హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం
హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్ లో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం చల్లబడింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం లో ఓ మోస్తారు వర్షం కురుస్తోంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని మొఖాసిగూడ గ్రామంలో భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో పలు ఇళ్ల పై కప్పులు ఎగిరిపోయాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీ వృక్షం విరిగిపడింది. ఉరుముల ,మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. ఎండవేడిమి, ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరైన ప్రజలకు కొంత ఉపశమనం లభించింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఈదురు గాలులు పిడుగులతో కూడిన భారీ వర్షం పడుతోంది. పలు చోట్ల పిడుగు పాటుకు చెట్లు నేలరాలాయి. కాగా.. సాయంత్రం 6 గంటల తరువాత పలు జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని వెల్లడించింది. 50-60కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులను అలెర్ట్ చేసినట్లు ఐఎండీ తెలిపింది.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై చంద్రబాబు ట్వీట్
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 10 ఏళ్లు అయిందని.. రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలంతా ఒక్కటేనన్నారు. 10 కోట్ల తెలుగు జాతి మేటిగా వెలగాలన్నదే నా ఆకాంక్ష అని అన్నారు. నాటి ఆర్థిక సంస్కరణల తరువాత సంపద సృష్టికి బీజం పడిందని.. ప్రభుత్వ విధానాల ద్వారా సంక్షేమం, అభివృద్ధితో ప్రజల జీవితాల్లో మార్పులు మొదలయ్యాయన్నారు. నాలెడ్జ్ ఎకానమీతో అవకాశాలను అందిపుచ్చుకుని భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. పేదరికం లేని సమాజం దిశగా రెండు రాష్ట్రాల ప్రయాణం సాగాలన్నారు. రానున్న రోజుల్లో ఆర్థిక అసమానతలను నిర్మూలించి.. సమగ్ర సాధికారత సాధించాలని కోరుకున్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడి 10 ఏళ్లు అవుతున్న నేటి ఈ సందర్భంగా తెలుగు ప్రజల విజయాలు, కీర్తి ప్రపంచ వ్యాప్తం కావాలన్నారు. భారతదేశం స్వాతంత్ర్యం సాధించి 100 ఏళ్లు పూర్తి అయ్యే 2047 నాటికి ప్రపంచంలో భారతీయులు అంతా అగ్రస్థానంలో ఉండాలన్నారు. అందులో తెలుగు జాతి నెంబర్ 1 అవ్వాలని ఆకాంక్షిస్తున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు.
తెలంగాణ యువతి అమెరికాలో అదృశ్యం..
విదేశాల్లో చదువుకుంటున్న భారతీయలు ఇటీవల కాలంలో విపరీత పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ప్రమాదాల్లో చనిపోవడం, ఇతర కారణాల వల్ల దాడులకు గురికావడం, ఇక్కడ ఉంటున్న తల్లిదండ్రుల్ని, వారి కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా తెలంగాణకు చెందిన 23 ఏళ్ల అమ్మాయి నితీషా కందుల అమెరికాలో అదృశ్యమ్యారు. మీడియా కథనాల ప్రకారం.. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ నుంచి ఆమె కనిపించకుండా పోయింది. హైదరాబాద్‌కి చెందిన నితీషా కాల్ స్టేట్ యూనివర్సిటీ శాన్ బెర్నార్డినోలో చదువుతోంది. మే 28, 2024 నుంచి అమెరికాలో కనిపించకుండా పోయింది. ఈ ఘటనకు ముందు ఇటీవల అమెరికా చికాగోలో 25 ఏళ్ల తెలంగాణ విద్యార్థి రూపేష్ చంద్ర చింతకింది అనే విద్యార్థి కూడా అదృశ్యమయ్యాడు. ఇతను విస్కాన్సిన్‌లోని కాంకోర్డియా యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నారు. దీనికి ముందు అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్ నగరంలో 25 ఏళ్ల హైదరాబాద్ విద్యార్థి మహ్మద్ అబ్దుల్ అర్ఫాత్ అదృశ్యమయ్యాడు. అనంతరం శవమై కనిపించాడు. ఇలా తప్పిపోయిన ఘటనలే కాకుండా రోడ్డు ప్రమాదాల్లో కూడా పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. గతేడాది బిజినెస్ అనాలిసిస్ లో మాస్టర్స్ చేస్తున్న 24 ఏళ్ల హైదరాబాద్ విద్యార్థిని ప్రతీక్షా కున్వర్ అమెరికాలోని కాన్సాస్‌లోని చెనీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. అక్టోబర్ 15 రాత్రి ప్రతీక్ష, తన సోదరి ప్రియాంక, స్నేహితుడు సాయి తేజ, డ్రైవర్ వరుణ్‌తో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది.
