Marais Erasmus on ODI World Cup 2019 Final: 2019 ప్రపంచకప్ ఫైనల్‌లో తాము ఘోర తప్పిదం చేసినట్లు ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మాజీ అంపైర్ మరియస్ ఎరాస్మస్ తెలిపారు. తమ తప్పిదం వల్లనే ఫైనల్ మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసిందని, అసలు ఇంగ్లండ్ కప్ గెలిచేదే కాదన్నారు. 5 పరుగులకు బదులుగా.. 6 పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ టైగా ముగిసిందని ఎరాస్మస్ చెప్పారు. ఫైనల్‌లో భారీ తప్పిదం చేశామని సహచర అంపైర్ కుమార్ ధర్మసేన తనతో మరుసటి చెప్పారని ఎరాస్మస్ వివరించారు.
లార్డ్స్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ బౌండరీల కౌంట్ ఆధారంగా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ముందుగా మ్యాచ్, ఆపై సూపర్ ఓవర్ కూడా టై అవడంతో.. ఐసీసీ నిబంధనల ప్రకారం బౌండరీల కౌంట్ ఎక్కువగా ఉన్న ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 241 రన్స్ చేయగా.. ఇంగ్లండ్ కూడా 241 పరుగులే చేసింది. మ్యాచ్ టై అవ్వడంతో.. ఫలితం కోసం సూపర్ఓవర్‌ను నిర్వహించారు. సూపర్ఓవర్‌లో ముందుగా ఇంగ్లండ్ 15 రన్స్ చేయగా.. ఆపై కివీస్ కూడా 15 పరుగులే చేసింది.
ఇంగ్లండ్ విజయానికి 50వ ఓవర్లోని చివరి మూడు బంతులకు 9 పరుగులు అవసరం అయ్యాయి. ట్రెంట్ బౌల్ట్ వేసిన నాలుగో బంతిని బెన్ స్టోక్స్ డీప్ మిడ్ వికెట్ మీదుగా షాట్ ఆడగా.. మార్టిన్ గప్తిల్ బంతిని అందుకొని త్రో విసిరాడు. స్టోక్స్, అదిల్ రషీద్ రెండో పరుగుకు ప్రయత్నించారు. అయితే గప్తిల్ వేసిన త్రో స్టోక్స్ బ్యాటుకు తగిలి బౌండరీకి వెళ్లింది. దీంతో అంపైర్లు ఓవర్ త్రో ద్వారా వచ్చిన నాలుగు, బ్యాటర్లు తీసిన రెండు పరుగులను కలిపి మొత్తంగా ఆరు రన్స్‌ను ఇచ్చారు. చివరి రెండు బంతులకు ఇంగ్లండ్ 2 పరుగులే చేసి స్కోరును సమం చేసింది. ఆ తర్వాత సూపర్ ఓవర్ టై అయింది.
ఐసీసీ రూల్స్ ప్రకారం.. ఓవర్ త్రో ద్వారా వచ్చిన పరుగులతో పాటు బ్యాటర్లు తీసిన రన్స్‌ను కూడా బ్యాటింగ్ జట్టుకు ఇస్తారు. అదే సమయంలో ఫీల్డర్ త్రో విసిరే సమయానికి.. పరుగు కోసం ఇద్దరు బ్యాటర్లు క్రీజు దాటినా పరుగు ఇస్తారు. ఈ నిబంధన ప్రకారం.. ఇంగ్లండ్‌కు 5 పరుగులే రావాలి. ఎందుకంటే మార్టిన్ గప్తిల్ త్రో విసిరే సమయానికి బెన్ స్టోక్స్, ఆదిల్ రషీద్ క్రీజును దాటలేదు. ఇది గమనించని ఫీల్డ్ అంపైర్‌లు ఐదుకు బదులుగా ఆరు పరుగులు ఇచ్చారు. అలా ఇవ్వకుంటే మ్యాచ్ టై కాకపోయేది, న్యూజిలాండ్ గెలిచేది.
Also Read: Mayank Yadav: నా అంతిమ లక్ష్యం అదే: మయాంక్ యాదవ్
‘ఫైనల్ మ్యాచ్ మరుసటి రోజు ఉదయం హోటల్ గదుల నుంచి కుమార ధర్మసేన, నేను ఒకే సమయంలో బయటకి వచ్చాం. మనం పెద్ద తప్పు చేశామని మీరు గమనించారా? అని ధర్మసేన నన్ను అడిగాడు. అప్పుడే ఆ విషయం నాకు తెలిసింది. మైదానంలో ఉన్న ఆ క్షణంలో ఇద్దరం ‘ఆరు’ ‘ఆరు’ అని చెప్పుకున్నాం. కానీ బ్యాటర్లు రెండో పరుగు పూర్తి చేయలేదని గమనించలేకపోయాం’అని మరియస్ ఎరాస్మస్ తెలిపారు. ఇటీవలే ఎరాస్మస్ రిటైరైన విషయం తెలిసిందే.