టీడీపీ-జనసేన పొత్తుపై మంత్రి కీలక వ్యాఖ్యలు.. ఇది ట్రైలర్ మాత్రమే.. సినిమా చాలా ఉంది..!
తెలుగుదేశం పార్టీ-జనసేన పొత్తు వ్యవహారంలో జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. అయితే, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ పొత్తుపై మంత్రి ఉషశ్రీ చరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. సొంత మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును పవన్ కల్యాణ్ ఎలా నమ్మాడు..? అని ప్రశ్నించారు. పవన్ ఇప్పుడిప్పుడే చంద్రబాబు నాయుడు నిజస్వరూపాన్ని తెలుసుకుంటున్నాడన్న ఆమె.. పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ఇంకా సినిమా చాలా ఉందని కౌంటర్ ఇచ్చారు. పవన్ ఓటు బ్యాంకును వాడుకొని చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు అని విమర్శించారు. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ జాగ్రత్త పడితే మంచిదని పేర్కొన్నారు. ఇక, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కూడా మండిపడ్డారు ఉషశ్రీ చరణ్.. వైఎస్ కేవలం చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ మాత్రమే చదువుతోందని ఆరోపించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత కూడా ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.. ఆ పార్టీలో వైఎస్ షర్మిల ఎలా పనిచేస్తోంది? అని నిలదీశారు ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్ . కాగా, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కొద్ది.. రాజకీయ నేతలు విమర్శలు, ఆరోపణలు ఎక్కుపెట్టి పొలిటికల్ హీట్ పెంచుతోన్న విషయం విదితమే.
వైసీపీ’సిద్ధం’ సభ వాయిదా
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకేసారి జరగనుండడంతో.. అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగుతున్నాయి.. అధికార పార్టీ వైసీపీ మరింత దూకుడుగా ముందుకు వెళ్తోంది.. వైనాట్ 175 అంటూ ప్రచారానికి సిద్ధం అవుతోంది.. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేసిన వైసీపీ.. మరికొన్ని స్థానాలపై కసర్తు చేస్తోంది.. ఇక ఇప్పుడు వరుసగా బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో ఈ నెల 30వ తేదీన ఏలూరులో వైసీపీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైంది.. అయితే, ఈ నెల 30వ తేదీన తలపెట్టిన సభను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేసింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఏలూరులో 30న జరగాల్సిన వైసీపీ సిద్ధం సభ ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా పడినట్టు వెల్లడించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. మీడియాతో మాట్లాడిన ఆయన.. 1వ తేదీన ఏలూరులో సభ నిర్వహిస్తాం.. సిద్ధం సభ ద్వారా ప్రజలకు ఐదేళ్లలో ఏం చేశామో చెప్పడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి లక్ష్యంగా పేర్కొన్నారు.. రాబోయే రోజుల్లో ఏం చేయాలి అనేది ఈ సభ నుంచి దిశా నిర్దేశం చేయబోతున్నారని తెలిపారు. ఇక, టీడీపీ-జనసేన పొత్తుపై మాట్లాడుతూ.. తన తల్లిని తిట్టి తనని వీధిలోకి లాగిన వాళ్ల చంక పవన్ కల్యాణ్ ఎక్కారని దుయ్యబట్టారు.. అమావాస్య రోజున పుట్టిన పొత్తు ఏరకంగా ఉంటుందో ముందే ఊహించామన్న ఆయన.. జైల్లో దొంగలు దొంగలు పంచుకున్నట్టు ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్.. సీట్లు పంచుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు. మరోవైపు.. తెలంగాణ బిడ్డను అని చెప్పిన వైఎస్ షర్మిల.. ఆమెను నమ్ముకున్న వాళ్లను నట్టేట ముంచి ఇక్కడికి వచ్చారని ఫైర్ అయ్యారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. కాగా, ఏలూరులో నిర్వహించనున్న బహిరంగ సభకు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా ఉమ్మడి జిల్లాల నుంచి లక్షలాది మందిని తరలించేలా వైసీపీ ప్లాన్ చేస్తోంది..
