రెబల్స్‌కు షాకిచ్చిన టీడీపీ..
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసినా.. పార్టీ ఆదేశాలు పట్టించుకోకుండా ఎన్నికల బరిలోనే ఉన్న రెబల్స్‌కు షాకిచ్చింది తెలుగుదేశం పార్టీ.. రెబెల్ అభ్యర్థులుగా బరిలోకి దిగిన ఆరుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు.. ఇక, టీడీపీ సస్పెన్షన్ వేటు వేసిన నేతల వివరాల్లోకి వెళ్తే.. అరకు రెబెల్ సివేరి అబ్రహం, విజయనగరం రెబెల్ మీసాల గీత, అమలాపురం రెబెల్ పరమట శ్యాం కుమార్, పోలవరం రెబెల్ ముడియం సూర్య చంద్రరావు, ఉండికి చెందిన కలవపూడి శివ, సత్యవేడుకి చెందిన రాజశేఖర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీడీపీ.. తెలుగుదేశం పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని వేటు వేసినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు అచ్చెన్నాయుడు. అమలాపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీలో ఉన్న తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థి పరమట శ్యామ్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసిన రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు… అమలాపురం అసెంబ్లీ టికెట్ టికెట్ దక్కక పోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు పరమట శ్యామ్.. నామినేషన్ ఉపసంహరించుకోవాలని టీడీపి నేతలు ఒత్తిడి చేసినా తలొగ్గలేదు శ్యామ్. తెలుగుదేశం అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఓట్లను టీడీపీ రెబెల్, స్వతంత్ర అభ్యర్థి పరమట శ్యామ్ చీల్చే అవకాశం ఉందంటున్నారు.
నేడు టీడీపీ-బీజేపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో..
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టాలు ముగిసిపోతున్నాయి.. ఇప్పటికే బరిలో నిలిచేది ఎవరో క్లారిటీ వచ్చింది.. దీంతో.. అన్ని పార్టీలు ప్రచారంపై ఫోకస్ పెట్టాయి.. మరోవైపు, ఇప్పటికే అధికార వైసీపీ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇక, ఈ రోజు టీడీపీ – బీజేపీ – జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబు నివాసంలో మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతల సమక్షంలో మేనిఫెస్టో విడుదల కానుంది. 2023 రాజమండ్రి మహానాడులో టీడీపీ సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించింది. ఆ తరువాత కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి మూడు పార్టీలు దిగాయి. ఇక, మూడు పార్టీలకు ప్రజలు, వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులు, అగ్రనేతల ఆలోచనలు, వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలతో మేనిఫెస్టో రూపకల్పన చేశారు. మేనిఫెస్టో అంశాలపై మూడు పార్టీల నేతలతో కూడిన మేనిఫెస్టో కమిటీ సుదీర్ఘ కసరత్తు చేసింది. రాష్ట్ర ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం.. రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం అనే థీమ్‌తో మేనిఫెస్టోను ఏర్పాటు చేశారు. అధిక పన్నులు, పన్నుల బాదుడు లేని సంక్షేమం – ప్రతి ప్రాంతంలో అభివృద్ధి అనే కాన్సెప్ట్‌తో మేనిఫెస్టోను తయారు చేశారు. అప్పులు, పన్నులతో ఇచ్చేది సంక్షేమం కాదని.. సంపద సృష్టితో సంక్షేమం ఇస్తామని కూటమి హామీలు ఇస్తోంది. వచ్చే 5 ఏళ్లలో చేసే డెవలప్మెంట్‌పై స్పష్టమైన రోడ్ మ్యాప్ తో మేనిఫెస్టో ఉంటుందంటోంది కూటమి. రాష్ట్ర సమగ్ర అభివృద్దితో పాటు, ప్రజల వ్యక్తిగత జీవితాల్లో మార్పు తెచ్చేలా ఒక్కో పథకం, కార్యక్రమం ఉంటుందని కూటమి అంటోంది. లబ్దిదారులు, రాష్ట్ర రాబడులు, నిధుల లభ్యత అంశాలపై లోతైన కసరత్తు తరువాతనే పథకాల డిజైన్ ఉంటుందని కూటమి నేతలు పేర్కొంటున్నారు. అయితే, కూటమి మేనిఫెస్టో ఎలా ఉంటుంది? ఏ అంశాలు చేరుస్తారు అనేది.. ఆసక్తికరంగా మారింది.
