మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు
బులియన్ మార్కెట్‌లో బుధవారం పెరిగిన బంగారం ధరలు.. నేడు భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో గురువారం (ఆగష్టు 3) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,100 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,110గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 300.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 330 తగ్గింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో గురువారం ఉదయం నమోదైనవి. దేశంలోని పలు రాష్ట్రాల్లో తులం బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,260గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,500లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,550 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,110గా కొనసాగుతోంది.
దయనీయమైన స్థితిలో స్టార్టప్‌లు.. 6 నెలల్లో 17 వేల మంది ఉద్యోగాలు ఊస్ట్
స్టార్టప్ కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. గతేడాది నుంచి స్టార్టప్ కంపెనీలకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున తొలగింపులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం 7 నెలలకు పైగా గడిచిపోయాయి. కానీ స్టార్టప్‌లు ఉద్యోగాల తొలగింపుల పర్వం కొనసాగిస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించిన గణాంకాలు నియామక పరిష్కారాలను అందించే సంస్థ CIEL HR ద్వారా ఒక నివేదికను ప్రకటించింది. గణాంకాల ప్రకారం, ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో వేల మంది స్టార్టప్‌లలో ఉద్యోగాలు కోల్పోయారు. జనవరి నుండి జూన్ 2023 వరకు 70 కంటే ఎక్కువ స్టార్టప్‌లు తమ వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకున్నాయి. 17 వేల మందికి పైగా ప్రజలు ఉద్యోగాలు పోగొట్టుకుని రోడ్డున పడ్డారు. ఎడ్‌టెక్, ఇ-కామర్స్, ఫిన్‌టెక్, ఫుడ్‌టెక్, హెల్త్‌టెక్, సాస్ రంగ కంపెనీలు తొలగించిన స్టార్టప్ కంపెనీలలో ప్రముఖమైనవి. edtech లో 6 స్టార్టప్‌లు తొలగించబడ్డాయి. బిజినెస్-టు-కన్స్యూమర్ ఇ-కామర్స్‌లో 17 కొత్త కంపెనీలు.. బిజినెస్-టు-బిజినెస్ విభాగంలో 3 స్టార్టప్ కంపెనీలు సంవత్సరం మొదటి ఆరు నెలల్లో తమ ఉద్యోగులను తొలగించాయి. ఫిన్‌టెక్ ప్రపంచంలో API బ్యాంకింగ్ ఉత్పత్తులు, బ్రోకరేజ్, మ్యూచువల్ ఫండ్‌లు, క్రెడిట్ కార్డ్‌లు, బీమా, చెల్లింపు పరిష్కారాలను అందించే సంస్థలతో సహా 11 స్టార్టప్‌లు తొలగించబడ్డాయి. సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సర్వీస్ (సాస్) పరిశ్రమలో 11 స్టార్టప్‌లు ఉద్యోగుల సంఖ్యను తగ్గించాయి.
నేడే భారత్-విండీస్ తొలి టీ20.. హైదరాబాద్ కుర్రాడు అరంగేట్రం! తుది జట్టు ఇదే
టెస్టు, వన్డే సిరీస్ తర్వాత భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య టీ20 పోరుకు రంగం సిద్ధమైంది. టెస్టు, వన్డే సిరీస్‌లు ఏకపక్షంగా సాగినా.. పొట్టి సిరీస్ రసవత్తరంగా సాగనుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల్లో మెరుపులు మెరిపించే విండీస్ ప్లేయర్స్ ఓ వైపు.. కుర్రాళ్లతో నిండిన భారత జట్టు మరోవైపు ఉంది. టీ20ల్లో టీమిండియాకు కచ్చితంగా సవాల్ ఎదురుకానుంది. ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో భారత్-విండీస్ తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. నేటి రాత్రి 8 గంటలకు ఆరంభం కానున్న ఈ మ్యాచ్.. డీడీ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
వెస్టిండీస్‌తో జరగనున్న 5 టీ20ల సిరీస్‌లో సీనియర్లకు విశ్రాంతిని ఇచ్చి.. పూర్తిగా కుర్రాళ్లకు అవకాశం ఇచ్చింది బీసీసీఐ. దాంతో భారత తుది జట్టు ఎలా ఉండబోతోందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మతో పాటు మరో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ టీ20 అరంగేట్రం చేసే అవకాశముంది. శుభ్‌మన్ గిల్‌తో కలిసి యశస్వి ఓపెనింగ్ చేయనున్నాడు. ఇషాన్ కిషన్ మూడో స్థానంలో ఆడుతాడు. ఇషాన్ జట్టులో ఉంటే.. సంజు శాంసన్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. తిలక్ వర్మ నాలుగో స్థానంలో ఆడనున్నాడు.
