ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై సర్కార్ ఫోకస్.. నేడు ప్రారంభించనున్న సీఎం
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.. రైతులు పండించిన పంట ఉత్పత్తులకు అదనపు విలువ చేకూర్చడం ద్వారా ఆ పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే టార్గెట్‌గా పెట్టుకున్న సర్కార్.. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. దానిలో భాగంగా రూ.1,719 కోట్లతో తలపెట్టిన 11 ఆహారశుద్ధి ప్రాజెక్టులకు ఈ రోజు ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్.. ఈ రోజు ఉదయం 11 గంటలకు వర్చువల్ విధానంలో శ్రీకారం చుట్టనున్నారు.. ఆరు యూనిట్లను ప్రారంభించడంతో పాటు.. మరో ఐదు యూనిట్లకు శంకుస్థాపన చేయనున్నారు ఏపీ సీఎం. ఈ రోజు ప్రారంభంకానున్న ఆరు ప్రాజెక్టుల్లో నాలుగు టమాటా విలువ ఆధారిత యూనిట్లు కాగా.. ఒక మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్, మరొకటి ఉల్లి విలువ ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమ ఉన్నాయి. ఈ రోజు 6 యూనిట్లకు ప్రారంభోత్సవం.. ఐదు యూనిట్లకు భూమిపూజ జరగనుండగా.. మొత్తం 11 యూనిట్లకు రూ.1,719 కోట్లు ఖర్చు చేస్తోంది ఏపీ ప్రభుత్వం.. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు సీఎం జగన్.. రూ.63.15 కోట్లతో నిర్మించిన 421 కలెక్షన్ సెంటర్లు, రూ.5.37 కోట్లతో నిర్మించిన 43 కోల్డ్ రూమ్స్ ను కూడా ప్రారంభించబోతున్నారు.. అయితే, ఆపరేషన్ గ్రీన్స్ కింద ఒక్కొక్కటి రూ.5.5 కోట్లతో నిర్మించారు.. ఈ యూనిట్లు.. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం తుమ్మగుంటపల్లి, చిత్తూరు జిల్లా గంగవరం మండలం పత్తికొండ, బైరెడ్డిపల్లి మండలం చప్పిడిపల్లి, సోమల మండలం కామిరెడ్డివారిపల్లెల్లో నాలుగు టమాటా విలువ ఆధారిత యూనిట్లను ఏర్పాటు చేశారు. ఒక్కో యూనిట్ సామర్థ్యం ఏడాదికి 3,600 టన్నులు. ఒక్కో యూనిట్‌లో 15 మంది చొప్పున నాలుగు యూనిట్ల ద్వారా 60 మందికి ఉపాధికి లభిస్తుంది. 2,414 మంది రైతులకు లబ్ధి చేకూరనుందని అంచనా వేస్తున్నారు.. ఇక, విజయనగరంలో రూ.4 కోట్లతో ఆరోగ్య మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్, కర్నూలు జిల్లాలో ఉల్లి విలువ ఆధారిత ఉత్పత్తుల కోసం ఒక్కో యూనిట్ రూ.లక్ష చొప్పున రూ.కోటితో 100 సోలార్ డీహైడ్రేషన్ యూనిట్లు (సూక్ష్మ పరిశ్రమలు) ఏర్పాటు చేశారు. మరోవైపు రూ.1,692 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఐదు ఆహారశుద్ధి పరిశ్రమలకు సీఎం వైఎస్ జగన్ భూమిపూజ చేయనున్నారు.
