భార్యాభర్తల అన్నాక చిన్ని చిన్న అలకలు.. కోపగించుకోవడాలు ప్రతి ఇంట్లో సహజంగానే ఉంటాయి. అది కూడా కొద్ది సేపు ఉంటుంది. ఆ తర్వాత అంతా మామూలు అయిపోతుంది. సంసారం అంటేనే ఒకరికొకరు అర్థం చేసుకోవడం.. సర్దుకుపోవడం అంటారు. అన్ని సమయాల్లో ఆశించినవి దొరకవు.. పరిస్థితులను బట్టి అర్థం చేసుకుంటే.. ఆ సంసారం మూడు పువ్వులు.. ఆరుకాయలు అన్నట్టుగా వెలిగిపోతుంది. ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవండి.
ఉత్తరప్రదేశ్‌లో ఓ వింతైన సంఘటన చోటుచేసుకుంది. భర్త కుర్కురే కొనివ్వలేదని ఏకంగా భర్తకు విడాకుల నోటీసు పంపించింది ఓ ఇల్లాలు. ఈ ఘటన ఆగ్రాలో వెలుగుచూసింది. గతేడాదే వారిద్దరికి వివాహం అయింది. పెళ్లైన కొత్తలో ఇద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు. భార్య అడకుండానే అన్ని కొనిచ్చి ప్రేమగా చూసుకున్నాడు. డ్యూటీ నుంచి వచ్చేటప్పుడే భార్యకు నచ్చిన స్నాక్స్‌ను తీసుకొస్తూ ఉండేవాడు. అలా ఆమె చిరుతిళ్లకు అలవాటు పడింది. ఇప్పుడు అదే ఆ సంసారానికి నిప్పు పెట్టింది. భార్యను మురిపించేందుకు సంవత్సరం కాలమంతా బాగానే చూసుకున్నాడు. అయితే ఈ మధ్య భర్త ఎలాంటి స్నాక్స్ ఇంటికి తీసుకురావడం లేదు. దీంతో దంపతుల మధ్య రోజూ గొడవ జరుగుతోంది. ఐదు రూపాయల కుర్కురే తీసుకురాలేవంటూ భర్తతో భార్య గొడవ పడుతుంది. ఎంత చెప్పినా స్నాక్స్ తీసుకురావడం లేదని విసుగెత్తిన ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అంతేకాకుండా భర్తకు విడాకుల నోటీసు పంపించింది.
ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కింది. తన భార్య పోరు భరించలేకపోతున్నానని.. రోజూ కుర్కురే తీసుకురావాలని గొడవ చేస్తుందని బాధితుడు పోలీసుల ముందు మొర్రపెట్టుకున్నాడు. దీంతో భార్యాభర్తలిద్దరినీ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పించారు. కుటుంబ సలహా కేంద్రం వారు.. జంటకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా ఇద్దరిలో మార్పు కనిపించలేదు. మరోసారి రావాలని పోలీసులు ఇంటికి పంపించారు. ఇంతలోనే ఆమె విడాకులకు అప్లై చేసింది.
భార్యాభర్తల మధ్య గొడవకు ఐదు రూపాయల కుర్కురే కారణమని పోలీసులు తెలిపారు. ఆమెకు కుర్కురే అంటే విపరీతమైన ఇష్టమని చెప్పారు. పెళ్లైన కొత్తలో భర్త.. రోజూ తెచ్చేవాడని.. ఇప్పుడు తీసుకురాకపోవడం వల్లే సంసారంలో గొడవలు మొదలయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ జంటకు 2023లో వివాహం అయిందని వెల్లడించారు.