‘ఆయుష్ వీసా’తీసుకొచ్చిన ప్రభుత్వం.. పెరగనున్న మెడికల్ టూరిజం
సాంప్రదాయ వైద్యానికి పుట్టినిల్లు భారతదేశం. పలువురు విదేశీయులు వైద్యం చేయించుకోవడం కోసం భారత్ కు వస్తుంటారు. అలాంటి వారికోసం హోం మంత్రిత్వ శాఖ అద్భుతమైన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద మెడికల్ టూరిజం కోసం భారతదేశానికి వచ్చే విదేశీ పౌరులకు ఇప్పుడు కొత్త కేటగిరీ వీసా ఇవ్వబడుతుంది. ఈ వీసా పేరు ‘ఆయుష్ వీసా’. సాంప్రదాయ భారతీయ వైద్య విధానంలో చికిత్స కోసం భారతదేశానికి రావాలనుకునే విదేశీ పౌరులు మాత్రమే ఈ వీసాను ఉపయోగించుకోగలరు. ఉదాహరణకు, ఒక విదేశీ పౌరుడు ఆయుర్వేద చికిత్స లేదా యోగా నేర్చుకోవడానికి భారతదేశానికి వస్తున్నట్లయితే.. అతనికి ‘ఆయుష్ వీసా’ కింద వీసా ఇవ్వబడుతుంది. భారతదేశంలోని పాత వైద్య విధానాన్ని విదేశాలకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఈ ప్రత్యేక వీసాను ప్రారంభించినట్లు చెబుతున్నారు.
విషాదం.. ఫోన్ ఛార్జర్ పిన్ను నోట్లో పెట్టుకొని మృతి చెందిన 8 నెలల చిన్నారి..
జీవితం ఎంత చిన్నది అనేది మనం చెప్పలేము.. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం అతి కష్టం.. మృత్యువు ఎప్పుడు ఎలా పలకరిస్తుందో అంచనా వెయ్యలేము.. మన చేతుల్లో లేని పని.. తాజాగా ముక్కు పచ్చలు ఆరని చిన్నారి 8 నెలలకే మృత్యువు ఒడిలోకి వెళ్లింది.. మొబైల్ చార్జర్ పిన్ను నోట్లో పెట్టుకొని విధ్యుత్ ఘాతుకంతో ప్రాణాలను విడిచింది.. ఈ విషాద ఘటన కర్ణాటక లో వెలుగు చూసింది..ఈ ఘటన కర్ణాటకలోని కార్వార్ తాలూకాలో చోటుచేసుకుంది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది..
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు వారం రోజులకు మించి జరిగే అవకాశం లేదని తెలుస్తోంది?. మూడు, నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి, ఈ ప్రభుత్వ హయాంలో ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు. ముందస్తు ఎన్నికల సభ కావడంతో అధికార, ప్రతిపక్షాలు తమ గళం వినిపించేందుకు సిద్ధమయ్యాయి. ఈ సమావేశాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అలాగే మరికొన్ని ముఖ్యమైన అంశాలపై ప్రభుత్వం చర్చించి బిల్లులు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి గురించి, ఇప్పటివరకు ప్రజల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలు, పథకాల గురించి సూత్రప్రాయంగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి.
నేడు వైన్ షాపుల రిజర్వేషన్లపై డ్రా తీయనున్న కలెక్టర్లు
ఎక్సైజ్ శాఖ వచ్చే రెండేళ్ల (2023-25) మద్యం దుకాణాలకు లైసెన్స్ మంజూరు ప్రక్రియను ప్రారంభించింది. మద్యం దుకాణాల లైసెన్సుల ఎంపిక ప్రక్రియకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు రేపటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇదే నెల 21న లాటరీ నిర్వహించి దుకాణాలు కేటాయిస్తారు. అయితే.. ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు కేటాయించాల్సిన షాపుల ఎంపిక కోసం నేడు కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ నిర్వహిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటి లైసెన్సుల గడువు ఈ ఏడాది నవంబర్‌తో పూర్తవుతున్నది. దీంతో కొత్తగా లైసెన్సులను జారీ చేసేందుకు ఎక్సైజ్ శాఖ సన్నాహాలు ప్రారంభించింది.
బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలంగాణకు మరోసారి వర్షాల హెచ్చరిక
తెలంగాణకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రుతుపవనాలు బలపడటంతో తెలంగాణలో మరోసారి వర్షాలు కురుస్తాయని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. నేడు, రేపు (ఆగస్టు 3, 4) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ విభాగం వెల్లడించింది. రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. హైదరాబాద్‌లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.