*గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం.. అసెంబ్లీ ముందుకు రెండు కీలక బిల్లులు
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. సోమవారం సమావేశాలు ప్రారంభం కాగా.. తొలిరోజు సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. నేడు ఉదయం 9 గంటలకు సమావేశం కానుంది ఏపీ అసెంబ్లీ.. పలు శాఖలకు సంబంధించిన అన్యువల్ రిపోర్ట్స్‌ను సభ ముందు పెట్టనుంది ప్రభుత్వం .. గవర్నర్ ప్రసంగం పై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు.. ఈ తీర్మానాన్ని ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ప్రవేశపెట్టనున్నారు.. ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సాగనుండగా.. చర్చ అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమాధానం చెప్పనున్నారు. ఇక, సభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.. ఏపీ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు- 2024, ఏపీ అడ్వకేట్స్ క్లరక్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు -2024 అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది వైఎస్ జగన్ సర్కార్. ఇక, ఇవాళ ఉదయం 10 గంటలకు ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు.. శాసన మండలిలో ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్.. తీర్మానంపై చర్చ సాగనుంది. కాగా, తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తూ.. తమ ప్రభుత్వ హయాంలో అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, జరిగిన అభివృద్ధిని సభ ముందు పెట్టారు.. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు చేపట్టినట్టు.. పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం. మనబడి నాడు-నేడు ద్వారా స్కూల్స్ రూపురేఖలు మార్చాం. విద్యారంగంపై రూ.73,417 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. చదువుకు పేదరికం అడ్డుకాకూడదని అమ్మఒడి పథకం తెచ్చాం. పాఠశాలల్లో మౌళిక సదుపాయాలే లక్ష్యంగా నాడు-నేడు కార్యక్రమం చేపట్టాం.. విద్యార్థుల ఖాతాల్లో నేరుగా రూ.15వేలు జమ చేస్తున్నాం అన్నారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా 10,132 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేశాం.. 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 177 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు. 53 ఏరియా ఆసుపత్రులు, తొమ్మిది జిల్లా ఆసుపత్రుల్లో వసతులు అభివృద్ది చేశామని తెలిపారు. రైతులు రాష్ట్రానికి వెన్నముక తమ ప్రభుత్వం నిలబడింది.. 62 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. 10,778 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు. ఇప్పటి వరకు 53.53 లక్షల రైతులకు రైతు భరోసా ఇచ్చామని.. రైతు భరోసా కింద రూ.33,300 కోట్లు పంపిణీ చేసినట్టు తెలిపారు.
*మేడారం జాతరలో ఉచిత వైఫై సేవలు.. 15 నుంచి 25 వరకు..
మేడారం సమ్మక్క – సారలమ్మ మహాజాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరకు దేశ, విదేశాల నుంచి సుమారు కోటి మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో జరిగే ఈ జాతరలో కమ్యూనికేషన్ సేవలు ఎంతో కీలకం కానున్నాయి. సెల్ ఫోన్ సిగ్నల్స్ నుండి ఇంటర్నెట్, వై-ఫై సేవలు చాలా ముఖ్యమైనవి. సరైన సిగ్నలింగ్ వ్యవస్థ లేకపోవడంతో అక్కడికి వెళ్లే భక్తులకు తరచూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో మేడారం మహాజాతరలో మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సిద్ధమైంది. జాతరలో సిగ్నలింగ్ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు భక్తులకు ఉచిత వైఫై సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారు. భక్తులు అధికంగా ఉండే 16 ప్రధాన ప్రాంతాల్లో ప్రజలందరూ ఉచితంగా వైఫై సేవలను వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు మేడారం మహాజాతరలో ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. ఇంటర్నెట్ సేవలను భక్తుల చేతికి అందించేందుకు బీఎస్ఎన్ఎల్ మేడారం మహాజాతరలో 16 చోట్ల హాట్ స్పాట్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. ఈ మేరకు గట్టమ్మ గుడి, కొత్తూరు రోడ్డు, కొత్తూరు పాఠశాల, ఊరట్టం క్రాస్‌రోడ్డు, కాజ్వే, రెడ్డిగూడెం పాఠశాల, హరిత హోటల్, నార్లాపూర్, ఇంగ్లిష్ మీడియం పాఠశాల, ఐటీడీఏ గెస్ట్ హౌస్, బస్టాండ్, వాచ్ టవర్, ఆసుపత్రులు, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్, ములుగు ప్రవేశద్వారం లో. మేడారంలోని వరి పొలాల్లో హాట్స్పాట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఆయా కేంద్రాల్లో పనులు కూడా పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ హాట్ స్పాట్ సెంటర్లలో వంద అడుగుల లోపు ఉన్న ఏ నెట్వర్క్ యూజర్ అయినా సులభంగా లాగిన్ అయి వైఫై సేవలను ఉపయోగించుకోవచ్చు. 