21 రోజుల్లో ఒక్క నిమిషం వృధా చేయలేదు.. లొంగిపోయే ముందు కేజ్రీవాల్..
లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌పై వచ్చిన ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు తీహార్ జైలులో లొంగిపోతున్నారు. అతని ఇంటి నుంచి బయలుదేరిని కేజ్రీవాల్, రాజ్ ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన తర్వాత హనుమాన్ మందిర్‌ని దర్శించారు. ఆ తర్వాత పార్టీ ఆఫీస్‌కి వెళ్లి నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు. పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో మాట్లాడిన కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘21 రోజుల్లో ఒక్క నిమిషం కూడా వృధా చేసుకోలేదు.. అన్ని పార్టీలకు ప్రచారం చేశాను.. దేశాన్ని కాపాడేందుకే ప్రచారం చేశాను.. దేశం ముఖ్యం ఆ తర్వాతే ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇది మరచిపోలేని అనుభూతి’’ అని కేజ్రీవాల్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తనకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా లేదని ఒప్పుకున్నారని, ఇది ఈ ప్రచారంలో గొప్పతనం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోంది, అఖండ మెజారిటీతో గెలిచిన ముఖ్యమంత్రిని సాక్ష్యాలు లేకుండా ఎలా జైల్లో పెడతారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. కేజ్రీవాల్‌ని జైల్లో పెట్టగలిగినప్పుడు, దేశంలో ఎవరినైనా జైల్లో పెడతారని, ఇది నియంతృత్వమని ఆయన విమర్శించారు. లొంగిపోయే ముందు అరవింద్ కేజ్రీవాల్ వెంట ఆయన భార్య సునీతా కేజ్రీవాల్, ఢిల్లీ మంత్రులు అతిషి, కైలాష్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్, రాజ్యసభ ఎంపీలు సంజయ్ సింగ్, సందీప్ పాఠక్, నేతలు దుర్గేష్ పాఠక్, రాఖీ బిర్లా, రీనా గుప్తాలతో సహా పార్టీ నేతలు ఉన్నారు. అనారోగ్య కారణాలతో తాను జైలుకు వెళ్తున్నానని, ఎలాంటి చికిత్స అందుతుందో తెలియనది కేజ్రీవాల్ ఈ రోజు అన్నారు. నన్ను ఏం చేస్తారో తెలియదని, మేం భగత్ సింగ్ శిష్యులం, దేశాన్ని రక్షించేందుకు జైలుకు వెళ్తున్నాం, అధికారం నియంతృత్వంగా మారినప్పుడు జైలు బాధ్యతగా మారుతుందని ఆయన అన్నారు.
ఉడకబెట్టిన గుడ్లు తినడంపై భర్తతో గొడవపడి మహిళ ఆత్మహత్య..
