ఈ నెల 9న తెలంగాణ కేబినెట్ భేటీ
తెలంగాణ కేబినెట్ భేటీ ఈ నెల 9న జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి శనివారం అన్ని శాఖలకు సమాచారం ఇచ్చారు. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ, యాసంగి ధాన్యం కొనుగోళ్లు, కొత్త క్రీడా విధానం సహా పలు కీలక అంశాలపై మంత్రిమండలి నిర్ణయాలు తీసుకోనుంది. యాసంగి సీజన్‌కు సంబంధించి దొడ్డుబియ్యం కొనుగోలుపై కేంద్రం పేచీ పెడుతుందనే ఇబ్బంది రాకుండా.. ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చూస్తోంది. వచ్చే వానాకాలం సాగుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, ఇతర సన్నద్ధతలపైనా మంత్రిమండలి దిశానిర్దేశం చేయనుంది.
దేశవ్యాప్తంగా నీట్ ప్రవేశ పరీక్ష
దేశవ్యాప్తంగా 2023-24లో వైద్య విద్యాసంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేషన్(పీజీ) మెడికల్ సీట్ల భర్తీకి నేడు నీట్ ప్రవేశపరీక్ష జరగనుంది. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్యాసంస్థల్లో ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా, డీఎన్‌బీ కోర్సులకు పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో మొత్తం 2,453 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ వైద్య విద్యాసంస్థల్లో 1,393, ప్రైవేటులో 1,060 సీట్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 271 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరగనుండగా.. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, సత్తుపల్లి, సూర్యాపేట, కోదాడ కేంద్రాల్లో నిర్వహిస్తారు. మార్చి 31వ తేదీలోపు ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
బీఆర్ఎస్‌ను ఎదుర్కొనే ఏకైక పార్టీ బీజేపీయే..
తెలంగాణలో అప్పులన్నీ తీరి అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ ఎదిగిందని ఆయన తెలిపారు. శనివారం రాత్రి ఆదిలాబాద్‌లో జరిగిన చేరికల సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఆ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో బీఆర్‌కు చెందిన పలువురు నేతలను పార్టీలోకి ఆహ్వానించారు. బండి సంజయ్ రాకతో ఆదిలాబాద్ జిల్లా కార్యకర్తల్లో జోష్ నెలకొంది. ఆదిలాబాద్ బైపాస్ నుంచి పట్టణం మీదుగా 13 కి.మీల మేరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బండి సంజయ్ సమక్షంలో భారీ ఎత్తున జిల్లా నాయకులు బీజేపీలో చేరారు. అనంతరం మహిళలపై సాగుతున్న అత్యాచారాలకు నిరసనగా బీజేపీ కార్యకర్తలతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్ కరెంట్ కట్ చేసేందుకు ప్రజలు సిద్ధమయ్యారని ఆయన అన్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా సీఎం స్పందించడం లేదని బండి సంజయ్ ఆరోపించారు. ప్రజల పక్షాన ఎంతకైనా తెగిస్తూ పోరాడుతోంది బీజేపీనేనని ఈ సందర్భంగా అన్నారు. మేం అధికారంలోకొస్తే ఉచిత విద్య, వైద్యంతోపాటు పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన రైతాంగానికి నష్ట పరిహారం అందిస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లా సభలో కేసీఆర్ సర్కార్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు.
గుండెపోటుతో వరుపుల రాజా మృతి
టీడీపీలో తీవ్ర విషాదం నెలకొంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డీసీసీబీ మాజీ ఛైర్మన్, ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ వరుపుల రాజా హఠాన్మరణం చెందారు. శనివారం ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటిన కాకినాడ అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ వరుపుల రాజా మృతి చెందారు. ఆయన పార్ధివదేహాన్ని స్వస్థలం ప్రత్తిపాడుకు తరలించారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత పెద్ద శంకర్లపూడిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరగనున్నాయి. వరుపుల రాజా మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజా మృతి పార్టీకి తీరని లోటని చెప్పిన చంద్రబాబు.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజా అంత్యక్రియలకు చంద్రబాబు హాజరయ్యే అవకాశం ఉందని టీడీపీ నేతలు చెప్తున్నారు.
