సీఎం చంద్రబాబు సక్సెస్ స్టోరీ:
పదహారేళ్లు ముఖ్యమంత్రి.! పదిహేనేళ్లు ప్రతిపక్ష నేత..! నాలుగు పదులు దాటి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం..! గెలిస్తే పొంగిపోడు..! ఓడితే కుంగిపోడు..! పట్టుదల, ఓర్పు, సహనానికి నిలువెత్తు రూపం. ఎన్నో సవాళ్లు, మరెన్నో సంక్షోభాలు..! అయినా వెనకడుగు వేయలేదు. ఎంతటివారినైనా తనవైపు తిప్పుకోగల నేర్పరి..! ప్రజా క్షేత్రంలో ఒప్పించి మెప్పించి నెగ్గుకురాగల గడసరి. పడిలేచిన కెరటమై తెలుగు రాజకీయాల్లో చెరగని ముద్రవేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్ర రాజకీయాలే కాదు.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత.. అభివృద్ధి, సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్.. ఇదీ చంద్రబాబు సింపుల్ ఇంట్రడక్షన్.
మహిళల్లో సర్వైకల్, బ్రెస్ట్ కేన్సర్లు ఎక్కువైపోతున్నాయి:
కృష్ణా జిల్లాలోని పామర్రు నియోజకవర్గం ముళ్ళపూడి గ్రామంలో నిర్మించనున్న సిటిజన్స్ ఫోర్స్ కేన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వర్చువల్ గా శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మా తల్లిగారు బసవరామ తారకం లింఫోమా కేన్సర్ కు బలైపోయారు అని ఆవేదన చెందింది. ఆ తరువాత బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ద్వారా సేవలందిస్తున్నాం.. కేన్సర్ బాధితులకు సరైన వైద్యం అందించే పరిస్ధితులు అప్పట్లో లేవు.. ఇటీవల కేన్సర్ ప్రబలి పోతోంది.. మన దేశంలో ప్రతీ లక్షకు 9 మంది కేన్సర్ బారిన పడుతున్నారు.. వైద్యానికి అయ్యే ఖర్చు బయట నుంచి తెచ్చే అప్పు కట్టలేక ప్రజలు పేదరికం బారిన పడుతున్నారు. అందుకే, కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అనే హెల్త్ ఇన్స్యూరెన్స్ స్కీం తీసుకొచ్చిందని బీజేపీ ఎంపీ పురంధేశ్వరి పేర్కొనింది.
ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్నాం:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ (ఏప్రిల్ 20న) మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్నాం.. ఈ రోజు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. 16 వేల 347 డీఎస్సీ పోస్టులతో నేడు నోటిఫికేషన్ రిలీజ్ అయింది.. నేటి నుంచి ఆన్ లైన్లో డీఎస్సీ అభ్యర్థులు అప్లైయ్ చేసుకోవచ్చు అని సూచించారు. ఇక, డీఎస్సీ అభ్యర్థులకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు అని లోకేష్ పేర్కొన్నారు.
నిమ్స్ అగ్ని ప్రమాద ఘటనకు సిగిరెట్టే కారణం:
పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రి అత్యవసర వైద్య విభాగంలో అగ్ని ప్రమాద ఘటనకు సిగిరెట్టే కారణమని అధికారులు నిర్ధారించారు. సిగరెట్, చెత్తతోనే అగ్ని ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు. బీడీ, సిగరెట్ కేర్ లెస్ స్మోక్ వల్ల అగ్నిప్రమాదం జరిగినట్లు గుర్తించారు. శనివారం సాయంత్రం అత్యవసర వైద్య విభాగంలోని ఐదో అంతస్తు ఆడిటోరియంలో చిన్నపాటి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కిటికీల నుంచి దట్టమైన పొగ బయటకు రావడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది సంఘటన స్థలికి చేరుకొని.. మంటలను అదుపు చేశారు. ఐదో అంతస్తులో రోగులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పొగ కంట్రోల్‌కి వచ్చాక అగ్నిప్రమాదం ఎందుకు జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. లిఫ్ట్ పక్కన్న ఉన్న చెత్తలో తాగిన బీడీ, సిగరెట్ వేయడం వల్లే అగ్నిప్రమాదం జరిగిందని తేల్చారు. బీడీ, సిగరెట్ కేర్ లెస్ స్మోక్ వల్ల అగ్నిప్రమాదం జరిగినట్లు గుర్తించారు. మొదట సిగరెట్‌తో చెత్త అంటుకొని.. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ వైర్లకు అంటుకుందని నిర్ధారించారు. 5వ ఫ్లోర్ ఖాళీగా ఉండడంతో సిబ్బంది అక్కడ చెత్తను పడేస్తున్నారు. అక్కడే ఇతరులు సిగరెట్ తాగి పడేయడంతో ఈ ఘటన జరిగింది.
