గత ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదు.. నిధులను డైవర్ట్ చేశారు..
గత ప్రభుత్వానికి ఆర్థిక క్రమ శిక్షణ లేదు అని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. మున్సిపల్ శాఖలో ఉన్న నిధులు గత ప్రభుత్వం డైవర్ట్ చేసింది అని ఆరోపించారు. ప్రస్తుత ఎన్డీయే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతోంది అని తేల్చి చెప్పారు. అన్నిటి కంటే ముఖ్యంగా మున్సిపల్ శాఖకు 13 వేల కోట్ల రూపాయలకు పైగా కేటాయింపు జరిగిందని వెల్లడించారు. ఇక, సీఆర్డీఏకు 6 వేల కోట్ల రూపాయలు కేటాయించారు.. 27,500 కోట్ల రూపాయలను పెన్షన్ కోసం కేటాయింపులు చేసినట్లు మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు.
వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం.. సత్యవర్థన్ స్టేట్మెంట్ ఇవ్వాలని పిటిషన్
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వంశీ కిడ్నాప్ చేశాడని పోలీసులు కేసు నమోదు చేసిన సత్యవర్ధన్ 164 స్టేట్ మెంట్ ఇవ్వాలని కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా సత్యవర్ధన్ స్టేట్ మెంట్ కావాలని న్యాయస్థానాన్ని కోరారు. గన్నవరం టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు దారుడిగా సత్యవర్ధన్ ఉన్నారు.. అయితే, ఈ కేసుతో తనకి సంబంధం లేదని ఫిబ్రవరి 10వ తేదీన కోర్టులో సత్యవర్ధన్ అఫిడవిట్ దాఖలు చేశారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8మంది సజీవ సమాధి
తెలంగాణలోని SLBC (శ్రీశైలం లిఫ్ట్ బకింగ్ కెనాల్) టన్నెల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది సజీవ సమాధి అయ్యారు. మృతుల్లో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచే అధికారులు, రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి క్షతగాత్రుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మట్టిలో వారు మూడు మీటర్ల లోతులో కూరుకుపోయినట్లు అధునాతన పరికరాలు సూచించాయి.
సమగ్రాభివృద్ధి.. ప్రజా సంక్షేమానికి భరోసా కల్పించేలా బడ్జెట్ ఉంది..
సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి భరోసా కల్పించేలా బడ్జెట్ ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మూల ధన వ్యయం పెంపుతో భవిష్యత్తుకు బాటలు వేశారు. వసతుల కల్పన, పెట్టుబడుల ఆకర్షణకు అద్భుత అవకాశం.. సూపర్ సిక్స్ పథకాల అమలు దిశగా కేటాయింపులు జరిగాయి.. పంచాయతీరాజ్ శాఖకు భారీ కేటాయింపులతో పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడుతుంది అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ ని స్వాగతిస్తున్నాం అని ఆయన చెప్పారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల మన్ననలు అందుకుంటుంది.. మూలధన వ్యయం భారీగా పెంచడం వల్ల పెట్టుబడుల ఆకర్షణకు అవకాశం కలుగుతుంది అని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ వెల్లడించారు.
పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది..
గాంధీ భవన్ లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ కొత్త ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది అని తెలిపారు. పని చేసిన వారి జాబితాను కొత్త ఇంఛార్జ్ సిద్ధం చేస్తారు.. కొందరికి పదవులు రాలేదు.. మొదటి విడతలో కార్పొరేషన్ చైర్మన్లు రెండేళ్లు అవకాశం ఇచ్చాం.. పని తీరు సరిగ్గా లేని వారిని కొనసాగించామని పేర్కొన్నారు. ఇప్పుడు ఏం అనను.. రెన్యువల్ కోసం వస్తారు కదా అప్పుడు చెప్తానని తెలిపారు. పదవి వచ్చింది కదా అని కూర్చున్న వాళ్లకు కొనసాగింపు ఉండదు అని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు.
రేపు చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (మార్చ్ 1వ తేదీన) చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో జీడీ నెల్లూరులోని రామానాయుడు పల్లెకు చేరుకోనున్నారు. గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధిదారులకు సీఎం అందివ్వనున్నారు. అలాగే, పది సూత్రాలు భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించనున్నారు. ఇక, ప్రజా వేదిక సభ నుంచి స్థానిక ప్రజల్ని ఉద్దేశించి సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. రామానాయుడు పల్లెలో స్థానిక టీడీపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3.55 గంటలకు తిరుపతి ఎయిర్ పోర్ట్ నుంచి విజయవాడకి తిరుగు పయనం కానున్నారు.