10 నుండి 20 Mbps వేగంతో 1 GB వరకు డేటాను ఉపయోగించవచ్చు. గత జాతర సందర్భంగా ప్రభుత్వం ఈ ఉచిత వైఫై సేవల కోసం సుమారు రూ.20 లక్షలు కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు. మహాజాతర మేడారంలో ఈ నెల 15 నుంచి బీఎస్ఎన్ఎల్ వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జాతర జరగనుండగా, 25వ తేదీ వరకు జాతర ముగిసే వరకు వైఫై సేవలు అందుబాటులో ఉంటాయి. BSNLకి సంబంధించిన అన్ని రకాల సేవలను పర్యవేక్షించడానికి మూడు బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఆయా బృందాల్లోని 20 మంది అధికారులు, సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ కనెక్టివిటీ, సిగ్నలింగ్ వ్యవస్థను పర్యవేక్షించి ఎలాంటి లోపాలు లేకుండా చూస్తారు. మేడారం జాతరలో బిఎస్ఎన్ఎల్ సిమ్‌లు కూడా ఉచితంగా ఇవ్వనున్నారు. రూ.249 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 45 రోజుల పాటు ప్రతిరోజూ 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత అవుట్గోయింగ్, ఇన్కమింగ్ కాల్స్ పొందవచ్చని అధికారులు చెబుతున్నారు.
*విశాఖ ఉక్కు అమ్మకానికి ఈవోఐ జారీ చేయలేదు.. రాజ్యసభలో కేంద్రమంత్రి
విశాఖపట్నం ఉక్కు కర్మాగారం (ఆర్ఐఎన్ఎల్) అమ్మకానికి ఈవోఐ (ఆసక్తి వ్యక్తీకరణ) జారీ చేయలేదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. సేలం స్టీల్ ప్లాంట్, దుర్గాపూర్ అల్లాయ్ స్టీల్ ప్లాంట్, భద్రావతిలోని విశ్వేశ్వరాయ స్టీల్ ప్లాంట్లలో పెట్టుబడుల ఉపసంహరణను ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపధ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారం విక్రయానికి సంబంధించి కొనుగోలుదార్ల నుంచి ఈవోఐ జారీ చేసే ప్రక్రియను ప్రభుత్వం విరమించుకున్నదా అని రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ విశాఖ ఉక్కు విక్రయానికి ఈవోఐ జారీ చేయలేదని తెలిపారు. పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టే సమయం, అందుకు నిర్దేశించిన ధర, విక్రయానికి సంబంధించిన నియమ నిబంధనలు, నాన్-కోర్ అసెట్స్, మైన్స్, అనుబంధ పరిశ్రమలు, యూనిట్లు, జాయింట్ వెంచర్లలో ఆర్ఐఎన్ఎల్ వాటా వంటి అంశాలు పరిగణలోనికి తీసుకున్న తర్వాత మాత్రమే విశాఖ ఉక్కులో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు మంత్రి చెప్పారు. సేలం స్టీల్, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్, భద్రావతి స్టీల్ ప్లాంట్లలో పెట్టుబడుల ఉపసంహరణపై బిడ్డర్లు ఆసక్తి చూపనందునే ఆయా స్టీల్ ప్లాంట్ల విక్రయ ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన ఐదేళ్లలో 32754 టన్నుల ముడి ఇనుమును ఉత్పత్తి చేసినట్లు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ ఏపీలో 2018-19లో 6933 టన్నులు, 2019-20లో 6539 టన్నులు, 2020-21లో 5898 టన్నులు, 2021-22లో 7096 టన్నులు, 2022-23లో 6288 టన్నుల ముడి ఇనుము ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఐదేళ్లలో మొత్తం 5,71,093 టన్నుల ముడి ఇనుము ఉత్పత్తి జరిగినట్లు మంత్రి తెలిపారు. ముడి ఇనుము ఉత్పత్తిలో 2014లో నాల్గవ స్థానంలో ఉన్న ఇండియా 2018లో జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే రెండవ స్థానానికి చేరిందని మంత్రి పేర్కొన్నారు. ఇండియా 2018లో 109.3 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో రెండవ స్థానానికి చేరుకోగా, జపాన్ 104.3 మెట్రిక్ టన్నులు ఉత్పత్తిచేసి 3వ స్థానానికి పడిపోయిందని తెలిపారు. ఇండియా ఐదేళ్లలో ఇనుము ఉత్తత్తిలో 55.7% వృద్ధి సాధించిందని, 2013-14 లో 81.69 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేయగా 2022-23 లో 127.20 మెట్రిక్ టన్నులు స్టీల్ ఉత్పత్తి చేసిందని తెలిపారు. గత 10 ఏళ్లుగా స్టీల్ ఉత్పత్తిలో ఇండియా 5% సీఐజీఆర్ (కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్) సాధించిందని మంత్రి వెల్లడించారు. స్టీల్ క్రమబద్దీకరించిన రంగం కావడంతో ఈ రంగం అభివృద్ధికి ప్రభుత్వం ఫెసిలిటేటర్‌గా వ్యవహరిస్తుందని, జాతీయ స్టీల్ పాలసీ 2017 కింద ఆశించిన లక్ష్యాలు చేరుకోవడానికి పలు చర్యలు చేపడుతుందని మంత్రి తెలిపారు.
*నేడు తెలంగాణ భవన్‌కు కేసీఆర్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు నేడు తెలంగాణ భవన్ కు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ రాష్ట్ర సమితి ఓడిపోయి అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ తొలిసారిగా పార్టీ కార్యాలయానికి వెళ్తున్నారు. ఇందుకోసం బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత అప్పటి ప్రగతి భవన్ నుంచి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి పరిమితమైన కేసీఆర్ అనుకోకుండా ప్రమాదానికి గురయ్యారు. శస్త్రచికిత్స తర్వాత ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నారు. దాదాపు రెండు నెలలుగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్న ఆయన ఇటీవల రాజకీయంగా క్రియాశీలకంగా మారారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కలిసి అసెంబ్లీకి చేరుకున్న ఆయన స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎదుట ప్రమాణం చేశారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చారు. కృష్ణా నది నీటి వినియోగం, ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగించడంపై ఇటీవల వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో కృష్ణా పరివాహక ప్రాంతాల బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమవుతున్నారు. ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను కేంద్రానికి అప్పగించడాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తూ… కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు సిద్ధమైంది. కృష్ణా నదిపై ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ త్వరలో నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ భేటీ నిర్వహణపై కూడా కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించనున్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు కృష్ణా నది సమస్యను ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ కూడా రాజకీయంగా యాక్టివ్‌గా మారడంతో ఇప్పుడు కాంగ్రెస్‌పై ఎదురుదాడికి బీఆర్ఎస్ సిద్ధమైంది. అందులో భాగంగానే ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు.
*నేడు గోవాలో ప్రధాని పర్యటన.. ‘ఇండియా ఎనర్జీ వీక్’ను ప్రారంభించనున్న మోడీ
నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గోవాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ‘ఇండియా ఎనర్జీ వీక్ 2024’ను ప్రారంభించనున్నారు. అంతేకాకుండా.. 1,350 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. దాంతో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) క్యాంపస్‌ను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం డెవలప్డ్ ఇండియా, డెవలప్డ్ గోవా 2047 కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఇక, ఇవాళ దక్షిణ గోవాలోని బేతుల్ గ్రామంలో ఉదయం 10.30 గంటలకు ONGC సీ సర్వైవల్ సెంటర్‌ను ప్రధాని మోడీ ప్రారంభించి.. ఆ తర్వాత ఇండియా ఎనర్జీ వీక్‌ను ప్రారంభంచనున్నారు. ఎనర్జీ వీక్ అనేది భారతదేశం యొక్క అతి పెద్ద ఓమ్నిచానెల్ ఎనర్జీ ఎగ్జిబిషన్.. దీని ప్రారంభోత్సవానికి వివిధ దేశాల నుంచి దాదాపు 17 మంది ఇంధన మంత్రులు హాజరయ్యే ఛాన్స్ ఉంది. ఈ కార్యక్రమంలో 900 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొననున్నారు. ఇది కెనడా, జర్మనీ, నెదర్లాండ్స్, రష్యా, బ్రిటన్, అమెరికా లాంటి ఆరు దేశాల నుంచి పెవిలియన్లను కలిగి ఉంటుంది. అయితే, ఇండియా ఎనర్జీ వీక్ 2024 ఇవాళ్టి నుంచి 9వ తేదీ వరకు గోవాలో నిర్వహించబడుతోంది. స్టార్టప్‌లను ప్రోత్సహించడంతో పాటు ఎనర్జీ వాల్యూ చైన్‌లో ఏకీకృతం చేయడమే ఇండియా ఎనర్జీ వీక్ 2024లో ఒక ముఖ్య ఉద్దేశం. ఇంధన రంగంలో భారతీయ MSMEలు ముందున్న వినూత్న పరిష్కారాలను ప్రదర్శించడానికి ప్రత్యేక మేక్ ఇన్ ఇండియా పెవిలియన్ కూడా నిర్వహించబడుతోంది.