జనసేన కార్యకర్తలకు పవన్ సమాధానం చెప్పాలి.. మంత్రి అంబటి డిమాండ్
టీడీపీ-జనసేన పొత్తు వ్యవహారంలో తాజా పరిణామాలపై హాట్ కామెంట్లు చేశారు మంత్రి అంబటి రాంబాబు.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. పొత్తు ధర్మాన్ని పాటించక పోయినా చంద్రబాబు వెంట పవన్ కల్యాణ్ ఎందుకు ప్రయాణం చేస్తున్నారో జనసేన కార్యకర్తలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పొత్తు ధర్మం లేకపోయినా, ప్యాకేజీ ధర్మం గిట్టుబాటు అవుతుందని భావిస్తున్నారా..? అని ఎద్దేవా చేశారు.. అసలు ఈ దేశంలో ఏ ధర్మాన్ని పాటించని వ్యక్తి చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు. ఇద్దరి మధ్య ఏదో తేడా వచ్చింది.. అందుకే పవన్ అలా మాట్లాడి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక, పవన్ కల్యాణ్‌కు కు సీట్లు డిమాండ్ చేసే అంత సీన్ లేదని సెటైర్లు వేశారు. సొంతగా సీట్లు ప్రకటించే పరిస్థితి లేదు.. ప్యాకేజీ కోసం పవన్ కల్యాణ్.. చంద్రబాబు సంకలో ఎక్కి కూర్చున్నాడు అంటూ ఆరోపణలు గుప్పించారు అంబటి రాంబాబు.
మాకేం ఇబ్బంది లేదు.. మేం 2 సీట్లు ప్రకటిస్తే.. పవన్ 2 సీట్లు ప్రకటించారు ..
రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నప్పుడు.. అవి పొత్తు ధర్మాన్ని పాటించాలి.. కానీ, తెలుగుదేశం పార్టీ అది విస్మరించి ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించింది అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కాకరేపాయి.. అంతే కాదు.. పొత్తు ధర్మం పాటించకుండా వాళ్లు రెండు సీట్లు ప్రకటించారు.. కాబట్టి మేం రెండు సీట్లు ప్రకటిస్తాం అంటూ… రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తోంది అంటూ జనసేనాని స్పష్టం చేశారు. దీంతో టీడీపీ-జనసేన మధ్య ఏదో జరుగుతోంది? అనే ప్రచారం తెరపైకి వచ్చింది.. ఈ పరిణామాలపై స్పందించిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. పవన్ కల్యాణ్ కామెంట్లను స్వాగతించిన టీడీపీ.. పవన్ సీట్ల ప్రకటనపై తమకేం ఇబ్బంది లేదని స్పష్టం చేసింది. అసలు పవన్ కల్యాణ్ కామెంట్లల్లో తప్పేం లేదు అన్నారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు.. టీడీపీ-జనసేన మధ్య సీట్ల సర్దుబాటు చాలా వరకు ఫైనల్ అయ్యాయని తెలిపారు. పవన్‌కు కొన్ని సీట్లు ప్రకటించాలని ఉంది.. ప్రకటించారు. జనసేన పోటీ చేసే సీట్లనే పవన్ ప్రకటించారన్నారు. జనసేన ప్రకటించిన సీట్ల విషయంలో మాకేం ఇబ్బంది లేదన్న ఆయన.. పవన్ కామెంట్ల మీద మాకు లేని బాధ మీకెందుకు..? పవన్ రెండు సీట్లు కాకుంటే.. నాలుగు సీట్లు ప్రకటిస్తారు.. వైసీపీకేంటి? అంటూ సెటైర్లు వేశారు. పవన్ కామెంట్లు చేసిన గంటలోనే ఐదుగురు వైసీపీ నేతలు మాట్లాడేశారు. మాది పవిత్ర పొత్తు.. కేసుల నుంచి తప్పించుకోవడానికి వైసీపీ పొత్తు పెట్టుకుంటోందని దుయ్యబట్టారు. టీడీపీ-జనసేన పొత్తులు ఎప్పుడు విచ్ఛిన్నం అవుతాయా..? అని వైసీపీ గోతి కాడ నక్కలా కూచుకుని కూర్చొంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బోండా ఉమామహేశ్వరరావు.
ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి..
రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తికి ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చందన వెళ్లి గ్రామంలో జున్నా సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తి ప్లాంటును డిప్యూటీ సీఎం ప్రారంభించారు. స్ట్రింగర్ మిషన్ యూనిట్ ను ప్రారంభించిన అనంతరం సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తి విధానం గురించి అక్కడ ఉన్న ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. సోలార్ ప్యానల్ ఉత్పత్తికి సంబంధించి గ్లాస్ లోడింగ్, భస్సింగ్, లే అప్, ల్యామినేటింగ్ ఫ్రేమింగ్, క్యూరింగ్ లైన్, క్లీనింగ్ సెక్షన్, సన్ సిమ్ లెటర్, ఐ పోర్టు, ఫైనల్ ఈ.ఎల్ ప్రాసెస్ యూనిట్స్ ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2030 సంవత్సరం నాటికి ప్రజలకు ఉన్న డిమాండ్ కు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తిని చేస్తామన్నారు. ప్రపంచంలో మానవ జాతికి విద్యుత్ శక్తికి మధ్యన విడదీయరాని బంధం ఏర్పడిందన్నారు. విద్యుత్ శక్తి అవసరాల డిమాండ్ రోజు రోజుకు పెరిగిపోతున్న క్రమంలో ఆ డిమాండ్ కు అనుగుణంగా ప్రత్యామ్నాయంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాలిక బద్ధంగా సౌర శక్తి, పవన శక్తి, హైడెల్, చెత్త నుంచి తయారు చేసే విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్తు ఉత్పత్తిని పెంచుతూ ప్రజల అవసరాలు తీర్చుతామని చెప్పారు. విద్యుత్తు రంగంపై గత ప్రభుత్వం 81 వేల కోట్ల రూపాయల పైబడి అప్పుల భారం మోపిందన్నారు. ఈ అప్పుల భారాన్ని అధిగమించి ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇప్పుడున్న థర్మల్ విద్యుత్తు కు ప్రత్యామ్నాయ మార్గాలతో అధిక విద్యుత్తు ఉత్పత్తిని పెంచుతామన్నారు. ప్రత్యామ్నాయ విద్యుత్ ను దేశం ప్రజలకు అందించేందుకు దివంగత ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వేసిన పునాదులు దేశవ్యాప్తంగా ప్రజల అవసరాలు తీర్చుతున్నాయని వివరించారు. భవిష్యత్తు ప్రజల అవసరాలను తీర్చే విధంగా స్థాపించిన ఈ కంపెనీ వృద్ధి చెందాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకాంక్షించారు.
గవర్నర్‌ను బీఆర్ఎస్ ఎలా ఇబ్బంది పెట్టిందో ప్రజలు మరిచిపోలేదు..
బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలే రద్దు చేశారని వ్యాఖ్యానించారు. గవర్నర్ వ్యవస్థను అవమానపర్చిన మూర్ఖత్వపు పార్టీ బీఆర్ఎస్ అంటూ ధ్వజమెత్తారు. మహిళా గవర్నర్‌ను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా అవమానించారని గుర్తుచేశారు. కనీసం గవర్నర్ పర్యటనలకు ప్రొటోకాల్ కూడా పాటించలేదని.. అంతేకాకుండా అధికారులను కూడా గవర్నర్ వద్దకు వెళ్లనీయలేదని మండిపడ్డారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించిన బీఆర్ఎస్‌ను.. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు ఛీ అంటూ తిరస్కరిస్తున్నారన్నారు. ఇంత జరిగినా వాళ్ల అహంకారం మాత్రం తగ్గలేదని.. ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమల్లోనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో మాత్రం బీఆర్‌ఎస్‌ను ప్రజలు ఛీదరించుకుంటున్నారని చెప్పుకొచ్చారు.
అయోధ్య రామ మందిర హారతి, దర్శన సమయాల్లో మార్పు.. కొత్త టైమింగ్స్ ఇవే..
