నేడు వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధుల విడుదల
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్.. నిరు పేద యువతుల వివాహాలకు సహకారం అందించేందికి వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పేరుతో పథకాలను తీసుకువస్తున్న విషయం విదితమే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల కోసం వైఎస్సార్ కల్యాణమస్తు, ముస్లిం మైనారిటీల కోసం వైఎస్సార్ షాదీ తోఫాను అందిస్తూ వస్తోంది ప్రభుత్వం.. ఇక, ఇప్పుడు మరో 10,132 జంటలకు శుభవార్త చెప్పారు సీఎం వైఎస్ జగన్.. అక్టోబర్- డిసెంబర్, 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ పథకం కింద 10,132 జంటలకు సంబంధించిన తల్లుల ఖాతాల్లో రూ.78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని ఇవాళ (మంగళవారం) విడుదల చేయనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరగనున్న కార్యక్రమంలో బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో సంబంధిత సొమ్మును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జమ చేయనున్నారు. కాగా, ఈ పథకాల ద్వారా నిరుపేదల కుటుంబాలకు బాసటగా నిలుస్తూనే.. మరోవైపు బాల్య వివాహాలకు వైఎస్ జగన్ సర్కార్ చెక్ పెడుతోంది. వధువు వయస్సు 18 ఏళ్లు, వరుడి వయస్సు 21 ఏళ్లు నిండాలనే నిబంధన పెట్టారు.. దీంతో ఇద్దరూ తప్పని సరిగా పదవ తరగతి పాసై ఉండాలి.. ఆ కుటుంబాల్లో ఆదాయపన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఉండరాదు. ఎస్సీ, ఎస్టీ వధూవరులకు 1 లక్ష రూపాయలు.. బీసీలకు 50 వేల రూపాయలు.. మైనారిటీలకు 1 లక్ష రూపాయలు అందిస్తున్నారు.. ఇక, ఎస్సీ, ఎస్టీలు కులాంతర వివాహం చేసుకుంటే 1లక్షా 20 వేల రూపాయలు.. బీసీలు కులాంతర వివాహం చేసుకుంటే 75 వేల రూపాయలు.. దివ్యాంగులకు 1 లక్షా 50 వేల రూపాయలను జగన్ ప్రభుత్వం అందిస్తోంది.
నేడు IIM- విశాఖ శాశ్వత క్యాంపన్ ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ, సీఎం జగన్..
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం (IIMV) శాశ్వత క్యాంపస్ ప్రారంభానికి సిద్ధమైంది. నగర శివారున ఆనందపురం మండలం గంభీరంలో 436 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ క్యాంప్‌సను ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇతర అధికారులు కూడా వర్చువల్ గానే పాల్గొంటారు. ఇక, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం విశాఖకు ఐఐఎంను కేటాయించింది.
రెండో రోజు రాజమండ్రిలో పవన్ పర్యటన.. పార్టీ ముఖ్య నేతలతో కీలక భేటీ..
నేడు రెండో రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటించనున్నారు. నేటి ఉదయం 10 గంటల నుంచి రాజమండ్రి ఏవీఏ రోడ్ లో ఉన్న జనసేన పార్లమెంటు కార్యాలయంలో సమావేశాలు జరగనున్నాయి. రాబోయే ఎన్నికల్లో జనసేన టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు, ముఖ్య నేతలతో ఆయన సమీక్ష సమావేశం కానున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ స్థానాల్లో పోటీ చేయాలి, అభ్యర్థులు ఎవరు అనే విషయాలపై ప్రధానంగా చర్చ చేయనున్నారు. రాజానగరం, రాజోలు స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే జనసేన ప్రకటించింది. కాగా, ఈ సమావేశంలో ఈ రెండు స్థానాల్లో ( రాజనగరం, రాజోలు ) పోటీ చేసే అభ్యర్థులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక, రాజమండ్రి రూరల్, పి.గన్నవరం, పిఠాపురం, కాకినాడ రూరల్ స్థానాలను సైతం జనసేన పార్టీ ఆశిస్తుంది. నేటి సాయంత్రం వరకు పవన్ కళ్యాణ్ సమావేశాలు కొనసాగనున్నాయి. రాత్రికి రాజమండ్రిలోనే జనసేనాని బస చేయనున్నారు. ఇక, రేపు ఉదయం రాజమండ్రి నుంచి భీమవరంకు పవన్ కళ్యాణ్ బయలుదేరి వెళ్ళనున్నారు.