ఉత్సాహంగా సీఎం జగన్ ఎన్నికల ప్రచారం.. నేడు మూడు జిల్లాలో పర్యటన
సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి జనం నీరాజనాలు పలుకుతున్నారు. బహిరంగ సభలకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. కూటమిపై పార్టీలపై విమర్శలు ఎక్కుపెడుతూ ప్రచారపర్వంలో ముందుకెళ్తున్నారు జగన్. నిన్న రెండో రోజున మూడు జిల్లాల్లోని మూడు నియోజకవర్గాల్లో పర్యటించారు సీఎం జగన్. మలి విడత ప్రచారంలో డోస్ పెంచేసారు సీఎం జగన్. కూటమిపై ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. 2014 మేనిఫెస్టోలో ఇదే కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రజలకు గుర్తుచేస్తున్నారు. అప్పట్లో టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టోను చూపిస్తూ.. అందులో ఎన్ని హామీలు అమలు కాలేదో.. ఎందుకు కాలేదో వివరిస్తున్నారు. రెండు వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతుందని సీఎం జగన్ అన్నారు. అటువైపున కౌరవ సైన్యం ఉందన్నారు. అందరిని మోసం చేసిన చరిత్ర కూటమిది అంటూ టీడీపీ, జనసేన, బీజేపీపై మండిపడ్డారు. ఈ మధ్య చంద్రబాబు తనను బచ్చా అంటున్నారని గుర్తుచేస్తూనే.. ఆ కామెంట్స్‌కు కౌంటరిచ్చారు జగన్. సిద్ధం, మేమంతా బస్సు యాత్రలతో ఇప్పటికే రాష్ట్రాన్ని చుట్టొచ్చిన జగన్… ఇప్పుడు మలి విడత ప్రచారం నిర్వహిస్తున్నారు. రోజుకు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంతో పాటు మైదుకూరు, పీలేరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. టంగుటూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం జగన్. మొత్తానికి…ఎన్నికల ప్రచారంలో డోస్ పెంచిన సీఎం జగన్ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.
ఇండిపెండెంట్లకు ‘గాజు గ్లాసు’ సింబల్.. కూటమి నేతలకు కునుకు కరువు..!
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పార్టీలను జనసేన గాజు గ్లాసు గుర్తు టెన్షన్ పెడుతోంది. గాజు గ్లాసు ఫ్రీ సింబల్‌గా ఉండటంతో.. జనసేన పోటీ చేయని చోట స్వతంత్రులకు గాజు గ్లాసు కేటాయిస్తున్నారు అధికారులు. దీంతో.. కూటమి నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. తమ గెలుపు అవకాశాలను ఇండిపెండెంట్లు ఎక్కడ గండి కొడతారో అని బెంబేలెత్తిపోతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు వచ్చింది. బెజవాడ ఎంపీ స్థానంతో పాటు జగ్గయ్యపేట, కైకలూరు, మైలవరం, మచిలీపట్నం అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు కోరడంతో ఫ్రీ సింబల్‌గా ఉన్న జనసేన గుర్తును ఇచ్చారు. కీలక స్థానాల్లో గాజు గ్లాసు కేటాయించడంతో కూటమి పార్టీ నేతలు టెన్షన్ పడుతున్నారు.
బీజేపీ నోటీసులకు భయపడేది లేదు.. కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
బీజేపీ నోటీసులకు భయపడేది లేదు.. కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. రాష్ట్ర సాగునీరు, పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పోలీసుల నోటీసులు కక్ష సాధింపు చర్యలు అన్నారు. బీజేపీ దేశంలో ఓటమి భయంతో కాంగ్రెస్ నాయకులను పోలీసులు, ఈడీ, సీబీఐ లతో బెదిరించాలని చూస్తుందన్నారు. ఫేక్ వీడియోలో అంటూ నోటీసులు పంపుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఆ వీడియోలతో సంబంధం ఏమిటి? అని ప్రశ్నించారు. నోటీసులకు, బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదు. కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవ్వడం ఖాయమన్నారు.
నేడు తెలంగాణకు మోడీ.. జహీరాబాద్, మెదక్ లో ప్రధాని ప్రచారం..