భారత ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు
కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ యూకేలో పర్యటిస్తున్నారు. ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇదిలా ఉంటే లండన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మరోసారి భారత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్రమోదీని గుడ్డిగా విశ్వసించే ఎవరికైనా మద్దతు ఉంటుందని, మోదీపై, ప్రభుత్వంపై ప్రశ్నలు లేవనెత్తే వారిపై దాడులు జరుగుతున్నాయని, బీబీసీపై ఇదే విధంగా దాడి జరిగిందని ఆయన అన్నారు. 2002 గుజరాత్ అల్లర్లలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ పాత్రపై బీబీసీ ‘‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’’పేరుతో రెండు భాగాల డాక్యుమెంటరీని రూపొందించింది. ఇది యూకే, ఇండియాలో వివాదాస్పదం అయింది. భారత విదేశాంగ శాఖ దీన్ని వలసవాద మనస్తత్వంగా అభివర్ణించింది. దీని తర్వాత ముంబై, ఢిల్లీ బీబీసీ కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. ఇదిలా ఉంటే.. తదుపరి ప్రధాని అభ్యర్థి మీరేనా..? అని అక్కడి మీడియా రాహుల్ గాంధీని ప్రశ్నించింది. అయితే ప్రస్తుతానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ను ఓడించడమే ప్రతిపక్షాల ఉమ్మడి లక్ష్యం అని అన్నారు. నిరుద్యోగం సమస్యల పరిష్కారంపై రాహుల్ మాట్లాడుతూ.. ప్రజలతో మాట్లాడటం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. విదేశాల్లో భారత్ ను చెడుగా చూపించిన వ్యక్తి ప్రధాని నరేంద్రమోదీ అని బీజేపీ విమర్శలను రాహుల్ తిప్పికొట్టారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అయినా చేసిందేం లేదని ప్రధాని విదేశాల్లో అనడం తనకు గుర్తుందని, పదేళ్లలో మనం ఓడిపోయామని అన్నారని, భారత్ లో అపరిమిత అవినీతి జరుగుతోందని వ్యాఖ్యానించారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు.
దారుణం..ఒకే సిరంజితో చాలా మందికి ఇంజెక్షన్.. అమ్మాయికి హెచ్ఐవీ పాజిటివ్..
ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. యూపీకి చెందిన ఓ డాక్టర్ అనేక మంది పేషెంట్లకు ఒకే సిరంజిని వాడాడు. ఆ తరువాత ఓ అమ్మాయికి హెచ్ఐవీ పాజిటివ్ గా తేలింది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఎటాహ్ లోని ఒక వైద్య కళాశాల వైద్యులు ఒకే సిరంజితో అనేక మందికి ఉపయోగించారు. అయితే ఈ ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ స్పందించారు. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వివరాల్లోకి వెళితే ఎటాహ్‌లోని రాణి అవంతీ బాయి లోధి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో ఒక వైద్యుడు ఒకే సిరంజిని అనేకమంది పేషెంట్లకు ఉపయోగించాడు. దీని తర్వాత ఒక అమ్మాయికి హెచ్ఐవీ పాజిటివ్ గా తేలింది. ఒకే సిరంజి నుంచి పలువురు పిల్లలకు ఇంజక్షన్లు ఇచ్చారని శనివారం ఆస్పత్రిలో చేరిన బాలిక తల్లిదండ్రులు జిల్లా మేజిస్ట్రేట్ అంకిత్ కుమార్ అగర్వాల్‌కు ఫిర్యాదు చేశారు. అంతకుముందు ఫిబ్రవరి 20న బంధువులు బాలికను ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చిన్నారికి హెచ్ఐవీ సోకిందని తేలడంతో ఆరోగ్య కార్యకర్తలు రాత్రికి రాత్రే చిన్నారిని బలవంతంగా ఆస్పత్రి నుంచి బయటకు పంపినట్లు బంధువులు ఆరోపించారు.
