ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పండగలు వైభవంగా జరుపుకుంటున్నారు
స్త్రీ శక్తి విజయానికి సూచిక విజయ దశమి అని.. మహిళా జయానికి ప్రతిబింబమని.. దసరా పండుగ అంటే.. మహిళల విజయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ నగరంలోని ఖిల్లా రఘునాథ ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ,ఎమ్మేల్యే గణేష్ గుప్తాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ప్రజలందరికీ దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండగ అంటే మహిళల విజయమని, 9 రోజుల పాటు బతుకమ్మ పండగ నంగా జరుపుకున్నామన్నారు.
సద్దుల బతుకమ్మ సోలపూర్ లో జరపటం సంతోషాన్ని ఇచ్చిందని, బతుకమ్మ పాట వలే శ్రీరాముని పాట కూడా చేశామన్నారు. ఈరోజు ఖిల్లా రామాలయంలో ఈ పాటను ఆవిష్కరించామని, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పండుగలు వైభవంగా జరుపు కుంటారన్నారు. ఇది తెలంగాణకే గర్వకారణమని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజలు సంతోషంగా ఉంటేనే పండగలు వైభవంగా జరుగుతాయని, చెడును తగ్గించి మంచి గుణాలను పెంపొందించుకోవాలన్నారు ఎమ్మెల్సీ కవిత. ప్రజలకు మంచి చేసే వారికి సమున్నత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
గగన్‌యాన్‌లో మహిళా వ్యోమగాములు, సైంటిస్టులకు ప్రాధాన్యం
దేశ అంతరిక్ష యాత్రల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాలని ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ ఆకాంక్షించారు. ఈ కోరిక ప్రధాని మోడీ సహా దేశ ప్రజల మనోభావాలను ప్రతిబింబిస్తోందని అన్నారు. పౌర్ణమసి కావూ ఆలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో.. ఇస్రో ప్రతిష్టాత్మక గగన్‌యాన్ మిషన్‌లో ఎక్కువ మంది మహిళా వ్యోమగాములు చేరాలని ఎస్.సోమనాథ్ తన కోరికను వ్యక్తం చేశారు. అయితే వ్యోమగాముల ఎంపిక, శిక్షణ ఇప్పటికే పూర్తయిందని, కాబట్టి మొదటి గగన్‌యాన్ మిషన్‌లో మహిళలు పాల్గొనడం సాధ్యం కాదని ఎస్ సోమనాథ్ స్పష్టం చేశారు. మానవులను అంతరిక్షంలోకి పంపి వారిని సురక్షితంగా భూమికి తీసుకురావడమే గగన్‌యాన్ మిషన్ ఉద్దేశం. భవిష్యత్తులో జరిగే గగన్‌యాన్ మిషన్‌లలో మహిళలు ఎక్కువగా పాల్గొంటారని ఇస్రో చీఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. “అంతరిక్ష యాత్రలలో ఎక్కువ మంది మహిళా వ్యోమగాములు నా కోరికల జాబితాలో ఉన్నారు. నేను ప్రధాని మోడీతో సహా దేశం యొక్క స్వరాన్ని మాత్రమే పెంచాను” అని ఆయన చెప్పారు.
రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేతపై అసద్ కీలక వ్యాఖ్యలు
మహ్మద్ ప్రవక్తపై అవమానకరమైన వ్యాఖ్యలకు పాల్పడినందుకు గత ఏడాది పార్టీ చర్య ప్రారంభించిన తెలంగాణ ఎమ్మెల్యే టి రాజా సింగ్‌పై సస్పెన్షన్‌ను ఉపసంహరించుకున్నందుకు బిజెపిని ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీలో విద్వేషపూరిత ప్రసంగం అత్యంత వేగవంతమైన మార్గమని ఆయన ఆరోపించారు.
“@నరేంద్రమోడీ తన ప్రియమైన “ఫ్రింజ్ ఎలిమెంట్”కి రివార్డ్ ఇచ్చారు. నూపుర్ శర్మ కూడా ప్రధానమంత్రి నుండి ఆమె ఆశీస్సులు పొందుతారని ఖచ్చితంగా చెప్పవచ్చు. మోడీ బీజేపీలో ప్రమోషన్‌కు ద్వేషపూరిత ప్రసంగం అత్యంత వేగవంతమైన మార్గం” అని సింగ్ సస్పెన్షన్ ఎత్తివేతపై స్పందించిన ఒవైసీ ఎక్స్‌లో అన్నారు.
జంట నగరాల్లో విజయ పాల ఉత్పత్తులు
ఇక నుంచి జంట నగరాల్లో కృష్ణా యూనియన్ పాల ఉత్పత్తులు లభ్యం కానున్నాయి. స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులను విజయ బ్రాండ్ అందుబాటులోకి తీసుకొస్తోంది. ఆరు దశాబ్దాలుగా వినియోగదారులు విశ్వాసం చూరగొంటున్న కృష్ణ మిల్క్ యూనియన్ వారి విజయ పాలు, పెరుగు, పాల ఉత్పత్తులు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో లభ్యం కానున్నాయి. త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి తన చేతుల మీదుగా కృష్ణా మిల్క్ యూనియన్ వారి విజయ పాలు, పాల ఉత్పత్తులను ఆవిష్కరించి, తదనంతరం హైదరాబాద్ మార్కెట్‌కు విడుదల చేశారు. శంషాబాద్‌లోని జీయర్ స్వామి వారి ఆశ్రమంలో నేడు(అక్టోబర్ 24) విజయ పాల ఉత్పత్తులను ఆయన విడుదల చేశారు.
