మరోసారి వార్తల్లోకెక్కిన నూహ్.. రెండు పార్టీల మధ్య రాళ్ల దాడి, యువతి మృతి
హర్యానాలోని నుహ్ జిల్లాలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నుహ్‌లోని లహర్‌వాడి గ్రామంలో శుక్రవారం పరస్పర విబేధాల కారణంగా రెండు పార్టీల మధ్య భారీ రాళ్ల దాడి జరిగింది. ఈ క్రమంలో 32 ఏళ్ల యువతి సజీవ దహనమైంది. యువతి మంటల్లో కాలిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అక్కడికి పోలీసు బలగాలు భారీగా చేరుకున్నాయి. ఆ ప్రాంతమంతా పోలీసు బలగాలతో మోహరించారు. సమాచారం ప్రకారం.. సుమారు ఏడు నెలల క్రితం నుహ్‌లోని లహర్‌వాడి గ్రామంలో భూ వివాదంపై రెండు పార్టీల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ హింసాత్మక ఘర్షణలో రిజ్వాన్ అనే 21 ఏళ్ల యువకుడు చనిపోయాడు. ఈ క్రమంలో.. నిందితులపై హత్యానేరం కింద పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. దీంతో యువకుడిపై హత్యాయత్నం చేసిన నిందితుల కుటుంబ సభ్యులు గ్రామం వదిలి పారిపోయారు.
డోకిపర్రు శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో సీఎం చంద్రబాబు పూజలు
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. సీఎం చంద్రబాబుకు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు కృష్ణారెడ్డి, సుధారెడ్డిలు స్వాగతం పలికారు. క్షేత్రంలో జరుగుతున్న స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. డోకిపర్రు మహా క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని సీఎం ప్రత్యేక పూజలు చేశారు. సీఎం చంద్రబాబుకు వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు.
తెలంగాణ ప్రగతి, ప్రతిష్ట తిరోగమనంలో పయనిస్తోంది
తెలంగాణ ప్రగతి, ప్రతిష్ట తిరోగమనంలో పయనిస్తోందన్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో హైదరాబాద్ అంటే ఫాస్టెస్ట్ గగ్రోయింగ్ సిటీ అనే పేరు ఉండేదని, కానీ కాంగ్రెస్ వచ్చాక 6 మోసాలు.. 66 అబద్ధాలు అన్నట్లుగా పరిస్థితి మారిందన్నారు బూర నర్సయ్య. గల్లీలో తిట్లు.. ఢిల్లీలో మెట్లు.. దేవుళ్లపై ఒట్లు.. సర్కార్ దీనికే పరిమితమైందని, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మొదలు ఇప్పటి వరకు ఏడాదిలో 24 సార్లు ఢిల్లీకి వెళ్లి రికార్డు సృష్టించారన్నారు. ప్రధాని మోడీ హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా మార్చాలని లక్షల కోట్లు అభివృద్ధికి కేటాయించారని, మోసపోతే గోసపడుతామని ఎన్నికలకు ముందే మేము చెప్పామని బూర నర్సయ్య తెలిపారు.
75ఏళ్ల రాజ్యాంగ ప్రయాణంపై ప్రసంగించిన మోడీ.. దద్దరిల్లిన పార్లమెంట్!
లోక్‌సభలో శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగంపై చర్చ జరుగుతోంది. మరోవైపు పార్లమెంటుకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి సభ్యులు ఘనస్వాగతం పలికారు. ‘భారత్ మాతా కీ జై’ నినాదాలతో పార్లమెంట్ భవనం దద్దరిల్లింది. రాజ్యాంగం ఆవిర్భవించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్‌సభలో మోడీ ప్రసంగించారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని, మన గణతంత్ర దేశం యావత్ ప్రపంచానికి స్ఫూర్తిదాయకమన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని దాని సంస్కృతిలో భాగమన్నారు. “భారత ప్రజాస్వామ్యం చాలా గొప్పది. ఇది మన సంస్కృతి, సంప్రదాయలతో నిండిపోయింది. 75 ఏళ్లలో భారతదేశం అసాధారణ విజయాలు సాధించింది. ఎన్నో సవాళ్లను అధిగమించి ముందుకు సాగింది. ఈ శక్తిని ప్రజాస్వామ్యం మనకు అందించింది. మన ప్రజాస్వామ్య గొప్పదనాన్ని చాటి చెప్పుకోవాలి. ఈ రోజు పండుగ జరుపుకోవాలి.” అని మోడీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
రాజ్యంగం గురించి నెహ్రూ సీఎంలకు లేఖ రాశారు.. పార్లమెంట్‌లో మోడీ సంచలన వ్యాఖ్యలు
నేడు పార్లమెంట్ సమావేశాల్లో 75 ఏళ్లు పూర్తి చేసుకున్న భారత రాజ్యాంగం, రాజ్యాంగ ప్రయాణంపై చర్చ జరిగింది. డిసెంబరు 13 నుంచి లోక్‌సభలో రాజ్యాంగంపై రెండు రోజుల చర్చను ఏర్పాటు చేశారు. ప్రతిపక్ష ఎంపీల ప్రసంగాల అనంతరం ప్రధాని మోడీ పార్లమెంట్‌లో ప్రసంగించారు. ప్రసంగం మధ్యలో కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం రాజ్యాంగం ఏర్పడి 25 ఏళ్లు పూర్తవుతున్న వేళ రాజ్యాంగాన్ని లాక్కున్నారన్నారు. దేశాన్ని జైలుగా మార్చి పౌరుల హక్కులను కాలరాశారన్నారు. ఇది కాంగ్రెస్ చరిత్రలో ఎప్పటికీ కడుక్కోలేని పాపమని అన్నారు. రాజ్యాంగ నిర్మాతల తపస్సును, శ్రమను నాశనం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. 1951లో కాంగ్రెస్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాజ్యాంగాన్ని మార్చిందని, భావప్రకటనా స్వేచ్ఛపై దాడి చేసిందని అన్నారు.
పారిశ్రామిక అభివృద్ధి ద్వారా రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం పారిశ్రామికవాడలో పర్యటించిన మంత్రి.. వివిధ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమయ్యారు. పారిశ్రామిక అభివృద్ధి ద్వారా రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామని మంత్రి వెల్లడించారు. పారిశ్రామిక వేత్తల సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తారకరామ ప్రాజెక్టును పూర్తి చేసి పైడి భీమవరం పారిశ్రామిక వాడ పరిసరాల్లో నీటి అవసరాలు తీరుస్తామన్నారు. వ్యర్థ జలాల నిర్వహణ కోసం చిన్న పరిశ్రమలు ముందుకు రావాలని మంత్రి సూచించారు. కేంద్రం ఇచ్చే 70 శాతం గ్రాంట్స్‌తో ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. యువతలో నైపుణ్యాభివృద్ది కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామన్నారు. కాలుష్య నియంత్రణకు చర్యలు చేకూడతామని హామీ ఇచ్చారు. ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ కౌన్సిల్ పూర్తి స్థాయిలో పని చేసేవిధంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశాలిచ్చారు.
తెలంగాణ తల్లిపై ప్రేమ లేదు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి రూపం మార్చారు
మన సంస్కృతిపై దాడి జరుగుతుంటే ప్రతీ ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణ తల్లిపై ప్రేమ లేదు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి రూపం మార్చారని విమర్శించారు. తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను చూస్తే తెలంగాణ సమాజాన్ని చూసినట్లుంటుందన్నారు. అందరం కలిస్తేనే ఒక అందమైన బతుకమ్మ అవుతుంది… అందరం కలిస్తేనే అందమైన సమాజం అవుతుందన్న సందేశం ఇచ్చేది బతుకమ్మ అంటూ కవి పేర్కొన్నారు. అలాంటి బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో లేకపోతే తెలంగాణ సమాజంలో స్నేహశీలత, సుహృధ్భావం ఎలా కనిపిస్తుందని ప్రశ్నించారు. తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడారు.
సింగరేణి కార్మికులకు కాపాడుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉంది
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేశామని దామోదర రాజనర్సింహ అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తున్నామని, మహిళా సాధికారత అనే అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా భుజస్కందాలపై వేసుకుందన్నారు మంత్రి దామోదర. ఇందిరా గాంధీ హయం లో పేదలకు భూములు పంచిన గంత కాంగ్రెస్ ది అని, గత 10సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఒక గుంట భూమి,ఒక ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. సింగరేణి కార్మికులకు కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం పై వుందని, గురుకుల విద్యార్థులకు 40%డైట్ చార్జీలు,100%కాస్మొటిక్ చార్జీలు పెంచామన్నారు మంత్రి దామోదర రాజనర్సింహ. 10సంవత్సరాల నియంత,నిరంకుశ పాలన చూశామని, ప్రజల యొక్క ప్రతి ఆకాంక్షను నెరవేరుస్తామన్నారు.
వైసీపీకి బిగ్ షాక్.. కడప కార్పొరేషన్‌లో ఏడుగురు కార్పొరేటర్లు జంప్!
కడప జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. కడప కార్పొరేషన్‌లో ఏడు మంది కార్పొరేటర్లు పార్టీ మారనున్నట్లు తెలిసింది. సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో కార్పొరేటర్లు టీడీపీలో చేరనున్నారు. వైసీపీ కార్పొరేటర్లతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చర్చలు జరిపారు. కడప నగరంలోని అలంకానపల్లెలో ఈరోజు సాయంత్రం మున్సిపల్ కార్పొరేటర్లతో ఎంపీ సమావేశం కాగా.. కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి సమావేశానికి అసంతృప్తి కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. గత రెండు నెలల క్రితం 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణ వైసీపీని వీడి టీడీపీలో చేరారు. కార్పొరేషన్‌లో కుర్చీల గోల తర్వాత అసంతృప్తి కార్పొరేటర్లపై టీడీపీ దృష్టి సారించింది. ప్రస్తుతం కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో టీడీపీకి ఇద్దరు కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు.
సాగునీటి సంఘం ఎన్నికల్లో అధికారిపై కత్తితో దాడి.. ఎన్నికలు వాయిదా
కృష్ణా జిల్లా పెడనలో సాగునీటి సంఘం ఎన్నికలు ఉద్రిక్తతకు దారితీశాయి. పెడనలో ఎన్నికల అధికారిపై కత్తితో దాడికి పాల్పడటం కలకలం రేపింది. పెడన మండలం నందిగామ గ్రామ నీటి సంఘం ఎన్నికలలో ఎన్నికల అధికారి జి.మధుశేఖర్‌పై కత్తితో దాడి చేశారు. టీడీపీలో ఇరువర్గాల మధ్య ఆదిపత్యం పోరుతో మండల పార్టీ అధ్యక్షుడు చల్లపాటి ప్రసాదు బలపర్చిన పామర్తి వెంకటేశ్వరరావుకి రెండు ఓట్లు రావడం దాడికి కారణమని తెలిసింది. ఎన్నికల అధికారి చేతిలో ఉన్న కాగితాలను చింపి పామర్తి వెంకటేశ్వరరావు ఎన్నికల అధికారిపై కత్తితో దాడి చేశారు. గాయపడిన ఎన్నికల అధికారి మధు శేఖర్‌ను ఆస్పత్రికి తరలించారు. భయంతో నందిగామ గ్రామ నీటి సంఘం ఎన్నికలను ఇంచార్జ్ తహసీల్దార్ అనిల్‌కుమార్ వాయిదా వేశారు.