ఎయిరిండియా సీన్ రిపీట్.. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్రవిసర్జన
ఎయిరిండియా విమానంలో మూత్రవిసర్జన ఘటన దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అయిందో అందరికి తెలుసు. దీనిపై డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) కఠిన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే రిపీట్ అయింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానంలో మద్యం తాగిన మత్తులో ఓ ప్రయాణికుడు, మరో ప్రయాణికుడిపై మూత్రవిసర్జన చేశాడు. విమానం ల్యాండ్ అయిన వెంటనే నిందితుడిని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. AA292 అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం శుక్రవారం రాత్రి 9:16 గంటలకు న్యూయార్క్ నుండి బయలుదేరింది మరియు 14 గంటల 26 నిమిషాల తర్వాత శనివారం రాత్రి 10:12 గంటలకు ఢిల్లీలోని విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. నిందితుడు యూఎస్ యూనివర్సిటీలో విద్యార్థి అని, అతడు తాగిన మత్తులో నిద్రపోతున్నప్పుడు మూత్ర విసర్జన చేశాడు. అయితే ఈ విషయంపై విద్యార్థి, ప్రయాణికుడికి క్షమాపణలు చెప్పాడు. ఈ ఘటనకు సంబంధించి పైలెట్, ఢిల్లీ విమానాశ్రయంలోని ఏటీసీకి సమాచారం ఇచ్చాడు. సీఐఎస్ఎఫ్ సిబ్బంది నిందితుడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు.
Kabzaa Trailer: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెక్స్ట్ బిగ్ థింగ్
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి KGF, కాంతార, విక్రాంత్ రోణా, 777 చార్లీ లాంటి సినిమాలు రిలీజ్ అయ్యి పాన్ ఇండియా ఆడియన్స్ దృష్టి KFIపై పడేలా చేశాయి. ఇప్పుడు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సినిమా వస్తుందా అని పాన్ ఇండియా సినీ అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. ఆ వెయిటింగ్ ని ఎగ్జైట్మెంట్ గా మారుస్తూ ‘కబ్జా’ సినిమా వస్తుంది. వెర్సటైల్ యాక్టర్స్ కిచ్చా సుదీప్, ఉపేంద్ర కలిసి నటిస్తున్న ఈ సినిమాని చంద్రు డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రేయ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో శివన్న స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నాడు. పోస్టర్స్, టీజర్ తో అంచనాలని పెంచిన కబ్జా చిత్ర యూనిట్ లేటెస్ట్ గా కబ్జా ట్రైలర్ ని లాంచ్ చేశారు. రిచ్ విజువల్స్, హ్యుజ్ సెటప్స్, స్టెల్లార్ కాస్ట్, ఎలక్ట్రిఫయ్యింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లాంటి విషయాలు కబ్జా ట్రైలర్ ని మాస్టర్ పీస్ లా మార్చాయి. అయితే ఇంటర్ కట్స్ ఎక్కువగా ఉండడంతో ఆ ట్రైలర్ ని కాస్త ఎక్కువ సేపే చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ట్రైలర్ లో చూపించిన సుదీప్, ఉపేంద్రల రెండు డిఫరెంట్ లుక్స్ ఆకట్టుకున్నాయి. శ్రేయ పీరియాడిక్ డ్రామాకి తగ్గట్లు సారీలో ఎలిగాంట్ గా ఉంది. ఈ మధ్య కాలంలో ఇదే తన బెస్ట్ లుక్ అని చెప్పాలి. థియేటర్ కి వచ్చే ఆడియన్స్ కి సర్ప్రైజ్ ని ప్లాన్ చేసిన దర్శకుడు చంద్రు ట్రైలర్ లో ఎక్కడా శివన్న క్యామియోకి సంబంధించిన క్లిప్ ని కూడా ప్లే చెయ్యలేదు. శివన్న కనిపిస్తాడేమో అని కబ్జా ట్రైలర్ చూసిన ఫాన్స్ కి నిరాశ తప్పదు. అయితే ఒక భారి సినిమా కన్నడ నుంచి వస్తుంది, ఇది ఇండియాలో నెక్స్ట్ బిగ్ థింగ్ అవుతుంది అంటూ చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై పెరిగిన అంచనాలు చూస్తే కబ్జా సినిమాకి పాన్ ఇండియా హిట్ అయ్యే సత్తా ఉందనిపిస్తుంది. మరి మార్చ్ 17న ఆ అంచనాలని అందుకోని కబ్జా సినిమా సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి.