ట్రాఫిక్ పోలీసులు చలాన్ల పేరుతో వేధిస్తున్నారంటూ ట్రాక్టర్ డ్రైవర్లు హైదరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ ముందు ధర్నాకు దిగారు. నగరంలో వివిధ ప్రాంతాలలో ట్రాక్టర్లు నడుపుతూ జీవనం సాగిస్తున్న తమపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షల పేరిట ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి నిర్మాణ సమయంలో కూల్చివేసిన మెటీరియల్ ను ట్రాక్టర్ లలో తాము తరలిస్తుంటామని… ఆ మెటీరియల్ కింద పడకుండా బట్టను కట్టి తీసుకెళ్తుంటామని వివరించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి ట్రాఫిక్ పోలీసులు తమకు ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు కేవలం ఒక గంట మాత్రమే అనుమతి ఇస్తున్నారని తెలిపారు. దాని తరువాత రోడ్లపై కనిపిస్తే ఫోటోలు తీసి , 2500 రూపాయలు చలాన్లు వేసున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం తాము ట్రాక్టర్లు నడుపుతున్నామని… కానీ ట్రాఫిక్ పోలీసుల చలాన్ల కారణంగా తాము జీవనోపాధి కోల్పోతున్నామని అన్నారు. పోలీస్ ఉన్నతాధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకొని , తమకు న్యాయం చేయాలని వారు వేడుకున్నారు.