రాజేంద్రనగర్ ఉప ఎన్నికల్లో కార్తిక్ రెడ్డి గెలిస్తారు:
త్వరలో జరిగే రాజేంద్రనగర్ ఉప ఎన్నికల్లో కార్తిక్ రెడ్డి గెలిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత నష్టపోయింది కేసీఆర్, బీఆర్ఎస్ కాదని.. ప్రజలే అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మాయమాటలకు ముసలోళ్లు, మహిళలు, నిరుద్యోగులు మోసపోయారన్నారు. మతం పేరు ఎత్తకుండా ఓటు అడిగే దమ్ము బీజేపీకి ఉందా? అని, బీజేపీ ఆటలు కూడా ఎన్నో రోజులు సాగవని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో రాజేంద్రనగర్ నేతలు బీఆర్ఎస్‌లో చేరారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
బాలుడికి కరెంట్ షాక్.. ప్రాణాలకు తెగించి రక్షించిన వ్యక్తి:
తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో విద్యుత్ షాక్‌కు గురైన బాలుడిని ఓ యువకుడు తన ప్రాణాలను పణంగా పెట్టి మరి రక్షించిన ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే, భారీ వర్షం కురవడంతో రోడ్డుపై వరద నీరు నిలిచింది.. అయితే, అటుగా 3వ తరగతి విద్యార్థి నడుస్తు వెళ్తుండగా, సమీపంలోని జంక్షన్ బాక్స్ నుంచి కరెంట్ వైర్ తెగి పడిపోయింది.. దాంతో ఆ బాలుడు షాక్‌కు గురయ్యాడు. అటు వైపుగా వెళుతున్న వారు ఎవరూ కూడా ఆ పిల్లాడి రక్షించడానికి ముందుకు వెళ్లలేదు.. కానీ, అది గమనించిన యువకుడు కన్నన్, ధైర్యంగా ముందుకు వెళ్లి ఆ బాలుడిని రక్షించాడు.
పాక్ ఐఎస్ఐ ఉగ్రకుట్ర భగ్నం:
పాకిస్తాన్ గూఢచార సంస్థ ‘‘ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)’’ మద్దతు కలిగిన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI) విదేశాల నుండి నిర్వహిస్తున్న రెండు టెర్రర్ మాడ్యూల్స్‌ని పంజాబ్ పోలీసులు ఛేదించారు. ఒక మైనర్‌తో సహా 13 మందిని అరెస్ట్ చేశారు. రెండు రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్స్(ఆర్పీజీ), ఒక రాకెట్ లాంచర్, రెండు ఐఈడీలను, హ్యాండ్ గ్రెనేడ్స్, ఆర్డీఎక్స్, పిస్టల్స్, కమ్యూనికేషన్ పరికరాలను, పెద్ద మొత్తంలో ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
ఐపీఎల్‌లో అతిపిన్న వయసులో అరంగేట్రం చేసిన క్రికెటర్లు వీరే:
యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. అతి పిన్న వయసులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 14 ఏళ్ల 23 రోజుల వయసులో ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. లక్నో సూపర్ జెయింట్స్‌పై మొదటి మ్యాచ్ ఆడిన వైభవ్.. 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 34 పరుగులు చేశాడు. బిహార్‌కు చెందిన వైభవ్‌ను ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ.1.10 కోట్లకు రాజస్థాన్ కొనుగోలు చేసింది. వేలంలో అమ్ముడుపోయిన అతిపిన్న వయసు ఆటగాడిగానూ అప్పుడు రికార్డు సృష్టించాడు. అతి పిన్న వయసులో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఆటగాడి రికార్డు ఇంతకుముందు రే బర్మన్ (16 ఏళ్ల 157 రోజులు) పేరిట ఉంది. లక్నో సూపర్ జెయింట్స్‌పై రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగడంతో బర్మన్ రికార్డు బద్దలైంది. ఈ జాబితాలో ముజీబుర్ రెహ్మన్ (17 ఏళ్ల 11 రోజులు), రియాన్ పరాగ్ (17 ఏళ్ల 152 రోజులు), సర్ఫరాజ్ ఖాన్ (17 ఏళ్ల 182 రోజులు), వాషింగ్టన్ సుందర్ (17 ఏళ్ల 199 రోజులు), రాహుల్ చాహర్ (17 ఏళ్ల 247 రోజులు), అభిషేక్ శర్మ (17 ఏళ్ల 250 రోజులు), ఇషాన్ కిషన్ (17 ఏళ్ల 262 రోజులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఆంటీలా నటించడం ఉత్తమం:
సీనియర్ స్టార్ హీరోయిన్ సిమ్రన్.. దక్షిణాది సినీ ప్రియులకు సుపరిచితురాలు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇలా భాషతో సంబంధం లేకుండా ఆమె ఎన్నో చిత్రాల్లో నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, విజయ్, సూర్య, అజిత్ వంటి స్టార్ హీరోలతో ఆమె వర్క్ చేసింది. ప్రస్తుతం ఇప్పుడు ఆమె సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లో యాక్ట్ చేస్తోంది. ఇటీవల విడుదలైన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లో సిమ్రన్ అతిథి పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించగ.. ప్రజంట్ వరుస ప్రాజుక్ట్‌లు లైన్ లో పెట్టిందట. ఇకపోతే తాజాగా ఓ నటికి చిన్నపాటి కౌంటర్ ఇచ్చింది సిమ్రాన్. ఏంటా పోస్ట్ అంటే.. ‘కొన్ని రోజుల క్రితం నాకు బాగా తెలిసిన తోటి నటికి ఓ సందేశం పంపించాను. ఆమె నటించిన ఒక సినిమానిలో ఆమె పాత్ర చాలా బాగుంది.. ఆ రోల్ చూసి ఆశ్చర్యపోయానని మెసేజ్ పంపా. దానికి ఆమె వెంటనే స్పందించింది. ఆంటీ రోల్స్‌లో నటించడం కంటే ఇది ఎంతో ఉత్తమం అంటూ రిప్లై ఇచ్చింది. ఆమె ఎంతో చులకనగా మాట్లాడినట్లు అనిపించింది. ఈ వేదికగా ఆమెకు నేను చెప్పేది ఒక్కటే. పనికిమాలిన డబ్బా రోల్స్‌లో నటించడం కంటే ఆంటీ లేదా అమ్మ పాత్రలు పోషించడం ఎంతో ఉత్తమం. ఏ వర్క్ చేసిన ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. ముఖ్యంగా మనపై మనకు నమ్మకం ఉండాలి. అప్పుడే వర్క్ కూడా అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతాం. దేనిని చులకనగా చూడకూడదు’ అని ఆమెకు గట్టి కౌంటర్ ఇచ్చింది సిమ్రాన్.