కాంగ్రెస్ నేతలకు కొత్త ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ క్లాస్
తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా నియమితుడైన ఏఐసీసీ ఇంచార్జీ, మీనాక్షి నటరాజన్ శుక్రవారం ఉదయం తెలంగాణ చేరుకున్నారు. ఆమె ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి సాధారణ రైల్లో రావడం విశేషం. కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఆమెను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఘనంగా స్వాగతించారు. మహేష్ కుమార్ గౌడ్ ఆమెకు కండువా కప్పి మరింత ఆతిథ్యం అందించారు. ఈ ఘట్టం రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య ఆనందాన్ని కలిగించింది. మీనాక్షి నటరాజన్ అనంతరం గాంధీ భవన్‌కు వెళ్లి అక్కడ జరుగుతున్న తెలంగాణ ప్రదేశ్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాజకీయ నాయకులు, పార్టీ నేతల హడావిడిని చూసి ఆమెకు కొంత అసహనం వచ్చింది. గాంధీ భవన్‌లో కొన్ని నేతలు ఆమె ముందు బొకేలు తీసుకురావడం, మొదటి నుంచీ వారిని దీనికి బదులుగా చెయ్యవద్దని కోరినప్పటికీ వారు వినకుండా బొకేలు తీసుకురావడం ఆమెను కాస్త చిరాకు చెందింది. ఈ కారణంగా, మీనాక్షి నటరాజన్ ఆక్షేపణలు వ్యక్తం చేశారు. గాంధీ భవన్‌లో ఇక నుంచి ఎలాంటి ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టకూడదని తెలిపారు.
రాష్ట్ర ప్రజలకు ఈ బడ్జెట్ ఎందుకు ఉపయోగపడదు..
ఏపీ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శలు గుప్పించింది. జనాన్ని నమ్మించి నట్టేట ముంచింది కూటమి ప్రభుత్వం.. చంద్రబాబును పొగడ్తలతో ముంచేత్తడానికే, భజన చేయడానికే పయ్యావుల కేశవ్ సమయం అంతా వృథా చేశారంటూ ఎద్దేవా చేసింది. రాష్ట్ర ప్రజలకు ఈ బడ్జెట్ ఎందుకు ఉపయోగపడదు.. అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్న ఇంకా జగనే తిడుతూ ఉన్నారు.. నాకు విజన్ ఉంది విస్తారాకుల కట్టా ఉంది అన్న చంద్రబాబు.. అప్పులు చేస్తూ కూర్చొన్నాడు అని ఆమె మండిపడింది. జగన్ చాలా తక్కువ అప్పులు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించారు.. అప్పులు చేసి రాజధానిని ఎందుకు కట్టాలి, కట్టాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. అంకెల గారడీతో ప్రజలను మోసం చేస్తున్నారు.. చేసిన అప్పులను తమ ఖాతాల్లోకి కూటమి నేతలు మళ్లించుకుంటున్నారు అని ఆర్కే రోజా ఆరోపించింది.
రాష్ట్ర ఆర్థిక స్థితిని పట్టాలెక్కించే బడ్జెట్ ఇది..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితిని పట్టాలెక్కించే బడ్జెట్ ఇది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సంక్షేమం, సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా కేటాయింపులు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకి మార్గ నిర్దేశనం చేసేలా బడ్జెట్ ఉంది.. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసింది అని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఆర్థిక క్రమ శిక్షణతో రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు తగ్గించే చర్యలు చేపట్టింది అని పేర్కొన్నారు.
రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు.. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు
విద్యార్థులకు పరీక్షా కాలం రానే వచ్చింది. ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభంకాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు మొదలుకానున్నాయి. మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. రేపు మొదటి ఏడాది ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. నిర్ణీత తేదీల్లో ఉదయం 09 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో జనరల్ విద్యార్థులు 500963, ఓకేషనల్ విద్యార్థులు 44581 మంది పరీక్షలకు హాజరుకానున్నారు.