తెలుగు రాష్ట్రాల్లో గతకొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, వాగులు, కుంటలు అలుగుపారుతున్నాయి. జలాశయాలు నిండు కుండలా మారాయి. భద్రాచాలం దగ్గర గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. జలాశయాల్లో ప్రమాదకర స్థాయికి నీరు చేరటంతో దిగువకు నీటిని వదులుతున్నారు.
Read Also: Dhanush 51: ధనుష్, శేఖర్ కమ్ముల కాంబోలో పాన్ ఇండియా #D51
ఇదిలా ఉండగా.. ఇవాళ (గురువారం) హైదరాబాద్- విజయవాడ జాతీయరహదారి పైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ఐతవరం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై మున్నేరు వరద నీరు ఉద్ధృతంగా వస్తోంది. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక, జాతీయ రహదారిపై వందలాదిగా వెహికల్స్ రెండు వైపులా నిలిచిపోయాయి. దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. వరద ధాటికి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Read Also: Andhrapradesh: సీఎం జగన్‌తో తిరుపతి ఎమ్మెల్యే భూమన భేటీ.. కీలక పదవిపై చర్చలు!
అయితే, కొందరు వాహనదారులు వరద నీటిలోనే నెమ్మదిగా ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తున్నారు. కీసర దగ్గర మున్నేరు, వైరా ఏరు, కట్టలేరు నదులు కలుస్తాయి. దీంతో విజయవాడ-హైదరాబాద్ నేషనల్ హైవేపై కీసర వంతెన దగ్గర మూడు ఏర్లు కలిసి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని.. కుదిరితే ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అటు వరంగల్ జిల్లాలో కూడా భారీగా వర్షాలు కురవడంతో కాజీపేట రైల్వే స్టేషన్ పూర్తిగా వరద నీటితో మునిగిపోయింది.