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ నేడు తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. నేడు మెదక్ జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా మెదక్ జిల్లాలోని అల్లా దుర్గం ఐబీ స్క్వేర్‌లో జరిగే భారీ బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా జహీరాబాద్, మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని మోడీ ప్రచారం నిర్వహించనున్నారు. ప్రధాని మోడీ ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు అసెంబ్లీ వేదిక వద్దకు చేరుకుని ప్రసంగించనున్నారు. దీంతో ప్రధాని మోడీ సభకు మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నుంచి రెండు లక్షల మంది హాజరవుతారని అంచనా. బీజేపీ శ్రేణులు వేసవికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. సభకు వచ్చే ప్రజలు ఎటువంటి ఇబ్బందిలేకుండా మంచి నీటి సదుపాయం కల్పించారు. కూర్చునేందుకు సదుపాయం కల్పించారు. మోడీ సభలో ఎటువంటి ఆటంకాలు లేకుండా సభ సజావుగా సాగేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జహీరాబాద్, మెదక్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ రూట్స్ మార్చినట్లు తెలిపారు. వాహనదారులు గమనించాలని, పోలీసులకు సహకరించి ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలని కోరారు.
భారత్ అగ్రరాజ్యంగా మారుతుంటే.. మేము అడుక్కుంటున్నాం..
పాకిస్తాన్ అగ్ర నాయకుడు, జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం (ఎఫ్) అధ్యక్షుడు మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ పాక్ పార్లమెంట్ లోపల భారతదేశాన్ని ప్రశంసించారు. నేడు భారత్ అగ్రరాజ్యంగా అవతరించేందుకు సిద్ధమవుతుంటే.. ప్రపంచ దేశాల ఆర్థిక సహాయానికి పాకిస్థాన్ సిద్ధంగా ఉందన్నారు. వరల్డ్ బ్యాంక్ తో పాటు ఇతర దేశాల దగ్గర మనం ఆర్థికంగా ఆదుకోవాలని అడుక్కునే పరిస్థితి ఏర్పాడిందని ఆయన విమర్శించారు. ఈ పరిస్థితికి ఎవరు బాధ్యులని మౌలానా ప్రశ్నించారు. పాకిస్థాన్‌లోని రాజకీయ నాయకులు భారత్‌ను ఎంత వ్యతిరేకించినా, భారత్ అభివృద్దిలో మనకంటే చాలా ముందుకెళ్లిందన్న విషయాన్ని వారు అంగీకరించాలన్నారు. కాగా, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను కీలుబొమ్మలుగా మార్చడం వల్లే దేశం ఈ పరిస్థితిని అదృశ్య శక్తులే కారణమని మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ అన్నారు. పార్లమెంట్ సభ్యులు సూత్రాలను వదిలి ప్రజాస్వామ్యాన్ని అమ్ముకోవడంలో నిమగ్నమై ఉన్నారని ఆయన మండిపడ్డారు. పార్లమెంటు నిజంగా ప్రజల ఆదేశాన్ని ప్రతిబింబిస్తుందా? రాజభవనాలతో, బ్యూరోక్రాట్లచే ప్రధానమంత్రి ఎవరనేది నిర్ణయించబడుతుందని విమర్శించారు. ఇంకా ‘ఎంతకాలం రాజీపడతాం?’ ఎంపీలుగా ఎన్నికయ్యేందుకు బయటి శక్తుల సహాయం ఎంతకాలం కొనసాగిస్తాం? అని మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ ప్రశ్నించారు. 2018, 2024 ఎన్నికలలో ఎన్నికల రిగ్గింగ్‌ను తీవ్రంగా ఖండించారు. చట్టాలను స్వతంత్రంగా రూపొందించడానికి చట్టసభ సభ్యులు శక్తిహీనతను గుర్తించడంపై రెహమాన్ విచారం వ్యక్తం చేశారు.
హిందూ మహాసముద్రంలో నాలుగు నౌకలపై హౌతీ రెబల్స్ దాడి..