*నేటి నుంచి ‘భారత్ రైస్’ అమ్మకాలు..
బియ్యం ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇవాళ (ఫిబ్రవరి 6) సాయంత్రం 4 గంటలకు భారత్ రైస్‌ను ప్రారంభించనట్లు కేంద్రం ప్రకటించింది. కిలో బియ్యాన్ని కేవలం 29 రూపాయలకే కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో ఆరంభించనున్నారు. నేటి సాయంత్రం 4 గంటల నుంచి భారత్ బ్రాండ్‌తో కూడిన భారత్ రైస్ విక్రయాలను కేంద్ర సర్కార్ ప్రారంభించబోతుంది. భారత ఆహార సంస్థ (FCI) నుంచి సేకరించిన 5 లక్షల టన్నుల బియ్యం NAFED, NCCF, కేంద్రీయ భండార్‌తో సహా అన్ని పెద్ద చైన్ రిటైల్‌లలో అందుబాటులోకి రానుంది. ఈ బియ్యాన్ని 5 కిలోలు, 10 కిలోల బ్యాగులు అందుబాటులో ఉంచనున్నారు. ఇప్పటికే.. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందు కూడా భారత్ బ్రాండ్‌తో తక్కువ ధరకు పిండి, పప్పులు, ఉల్లిపాయలు, టమోటాలను విక్రయించింది. ఇందులో భారత్ గోధుమ పిండిని 6 నవంబర్ 2023న కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది. దీంతో దేశంలో సగటు పిండి ధర కిలో 35 రూపాయలు ఉండగా.. కేంద్రం చొరవతో 27.50 రూపాయలకి లభిస్తుంది. కాగా శనగపప్పును కిలో రూ.60కి దొరుకుతుంది. కాగా.. ఈ-కామర్స్ వేదికల్లో భారత్ బ్రాండ్ విక్రయాలకు మంచి స్పందన వస్తుండగా.. భారత్ రైస్‌కు సైతం అదే స్థాయిలో ఆదరణ దొరుకుతుందని సెంట్రల్ సర్కార్ భావిస్తోంది. అంతేకాకుండా.. భారత్ రైస్ తో సామాన్యులకు లాభం చేకూరనుంది.
*ప్రధాని మోడీ ఓబీసీ కావడం వల్లే శంకరాచార్యలు ప్రాణ ప్రతిష్టకు రాలేదు
ప్రధాని నరేంద్ర మోడీ వెనుకబడిన వర్గానికి (OBC) చెందిన వ్యక్తి.. ఆయన చేతుల మీదుగా అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగడం వల్లే శంకరాచార్యులు రాలేదని తమిళనాడు క్రీడా అభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. తూర్పు చెన్నై డీఎంకే జిల్లా శాఖ ఏర్పాటు చేసిన పార్టీ బూత్ ఏజెంట్ల సమావేశంలో ఆయన పాల్గొని ఈ కామెంట్స్ చేశారు. సనాతన ధర్మంలో ఉన్న అసమానతల గురించి మాట్లాడాను.. అయితే, అసమానతలు ఉన్నాయనడానికి పీఠాధిపతుల చర్యే నిదర్శనం.. ఈ విషయాన్ని నాలుగు నెలల క్రితమే నేను చెప్పా.. కానీ, అందరు నన్ను విమర్శించారనే విషయాన్ని ఉదయనిధి స్టాలిన్ గుర్తు చేసుకున్నాడు. అయితే, సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పను అని ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. వితంతువు కావడం, గిరిజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును బీజేపీ ప్రభుత్వం అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని ఆయన ఆరోపించారు. డీఎంకే ఏ మతానికి, రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకం కాదు.. కానీ, దేశ రాష్ట్రపతిని కూడా దీనికి ఆహ్వానించలేదని పేర్కొన్నారు. కాగా.. 2023 సెప్టెంబర్ లో అభ్యుదయ రచయితల సదస్సులో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఆయన పిలుపునిచ్చారు. సనాతన ధర్మం కరోనా వైరస్, మలేరియా, డెంగ్యూ లాంటిది, సమానత్వం, సామాజిక న్యాయం అభివృద్ధి చెందాలంటే దాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. ఉదయనిధి వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆయనపై పలు చోట్లు కేసులు నమోదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన.. న్యాయస్థానాలపై తనకు తగిన గౌరవం ఉంది.. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని ఉదయనిధి స్టాలిన్ వెల్లడించారు.