ఇటీవల కాలంలో భార్యభర్తల మధ్య చిన్నచిన్న విషయాలే గొడవలకు దారి తీస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇవి ఆత్మహత్యలు, హత్యలకు దారి తీస్తున్నాయి. తాజాగా బెంగళూర్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. బాయిల్డ్ ఎగ్స్ కోసం గొడవ మహిళ ఆత్మహత్యకు పురిగొల్పింది. ఉడకపెట్టిన కోడిగుడ్లు తిన్నందుకు భర్తతో గొడవ పడిన భార్య భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకలో జరిగిన ఈ షాకింగ్ ఘటనలో బెంగళూర్‌లోని మదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచోహళ్లిలో జరిగింది. మృతురాలిని పూజగా గుర్తించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎగ్స్ షేర్ చేసుకునే విషయంలో పూజ తన భర్త అనిల్ కుమార్(35)తో గొడవపడి ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఈ జంట ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని డియోరియా జిల్లాకు చెందిన వారని పోలీసులు తెలిపారు. మాచోహళ్లిలోని పెయింట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరంతా ఫ్యాక్టరీ భవనంలోని మూడో అంతస్తులోని ఓ గదిలో నివసిస్తున్నారు. ప్రాథమిక విచారణలో, భార్యభర్తులు ఇద్దరూ తరుచూ వంట చేయడంతో సహా చిన్నచిన్న విషయాలపై గొడవపడేవారని తెలిసింది. మే 25న డిన్నర్ సమయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. గొడవ తర్వాత అనిల్, ఇద్దరు పిల్లలు పడుకున్న తర్వాత, పూజ భవనంపై నుంచి దూకి చనిపోయింది. కుటుంబ పెద్ద అయినందున తనకు అదనంగా ఉడికించిన గుడ్డు కావాలని అనిల్, భార్య పూజను కోరాడని, దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని తెలిసింది. పూజని అనిత్ తీవ్రంగా దూషించాడు. తనకు రుచికరమైన ఆహారం చేయడం లేదని, ఆమెను ఎక్కడికైనా వెళ్లి చనిపోవాలని కోపంతో తిట్టాడు. తెల్లవారుజామున 2.30గంటలకు పూజ కనిపించకపోవడంతో, అనిల్ తన సహచరులతో కలిసి వెతకడం ప్రారంభించగా.. నేలపై రక్తపుమడుగులో పూజ చనిపోయిఉంది. ఈ ఘటనలో అనిల్ కారణంగా మరణించడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అగ్నిప్రమాదంలో 30కి పైగా కార్లు దగ్ధం..
నోయిడాలోని సెక్టార్-8 ప్రాంతంలో ఆదివారం ఒక ప్లాట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో సుమారు 35 కార్లు దగ్ధమైనట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. స్కోడా స్క్రాప్ చేసిన కార్లను ఖాళీ స్థలంలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఇక అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం.., మధ్యాహ్నం 3 గంటల సమయంలో మంటల గురించి కాల్ వచ్చిందని., తాము వెంటనే ఫైర్ ఇంజెన్స్ తో అక్కడికి చేరుకుంట్లు తెలిపారు. తాము సంఘటన స్థలానికి చేరుకున్నప్పుడు స్కోడా స్క్రాప్డ్ కార్లు మంటల్లో చిక్కుకున్నాయని., మంటలను ఆర్పడానికి ఆరు ఫైర్ ఇంజెన్స్ ను ఉపయోగించినట్లు తెలిపారు. ఈ ఘటనలో దాదాపు 35 కార్లు మంటల్లో కాలిపోయాయని అగ్నిమాపక శాఖ సీనియర్ అధికారి తెలిపారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం కానీ.., ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వారు తెలిపారు. ఇక అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నామని వారు తెలిపారు.