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ రోజు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల
కలియుగ ప్రత్యక్షదైవం, తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు శుభవార్త.. ఈ రోజు శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఆగస్టుతో పాటు సెప్టెంబర్ నెలకు సంబంధించిన అదనపు కోటా టికెట్లను కూడా టీటీడీ వెబ్‌సైట్‌లో పెట్టనున్నారు.. రోజుకు 4 వేల చొప్పున అదనపు కోటా టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. ఇక, అక్టోబర్ నెలకు సంబంధించి రోజుకి 15 వేల చొప్పున టికెట్లు విడుదల చేయనున్నారు అధికారులు.. ఇక, మరోవైపు.. రేపు తిరుమలలో పల్లవోత్సవం నిర్వహించనున్నారు.. అంతేకాకుండా అక్టోబర్ నెలకు సంబంధించి తిరుపతి, తిరుమలలో వసతి గదుల కోటా విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు. ఇక, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.. 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉండగా.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. మరోవైపు.. నిన్న శ్రీవారిని 73,796 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,840 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.5 కోట్లుగా టీటీడీ ప్రకటించింది.. ఈ నెల 10న శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం వచ్చింది. సుమారు రెండు నెలల తర్వాత స్వామివారి హుండీకి రూ.5.11 కోట్ల ఆదాయం రాగా.. ఈ నెల 18న శ్రీవారి హుండీకి 5.40 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక, సోమవారం రోజు హుండీ ఆదాయం రూ.5 కోట్లుగా పేర్కొంది టీటీడీ.
వనస్థలిపురంలో డివైడర్ ను ఢీ కొట్టి అంబులెన్స్ బోల్తా.. డ్రైవర్ మృతి
అత్యవసర సమయాల్లో ఫోన్ చేసిన వెంటనే కుయ్.. కుయ్ అంటూ నిమిషాల్లో ట్రాఫిక్ ఉన్నా.. ఎన్ని అవాంతరాలు చోటుచేసుకున్నా.. వారి ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ప్రాణాలను కాపాడేందుకు ముందుంటారు అంబులెన్స్ డ్రైవర్లు. రోగికి ప్రాణాలు కాపాడటానికి వారి ప్రాణాలు సైతం పణంగా పెడుతుంటారు. అయితే ఓ అంబులెన్స్ డ్రైవర్ ఓ రోగికి సీరియస్ గా ఉండటంతో వారికి ఆసుపత్రి వద్ద డ్రాప్ చేశాడు. అయితే డ్రైవర్ అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో డివైడర్‌ను ఢీ కొట్టడంతో దీంతో డ్రైవర్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అది చూసిన వారందరూ చలించిపోయారు. ఈ ఘటన వనస్థలిపురంలో చోటుచేసుకుంది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో హస్తినాపురం వద్ద ఓ ప్రైవేట్ అంబులెన్స్ ప్రమాదానికి గురైంది.. మంటల్లో అంబులెన్స్ దగ్ధమైంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన అంబులెన్స్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మలక్‌పేటకు చెందిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్ బీఎన్‌రెడ్డి హస్తినాపురం వద్ద డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే డ్రైవర్‌ను బయటకు తీశారు. అయితే, తీవ్రంగా గాయపడిన అంబులెన్స్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో అంబులెన్స్‌ను తొలగించే ప్రయత్నం చేయగా అందులోని ఆక్సిజన్ సిలిండర్ ఒక్కసారిగా పేలి మంటలు చెలరేగాయి. అంబులెన్స్ పూర్తిగా దగ్ధమైంది. దీంతో ఆక్సిజన్ సిలిండర్ పేలుడు ధాటికి అక్కడే వున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇంటి నుంచి బయటకు పరుగులు పెట్టారు. బయటకు వచ్చి చూడగా అంబులెన్స్ దగ్ధం కావడంతో చూసి షాక్ కు గురయ్యారు. స్థానిక సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అంబులెన్స్ డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన డ్రైవర్ కుటుంబ సభ్యులను సమాచారం అందించారు. ఇబ్రహీంపట్నం మలక్ పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నుంచి రోగులను దింపుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఒకప్పుడు చికెన్, లిక్కర్ బాటిళ్లు పంచితే.. ఇప్పుడు టమాటాలు పంచుతున్నారు
టమాటా ధరలు పెరగడం వల్ల సామాన్యుల కిచెన్ బడ్జెట్‌పై భారం పడుతుండగా, తెలంగాణలోని అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు 47వ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం (జూలై 24) మహిళలకు ఉచితంగా టమాటాలు పంపిణీ చేశారు. వరంగల్‌లోని BRS నాయకుడు రాజనాల శ్రీహరి నగరంలోని చౌరస్తా సెంటర్‌లో సుమారు 250 నుండి 300 మంది మహిళలకు ఒక్కొక్క బుట్టలో 1.5 కిలోల టమాటాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఏదో ఒక రోజు తెలంగాణకు రామారావు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు శ్రీహరి చెప్పారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తనయుడు, తెలంగాణ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన రామారావు రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులు తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు. శ్రీహరి గతేడాది 200 మంది పార్టీ కార్యకర్తలకు చికెన్, మద్యం పంపిణీ చేసి వార్తల్లో నిలిచారు.
అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిపై మూత్ర విసర్జన.. ఆగ్రాలో దారుణం.. వీడియో వైరల్
కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని సిద్ధిలో దళితుడి ముఖంపై మూత్ర విసర్జన చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ అంశం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. తాజాగా మరోసారి అలాంటి ఉదంతం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటుచేసుకుంది. స్పృహ తప్పి నేలపై పడి ఉన్న వ్యక్తిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తున్నాయి. అంతేకాదు ఆమెను పదే పదే దుర్భాషలాడుతూ తన్నుతూ ఉంటాడు. ఇప్పుడు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అతనిపై హత్యాయత్నం సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వీడియో మూడు నాలుగు నెలల నాటిదని పోలీసులు చెబుతున్నారు. ఈ 30 సెకన్ల వీడియోలో యువకుడు ఈ వ్యక్తిని తలపై తన్నడం కూడా కనిపిస్తుంది. యువకుడు, అతని స్నేహితులు బాధితుడిని దుర్భాషలాడారు. ఈ వీడియో విస్తృతంగా వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ వీడియో మూడు-నాలుగు నెలల నాటిదని పోలీసులు తెలిపారు. ఆగ్రా డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (సిటీ) సూరజ్ కుమార్ రాయ్ నిందితులలో ఒకరిని అరెస్టు చేశారు. ఇతరుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. వీడియో వైరల్ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారని ట్విట్టర్‌లో వీడియో ప్రకటనలో తెలిపారు. ఈ విషయమై బాధితుడు ఆగ్రాలోని ఏ పోలీస్ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేయలేదని విచారణ అనంతరం పోలీసులకు తెలిసింది. ఆ వీడియో మూడు-నాలుగు నెలల నాటిదని, నిందితుడిని ఆదిత్యగా గుర్తించారు. ఆదిత్యను అరెస్టు చేశారు. అతనిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 307 (హత్య ప్రయత్నం), ఇతర నిబంధనల ప్రకారం కేసు నమోదు చేయబడింది.
డెలివరీ బాయ్‌గా కష్టపడ్డాడు.. సర్వీస్ కమీషన్ జాబ్ కొట్టాడు.
ఎవరైనా సాధించాలన్న సంకల్పం ఉంటే అతడు అన్ని ఆటంకాలను ఎదుర్కొని విజేతలగా నిలుస్తాడు. దానికి సాక్ష్యమే మా ఫుడ్ డెలివరీ బాయ్ అంటూ జొమాటో సంస్థ ఓ కథనాన్ని షేర్ చేసింది. ఇందులో జొమాటో డెలివరీ బాయ్ తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడని పేర్కొంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో యువకుడికి ప్రశంసల వర్షం కురుస్తోంది. విఘ్నేష్ అనే వ్యక్తి జొమాటోలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ తమిళనాడు సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడని జొమాటో ట్వీట్ చేసింది. ఈ పరీక్ష ఫలితాలు జూలై 12న విడుదలయ్యాయి. జూలై 24న, Zomato తన కుటుంబంతో విఘ్నేష్ చిత్రాన్ని పంచుకుంది. అతని విజయం గురించి చెప్పింది. జొమాటో డెలివరీ పార్టనర్ రూమ్‌లో పనిచేస్తున్నప్పుడు తమిళనాడు సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విఘ్నేష్‌కి జొమాటో హార్ట్ ఎమోజితో రాసింది. జొమాటో చేసిన ఈ ట్వీట్‌పై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటి వరకు 51 వేల మంది ఈ ట్వీట్‌ను చూడగా, 2500 మందికి పైగా లైక్ చేశారు.
