*తెలంగాణకు నేడు ప్రధాని మోడీ రాక..
తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ రానున్నారు. నేటి మధ్యాహ్నం 2 గంటలకు నారాయణపేటలో.. అలాగే, సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఇక, మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని నారాయణపేట బహిరంగ సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించనున్నారు. అలాగే, సాయంత్రం ఐదు గంటలకు ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఎల్బీ స్టేడియంలో జరిగే సభతో మోడీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. అయితే, బేగంపేట విమానాశ్రయం నుంచి LB స్టేడియం వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బేగంపేట్ విమానాశ్రయం – బేగంపేట్ ఫ్లైఓవర్ – గ్రీన్ ల్యాండ్స్ – యశోద హాస్పిటల్ – రాజ్ భవన్ – ఖైరతాబాద్ ఫ్లైఓవర్ – ఎన్టీఆర్ మార్గ్ – తెలుగు తల్లి జంక్షన్ – రవీంద్ర భారతి మార్గాలలో ట్రాఫిక్ మళ్లీంపు ఉంటుందని పోలీసులు హెచ్చరించారు. అదేవిధంగా, ఎల్బీ స్టేడియం – నాంపల్లి – బషీర్‌బాగ్ – బీజేఆర్ విగ్రహం – ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ – నాంపల్లి రైల్వే స్టేషన్ రోడ్ – లిబర్టీ – హిమాయత్‌నగర్ – అసెంబ్లీ – వద్ద కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
*నేటి సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే..
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధంమవుతోంది. రేపటితో కీలకమైన ప్రచార ఘట్టానికి తెరపడనుంది. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. తమ ప్రభుత్వంలో చేసి అభివృద్ధి, సంక్షేమం, మంచి పనులు వివరిస్తూ ముందుకెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో.. సీఎం జగన్ రాష్ట్రాన్ని మొత్తం చుట్టేశారు. కాగా.. నేడు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు గుంటూరు పార్లమెంట్ పరిధిలోని మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని నగరి నియోజకవర్గం పుత్తూరులో కార్వేటినగరం రోడ్ కాపు వీధి సర్కిల్లో జరిగే సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి వైఎస్సార్ కడప జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కడప నగరంలోని మద్రాస్ రోడ్ శ్రీ పొట్టి శ్రీరాములు సర్కిల్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. మొత్తంగా రేపు మూడు నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొననున్నారు సీఎం జగన్. ఇక, జగన్ సభలకు సంబంధించి వైసీపీ శ్రేణులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
*ఏపీలో డీబీటీల పంపిణీపై హైకోర్టు కీలక ఆదేశాలు
సంక్షేమ పథకాల లబ్దిదారులకు నగదు జమ చేయకుండా ఆపాలన్న ఈసీ నిర్ణయంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యాదీవెన, ఆసరా, ఈబీసీ నేస్తం ఇన్‌పుట్ సబ్సిడీ, చేయూత నిధులను ఎన్నికలు పూర్తయ్యే వరకు విడుదల చేయొద్దన్న ఎన్నికల సంఘం ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. నిధుల విడుదల చేయవద్దన్న ఈసీ ఆదేశాలను తాత్కాలికంగా ఇవాళ వరకు నిలుపుదల చేస్తూ హైకోర్టు ఆదేశించింది. నేడు ఒక్కరోజు వెసులుబాటు కల్పించిన హైకోర్టు.. ఈ నెల 11 నుంచి 13 వరకు నిధుల విడుదల చేయవద్దని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నిధుల పంపిణీ విషయాన్ని ప్రచారం చేయవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇందులో నేతల జోక్యం ఉండొద్దని, ప్రచారం చేయవద్దని ఆదేశించింది. దీంతో నేడు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమయ్యే అవకాశాలు ఉన్నాయి. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి, ఈసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్ 27కు వాయిదా వేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
*నేడు పశ్చిమ బెంగాల్ లో అమిత్ షా ప్రచారం..
నాలుగో విడత ఎన్నికల ప్రచారం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ (శుక్రవారం) మరోసారి పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్నారు. ఈ రోజున అసన్‌సోల్, రాంపూర్‌హాట్, రానాఘాట్‌లలో మూడు చోట్ల బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తారు. మరోవైపు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా కూడా బెంగాల్‌లో పర్యటించి బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. కాగా, బెంగాల్ రాష్ట్రంలోని బరాక్‌పూర్, హుగ్లీ లోక్‌సభ నియోజకవర్గాలతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలతో పాటు నాడియా జిల్లాలోని కృష్ణానగర్‌లో నిర్వహించే రోడ్ షోలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పాల్గొననున్నారు. అయితే, కృష్ణానగర్ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మహువా మోయిత్రాపై బీజేపీ నుంచి పోటీ చేస్తున్న రాజమాతా అమృతా రాయ్ కోసం ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు. అలాగే, అదే సమయంలో కోల్‌కతాలోని జాదవ్‌పూర్ స్థానం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీకి రైల్వే మంత్రి వైష్ణవ్ నేటి ఉదయం 11 గంటలకు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి రైల్వే సిటీ ఖరగ్‌పూర్ నగరంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొననున్నారు. అనంతరం బరాసత్‌లోని వెస్టిన్ హోటల్‌లో రాత్రి 8 గంటలకు బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు.