*నేడు దక్షిణాఫ్రికాతో సెమీఫైనల్.. సూపర్ ఫామ్‌లో యువ భారత్!
అండర్-19 ప్రపంచకప్ 2024 సెమీఫైనల్ 1 మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్, ఆతిథ్య దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. సూపర్ ఫామ్‌లో ఉన్న యువ భారత్‌కు టోర్నీలో ఇప్పటివరకు ఓటమన్నదే తెలియదు. సెమీస్‌కు ముందు ఆడిన 5 మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్.. అదే జోరు సెమీఫైనల్లో కూడా కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా టీమిండియా బరిలోకి దిగుతోంది. పటిష్ట భారత జట్టును నిలువరించడం దక్షిణాఫ్రికాకు కష్టమే అని చెప్పాలి. అండర్-19 ప్రపంచకప్ 2024లో ఆడిన అన్ని మ్యాచ్‌లలో మూడు విభాగాల్లోనూ భారత్ రాణించింది. రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీతో ముషీర్ ఖాన్ జోరుమీదున్నాడు. 334 పరుగులు చేసిన ముషీర్.. టోర్నీ టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. 304 పరుగులు చేసిన కెప్టెన్ ఉదయ్ సహరన్ కూడా ఫామ్‌లో ఉన్నాడు. నేపాల్ మ్యాచ్‌లో సచిన్ దాస్ సెంచరీ (116) బాదాడు. వీరిని అడ్డుకోవడం ప్రొటీస్ బౌలర్లకు కష్టమే. మరోవైపు యువ భారత్ బౌలింగ్‌లో కూడా రాణిస్తోంది. బౌలర్ సౌమి కుమార్ పాండే అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 2.17 ఎకానమీతో 16 వికెట్లు పడగొట్టాడు. అతడి బౌలింగ్‌లో పరుగులు చేయడం అంత సులువు కాదు. పేసర్లు నమన్ తివారి, రాజ్ లింబాని కూడా రాణిస్తుండడం కలిసొచ్చే అంశం. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభం అయ్యే ఈ మ్యాచ్ స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారం కానుంది. మరో సెమీస్‌లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ తలపడనున్నాయి.
*మహిళలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు..ఎంతంటే?
బంగారం కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో అదిరిపోయే న్యూస్.. ఈరోజు మార్కెట్ లో ధరలు భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. వెండి కూడా అదే దారిలో నడిచింది… మంగళవారం 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 150 దిగొచ్చి.. రూ. 57,950కి చేరింది.. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 160 తగ్గి.. రూ. 63,220కి చేరింది.. ఇక కేజీ వెండి రూ. 200 దిగొచ్చి.. రూ. 75,300కి చేరింది.. ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,500గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,820గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 57,950గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 63,220గాను ఉంది.. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,100గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,370గా ఉంది. కోల్‌కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,950 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 63,220గా ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,950గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,220గా నమోదైంది.. వెండి విషయానికొస్తే.. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి.. కేజీ వెండి రూ. 200 దిగొచ్చి.. రూ. 75,300కి చేరింది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 76,700 పలుకుతోంది. వెండి ధరలు కోల్‌కతాలో రూ. 75,200.. బెంగళూరులో రూ. 72,500గా ఉంది. మిగిలిన ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి.. రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..