద్దుబిడ్డలు… వారిని అగౌరవ పరచడం మనల్ని మనమే కించపరచుకోవడం…” అన్నది సారాంశం! అదే ట్వీట్ ను నాగార్జున చిన్నకొడుకు అఖిల్ రీట్వీట్ చేశారు. అక్కడ నుంచీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చోపచర్చలు మొదలయ్యాయి.
నందమూరి – అక్కినేని మధ్య ఏం జరిగింది?
వయసురీత్యా యన్టీఆర్, ఏయన్నార్ కంటే పెద్దవారు. కానీ, సినిమా రంగంలో ఏయన్నార్ సీనియర్. దాంతో ఇద్దరూ ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ బాక్సాఫీస్ బరిలో ఎంత పోటీ ఉన్నా, సొంత అన్నదమ్ములలాగే కలసి మెలసి ఉన్నారు. అక్కినేని కన్నతల్లి పున్నమ్మ సైతం యన్టీఆర్ ను తమ పెద్దబ్బాయిగానే అభిమానించేవారు. అలాగే యన్టీఆర్ కన్నవారు, ఏయన్నార్ ను తమ చిన్నబ్బాయిగా భావించేవారు. అంతటి అనుబంధం ఉన్న నందమూరి, అక్కినేని కుటుంబాల మధ్య వ్యక్తిగత వైరాలు ఏ నాడూ లేవు. యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరూ విదేశాలకు కలసి వెళ్ళాలనుకున్నారు. అయితే ఆ సందర్భంలో యన్టీఆర్ తీరిక లేక, వీలు కాలేదు. ఏయన్నార్ తీరిక చేసుకొని అమెరికా వెళ్ళారు. ఆ గ్యాప్ లో కొందరు స్వార్థపరులు అటు ఇటుగా, ఇటు అటుగా చేరి కొన్ని వదంతులు సృష్టించారు. దాంతో యన్టీఆర్, ఏయన్నార్ మధ్య కొంత దూరం పెరిగింది. ఆ తరువాత కూడా వారిద్దరూ కలసి ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ చిత్రంలో నటించారు. దాదాపుగా అదే సమయంలో ఏయన్నార్ తెలుగు సినిమా రంగం స్వరాష్ట్రానికి తరలిరావాలి అంటూ భాగ్యనగరం చేరారు. అప్పుడు యన్టీఆర్, ఏయన్నార్ వర్గాలు అంటూ తలెత్తాయి. అవి రోజు రోజుకూ మరింత బలపడుతూ వచ్చాయి. కొన్నాళ్ళు ఇద్దరి మధ్య మాటలు లేవు. అయితే యన్టీఆర్ ను పెద్దాయనగా చిత్రసీమ గౌరవించేది. అందుకు ఏయన్నార్ కూడా ఏ నాడూ అడ్డు చెప్పలేదు. ఏదైనా చిత్రసీమలో సమస్య తలెత్తితే, మధ్యవర్తుల ద్వారా చర్చించుకొని ఇద్దరూ ఓ నిర్ణయం తీసుకొనేవారు. అంతటి అనుబంధం ఉన్న అన్నదమ్ముల లాంటి యన్టీఆర్, ఏయన్నార్ మళ్ళీ 1975 ప్రాంతంలో కలుసుకున్నారు. ఇద్దరూ హైదరాబాద్ లో స్టూడియోస్ నిర్మించారు. ఏయన్నార్ తన అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభోత్సవానికి యన్టీఆర్ ను పిలిచారు. అలాగే యన్టీఆర్ తన రామకృష్ణా సినీస్టూడియోస్ ఆరంభోత్సవానికి ఏయన్నార్ ను ఆహ్వానించారు. ఆ పై యన్టీఆర్ డైరెక్షన్ లో ఏయన్నార్ ‘చాణక్య-చంద్రగుప్త’లో నటించారు. ఏయన్నార్ భాగస్వామిగా నిర్మితమైన ‘రామకృష్ణులు’లో యన్టీఆర్ అభినయించారు. తరువాత యన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర్లు నిర్మించిన ‘సత్యం-శివం’లోనూ ఇద్దరూ కలసి నటించారు. అలా సమానస్థాయి కలిగిన ఇద్దరు మహానటులు దాదాపు 14 చిత్రాలలో కలసి నటించడం అన్నది ప్రపంచంలోనే ఓ రికార్డు! దానిని సాధ్యం చేసిన ఘనత యన్టీఆర్, ఏయన్నార్ కే దక్కుతుంది.
పబ్లిగ్గా యన్టీఆర్ క్షమాపణ!
అంత చరిత్ర సృష్టించిన యన్టీఆర్, ఏయన్నార్ తమ చిత్రాల విజయోత్సవంలోనూ ఒకరికొకరు అతిథులుగా ఆహ్వానించుకున్న సందర్భాలూ లేకపోలేదు. రామారావు రాజకీయాల్లో అడుగు పెట్టడం కూడా ముందుగా నాగేశ్వరరావుతోనే చర్చించారు. యన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా, ఏయన్నార్ స్టూడియో కోసమని తీసుకున్న ప్రభుత్వ స్థలంలో టింబర్ డిపో నడుపుతున్నారని తెలిసింది. దాంతో యన్టీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దాంతో మళ్ళీ యన్టీఆర్-ఏయన్నార్ మధ్య విభేదాలు పొడసూపాయి. ఆ సమయంలో ఏయన్నార్ ఆసుపత్రి పాలు కావడం, యన్టీఆర్ వెళ్ళి పరామర్శించడం అన్నీ జరిగాయి. తరువాత ఆ స్థలమే నేడు ‘అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్’గా పేరొందిన స్టూడియోగా నిలచింది. అప్పటి నుంచీ మళ్ళీ యన్టీఆర్, ఏయన్నార్ మధ్య దూరం పెరిగింది. రామారావు చివరి సారి 1994లో ముఖ్యమంత్రి అయినపుడు, ఆయనను తెలుగు చిత్రసీమ ఘనంగా సన్మానించింది. ఆ ఉత్సవంలో ఏయన్నార్ పాల్గొనలేదు. ఆ వేదికపైనే యన్టీఆర్ తన ప్రసంగంలో లక్షలాది మంది సమక్షంలో “ఎందరు వచ్చినా, నా సోదరుడు ఏయన్నార్ రాకపోవడం వెలితిగా ఉంది. ఒకవేళ ఆయనను ఏమైనా బాధ పెట్టి ఉంటే క్షమించమని కోరుతున్నాను” అంటూ యన్టీఆర్ చెప్పారు. ఆ సమయంలో ఓ సినిమా షూటింగ్ నిమిత్తం వేరే ఊరిలోఉన్న ఏయన్నార్ ఈ విషయం తెలియగానే హుటాహుటిని వచ్చి, యన్టీఆర్ ను వెళ్ళి ఆలింగనం చేసుకున్నారు. మళ్ళీ అప్పటి నుంచీ చివరిదాకా అన్నదమ్ముల్లాగే మసలారు. అలా యన్టీఆర్, ఏయన్నార్ మధ్య పొరపొచ్చాలు వచ్చినా, చివరి దాకా ఒకరినొకరు గౌరవించుకున్నారే తప్ప ఏ నాడూ ఎవరినీ తక్కువ చేసుకున్నది లేదు.
అక్కినేని ఫ్యామిలీకి బాలకృష్ణకు మధ్య ఏం జరిగింది?
యన్టీఆర్ తనయులు ఏయన్నార్ ను ‘బాబాయ్’ అంటూ ఎంతగానో గౌరవించేవారు. అలాగే బాలకృష్ణ సైతం ఏయన్నార్ తో కలసి “భార్యాభర్తల బంధం, గాండీవం, శ్రీరామరాజ్యం” వంటి చిత్రాలలో నటించారు. బాలయ్య సంచలన విజయాలు సాధించినప్పుడు ఏయన్నార్ స్వయంగా అభినందించిన సందర్భాలూ లేకపోలేదు. అలాంటి బాబాయ్-అబ్బాయ్ మధ్య ఓ వేడుక కారణంగా పొరపొచ్చాలు తలెత్తాయి. ఏయన్నార్ కు సంబంధించిన ఓ వేడుక సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. అందులో నందమూరి ఫ్యామిలీ తరపున బాలకృష్ణ తమ్ముడు రామకృష్ణ హాజరయ్యారు. ఆ వేడుకలో వేదికపైకి అందరినీ పిలిచిన ఏయన్నార్ ఫ్యామిలీ రామకృష్ణను స్టేజీపైకి పిలువలేదన్న కారణంగానే బాబాయ్ అక్కినేనిపై బాలయ్య కోపం పెంచుకున్నారని అంటారు. అంతకు ముందు బాబాయ్ అంటూ ఎంతో అభిమానంగా పిలిచే ఏయన్నార్ కు తరువాత నుంచీ బాలకృష్ణ దూరంగా ఉన్నారు. ఆ దూరం తగ్గించాలని నాగార్జున ప్రయత్నించినట్టూ చెబుతారు. అయితే బాలయ్య తన పట్టు వదలలేదు. చివరకు కారణాలు ఏవైనా, ఏయన్నార్ కన్నుమూసినప్పుడు కూడా బాలకృష్ణ హాజరు కాలేదు. అప్పటి నుంచీ బాలయ్య, నాగార్జున మధ్య దూరం కూడా పెరిగిందనే చెప్పాలి. అయితే, సుబ్బరామిరెడ్డి వైజాగ్ లో నిర్వహించిన ఓ వేడుకలో బాలకృష్ణ, నాగార్జున ఇద్దరినీ కలిపారు. అప్పుడు వారి మధ్య ఏలాంటి భేదాలు లేవని హీరోలు చెప్పుకున్నా, అది వైజాగ్ వరకే పరిమితమైంది. తరువాత ఎప్పటిలాగే దూరం నెలకొంది.
రాజకీయ కోణం…
తాజాగా ‘వీరసింహారెడ్డి విజయోత్సవం’లో బాలయ్య తన ప్రసంగంలో ఏదో మాట్లాడుతూ “అక్కినేని… తొక్కినేని…” అనడం నేడు మళ్ళీ ఆజ్యం పోసింది. ఇక్కడ రాజకీయ కారణాలూ ఉన్నాయని తెలుస్తోంది. వైజాగ్ లో బాలకృష్ణ, నాగార్జునతో కలసి పోవడానికి అప్పట్లో తెలుగుదేశం అధికారంలో ఉంది. ఆ కారణంగా బాలయ్య, నాగ్ తో సయోధ్యకు అంగీకరించారు. కానీ, ఇప్పుడు నాగార్జున ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీతో సఖ్యంగా ఉన్నారు. అందువల్ల సహజంగానే తెలుగుదేశం పార్టీకి చెందిన బాలయ్యకు వారిపై వ్యతిరేకం ఉంటుంది. కానీ, బాలకృష్ణ రాజకీయ కోణంలో కాకుండా సినిమా వేడుకలో ‘అక్కినేని తొక్కినేని’ అనడంతోనే రచ్చ సాగుతోంది. బాలకృష్ణ సినిమాల్లో మాటల తూటాలు పేల్చడమే కాదు, నిజజీవితంలోనూ ఫ్లో లో ఏది పడితే అది మాట్లాడేసి, తరువాత క్షమాపణలు చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. బాలయ్య వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే బాలయ్య ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో మాట్లాడరని, ఏదైనా తప్పుంటే ఆయన అంగీకరిస్తారనీ సన్నిహితులు చెబుతున్నారు. దాంతో సోషల్ మీడియాలో ఈ రచ్చ నెటిజన్స్ కు ఆసక్తి కలిగిస్తున్నా, చిత్రసీమలో అనారోగ్యకరమైన వాతావరణం నెలకొల్పుతుందనే చెప్పాలి. ఏ సమస్యకైనా ఓ పరిష్కారం అంటూ ఉంటుంది. మరి ఈ రచ్చ ఎప్పుడు ఆగుతుందో చూడాలి.