తండ్రి కల నెరవేర్చిన టాలీవుడ్ డైరెక్టర్:
టాలీవుడ్ లో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకులలో తరుణ్ భాస్కర్ ఒకరు. ఆయన తెరకెక్కించిన ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘కీడా కోలా’ సినిమా యూత్ పరంగా బాగా అలరించాయి. కానీ ఇందులో ‘పెళ్లిచూపులు’ కు వచ్చిన గుర్తింపు చాలా పెద్దది. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఆ రేంజ్ సక్సెస్ చూడలేదు. అలాగే తన స్థాయిని మించి ఎదిగిన విజయ్ దేవరకొండను మరోసారి తన సినిమాకు ఒప్పించడం మాత్రం తరుణ్‌కి ఇప్పటిదాకా సాధ్యపడలేదు. ఇక తరుణ్ దర్శకుడిగా మాత్రమే కాదు పలు చిత్రాల్లో మంచి పాత్రలు కూడా పోషించాడు. యాక్టింగ్ పరంగా కూడా ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాదు తరుణ్ భాస్కర్ తల్లి సైతం పలు హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. ఇక పోతే తరుణ్ భాస్కర్ తండ్రి ఉదయ్ భాస్కర్ చాలా సంవత్సరాల క్రితమే మృతి చెందారట. అయితే సొంతిల్లు కట్టుకోవాలనేది ఆయన కల. కాగా తన తండ్రి కలను నెరవేర్చానని చెబుతూ, తాజాగా తరుణ్ భాస్కర్ సోషల్ మీడియా వేదికగా ఇంటి ఫోటోలు చేశారు.. ‘ మీ కల నెరవేర్చాను నాన్న. నువ్వు చూస్తున్నావనే అనుకుంటున్నా’ అంటూ తరుణ్ భాస్కర్ రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ పై నెటిజన్లు రియాక్ట్ అవుతూ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఇక ప్రస్తుతం తరుణ్ భాస్కర్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ తో బిజీగా ఉండగా ఈ మూవీలో ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తున్నారని తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.
హాస్పిటల్ బెడ్ పై యాంకర్ రష్మీ:
యాంకర్ రష్మి.. బుల్లి తేరపై స్టార్ స్టేటస్ ను అందుకుని తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అడపా దడపా వెండితెరపై కనిపించింది. కానీ బుల్లితెర రష్మీకి వేలాదిమంది అభిమానులను తెచ్చిపెట్టింది. ఇదిలా ఉండగా ఇటీవల రష్మీ తీవ్ర అనారోగ్యానికి గురైంది. అందుకు సంబంధించిన విషయాన్నీ తన వ్యక్తిగత ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ ‘ గత కొన్ని రోజులుగాఆరోగ్యం బాగుండటం లేదు. నా శరీరంలో ఎదో జరుగుతోందన్న నాకు అర్ధం అవుతోంది. కొంత గ్యాప్ తీసుకోవాలని ముందుగా కమిట్ అయిన ప్రోగ్రామ్స్ ను త్వరగా ఫినిష్ చేశాను. కొద్దీ రోజుల క్రితం ఒళ్లు నొప్పులు ఎక్కువ అయ్యాయి. దానికి తోడు విపరీతంగా రక్త స్రావం అవుతోంది. చివరకు తన హీమోగ్లోబిన్ స్థాయి 9శాతానికి పడిపోయింది. అసలు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. తీవ్రమైన నొప్పులతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాను. ఏప్రిల్ 18న ఆపరేషన్ చేసారు వైద్యులు. ఇప్పుడు క్షేమంగానే ఉన్నాను హాస్పిటల్‌లో చేరిన రష్మీ గత 5 రోజులుగా నాకు తోడుగా ఉన్న ఫ్యామిలీ, ఫ్రెండ్స్, హాస్పిటల్ టీంకు ధన్యవాదాలు’ అని తెలిపింది రష్మీ. ఇంకా కొన్ని రోజులు ఇలానే రెస్ట్ మోడ్‌లో ఉంటానని మాత్రం చెప్పింది. పూర్తి గా కోలుకున్నాక, ఆరోగ్యం కుదుటపడ్డాక మళ్లీ కమ్ బ్యాక్ ఇస్తానని ఇంకో మూడు వారాలు మాత్రం ఇలాగే విశ్రాంతి తీసుకుంటానని చెప్పింది కానీ అసలు రష్మీకి వచ్చిన అనారోగ్య కారణం ఏంటన్నది దానిపై వివరంగా చెప్పలేదు. కారణాలు ఏవైనా కానీ రష్మీ త్వరగా కోలుకుని బుల్లితెరపై మళ్ళి మెరవాలని అందరిని నవ్వించాలని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.