ఉత్తర్ ప్రదేశ్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 3.9 నమోదు
ఉత్తర్ ప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. యూపీలోని సోన్‌భద్రలో ఆదివారం మధ్యాహ్నం 3.49 గంటల సమయంలో రిక్టర్ స్కేల్‌పై 3.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) వెల్లడించింది. ఖనిజ సంపద, థర్మల్ పవర్ ప్లాంట్‌లకు ప్రసిద్ధి చెందిన సోన్‌భద్ర జిల్లాలో భూకంప కేంద్రం ఏర్పడినట్లు తెలిపింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ ఘటనలో ప్రాణ, ఆస్థి నష్టం గురించి ఇంకా వివరాలు తెలియరాలేదని అధికారులు చెప్పారు. ఈ భూకంప ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. NCS ఈ వివరాలను తన ‘X’ ఖాతాలో పోస్టు చేసింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున మణిపూర్‌లోని చందేల్‌లో రిక్టర్ స్కేల్‌పై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం అక్షాంశం 23.9 N, రేఖాంశం 94.10 E , 77 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు NCS పేర్కొంది. ఆదివారం తెల్లవారుజామున 2:28 గంటలకు (IST) భూకంపం సంభవించింది. కాగా.. ఉత్తర భారతదేశం, హిమాలయాల ప్రాంతం, నేపాల్‌లపై తరచూ ప్రకృతి ప్రకోపం చూపిస్తూనే ఉంటుంది. ఇక సాధారణంగా మామూలు భూ ప్రకంపనలు అయితే చాలా సార్లు వస్తూనే ఉంటాయి. ఒక్కోసారి భారీ తీవ్రతతో వచ్చిన భూకంపాలు ఆస్తి, ప్రాణ నష్టాన్నే మిగులుస్తున్నాయి. గతేడాది ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో 6.4 తీవ్రతతో భారీ భూకంపం చోటు చేసుకుంది. తాజాగా నేపాల్‌లో వచ్చిన భారీ భూకంపం ధాటికి ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా తీవ్ర ప్రకంపనలు సంభవించాయి.
2500 మంది ఉద్యోగులపై టాటా స్టీల్ వేటు
మన దేశానికి చెందిన దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్‌లోని టాటా స్టీల్ పలు దేశాల్లో తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. యూకేలోని వేల్స్ లో ఉన్న తమ స్టీల్ ఉత్పత్తి ప్లాంట్‌లో పని చేస్తున్న సుమారు 2500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సంస్థ పూనుకుంది. యూకే కార్యకలాపాలతో ముడిపడిన వారిని తొలగించబోతున్నట్టు పేర్కొంది. స్టీల్ తయారీ విధానంలో పర్యావరణ హిత మార్పులు చేస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపు తప్పదని స్పష్టం చేసింది. మరోవైపు, కంపెనీ నిర్ణయాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గతేడాది చివరి నాటికి యూకే ప్రభుత్వం తమ దేశంలో గ్రీనెర్ స్టీల్ ప్రోడక్షన్ కోసం సుమారు 500 మిలియన్ యూరోల నిధులు కేటాయించింది. టాటా స్టీల్ బ్రిటన్ లో అతిపెద్ద స్టీల్ తయారీ సంస్థగా ఉంది. కంపెనీలో 8 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయినప్పటికీ సుమారు 3000 మంది ఉద్యోగాలు రిస్క్‌లోనే ఉన్నయాని గతంలో కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వం కేటాయించిన నిధులు ఈ రంగంలోని 5000 మంది ఉద్యోగులకు భద్రత కల్పిస్తుందని, మిగిలిన 3 వేల మంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని పేర్కొన్నాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉపాధి కోల్పోవడంతో పోర్ట్ టాల్బోట్, యూకే తయారీ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని జీఎంబీ యూనియన్ సీనియర్ అదికారి చార్లోట్ బ్రంప్టోన్ ఆందోళన వ్యక్తం చేశారు.
నదిని దాటుతుండగా పడవ బోల్తా.. 20 మంది దుర్మరణం..
తూర్పు ఆఫ్ఘనిస్థాన్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం నది దాటుతుండగా బోటు బోల్తా పడడంతో 20 మంది మృతి చెందారు. ఘటన సంబంధిత వివరాల్లోకెళితే.. మహ్మంద్ దార్ ప్రాంతంలో నది దాటుతుండగా ఓ బోటు బోల్తా పడింది. ప్రమాదంలో పడవలోని వారందరూ మునిగిపోయారని నంగరార్ ప్రావిన్స్‌కు చెందిన ప్రాంతీయ సమాచార, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఖురేషీ బద్లోన్ తెలిపారు. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని ఆయన తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో మొత్తం 25 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు. రెస్క్యూ టీం ఐదు మృతదేహాలను కనుగొన్నారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కెపాసిటీకి మించి మనుషులను ఎక్కించుకోవడంతో ఈ సంఘటన జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ విషాద గతానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.