కాకర్ల ట్రస్ట్ సేవలు గుర్తించి టీడీపీ అధిష్టానం టికెట్..
పురిటి గడ్డపై మమకారంతో మెట్ట ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో.. ప్రజల జీవితాలు మార్చాలన్న ఆలోచనతో ఉదయగిరి నియోజకవర్గంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. గత రెండేళ్లుగా 16 పథకాలను సొంత నిధులతో ప్రజల్లోకి తీసుకువెళ్లి వేలాదిమందికి లబ్ధి చేకూర్చిన ఘనత ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ-జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ కు దక్కింది. ట్రస్ట్ సేవలు సూపర్ సక్సెస్ అయ్యాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం ద్వారా వేలాదిమంది రోగులకు ఉచితంగా వారి ఇంటి వద్దకే వెళ్లి సేవలందించిన ఘనత కాకర్లదే. అదేవిధంగా వింజమూరు పట్టణంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటుచేసి ప్రతిరోజు సుమారు 700 మందికి మధ్యాహ్న భోజనాన్ని అందించి ప్రజల ఆకలి తీర్చి అన్నదాత అయ్యాడు.
ఈ నెల 17న ఏపీకి ప్రధాని మోడీ.. బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని నేతలకు సూచన
టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో పొత్తులపై చర్చలు అనంతరం.. ఢిల్లీ నుంచి పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అమిత్ షాతో జరిపిన చర్చల సారాంశాన్ని నేతలకు వివరించారు.. బీజేపీతో పొత్తు ఖరారైందని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బీజేపీతో పొత్తులని చంద్రబాబు నేతలకు వివరించారు. బీజేపీతో పొత్తు కుదుర్చుకోవాల్సిన ఆవశ్యకతను పార్టీ నేతలకు చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితులను అర్థం చేసుకోవాలని నేతలకు సూచించారు. రాష్ట్రానికి మేలు జరిగేలా బీజేపీ కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని టీడీపీ అధినేత తెలిపారు.
ఆర్టీసీ నష్టాల నుంచి ప్రాఫిట్ ఓరియంటేషన్ వైపుగా వెళ్తున్నాం…
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48గంటల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చామన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు మహాలక్ష్మి పథకం అమలుకు సిద్ధమయ్యారు… విజయవంతం చేసారన్నారు. 3నెలల్లో 25కోట్ల మహిళలు ఇప్పటివరకు ప్రయాణం చేశారని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ సంస్థ ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని, ప్రావిడెంట్ ఫండ్ నీ వాడుకున్నారు గతంలో… బాండ్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్నారన్నారు. ఇప్పుడు 2017 PRC పూర్తి స్థాయిలో ఇవ్వాలని అనుకుంటున్నామని, ఆర్టీసీ నష్టాల నుంచి ప్రాఫిట్ ఒరిఎంటేషన్ వైపు గా వెళ్తున్నామన్నారు. ఫిట్‌మెంట్ 21% ఇవ్వాలని నిర్ణయించాము… దీనివల్ల ఏడాదికి భారం పడుతుంది.. అయినా కూడా ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులకు సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.
రాహుల్‌ని ప్రధాని చేయడమే సోనియాగాంధీ లక్ష్యం.. కాంగ్రెస్ పేదలకు చేసిందేం లేదు..
Amit Shah: కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు తమ కుటుంబాల ప్రయోజనాల కోసమే పనిచేశారని, పేదల కోసం ఏం చేసింది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం ఆరోపించారు. పాట్నాలోని పాలిగంజ్ ప్రాంతంలో జరిగిన ఓబీసీ మోర్చా ర్యాలీలో ఆయన ప్రసంగించారు. పేదలకు మేలు చేసింద కేవలం ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ మాత్రమే అని అన్నారు. కాంగ్రెస్ నేతలు ఎల్లప్పుడూ వారి కుటుంబాలను జాగ్రత్తగా చూసుకున్నారని, వెనకబడిన ప్రజల పేరుతో లాలూ ప్రసాద్ యాదవ్ కూడా తన కుటుంబం కోసమే జీవితమంతా జీవించారని ఆరోపించారు. సోనియా గాంధీ ఏకైక లక్ష్యం తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే అని అన్నారు.
మిగతా అన్నీ పార్టీలు ఒకవైపు.. సీఎం జగన్ మరోవైపు
ఆదివారం బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ ‘సిద్ధం’ సభ నిర్వహించనుంది. అందుకు సంబంధించి భారీఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్ని లక్షల మంది వచ్చినా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. సభాస్థలంలో సీఎం ప్రసంగం అందరికి కనబడేటట్లుగా భారీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో.. శనివారం మేదరమెట్ల ‘సిద్ధం’ ఏర్పాట్లను మంత్రి విడదల రజని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మూడు ‘సిద్ధం’ సభలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని మంత్రి విడదల రజని అన్నారు. మూడు సభలకు మించిన రెస్పాన్స్ ప్రజల నుంచి మేదరమెట్ల సభకు రానుందని తెలిపారు. సీఎం జగన్ పాలనపై ప్రజలు నమ్మకంతో ఉన్నారని.. రాష్ట్రంలో అన్ని వర్గాలకు జగన్ న్యాయం చేశారని పేర్కొన్నారు. ప్రజలు తమకు మంచి చేస్తున్న నాయకుడికి అండగా ఉండాలని ఫిక్స్ అయ్యారని తెలిపారు.
సంస్కృతి, ఆధ్యాత్మికత అనేవి భారతదేశ సాఫ్ట్ పవర్స్
మార్చి 14 నుండి మార్చి 17 వరకు కేంద్ర సాంస్కృతిక శాఖ, గైడ్ ఆఫ్ హార్ట్‌ఫుల్‌నెస్ ఆధ్వర్యం లో గ్లోబల్ స్పిరుచువాలిటీ మహోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వసుధైక కుటుంబం థీమ్ తో మహోత్సవమని, కన్హా శాంతి వనం లో కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మార్చి 15 న రాష్ట్రపతి ప్రారంభిస్తారని, మార్చి 16 న ఉప రాష్ట్రపతి పాల్గొంటారని ఆయన తెలిపారు. సంస్కృతి (culture), ఆధ్యాత్మికత (Spirituality) అనేవి భారతదేశ సాఫ్ట్ పవర్స్ అని ఆయన అన్నారు. మన కల్చరల్, స్పిరిచువల్ గైడెన్స్ ద్వారా యావత్ ప్రపంచాన్ని మనం ప్రభావితం చేస్తున్నామని, ఓ సానుకూల మార్గం వైపు ప్రపంచాన్ని తీసుకెళ్తున్నామన్నారు. అందులో స్వామి వివేకానంద మొదలుకుని.. అనేకమంది మహానుభావులు.. మన గొప్పతనాన్ని, మన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెబుతున్నామన్నారు కిషన్ రెడ్డి.
కేఏ పాల్ తప్ప అందరితోనూ పొత్తులు పెట్టుకున్న చరిత్ర ఆయనది..
టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులపై మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరూ కలిస్తే తప్ప పోటీ ఇవ్వలేమని తెలిసి రాజకీయ పార్టీలు అన్నీ ఏకం అయ్యాయని విమర్శించారు. చంద్రబాబుకు పొత్తులు కొత్త కాదని దుయ్యబట్టారు. మేలు చూసి ఓటేయమని ముఖ్యమంత్రి అడుగుతుంటే.. పొత్తు చూసి ఓటేయమని చంద్రబాబు అడుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. KA పాల్ తప్ప అందరితోనూ పొత్తులు పెట్టుకున్న చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. మేం ఎన్నికలకు సిద్ధం అంటుంటే.. పొత్తుల కోసం అమిత్ షా ఇంటి ముందు మేం సిద్ధం అని పవన్, చంద్రబాబు నిలబడ్డారని మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. పొత్తుల తెరపైకి ఇప్పుడు మూడో కృష్ణుడిని తెచ్చారు.. బీజేపీకి వైసీపీకి సంబంధాలు ఉన్నాయని ప్రజలను నమ్మించే తప్పుడు ప్రచారం టీడీపీ చేసిందని అమర్నా్థ్ తెలిపారు.
గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ విద్యుత్ సరఫరా చేశాం
రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఇవ్వనటువంటి విద్యుత్ నీ రాష్ట్ర ప్రజలకు అందించామని, రాష్ట్రంలో నిన్న విద్యుత్ 15623 మెగావాట్ల వినియోగం అయ్యిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో 15497 మెగావాట్ల విద్యుత్ (30.03.2023న) నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్ సరఫరా చేశామని, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ విద్యుత్ సరఫరా చేశామని ఆయన వెల్లడించారు. గత పాలకులు వాస్తవాలు పక్కన పెట్టి భ్రమలు కల్పించారని, 2022 డిసెంబర్ లో 200 మిలియన్ యూనిట్లు వాడితే 2023 డిసెంబర్ 207.07 మిలియన్ యూనిట్లు సరఫరా చేసామని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం సరఫరా కంటే ఈ ప్రభుత్వం డిసెంబర్ నుంచి ఎక్కువ విద్యుత్ సరఫరా చేసామని, ఇంకా ఎక్కువ డిమాండ్ వచ్చినా తట్టుకుని సరఫరా చేస్తామన్నారు భట్టి విక్రమార్క. మార్చి, ఏప్రిల్ లో ఎక్కువ వాడకం ఉండబోతోందని… 16వేల మెగావాట్ల ఉత్పత్తి, విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఎవరైనా అపోహలు కల్పిస్తే నమ్మొద్దని ఆయన వెల్లడించారు. గత పాలకులు కల్పించిన ఇబ్బందుల నుంచి కూడా బయటపడేందుకు చర్యలు తీసుకుంటున్నామని, కోల్ మినిస్టర్ ను కలిసి తడిచెర్ల బొగ్గు బ్లాక్ గురించి చర్చించామన్నారు. ఆదర్శవంతమైన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని, త్వరలో విద్యుత్ పాలసీని ప్రవేశ పెడతామన్నారు. ఫ్లోటింగ్ సోలార్ కోసం సర్వే చేసాం. త్వరలో రిపోర్టు రాబోతుందని, సోలార్ విద్యుత్ ను ఎలా వాడుకోవచ్చనే అంశాలపై ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. సర్ ప్లస్ విద్యుత్ ఉండే రాష్ట్రంగా తెలంగాణను మారుస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ కు ఇబ్బంది లేకుండా ఓ ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్తున్నామని, గృహాలక్ష్మీ పై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
బీజేపీ, టీడీపీ, జనసేన సంయుక్త ప్రకటన..
బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుపై ఆయా పార్టీల అధినేతలు జేపీ నడ్డా, చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మోడీ, బీజేపీ, టీడీపీ, జనసేన దేశ ప్రగతికి, ఏపీ ప్రజల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాయన్నారు. ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు.
ప్రధాని మోడీ గత 10 సంవత్సరాలుగా దేశాభివృద్ధి ప్రగతి కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారన్నారు. బీజేపీతో టీడీపీ-జనసేన కలిసి రావడం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను చేరుకోవడానికి సహాయం చేస్తుందని తెలిపారు. బీజేపీ-టీడీపీల మధ్య పాత సంబంధాలున్నాయని.. 1996లో టీడీపీ ఎన్డీయేలో చేరిందని, అటల్ జీ, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కలిసి విజయవంతంగా పనిచేచేశారని పేర్కొన్నారు.
2014లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేసిందని పేర్కొ్న్నారు. 2014 సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు జనసేన మద్దతు ఇచ్చిందని తెలిపారు. సీట్ల పంపకానికి సంబంధించిన విధివిధానాలను ఒకటి రెండు రోజుల్లో చర్చించనున్నామని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజల నిరీక్షణకు తగ్గట్టుగానే, వారి హృదయపూర్వకమైన ప్రజల మద్దతుతో కూటమి ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. పెద్ద మొత్తంలో ప్రజల హృదయపూర్వక మద్దతు లభిస్తుందని చెప్పారు.
పాక్ అధ్యక్షుడిగా మరోసారి జర్దారీ ఎన్నిక
పాక్ అధ్యక్షుడిగా ( Pakistan President) మరోసారి అసీఫ్ అలీ జర్దారీ (Asif ali zardari) ఎన్నికయ్యారు. మొదటి నుంచి అధ్యక్ష పదవి రేసులో ఆయన పేరే ఎక్కువగా వినిపించింది. ఇప్పుడు అధికారికంగా ఆ పేరునే ప్రకటించారు. పాకిస్థాన్ 14వ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో జర్దారీకి 255 ఓట్లు రాగా.. అతని ప్రత్యర్థికి 119 ఓట్లే వచ్చాయి. దీంతో పాకిస్థాన్ అధ్యక్షుడిగా రెండోసారి ఆసిఫ్ అలీ జర్దారీ ఎన్నికయ్యారు. 68 ఏళ్ల జర్దారీ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) మరియు పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) ఉమ్మడి అభ్యర్థి కాగా, అతని ప్రత్యర్థి మహమూద్ ఖాన్ అచక్జాయ్ (75) సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ (SIC) అభ్యర్థిగా ఉన్నారు.