*నేడు మక్తల్, షాద్ నగర్, గోషామహల్ ల్లో సీఎం రేవంత్ పర్యటన..
రాష్ట్రంలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికలపై కూడా దృష్టి సారించింది. ఏది ఏమైనా సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ లోక్ సభ నియోజకవర్గాల్లో విజయభేరి మోగించాలనే ఉత్సాహంతో ముందుకు సాగనుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేలు తరచూ బహిరంగ ఎన్నికల సభల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల ప్రచారానికి మరికొద్ది రోజులు మిగిలి ఉండడంతో హస్తం పార్టీ ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ మక్తల్, షాద్ నగర్, గోషామహల్ నియోజకర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు మక్తల్ జన జాతర సభకు హాజరు కానున్నారు. సాయంత్రం 5.30 గంటలకు షాద్ నగర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. సాయంత్రం 6.45 గంటలకు గోషామహల్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు. రాత్రి 8.30 గంటలకు తాజ్ కృష్ణలో మీట్ ది ప్రెస్ లో పాల్గొంటారు. కాగా.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఉదయం 11 గంటలకు తాజ్ కృష్ణలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు నకిరేకల్ జన జాతర సభకు హాజరుకానున్నారు ఖర్గే. రేపు 11వ తేదీ ఉదయం 11 గంటలకు కామారెడ్డి, మధ్యాహ్నం ఒంటి గంటకు తాండూరులో జరిగే ఎన్నికల సభల్లో ఏఐసీసీ అధినేత్రి ప్రియాంక గాంధీ పాల్గొంటారు.
*అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై నేడు తీర్పు
లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వినతిని ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఎన్నికలలో ప్రచారం చేయడమనేది ప్రాథమిక హక్కు ఏం కాదని చెప్పుకొచ్చింది. చట్టపరమైన, రాజ్యాంగబద్దమైన హక్కు కూడా కాదని ఈడీ చెప్పింది. ఈ మేరకు గురువారం నాడు జరిగిన సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇక, కేజ్రీవాల్‌కు బెయిల్ ఇస్తే జైలులో ఉన్న రాజకీయ నాయకులు అందరు ఎన్నికల ప్రచారం కోసం బెయిల్‌ను హక్కుగా కోరుతారని ఈడీ వాదించింది. అయితే, ఈడీ వాదనలపై సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించింది. బెయిల్ ఇస్తే తప్పేంటి అని ప్రశ్నించింది. కాగా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు తీర్పును వెల్లడించనుంది. ఈ పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పును రిజర్వ్ లో ఉంచింది. ఇక, కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని కోర్టు తెలిపింది. ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం దాఖలు చేసిన పిటిషన్ పైనా అదే రోజు వాదనలు వింటామని జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. కాగా, మార్చి 21వ తేదీన కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు.
*జైళ్లలో ఖైదీల రద్దీకి పరిష్కారం పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జైళ్లలో రద్దీని తగ్గించే పరిష్కారంపై సుప్రీంకోర్టు గురువారం పెద్ద వ్యాఖ్య చేసింది. దీంతో ఖైదీల పునరావాస సమస్యను కూడా పరిష్కరించవచ్చని కోర్టు పేర్కొంది. బహిరంగ జైళ్లను ఏర్పాటు చేయడం రద్దీకి పరిష్కారాలలో ఒకటని, ఖైదీల పునరావాస సమస్యను కూడా పరిష్కరించవచ్చని ఎస్సీ పేర్కొంది. సెమీ ఓపెన్ లేదా ఓపెన్ జైళ్లు ఖైదీలు పగటిపూట ప్రాంగణం వెలుపల పని చేయడానికి అనుమతిస్తాయి. వారికి జీవనోపాధిని సంపాదించడానికి.. సాయంత్రం తిరిగి రావడానికి సహాయపడతాయి. ఖైదీలను సమాజంతో కలిసిపోవడానికి.. బయట సాధారణ జీవితాన్ని గడపడానికి వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున వారి మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఈ భావన తీసుకురాబడింది. జైళ్లు, ఖైదీలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం దేశవ్యాప్తంగా ఓపెన్ జైళ్లను విస్తరించాలని కోరింది. జైళ్లలో రద్దీకి ఒక పరిష్కారం ఓపెన్ జైళ్లు లేదా క్యాంపులను ఏర్పాటు చేయడం. రాజస్థాన్‌లో ఓపెన్ జైలు పనిచేస్తోందని ధర్మాసనం పేర్కొంది. జైలు రద్దీతో పాటు ఖైదీలకు పునరావాసం కల్పించే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నట్లు తెలిపారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) తరపున హాజరైన న్యాయవాది కోర్టుకు మాట్లాడుతూ.. ఓపెన్ జైళ్లపై అన్ని రాష్ట్రాల నుండి స్పందనలు కోరామని, వాటిలో 24 మంది స్పందించారని చెప్పారు.
*బంగ్లాదేశ్ లో నదిలో కూలిన విమానం.. వైమానిక దళ పైలట్ మృతి
బంగ్లాదేశ్‌లోని చటోగ్రామ్‌లో ఎయిర్‌ఫోర్స్ ట్రైనర్ ఫైటర్ జెట్ నదిలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లలో ఒకరు మరణించారు. ఘటనకు సంబంధించిన వీడియోలో విమానం వెనుక భాగంలో మంటలు కనిపిస్తున్నాయి. నదిలో పడటానికి దాదాపు ఒక రౌండ్ పట్టింది. వీడియోలో జెట్ భాగాలు కూడా కొద్దికొద్దిగా విరిగిపోతున్నట్లు కనిపిస్తాయి. నేవీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 32 ఏళ్ల స్క్వాడ్రన్ లీడర్ అసిమ్ జవాద్ మరణించినట్లు ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టరేట్ (ISPR) తెలిపింది. బంగ్లాదేశ్ వైమానిక దళం (BAF) YAK130 ట్రైనర్ ఫైటర్ జెట్ ఉదయం 10:25 గంటల ప్రాంతంలో శిక్షణ తర్వాత స్థావరానికి తిరిగి వస్తుండగా అది కూలిపోయింది. ఇందులో వింగ్ కమాండర్ సోహన్ హసన్ ఖాన్, స్క్వాడ్రన్ లీడర్ అసిమ్ జవాద్‌లు విమానంలో ఉండగా, జెట్ నుంచి బయటకు వచ్చేశారు. వీడియోలో పైలట్ పారాచూట్‌తో దిగుతున్నట్లు చూపించారు. నదిలో దిగిన ఇద్దరు పైలట్లను ఎయిర్ ఫోర్స్, నేవీ, స్థానిక మత్స్యకారులు రక్షించారు. అసిమ్ జవాద్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పైలట్లు విమానాన్ని విమానాశ్రయానికి సమీపంలో జనసాంద్రత ఉన్న ప్రాంతం నుండి తక్కువ జనాభా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లగలిగారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు BAF ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
*నేడు ‘అక్షయ తృతీయ’.. బంగారం కొనడానికి అనుకూల సమయం ఇదే!
హిందూ సంప్రదాయంలో ముఖ్యమైన పండుగల్లో ‘అక్షయ తృతీయ’ ఒకటి. ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్ష తృతీయ తిథి నాడు ఈ పండగను జరుపుకుంటారు. ఈ ఏడాది శుకవారం (మే 10) అక్షయ తృతీయ వచ్చింది. లక్ష్మీదేవత ప్రసన్నం కోసం.. అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా చేయడం వల్ల ఇంటికి సంపదలు, శ్రేయస్సు వస్తుందని చాలా మంది నమ్మకం. అంతేకాదు లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుందని నమ్ముతారు. ఈ నేపథ్యంలో నేడు బంగారం కొనడానికి అనుకూలమైన సమయం ఏమిటో తెలుసుకుందాం. వైశాఖ మాసం శుక్లపక్షంలోని అక్షయ తృతీయ రోజు అబుజ్హ ముహూర్తంలో ఒకటిగా పరిగణించబడుతుంది. బంగారం, వెండి, వాహనాలు, ఆస్తులు.. కొనుగోలు చేయడానికి ఈ రోజు ఉత్తమంగా పరిగణించబడుతుంది. నేడు (అక్షయ తృతీయ) బంగారం కొనడానికి అనుకూలమైన సమయం ఉదయం 05:45 నుండి మొదలైంది. శనివారం (మే 11) ఉదయం 02:50 వరకు కొనుగోలు చేయొచ్చు. ఇక నేడు పూజ సమయం ఉదయం 5:45 నుంచి మధ్యాహ్నం 12:05 వరకు ఉంది. పూజ పీఠం, పసుపు వస్త్రం, 2 మట్టి కుండలు, కుంకుమ, బియ్యం, పసుపు, యాలకులు, గంగాజలం, చందనం, పసుపు, కుంకుమ, కర్పూరం, తమలపాకులు, లక్ష్మి-విష్ణువు ఫోటో, ధూపం, నాణేలు, పంచామృతం, పండ్లు, పువ్వులు, కొబ్బరి కాయలు, దీపం, అష్టగంధలతో పాటు ఈ రోజు కొనుగోలు చేసిన వస్తువులను లక్ష్మీదేవికి సమర్పించండి. ఈ రోజున నువ్వులు, నెయ్యి, బట్టలు, ఉప్పు, తేనె, పండ్లు, బియ్యం, ధాన్యం మొదలైన వాటిని దానం కూడా చేయొచ్చు.