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో రద్దీ దృష్ట్యా ఆలయ ట్రస్టు భక్తుల కోసం హారతి, దర్శనానికి వేళల్లో మార్పులు చేసింది. కొత్త సమయాలను పంచుకుంది. రామ మందిరం వద్దనే కాకుండా పక్కనే ఉన్న హనుమాన్ గర్హి ఆలయం వద్ద కూడా భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఉదయం 4:30 గంటలకు రామ్ లల్లా విగ్రహానికి శృంగార్ ఆరతి (ప్రార్థన), ఉదయం 6:30 గంటలకు మంగళ ప్రార్థన జరుగుతుంది. ఉదయం ప్రార్థన అనంతరం 7 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. మధ్యాహ్నం భోగ్ (నైవేద్యం) ప్రార్థన, సాయంత్రం 7:30 గంటలకు సాయంత్రం హారతి నిర్వహించబడుతుంది, సాయంత్రం నైవేద్య ప్రార్థన రాత్రి 8 గంటలకు జరుగుతుంది. ఆరోజు చివరి ప్రార్థన అయిన శయన హారతి రాత్రి 10 గంటలకు జరుగుతుందని విశ్వహిందూ పరిషత్ ప్రాంతీయ అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌ఛార్జ్ శరద్ శర్మ తెలిపారు.
ఓవర్‌టేక్ చేస్తూ బైక్, ఆటోని ఢీకొట్టిన స్కార్పియో.. ఏడుగురు దుర్మరణం..
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సింగిల్ లైన్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న స్కార్పియో ఓవర్‌టేక్ చేసే సమయంలో రెండు బైకులను, వెనక ఉన్న ఆటో రిక్షాను ఢీకొట్టింది. దీంతో ఏడుగురు మరణించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సంఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డైంది. సింగిల్ లైన్ రోడ్డుపై అతివేగంగా వస్తున్న స్కార్పియో, ఆటోని ఓవర్‌టేక్ చేయడానికి యత్నించింది. ఇదే సమయంలో రెండు బైకుల్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఆటోలో 15 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించగా.. మిగిలిన నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాదంపై బీజాపూర్ గ్రామ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉద్రిక్తతల మధ్య.. భారత్‌కి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన మాల్దీవులు..
ఇండియా, మాల్దీవుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇటీవల లక్షద్వీప్ పర్యటనను ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్రమోడీపై అక్కడి మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇండియా ప్రజలు మాల్దీవులపై తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మాల్దీవ్స్ పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ చైనా అనుకూలంగా వ్యవహరించడం, భారత్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదం అయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు శుక్రవారం భారతదేశానికి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మాల్దీవుల అధ్యక్షుడి కార్యాలయం ఓ ప్రకటనలో ‘‘పరస్పర గౌరవం మరియు లోతైన బంధుత్వ భావనపై స్థాపించబడిన శతాబ్ధాల నాటి స్నేహం’’ అంటూ ఇండియాను ఉద్దేశించి ప్రస్తావించారు. భారత 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజ్జూ భారత రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రికి శుభాకాంక్షలు మరియు శుభాకాంక్షలు పంపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వేర్వేరు సందేశాలలో, అధ్యక్షుడు ముయిజ్జూ శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే సంవత్సరాల్లో భారత్, దాని ప్రజలు శాంతి, పురోగతిని కొనసాగించాలని కోరారు. ఆ దేశ అధ్యక్షుడితో పాటు మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రెందు దేశాల మధ్య విభేదాల తర్వాత తొలిసారిగా మాల్దీవ్స్, భారత్‌కి సందేశాన్ని పంపింది.
బెంగుళూరు ట్రాఫిక్ లో ఇరుక్కున్న పెళ్లి కూతురు.. మెట్రోలో ఫోటోలు వైరల్..
బెంగళూరు ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజలు ఇంటి నుంచి బయటకు వస్తే తమ గమ్యానికి చేరుకోవడానికి చాలా ఇబ్బందులు పడాలి.. ట్రాఫిక్ లో వేచి ఉండాలి.. అందుకు కారణాలు కూడా అనేకం ఉన్నాయి.. మొన్నీమధ్య ఓ మహిళా ఉద్యోగి ట్రాఫిక్ లో కూరగాయలు కోసుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. ఇప్పుడు ఓ పెళ్లి కూతురు వీడియో ఒకటి వైరల్ గా మారింది.. ఈ వీడియోలో ఓ పెళ్లి కూతురు బాగా మూస్తాబయి ట్రాఫిక్ లో బయలు దేరింది.. అయితే ట్రాఫిక్ లో ఇరుక్కు పోయింది.. ఇక చేసేదేమి లేక మధ్యలో దిగి మెట్రో ఎక్కినట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది.. ఆ తర్వాత సమయానికి మండపానికి చేరుకొని పెళ్లి పీటలు మీద కూర్చున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.. ఈ వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
డియర్ డాటర్.. ఏడిపిస్తున్న ఇళయరాజా పోస్ట్
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట తీవ్ర విషాదం నెలకున్న విషయం తెల్సిందే.. ఆయన కుమార్తె భవతారణి తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె శ్రీలంకలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటూ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక భవతరణి మృతి పట్ల సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు, ఇళయరాజా అభిమానులు ఆమెకు సంతాపం ప్రకటించారు. ముఖ్యంగా విశాల్.. చాలా ఎమోషనల్ అయిన విషయం కూడా తెల్సిందే. ఇక తాజాగా కూతురును తలుచుకొని ఇళయరాజా కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఆమె చిన్ననాటి ఫోటోను షేర్ చేస్తూ.. జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఇళయరాజా హెడ్ ఫోన్స్ పెట్టుకొని.. పక్కనే ఉన్న భవతారణికి పుస్తకంలో ఉన్న ప్రముఖులను పరిచయం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక ఈ ఫొటోకు క్యాప్షన్ గా డియర్ డాటర్ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. కూతురు జ్ఞాపకాలతో ఇళయరాజా ఎంత కుంగిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క ఫోటో చాలు.. తండ్రీకూతుళ్ళు ఎలా ఉండేవారో తెలుస్తోందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక భవతరిణి గురించి చెప్పాలంటే.. ఆమెకు గాయనిగా కోలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉంది. 2000 సంవత్సరంలో వచ్చిన భారతి అనే సినిమాకు ఇళయరాజా సంగీతం అందించగా.. ఆ సినిమాలో మాయిల్ పోలా పొన్ను ఒన్ను అనే పాటను భవతరిణి పాడింది. ఈ పాటతో ఆమె నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ఫ్రెండ్స్, పా, టైమ్, ఒరు నాళ్ ఒరు కనవు, అనెగన్ తదితర చిత్రాల్లో పలు పాటలు పాడి మెప్పించింది. ఫిర్ మిలేంగే, ఇలక్కనమ్, వెల్లాచి, అవునా తదితర సినిమాలకు సంగీత దర్శకురాలిగా వ్యవహరించారు. చివరగా 2019లో వచ్చిన మాయానది అనే తమిళ చిత్రానికి సంగీత దర్శకురాలిగా పనిచేసింది.
భయపెడుతున్న C 202 ఫస్ట్ లుక్
మున్నా కాశి హీరో గా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న హర్రర్ థ్రిల్లర్ చిత్రం ‘సి 202’ (C 202). మైటీ ఒక్ పిక్చర్స్ (Mighty Oak Pictures) బ్యానర్ పై తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రంలో, వై విజయ ప్రధాన పాత్రలలో గోవా బ్యూటీ షారోన్ రియా ఫెర్నాండెజ్ హీరోయిన్ గా మనోహరి కె ఎ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఆద్యంతం రాత్రి పూటనే షూట్ చేయడం గమనార్హం. షూటింగ్ అంతా పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీగా ఉన్న ఈ సినిమా నుంచి జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు, హీరో మున్నా కాశి మాట్లాడుతూ “మా ‘సి 202’ (C 202) సినిమా మొత్తం రాత్రిపూట చిత్రీకరించబడింది. కథ స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్గా అద్భుతమైన సస్పెన్స్ తో భయపడే హారర్ సన్నివేశాలతో మంచి త్రిల్లింగ్ ఎపిసోడ్స్ తో సినిమా ని చిత్రకరించామని అన్నారు.