Siddipet: ఎడతెరిపి లేని వర్షాలకు రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల వాగులు ఉప్పొంగడంతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సిద్దిపేట జిల్లాలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. సిద్దిపేట జిల్లాలో ఆఖరి మజిలీ కోసం అవస్థలు పడిన ఘటన తాజాగా చోటుచేసుకుంది.
Read Also: Heavy Rains: నేడు భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ! అస్సలు బయటకు రావొద్దు
చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల కోసం ఉప్పొంగుతున్న వాగులో పాడే మోస్తూ గ్రామస్థులు, బంధువులు ఈదుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. చేర్యాల మండలం వేచరిణి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతూ బాలయ్య అనే వ్యక్తి మృతిచెందారు. గ్రామస్థులు, బంధువులందరూ ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కానీ గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గ్రామంలో వాగు ఉప్పొంగుతోంది. అంత్యక్రియలు చేయాలంటే ఆ వాగు దాటాల్సి ఉంటుంది. ఇక దారిలేక స్మశాన వాటిక వాగు అవతలి వైపు ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో అర చేతిలో ప్రాణాలు పెట్టుకుని వాగు దాటి అంత్యక్రియలు చేశారు. గతంలో బ్రిడ్జి నిర్మించాలని అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా బ్రిడ్జి నిర్మించాలని ఆ గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.