మళ్లీ ఎన్డీఏదే అధికారం, బీజేపీకి 333కి పైగా సీట్లు.. తాజా సర్వేలో వెల్లడి..
BJP: లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తుందని టైమ్స్ నౌ-ఈటీజీ రీసెర్చ్ సర్వే తాజాగా వెల్లడించింది. లోక్‌సభలోని మొత్తం 543 స్థానాల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి 400 సీట్లకు చేరువకు వస్తుందని అంచనా వేసింది. సర్వే ప్రకారం.. ఎన్డీయేకి 358-398 మధ్య సీట్లు వస్తాయని, ఇందులో బీజేపీకి స్వతహాగా 333-363 ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందని తెలిపింది. మరోసారి కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం తప్పదని జోస్యం చెప్పింది.
ఇండియా కూటమికి 110-120 మధ్య సీట్లు దక్కే అవకాశం ఉందని సర్వే చెప్పింది. కాంగ్రెస్ పార్టీకి 28-48 స్థానాలు మించకపోవచ్చని తెలిపింది. తమిళనాడులో డీఎంకే కూటమికి 24-28 సీట్లు దక్కే అవకాశం ఉంది. 42 లోక్ సభ స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్‌లో మమతా మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ 17-21 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వే అంచనా వేసింది. ఈ రాష్ట్రంలో బీజేపీకి 20-24 సీట్లు రావచ్చని పేర్కొంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో 5-7 స్థానాలను గెలుచుకుంటుందని సర్వే ప్రిడిక్ట్ చేయడం విశేషం. ఒడిశాలో బిజూ జనతాదళ్‌కి 10-11 సీట్లు వస్తాయని తెలిపింది.
అరుణాచల్‌ప్రదేశ్ పీసీసీ చీఫ్ రాజీనామా
సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు వరుస దెబ్బలు తగలుతున్నాయి. హస్తం పార్టీని ఒక్కొక్కరు విడిచిపెడుతున్నారు. ఇటీవలే మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ నేతలు పార్టీని వీడి బీజేపీలో చేరారు. తాజాగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ అరుణాచల్‌ప్రదేశ్ పీసీసీ చీఫ్ రాజీనామా చేశారు. మాజీ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు నబమ్ టుకీ తన పదవికి రాజీనామా చేసినట్లు ఆ పార్టీ నాయకుడు ఒకరు శనివారం తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇటీవల బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో నబమ్ టుకీ తన రాజీనామాను శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షుడికి పంపినట్లు తెలిసింది. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి ఫిరాయించకుండా అడ్డుకోలేకపోయిందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేసినట్లు పీసీసీ ప్రధాన కార్యదర్శి గ్యామర్ తానా చెప్పారు.
కులగణనతోనే పేదలకు మేలు
కాంగ్రెస్ (Congress) అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రకటించారు. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా ఆయన గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. కులగణన చేపట్టి.. దీనిద్వారా 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తి వేయొచ్చని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కులగణనతో పాటు ఆర్థిక స్థితిగతుల విశ్లేషణ ద్వారా ఇప్పటివరకు ఉన్న 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేయొచ్చన్నారు. పేదల కోసం సరైన విధానాలు, ప్రణాళికలను రూపొందించడమే కాక విద్య, వైద్యం ఇలా అనేక రంగాల్లో అభివృద్ధికి సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు. బీహార్‌లో నిర్వహించిన కులగణన సర్వేలో పేదల్లో 88 శాతం మంది దళిత, గిరిజన, వెనకబడిన, మైనారిటీ వర్గాల వారే ఉన్నట్లు తేలిందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కులగణన, ఆర్థిక స్థితిగతుల నమోదు అనే రెండు చరిత్రాత్మక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.