నేడు బాసరలో విజయ సంకల్ప యాత్ర ప్రారంభించనున్న అస్సోం సీఎం
తెలంగాణ రాష్ట్రంలో పార్ల మెంటు ఎన్నిక లు దగ్గరపడుతున్న నేపథ్యంలో బీజేపీలో సమర శంఖారావం పూరించనుంది. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎంపీ ఎన్నికల బస్సు యాత్ర ప్రారంభం కానుంది. భారతీయ జనతా పార్టీ విధివిధానాలు, వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో పార్లమెంట్ ఎన్నికల రంగంలో శ్రేణులను ఏకం చేసేందుకు ఇవాళ బాసర పుణ్యక్షేత్రం నుంచి విజయ సంకల్ప యాత్ర పేరిట బస్సు యాత్రను ప్రారంభిస్తోంది. ఆదిలాబాద్ పెద్దపెల్లి నిజామాబాద్ పార్లమెంట్ స్థానాలను కలుపుతూ 21 శాసనసభ స్థానాల్లో దాదాపు 310 కిలోమీటర్ల మేర బస్సుయాత్ర కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి అశోక్ ముఖ్యకార్యదర్శి హిమంత విశ్వ శర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. బాసర సరస్వతీ ఆలయంలో ఉదయం 9 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా భైంసా చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు జిన్నింగ్ ఫ్యాక్టరీ ఆవరణలో ఎస్ఎస్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. భోజనం తర్వాత యాత్ర ప్రారంభమవుతుంది. కల్లూరు, నర్సాపూర్ (జి), దిలావర్పూర్లో రోడోషో ముగించుకుని నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు అక్కడ బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు.
నేడు జమ్మూలో పర్యటించనున్న ప్రధాని మోడీ..
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ (మంగళవారం) జమ్మూలో పర్యటించనున్నారు. దాదాపు రూ.13,375 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేయనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో బాణాసంచా అమ్మకాలపై అధికారులు నిషేధం విధించారు. నేటి సాయంత్రం 5 గంటల వరకు క్రాకర్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే డ్రోన్లు ఎగురవేతను సైతం అధికారులు నిషేధించారు. ఇక, ప్రధాని మోడీ జమ్మూలో నిర్మించిన ఎయిమ్స్‌ను నేడు ప్రారంభించబోతున్నారు. ఈ ఆస్పత్రికి పునాది రాయిని 2019 ఫిబ్రవరిలో వేశారు. అంతే కాకుండా 48.1 కిలో మీటర్ల పొడవైన బనిహాల్- సంగల్దాన్ రైల్వే సెక్షన్‌ను కూడా ఆయన ప్రారంభించనున్నారు. అయితే, మొత్తం రూ.32,000 వేల కోట్లతో పలు అభివృద్ది పనులను ఆయన జాతీకి అంకితం చేయనున్నారు. ఈ రైలు విభాగం కాశ్మీర్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలుపుతూ 272 కిలో మీటర్ల పొడవైన ఉధంపూర్- శ్రీనగర్ -బారాముల్లా మీదుగా తిరిగనుంది. జమ్మూ కాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాడిన తర్వాత ప్రధాని మోడీ చేపట్టిన రెండో పర్యటన ఇది.. ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు.
త్వరలో పట్టాలెక్కనున్న 50అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని నడిచిన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రజల నుండి చాలా ఆదరణను పొందింది. అమృత్ భారత్ రైలు పెద్ద విజయాన్ని సాధించిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం ప్రకటించారు. దీని కారణంగా 50 అమృత్ భారత్ రైళ్లకు అనుమతి లభించింది. రైల్వే మంత్రి ఈ నిర్ణయాన్ని సోషల్ మీడియాలో వీడియోను ట్వీట్ చేయడం ద్వారా తెలియజేశారు. మధ్యంతర బడ్జెట్‌కు ముందు, అశ్విని వైష్ణవ్ ప్రతి సంవత్సరం 300 నుండి 400 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ నడుపుతామని చెప్పారు. ఇప్పుడు ఈ పెద్ద ప్రకటనతో అది ఖాయమైంది. అశ్విని వైష్ణవ్ తన ట్వీట్లో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ 33 సెకన్ల చిన్న వీడియోను పోస్ట్ చేసింది. అర్థరాత్రి వరకు రెండు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వందేభారత్ రైళ్లను సామాన్యులకు తక్కువ ధరకు అందించడానికి రైల్వే అమృత్ భారత్‌ను ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిసెంబర్ 30, 2023న దేశానికి రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను బహుమతిగా ఇచ్చారు. ప్రధాని మోడీ అయోధ్య నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఏడాదిలో రెండుసార్లు 10, 12వ బోర్డు పరీక్షలు!