ఈ నెల 26న సీఎం వైఎస్ జగన్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన
ఈ నెల 26న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు విజయ్ గణేష్ మోహన్ వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరనున్నారు. రాజానగరం మండలం దివాన్‌చెరువు డి.బి.వి.రాజు లే–అవుట్‌లో జరగనున్న విజయ్ గణేష్ మోహన్ వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి హాజరవ్వనున్నారు. అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు.
తన 150వ వన్డే మ్యాచ్‌లో రికార్డులు సృష్టించిన డికాక్
దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఈ వరల్డ్ కప్‌లో వరుసగా రెండు సెంచరీలు బాదిన డికాక్.. తాజా మరో శతకాన్ని నమోదు చేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో క్వింటన్ డికాక్ 140 బంతుల్లో 174 పరుగులు చేశాడు. 15 ఫోర్లు, 7సిక్సర్లతో పరుగుల మోత మోగించాడు. ఈ వరల్డ్ కప్‌లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ పాకిస్థాన్‌పై చేసిన 163 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరును డికాక్ అధిగమించాడు. అతనితో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ 49 బంతుల్లోనే 90 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. నిర్ణీత 50 ఓవర్లో సౌతాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 382 పరుగుల భారీ స్కోరు చేసింది.
భర్తను తీవ్రంగా కొట్టి.. భార్యను లాక్కెళ్లి సామూహిక అత్యాచారం
ప్రస్తుతం సమాజంలో మహిళలకు రక్షణ కరువైంది. రోజు ఎక్కడో చోట అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా మరోచోట దారుణం జరిగింది. ఒడిశాలో భర్తను దారుణంగా కొట్టి భార్యపై ఐదుగురు సామూహిక అత్యాచారం చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని ధెంకనల్ జిల్లాలో ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి, అతని భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని సీనియర్ పోలీసు అధికారి మంగళవారం తెలిపారు. అక్టోబర్ 21 సాయంత్రం జిల్లాలోని బరునా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ జంట జాజ్‌పూర్ జిల్లాకు చెందిన వారన, ఆ మహిళ తన చదువు కోసం భుబన్‌లో ఉంటోందని అధికారి తెలిపారు.
సంచలనం రేపుతున్న మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ ఘటన
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని లక్ష్మీ బ్యారేజ్ మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగిన ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పిల్లర్ కుంగడానికి ముందు అక్కడ పేలుడు శబ్దం వినిపించడంతో దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చప్పుడు ఎందుకొచ్చింది? పిల్లర్ ఎందుకు కుంగింది? ఇందులో కుట్ర కోణం ఏమైనా ఉందా? అని ఇరిగేషన్ అధికారులు అనుమానిస్తున్నారు.
దీంతో ఈ ఘటనపై ఇరిగేషన్ అధికారులు మంగళవారం మహదేవ్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ముందు ఇలాంటి ఘటన జరగడంతో ఏదైనా కుట్రలు ఉండొచ్చని.. దానిపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుపై పోలీసులు సానుకూలంగా స్పందించారు. ప్రివెంటేషన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ (పీడీపీపీ ) సెక్షన్ 3, 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ప్రత్యేక టీమ్‌తో విచారణ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖర్గే మాట్లాడుతూ.. ఇందులో మావోయిస్టుల ప్రమేయం లేదని తమ విచారణలో తేలిందని వెల్లడించారు. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతుందని.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు….
మణిపూర్‌లో జరుగుతున్న హింసకు బాహ్య శక్తులే కారణం
మణిపూర్‌లో జరుగుతున్న హింసకు బాహ్య శక్తులే కారణమని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆరోపించారు. మణిపూర్‌లో కుట్రపూరితంగానే ఈ ఘటన అంతా జరిగిందన్నారు. నాగ్‌పూర్‌లో విజయదశమి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల మణిపూర్‌లో జరిగిన హింసాకాండను ప్రస్తావించారు. మణిపూర్ హింసను ప్రశ్నిస్తూ, మణిపూర్‌లోని మెయిటీ, కుకీ వర్గాల ప్రజలు చాలా కాలంగా కలిసి జీవిస్తున్నారని సంఘ్ చీఫ్ అన్నారు. ఒక్కసారిగా రెండు వర్గాల మధ్య మంటలు చెలరేగాయి. ఇలాంటి వేర్పాటువాదం, అంతర్గత గొడవల వల్ల ఎవరికి లాభం అని మోహన్ భగవత్ ప్రశ్నించారు. మణిపూర్‌లో జరిగిన దానిలో బయటి వ్యక్తులు కూడా ఉన్నారు అని ఆయన పేర్కొన్నారు.
లేట్ గా వస్తున్నా.. లేటెస్ట్ గా హిట్ అయ్యే కంటెంట్ ఉన్నట్లుందే
చియాన్ విక్రమ్, రీతూ వర్మ జంటగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ధృవ నచ్చితరం. తెలుగులో ఇదే సినిమా ధృవ నక్షత్రం అనే పేరుతో రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తై దాదాపు పదేళ్లు కావొస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమా రిలీజ్ కు నోచుకోలేదు. ఎప్పుడు రిలీజ్ అన్నా కూడా ఏదో ఒక కారణం వలన వాయిదా పడుతూ వస్తుంది. అసలు ఈ సినిమా రిలీజ్ అవ్వదు.. కన్ఫర్మ్ అని అభిమానులు ఆశలు కూడా వదులుకున్నారు. ఇక కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ప్రతిసారి ఒక సాంగ్ పోస్టరో.. లేక టీజర్ పోస్టరో రిలీజ్ చేసి అంచనాలు పెంచేస్తూ ఉంటారు. ఇక ఈసారి మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేలానే కనిపిస్తుంది. నవంబర్ 24 న ధృవ నక్షత్రం తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ అవుతుందని మేకర్స్ ఖచ్చితంగా చెప్పేశారు. ఇక దీంతో పాటు సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసారు.