రైతులకు, సైనికులకు కాంగ్రెస్ ద్రోహం చేసింది
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ కురుక్షేత్రలో మెగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హర్యానాలో మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ ఖాయమన్నారు. ఈ ర్యాలీలో సీఎం నయాబ్ సైనీపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. అలాగే భాజపా చెప్పింది.. కచ్చితంగా చేస్తుందని అన్నారు. రెండు రోజుల క్రితమే తాము హర్యానాకు ప్రయోజనం కలిగించే పెద్ద నిర్ణయం తీసుకున్నామన్నారు. 70 ఏళ్లు పైబడిన వారికి రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
గణేష్ నిమజ్జనానికి జీహెచ్‌ఎంసీ తరఫున అన్ని ఏర్పాట్లు చేశాం..
గణేష్ నిమజ్జనానికి జీహెచ్‌ఎంసీ తరఫున అన్ని ఏర్పాట్లు చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి కాటా తెలిపారు. ఈ నెల 17, 18, 19 మూడు రోజులపాటు 15000 మంది జీహెచ్ఎంసీ సిబ్బంది పని చేస్తారని ఆమె తెలిపారు. శానిటేషన్ సిబ్బంది, ట్యాంక్ బండ్‌లో గజ ఈతగాళ్లు ను ఏర్పాటు చేశామని ఆమె అన్నారు. నిమజ్జనానికి వచ్చే భక్తుల కోసం ట్యాంక్‌బండ్, సరూర్ నగర్ మంచినీళ్లు, ఫుడ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు అమ్రపాలి తెలిపారు. ఇప్పటికే రోడ్ రిపేర్స్, స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేశామని, అన్ని మేజర్ చెరువుల వద్ద క్రేన్సు ఏర్పాటు చేశామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చిన్న చిన్న చెరువుల వద్ద బేబీ పాంట్స్ ను ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు.
అంతరిక్షం నుంచే సునీతా విలియమ్స్ ఓటు.. ఇది ఎలా సాధ్యం..?
సునీతా విలియమ్స్ ఇటీవల కాలంలో మారుమోగుతున్న పేరు. జూన్ 5న 8 రోజుల మిషన్ కోసం అమెరికా అంతరిక్ష సంస్థ నానా, సునీతా విలియమ్స్‌తో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్‌లని బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కి పంపింది. అయితే, అక్కడి వెళ్లిన తర్వాత స్టార్‌లైనర్‌లో లీకేజీలను గుర్తించారు. నిజానికి ఈ స్టార్ లైనర్ అంతరిక్షానికి బయలుదేరే ముందే కొన్ని అడ్డంకులు ఎదురుకావడంతో లాంచ్ వాయిదా పడింది. తీరా అక్కడికి వెళ్లాకా హీలియం లీకులు, థ్రస్టర్లు విఫలం కావడంతో సమస్య తలెత్తింది. 8 రోజుల మిషన్ కోసం వెళ్లిన సునీతా విలియమ్స్ అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎలాన్ మస్క్‌కి చెందిన డ్రాగన్ క్రూ ద్వారా భూమిపైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..!
స్టీల్ ప్లాంట్ సంక్షోభం రాజకీయ వేడిని రాజేస్తోంది. విశాఖ ఉక్కు మూసివేయడమే అంతిమ నిర్ణయం అయితే తన పదవికి రాజీనామా చేస్తానని గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రకటించారు. రాజీనామా చేసి కార్మికులతో కలిసి పరిరక్షణ పోరాటంలో కొనసాగుతానని ఆయన చెప్పారు. రెండు రోజులుగా ఆర్‌ఐఎన్‌ఎల్‌లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. రా మెటీరియల్ కొరతను కారణంగా చూపించి బ్లాస్ట్ ఫర్నేస్ -3ని యాజమాన్యం మూసివేసింది. సిబ్బంది వీఆర్‌ఎస్ అమలు సహా యాజమాన్య నిర్ణయాలపై కార్మికుల్లో ఆందోళన పెరుగుతోంది. దశలవారీగా ప్లాంట్ షట్ డౌన్ చేసేందుకు యాజమాన్యం ప్రయత్నం చేయడంపై కార్మిక వర్గాలు ఆందోళన ఉధృతం చేస్తున్నాయి. ఎన్డీఏ అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్‌ను కాపాడుతామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తోంది. దీంతో విశాఖ జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేలు అలెర్ట్ తయారు అయ్యారు. కూర్మన్నపాలెం దగ్గర స్టీల్ కార్మికుల దీక్షా శిబిరం దగ్గరకు వెళ్లి ఎమ్మెల్యే పల్లా, ఎంపీ భరత్ ఆందోళనలో ఉన్న కార్మికులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. మరోవైపు, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్కరణ దిశగా జరుగుతున్న ప్రయత్నాలు వ్యతిరేకిస్తూ గాజువాక జంక్షన్‌లో సీఐటీయూ మహాధర్నాకు పిలుపునిచ్చింది.
ముంబయి నటి జేత్వాని ఫిర్యాదు.. కుక్కల విద్యాసాగర్‌పై కేసు నమోదు
ముంబయి నటి కాదంబరి జేత్వాని ఫిర్యాదుతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పీఎస్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. పోలీసులు తనను, తన కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్ట్ చేశారని జేత్వాని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీసులు తనను తన కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్ట్ చేశారన్న ఫిర్యాదుపై విచారణ జరుపుతామని పోలీసులు పేర్కొనగా.. ప్రస్తుతానికి విద్యాసాగర్ పై మాత్రమే కేసు నమోదైనట్లు తెలిసింది. కుక్కల విద్యాసాగర్, మరికొందరిపై 192, 211, 218, 220, 354, 467, 420, 469, 471, రెడ్‌విత్ 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. పోలీసుల పాత్ర పై విచారణ చేసి ఆధారాలు సేకరించి కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. గతంలో కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదుపై ఇదే స్టేషన్‌లో జేత్వానీ, ఆమె కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
రాష్ట్రానికి 10 వేల కోట్ల నష్టం జరిగితే కేసీఆర్, కేటీఆర్ కనీసం స్పందించలేదు..
అమెరికాలో పది రోజులు జల్సా చేసి వచ్చి కేటీఆర్ ఇప్పుడు తెగ హడావిడి చేస్తున్నాడని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వర్షాలు, వరదల వల్ల ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ ప్రజలు అల్లాడిపోతే వారి గురించి కేటీఆర్ మాట్లాడరని, రాష్ట్రానికి 10 వేల కోట్ల నష్టం జరిగితే కేసీఆర్, కేటీఆర్ కనీసం స్పందించలేదన్నారు. అమెరికా నుంచి రాగానే ఖమ్మం ప్రజలను పరామర్శించడానికి కేటీఆర్ వెళ్తాడని అనుకున్నామని, సూర్యాపేట, మహబూబాబాద్ రైతులను కలుస్తడని భావించామన్నారు. కౌశిక్ రెడ్డి అనే శాడిస్ట్, సైకో, పిచ్చి కుక్క లా స్వైర విహారం చేస్తున్న వ్యక్తి ఇంటికి కేటీఆర్ పోయారని ఆయన అన్నారు. వీళ్ల కు తెలంగాణ జనం పైన ప్రేమ ఉందా..? బాధితుల మీద కనీసం సానుభూతి ఉందా అని, రోజుకు 18 గంటలు పనిచేస్తున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బద్నాం చేయాలన్న ఆలోచన తప్ప మరోకటి లేదన్నారు మేడిపల్లి సత్యం.
సీఎం మమతాను కలిసిన ట్రైనీ డాక్టర్‌లు.. 5 డిమాండ్లు ఇవే..
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనపై జూనియర్ డాక్టర్లలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత 33 రోజులుగా వైద్యులు నిరసనలు చేస్తున్నారు. 5 డిమాండ్లను నెరవేర్చాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. నిరసన తెలుపుతున్న వైద్యులను ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలిశారు. సీఎం నివాసంలో చర్చనడుస్తోంది. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్, పశ్చిమ బెంగాల్ డీజీ రాజీవ్ కుమార్, పశ్చిమ బెంగాల్ ప్రిన్సిపల్ సెక్రటరీ, హెల్త్ నారాయణ్ స్వరూప్ నిగమ్, పశ్చిమ బెంగాల్ మంత్రి చంద్రిమా భట్టాచార్య సమావేశానికి వచ్చారు.
చిత్తూరు రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం
చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా మొగలి ఘాట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందడపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారని తెలిపారు. ప్రభుత్వం తరఫు నుంచి మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. క్షతగాత్రులకు ఒక లక్ష రూపాయలు సహాయం ఇస్తామన్నారు. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారని, 31 మంది గాయపడ్డారని వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నామన్నారు.
ఈ నెల 16న వరంగల్ జిల్లాలో మద్యం అమ్మకాలు బంద్
ఈ నెల 16న నిమజ్జనం రోజు వరంగల్ జిల్లాలో మద్యం అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. ఈ నెల 16 గణేష్ విగ్రహాల శోభయాత్ర, నిమజ్జన కార్యక్రమం వున్న నేపథ్యంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో సెప్టెంబర్ 16 (సోమవారం) మద్యం విక్రయాలను నిలిపివేయాలని ఆయన సూచించారు. ఈ నెల 16 ఉదయం 6:00 గంటల నుండి మరుసటి రోజు 17 ఉదయం 6:00 గంటల వరకు కమిషనరేట్ వ్యాప్తంగా వైన్ షాపులు (మద్యం దుకాణాలు) మద్యం సరఫరా చేసే బార్ & రెస్టారెంట్లు, క్లబ్‌లు, హోటళ్ళు మూసివేయాలని పోలీసు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. .గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని పురస్కారించుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం నిర్వహించేందుకు సెప్టెంబర్ 16 న మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మద్యం దుకాణాలు తెరిస్తే చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామనీ హెచ్చరించారు. నిబంధనలు పాటిస్తూ శాంతియుతంగా గణేష్ నిమజ్జనం కార్యక్రమం జరిగేలా సహకరించాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
విజయవాడలో మున్సిపల్ కమిషనర్, అధికారులపై మంత్రి ఆగ్రహం
విజయవాడలో మున్సిపల్ కమిషనర్, అధికారులపై మంత్రి నారాయణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ కండ్రికలో మంత్రి నారాయణ పర్యటించారు. బుడమేరు వరద బాధిత ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. మంచినీరు ఏర్పాటు చేయడం లేదని మంత్రి వద్ద స్థానికులు వాపోయారు. వరద ముంపు ప్రాంతాలలో మంత్రులు తిరుగుతుంటే అధికారులకు పట్టడం లేదంటే ఏమిటి పరిస్థితి అంటూ అధికారులను మంత్రి నారాయణ నిలదీశారు. పేదల కాలనీలో ఉంటే సమస్యలు మీకు తెలుస్తాయంటూ కమిషనర్ పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక్కరోజు మంచం వేసుకొని రాత్రి సమయంలో పడుకుంటే ఇక్కట్లు తెలుస్తాయంటూ కమిషనర్ ధ్యానచంద్‌పై మంత్రి నారాయణ నిప్పులు చెరిగారు. యుద్ధ ప్రాతిపదికన ముంపు ప్రాంతాలలో నీరు తొలగేలా చూడాలని, మంచినీళ్లు అందించాలని ఆదేశించారు. స్పందించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల ముందుకు నేరుగా అధికారులను తీసుకువెళ్లారు మంత్రి నారాయణ. ఇదిలా ఉండగా.. బెజవాడ వాసులను బుడమేరు ముంపు ప్రచారం పరుగులు పెట్టించింది. బుడమేరుకు వరద ముంపు వచ్చిందని కొద్దిసేపట్లో మళ్ళీ ఇళ్లలోకి వరదనీరు వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వార్త తెలుసుకున్న అజిత్ సింగ్ నగర్, పాయకాపురం, కండ్రికా ప్రాంతాల వారు ఇళ్ళ నుంచి బయటకు వచ్చేసి కంగారు పడిన పరిస్థితి నెలకొంది. ఇదంతా ఫేక్ ప్రచారంగా అధికారులు చెబుతున్నారు. ఎవరు ఈ ప్రచారం చేశారు అనేది గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.