కంసన్ హైజెన్ కేర్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం..
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని కంసన్ హైజెనిక్ పరిశ్రమలో అర్థరాత్రి ఒకసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక షెడ్డులో భారీ మంటలు ఎగిసిపడుతూ అందరూ చూస్తుండగానే క్షణాల్లో పూర్తిగా నేల మట్టం అయిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉంటుందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఐదు ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినా మంటలు అదపులోకి రాలేదు. పరిశ్రమ పూర్తిగా అగ్నికి ఆహతి అయ్యింది.అయితే.. పక్కనే ఉన్న ఇతర పరిశ్రమలకు మంటలు వ్యాపించకుండా ప్రయత్నిస్తున్నారు. ఇక.. అగ్ని ప్రమాదం కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి.
కదులుతున్న రైలులో కాల్పులు..
ఒడిశాలోని భద్రక్‌లో నందన్‌కనన్ ఎక్స్‌ప్రెస్ రైలుపై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. రైలు న్యూఢిల్లీ నుంచి భువనేశ్వర్ వెళ్తోన్న సమయంలో ఈ ఘయ్తన జరిగింది. ఈ సంఘటన భద్రక్, బౌదాపూర్ సెక్షన్ మధ్య జరిగింది. అందిన సమాచారం ప్రకారం, రైలు నంబర్ 12816 గార్డ్ బ్రేక్ వద్ద రెండు రౌండ్ల కాల్పులు జరిగాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ ఘటన గురించి రైలు గార్డు మహేంద్ర బెహెరా మాట్లాడుతూ.. ఒక వ్యక్తి పిస్టల్‌తో రైలుపై కాల్పులు జరుపుతున్నట్లు చూశానని చెప్పారు. కాల్పుల ఘటన తర్వాత రైలు కిటికీకి రంధ్రం పడింది. అనంతరం ఆర్పీఎఫ్ సిబ్బంది రైలుకు భద్రత కల్పించి రైలును పూరీకి తరలించారు.
జెడ్డాలో ఐపీఎల్ మెగా వేలం.. పేర్లు నమోదు చేసుకున్న 1574 మంది క్రికెటర్లు!
ఐపీఎల్ 2025 మెగా వేలం తేదీలు ఖరారు అయ్యాయి. నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో వేలం జరగనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. సోమవారంతో (నవంబర్ 4) ప్లేయర్ రిజిస్ట్రేషన్ అధికారికంగా ముగిసింది. మొత్తం 1,574 మంది క్రికెటర్లు మెగా వేలం కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో 1,165 మంది భారతీయులు ఉండగా.. 409 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు.
ఐపీఎల్ 2025 వేలం జాబితాలో 320 క్యాప్‌డ్ ప్లేయర్‌లు, 1,224 అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌లు, 30 అసోసియేట్ నేషన్స్ ప్లేయర్‌లు ఉన్నారు. 48 మంది క్యాప్‌డ్ ఇండియన్స్, 272 క్యాప్‌డ్ ఇంటర్నేషనల్స్ ప్లేయర్స్, 965 మంది అన్‌క్యాప్‌డ్ ఇండియన్ ప్లేయర్‌లు, 104 అన్‌క్యాప్‌డ్ ఇంటర్నేషనల్స్ ప్లేయర్స్ ఉన్నారు. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, అర్ష్‌దీప్ సింగ్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు వేలంలో ఉన్నారు. వీరికి కాసుల వర్షం కురిసే అవకాశం ఉంది.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ
ఏపీ కేబినెట్ సమావేశం ఈరోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరుగనున్నది. ముఖ్యంగా, 1982 ల్యాండ్ గ్రాబింగ్ చట్టం రద్దు ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోబడే అవకాశం ఉంది. ప్రస్తుత చట్టంలో ఉన్న కొన్ని నిబంధనల కారణంగా భూ ఆక్రమణలపై కేసుల నమోదు కోసం ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. వైసీపీ పాలనలో అనేక ఎకరాలు అక్రమంగా ఆక్రమించబడినట్లు కూడా ఇప్పటికే ప్రభుత్వం పేర్కొంది. అందుకే ఈ చట్టాన్ని రద్దు చేసి, కొత్తగా “ల్యాండ్ గ్రాబింగ్ ప్రోహిబిషన్ బిల్లు 2024” తీసుకురావాలని నిర్ణయించింది.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన నిర్ణయం..
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గాలంట్‌ను పదవి నుంచి తొలగించారు. గాజాలో యుద్ధం మొదలు ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగాయి.. ఈ కారణంగా ఆయనను విధుల నుంచి తొలగించినట్టు సమాచారం. గాజాలోని హమాస్, లెబనాన్‌లోని హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు జరుగుతున్నప్పుడు నెతన్యాహు అనూహ్య ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. యుద్ధం సమయంలో ప్రధానికి, రక్షణశాఖ మంత్రికి మధ్య పూర్తి నమ్మకం ఉండాలి.. మొదట్లో అలాంటి నమ్మకమే మా మధ్య ఉండేది. దాని ఎన్నో సానుకూల ఫలితాలు సాధించాం. దురదృష్టవశాత్తు ప్రస్తుతం అలాంటిది కొనసాగడం లేదు.. ఇద్దరి మధ్య అంతరాలు పెరిగిపోయాయి.. మా మధ్య విశ్వాసం సన్నగిల్లిందని ఇజ్రాయెల్ ప్రధాని చెప్పుకొచ్చారు.