ఛత్తీస్‌గఢ్‌లో పీఎంశ్రీ (ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకాన్ని సోమవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని పండిట్ దీన్ దయాళ్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం విష్ణుదేవ్ సాయితో పాటు విద్యాశాఖ అధికారులు, ఛత్తీస్‌గఢ్ పాఠశాల విద్యాశాఖ మంత్రి బ్రిజ్మోహన్ అగర్వాల్ పాల్గొన్నారు. పీఎంశ్రీ ఆరంభం సందర్భంగా 10, 12 తరగతుల విద్యార్థులకు కేంద్ర విద్యాశాఖ మంత్రి శుభవార్త చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో 10, 12వ బోర్డు పరీక్షలకు సంవత్సరంలో రెండుసార్లు హాజరయ్యే అవకాశాన్ని 2025-26 విద్యా సంవత్సరం నుంచి కల్పించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. విద్యార్థులు రెండుసార్లు పరీక్షలు రాసి.. మెరుగైన స్కోరును ఉంచుకుని, మరో దానిని రద్దు చేసుకునే అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులపై విద్యా సంబంధిత ఒత్తిడిని తగ్గించడం ఇది ఒకటి అని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానం 2020ను లక్ష్యాలను ఆయన వివరించారు. ప్రధానమంత్రి శ్రీ యోజన కింద దేశవ్యాప్తంగా 14500 ప్రభుత్వ పాఠశాలలను అప్‌గ్రేడ్ చేయడానికి కేంద్రం సిద్ధమైంది. ఈ పథకం కింద ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 211 పాఠశాలలు మరియు కేంద్రీయ విద్యాలయానికి చెందిన 17 పాఠశాలలు చేర్చబడ్డాయి. కాదు, నవోదయ విద్యాలయానికి చెందిన 20 పాఠశాలలు కూడా ఈ పథకంలో చేర్చబడ్డాయి. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 248 పాఠశాలలు ప్రధానమంత్రి శ్రీ యోజన కింద ఎంపికయ్యాయి.
ఈ ఇద్దరు కలిస్తే పాన్ ఇండియాకి పూనకాలే…
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం… కల్కిలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ చేస్తున్నాడనేది. అసలు ఇందులో నిజం ఉందా? అనేది ఎవ్వరికీ తెలియదు కానీ కల్కిని నాగ్ అశ్విన్ ఎలా డిజైన్ చేస్తున్నాడనే ఊహాగానాలు మాత్రం అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్తున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ కల్కి గురించి రోజుకో వార్త బయటకు వస్తుంది. కల్కి దెబ్బకు బాహుబలి 2 రికార్డులు కూడా డేంజర్ జోన్లో పడే ఛాన్స్ ఉందని వినిపిస్తోంది. ఎందుకంటే… ఈ సినిమా కంటెంట్ పరంగానే కాదు… విజువల్ పరంగా ఓ అద్భుతమే అంటున్నారు. బలమైన యాక్షన్ సీక్వెన్స్, అద్భుతమైన గ్రాఫిక్స్‌తో పాటు అంతకుమించి బలమైన ఎమోషన్స్ కల్కిలో ఉన్నాయని టాక్. ఈ సినిమా కోసం ఏకంగా 5 విఎఫ్ఎక్స్ కంపెనీలు విజువల్ ఎఫెక్ట్స్ పై వర్క్ చేస్తున్నాయట. అందులో మూడు ఇండియన్ కంపెనీలు కాగా… ఒకటి న్యూజిలాండ్, ఒకటి యూఎస్ కంపెనీ అని తెలుస్తోంది. ఇక, కల్కి స్టార్ క్యాస్టింగ్ చూస్తే ఔరా అనాల్సిందే. ఈ సినిమాలో ప్రభాస్‌తోపాటు కమల్ హాసన్, బిగ్ బీ అమితాబ్, దీపికా పదుకొనె, దిశా పటానీ మెయిన్ కాస్టింగ్‌గా ఉన్నారు. వీరితోపాటు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రానా, మృణాల్ ఠాకూర్‌తో పాటు రాజమౌళి, రామ్‌గోపాల్ వర్మ వంటి వారు కూడా క్యామియో చేస్తున్నారనే టాక్ ఉంది. ఇక వీళ్లకు తోడు ఎన్టీఆర్ పేరు కూడా పెద్దగా సౌండ్ చేస్తోంది. కల్కిలో యంగ్ టైగర్ కాసేపు తెరపై కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది. ఇండస్ట్రీ వర్గాలు ఈ విషయాన్ని బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. ఒకవేళ… ప్రభాస్, ఎన్టీఆర్ ఒకే స్క్రీన్ పై కనిపిస్తే మాత్రం థియేటర్లు తగలబడిపోతాయ్… అని అనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. మరి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే… మే 9 వరకు వెయిట్ చేయాల్సిందే!
ప్రాక్టీస్ కోసం 16 వేల కిలోమీటర్లు.. ప్రతి రోజూ 500 బంతులు!
రాజ్‌కోట్ టెస్టులో అరంగేట్ర బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అందరినీ ఆకట్టుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 66 బంతుల్లో 62 రన్స్ చేసిన సర్ఫరాజ్.. రెండో ఇన్నింగ్స్‌లో 72 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ స్పిన్నర్లను సర్ఫరాజ్ సునాయాసంగా ఎదుర్కొన్నాడు. అరంగేట్రం మ్యాచ్ అయినా బౌండరీలు బాదుతూ స్వేచ్ఛగా ఆడాడు. అయితే స్పిన్‌లో సర్ఫరాజ్ ప్రదర్శన గాలివాటమేమీ కాదు. అతడి 15 ఏళ్ల కఠిన శ్రమకు ఫలితం. తండ్రి నౌషాద్ ఖాన్ పర్యవేక్షణలో సర్ఫరాజ్ ఖాన్ ప్రతి రోజూ 500 బంతులు ఎదుర్కొన్నాడు. అలా అతడు తన నైపుణ్యాన్ని మెరుగుపర్చుకున్నాడు. ముఖ్యంగా కరోనా లాక్డౌన్ సమయంలో అవలంబించిన ప్రణాళిక.. ఇంగ్లండ్ స్పిన్నర్లు టామ్ హార్ట్లీ, జో రూట్, రెహాన్ అహ్మద్‌ల బౌలింగ్‌లో మంచి ఫలితాలను ఇచ్చింది. ‘ముంబై మైదానాల్లో ఆఫ్, లెగ్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ల బౌలింగ్‌లో ప్రతి రోజూ 500 బంతులు ఎదుర్కోవడం వల్లే రాజ్‌కోట్‌లో సర్ఫరాజ్ ఖాన్ స్పిన్నర్లను బాగా ఎదుర్కోగలిగాడు’అని ఓ కోచ్ తెలిపాడు. ‘కరోనా సమయంలో ప్రాక్టీస్ కోసం సర్ఫరాజ్ ఖాన్ 16 వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. ముంబై నుంచి అమ్రోహా, మొరాదాబాద్, మీరట్, కాన్పూర్, మథుర, దెహ్రాదూన్లకు వెళ్లి బంతి స్క్వేర్‌గా టర్నయ్యే అకాడమిలలో సాధన చేశాడు. కొన్ని బంతులు ఎక్కువ బౌన్స్ అయితే.. ఇంకొన్ని తక్కువ ఎత్తులో వచ్చేవి’ అని సదరు కోచ్ చెప్పాడు. భువనేశ్వర్ కుమార్ కోచ్ సంజయ్, మొహ్మద్ షమీ కోచ్ బబ్రుద్దీన్, కుల్దీప్ యాదవ్ కోచ్ కపిల్ దేవ్ పాండే, గౌతమ్ గంభీర్ కోచ్ సంజయ్ కూడా స్పిన్‌లో సర్ఫరాజ్ బాగా ఆడడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఇక మూడో టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన అతడు నాలుగో టెస్టులో రాణించాలని చూస్తున్నాడు.