భారత్, విండీస్ రెండో టెస్టు డ్రా.. సిరీస్ 1-0తో రోహిత్ సేన సొంతం!
వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనుకున్న భారత్ ఆశలపై వరణుడు నీళ్లు చల్లాడు. రెండో టెస్టులో చివరి రోజైన సోమవారం పూర్తిగా ఆటను వర్షం తుడిచిపెట్టేయడంతో.. భారత్ డ్రాతో సరిపెట్టుకోక తప్పలేదు. దాంతో సిరీస్ 1-0తో టీమిండియా సొంతమైంది. భారీ వర్షంతో మ్యాచ్ చివరి రోజు ఒక్క బంతి కూడా సాధ్యం కాలేదు. మ్యాచ్ డ్రా కావడంతో సిరీస్ సొంతమైనా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో భారత్ కీలక పాయింట్లు కోల్పోయింది. నాలుగో రోజు వర్షం అంతరాయంతో దాదాపు ఒక సెషన్ ఆట తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే. చివరి రోజు అయినా వరుణుడు కరుణిస్తాడనుకుంటే.. అది జరగలేదు. వర్షం వస్తూ పోతూ ఉండటంతో.. ఆటగాళ్లు అసలు మైదానంలోకి కూడా రాలేకపోయారు. భారీ వర్షం కారంగా మ్యాచ్ సాధ్యపడకపోవడంతో.. చివరికి అంపైర్లు ఆటను రద్దు చేశారు. దాంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. నాలుగోరోజు 365 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఆట ముగిసే సమయానికి 76/2తో నిలిచింది. విండీస్ విజయానికి ఇంకా 289 పరుగులు కావాల్సి ఉంది. త్యాగ్‌నారాయణ్ (24 నాటౌట్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (20 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఈ సిరీస్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. ఆ జోరు చూస్తే సోమవారం కనీసం రెండు సెషన్ల ఆట సాధ్యపడినా.. విండీస్‌ను ఆలౌట్ చేసేవారు. కానీ వరణుడు భారత్ విజయాన్ని అడ్డుకున్నాడు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 438 పరుగులు చేయగా.. విండీస్ 255 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించిన భారత్.. 181/2 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ 76/2తో నిలిచింది. తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లోని తొలి మ్యాచ్ జూన్ 27న జరుగుతుంది.
స్థిరంగా బంగారం ధరలు.. తగ్గిన వెండి ధర! తెలుగు రాష్ట్రాల్లో తులం పసిడి రేటు ఎంతుందంటే?
ఇటీవల వరుసగా పెరిగిన బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (జులై 25) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,150 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,160గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై.. 24 క్యారెట్ల బంగారం ధరపై ఏ మార్పు లేదు. ఈ బంగారం ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం 6 గంటలకు నమోదైనవి. తెలుగు రాష్ట్రాల్లో తులం పసిడి రేటు ఎంతుందో ఓసారి చూద్దాం. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,320గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,450లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,490 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,160గా కొనసాగుతోంది. మరోవైపు పెరిగిన వెండి ధరలకు కాస్త బ్రేక్ పడింది. సోమవారం స్థిరంగా ఉన్న వెండి ధరలు నేడు కాస్త తగ్గాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర మంగళవారం రూ. 77,500లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 500 తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 77,500గా ఉండగా.. చెన్నైలో రూ. 80,500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 76,000 ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 80,500లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80,500ల వద్ద కొనసాగుతోంది.