కన్నీరు పెడుతున్న రైతన్నల కన్నీళ్ల వైపు చూడు.. కేటీఆర్ ట్వీట్ వైరల్..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లంలో కాంటా ఎప్పుడు వేస్తారో తెలియక కన్నీరు పెడుతున్న రైతన్నల కన్నీళ్ల వైపు చూడు అంటూ మండిపడ్డారు. గుట్టలను మట్టిచేసి భూదాహం తీర్చుకోవడం కాదు రేవంత్ – గుట్టల్లా పేరుకుపోయిన ధాన్యం రాశుల వైపు చూడు అంటూ ట్వీట్ చేశారు. గాలిమోటర్లో మూటలు మోసుడు కాదు – కొనేవారు లేక పేరుకుపోయిన ధాన్యం మూటల వైపు చూడు అంటూ తెలిపారు. ఢిల్లీ ముందు మోకరిల్లడం కాదు – పండించిన పంటకు భద్రత లేక గొల్లుమంటున్న రైతన్నల మొహం వైపు చూడంటూ మండిపడ్డారు. నీ కల్లబొల్లిమాటలతో కాలయాపన చేయడం కాదు – ధాన్యం కొనడానికి ముందుకు రాని మిల్లర్ల ముచ్చటేందో చూడు అంటూ నిప్పులు చెరిగారు. నీ మూసి ముసుగులు కాదు – కల్లంలో కాంటా ఎప్పుడు వేస్తారో తెలియక కన్నీరు పెడుతున్న రైతన్నల కన్నీళ్ల వైపు చూడు అని ట్విటర్ వేదికగా సీఎం రేవంత్ పై మండిపడ్డారు. పొద్దు, మాపు ఢిల్లీ యాత్రలు కాదు – పల్లె పల్లెల్లో, వాడ వాడల్లో వడ్లు కొనండి మొర్రో అంటూ మొత్తుకుంటున్న రైతు ఆవేదన వైపు చూడు అన్నారు. నీ కాసుల కక్కుర్తి – నీ కేసుల కుట్రలు కాదు – పండిన పంటకు గిట్టుబాటు ధర దక్కక కకావికలం అవుతున్న రైతు బతుకు వైపు చూడాలని సీఎంకు తెలిపారు. దొడ్డు వడ్లకు బోనస్ ఎగ్గొడితివి .. సన్నవడ్లకు సున్నం పెడితివి .. ఎగ్గొట్టడం మీద ఉన్న శ్రద్ధ రైతులకు ఆసరాగా నిలవడం వైపు చూడాలని కేటీఆర్ ట్విటర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేడు ఢిల్లీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ రోజు (బుధవారం) ఢిల్లీకి బయలుదేరతున్నారు. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత వెలగపూడి సచివాలయం నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి 3.30 గంటలకు ఢిల్లీ విమానానికి ప్రయాణం చేయి, 5:45 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. విమానాశ్రయ నుంచి నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసానికి చేరుకుని, 6:30 నుంచి 7 గంటల మధ్య ఆయనతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఏపీ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక విషయాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై, ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఇటీవల పోలీసు అధికారులపై చేసిన విమర్శల నేపథ్యంలో ఈ భేటీ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
ఉత్కంఠగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఆ రోజే ఫైనల్ రిజల్ట్!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్ట్ ట్రంప్, కమలా హ్యారీస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. ఒక పక్క పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే.. మరో పక్క ఫలితాల కౌంటింగ్‌ను స్టార్ట్ చేశారు. ఇక, భారత కాలమాన ప్రకారం ఇవాళ (బుధవారం) ఉదయం 11.30 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. దీంతో పోలింగ్ పూర్తైన కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల వరకు సాగిన కౌంటింగ్‌లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు.
నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సర్వే.. సేకరించే వివరాలు ఇవే..
కుల గణన సర్వేను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుంది. ఇవాళ ఇంటింటికి కుటుంబ సర్వే నిర్వహించనున్నారు. సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కులాల సమాచార సేకరణకు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నేటి నుంచి నిర్వహించనున్నారు. నేటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు అనగా మూడు రోజుల పాటు ఇళ్ల జాబితా నమోదు కార్యక్రమం నిర్వహించనున్నారు. గ్రామ పంచాయతీ/మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాల పేర్లు కోడ్ రూపంలో సేకరించబడతాయి. ఇంటి జాబితాలో వార్డు నంబర్, ఇంటి నంబర్, వీధి పేరు కూడా నమోదు చేయబడ్డాయి. ప్రతి ఇంటికి ఒక స్టిక్కర్ జతచేయబడుతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి (బుధవారం) నుంచి శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి సర్వే చేయనున్నారు. ఈ సర్వేలో ప్రజల సామాజిక, విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ వివరాలను సేకరించనున్నారు. ఈ సర్వే కోసం 75 ప్రశ్నల ఫార్మాట్‌ను సిద్ధం చేశారు. ఈ ప్రశ్నలు రెండు భాగాలుగా ఉంటాయి. కాగా.. 8 పేజీల్లో ఆయా వివరాలను ఎన్యూమరేటర్లు నమోదు చేస్తారు.