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం జరిగినప్పటి నుంచి యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తున్నారు. మరోవైపు హిందూ మహా సముద్రంలో నౌకలపై హౌతీ రెబల్స్ దాడులు పెంచారు. ఇజ్రాయెల్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న దేశాలకు చెందిన నౌకలపై ఈ దాడులు కొనసాగుతున్నాయి. హిందూ మహా సముద్రంలో డ్రోన్ దాడులను ప్రారంభించామని.. MSC ఓరియన్ కంటైనర్ షిప్‌ను లక్ష్యంగా చేసుకున్నామని యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు తెలిపారు. LSEG డేటా ప్రకారం.. పోర్చుగీస్- ఫ్లాగ్ ఉన్న MSC ఓరియన్ పోర్చుగల్, ఒమన్ మధ్య పని చేస్తోంది. ఇరాన్-మద్దతుగల హౌతీ మిలిటెంట్లు నవంబర్ నుంచి ఎర్ర సముద్రం, బాబ్ అల్- మందాబ్ జలసంధి, గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో పదేపదే డ్రోన్, క్షిపణి దాడులను కొనసాగిస్తున్నాయి. దక్షిణాఫ్రికా చుట్టూ సుదీర్ఘమైన ప్రయాణాలకు నౌకలను నిరోధిస్తున్నారు. ఈ దాడుల వల్ల ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం తీవ్రతరం అవుతుందనే భయాలను కూడా పెంచుతుంది. అయితే, నౌకలపై దాడులకు ప్రతిస్పందనగా, అమెరికా, బ్రిటన్ హౌతీ రెబల్స్ స్థానాలపై దాడి చేశాయి. హిందూ మహాసముద్రంలో ఉన్న భారత నావికాదళం ఏప్రిల్ 26వ తేదీన పనామా జెండాతో కూడిన ముడి చమురు ట్యాంకర్‌కు సహాయం చేసిందని ఆదివారం వార్తలు వచ్చాయి. హౌతీ తిరుగుబాటుదారులు ఈ ట్యాంకర్ ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు సమాచారం. కాగా, ఓడలో 22 మంది భారతీయులతో సహా మొత్తం 30 మంది సిబ్బంది ఉన్నారు.
బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్‌లకు గుడ్‌న్యూస్.. సగానికి తగ్గిన ప్యాక్ ధర!
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తమ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్లకు గుడ్‌న్యూస్ తెలిపింది. సినిమాప్లస్ ఓటీటీ ప్యాకేజీ ప్రారంభ ధరను బీఎస్ఎన్ఎల్ సగానికి తగ్గించింది. స్టార్టర్ ప్యాక్ ధరను రూ.49కు కుదించింది. ఈ ప్యాక్ కోసం కంపెనీ గతంలో నెలకు రూ.99 వసూలు చేసింది. ఈ ప్యాక్‌లో లయన్స్‌గేట్, షెమరూమీ, హంగామా, ఎపిక్ ఆన్ ఓటీటీల్లోని కంటెంట్‌ను మీరు ఎంజాయ్ చేయొచ్చు. స్టార్టర్ ప్యాక్‌తో పాటు బీఎస్‌ఎన్‌ఎల్ మరో రెండు ప్లాన్లను కూడా అందిస్తోంది. జీ5, సోనీలివ్, యప్‌టీవీ, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో కూడిన ఫుల్ ప్యాక్ ఓటీటీ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది. ఈ ఫుల్ ప్యాక్ ధర నెలకు రూ.199గా ఉంది. ఫుల్ ప్యాక్‌తో పాటు రూ.249తో ప్రీమియం ప్లాన్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకొచ్చింది. ఈ ప్యాక్‌లో జీ5, సోనీ లివ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, యప్‌టీవీ, లయన్స్‌గేట్, షెమరూమీ, హంగామా వంటి ఓటీటీ కంటెంట్‌ను ఎంజాయ్ చేయొచ్చు. బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్‌స్క్రిప్షన్‌తో ఒకే లాగిన్‌తో వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు యాక్సెస్ లభిస్తుంది. జియోటీవీ ప్రీమియం పేరిట జియో, ఎక్స్‌ట్రీమ్ ప్లే పేరిట ఎయిర్‌టెల్, టాటా ప్లే బింజ్‌తో టాటా సైతం ఈ తరహా ప్యాకేజీలను అందిస్తున్నాయి. సినిమా లవర్స్‌కు ఈ ప్యాక్‌లు బాగా ఉపయోగపడనున్నాయి. సినిమా ప్లస్ యాక్సెస్ కావాలనుకుంటే బీఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్ వెబ్‌సైట్ లోకి వెళ్లి నచ్చిన ప్లాన్ కొనుగోలు చేయవచ్చు. ఈ సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు తమ బ్రాడ్ బ్యాండ్ ఛార్జీల్లో కస్టమర్లకు అందుతాయి.
మేం దారుణంగా విఫలమయ్యాం.. ప్రతీ రోజు మనది కాదు: రిషబ్ పంత్
బ్యాటింగ్ యూనిట్‌గా తాము దారుణంగా విఫలమయ్యాం అని, అదే తమ ఓటమిని శాసించిందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో 150 పరుగుల లక్ష్యం చాలా తక్కువ అని పేర్కొన్నాడు. తప్పుల నుండి తాము నేర్చుకుంటామని, ప్రతి రోజు మనది కాదని పంత్ అన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ… ‘ముందు బ్యాటింగ్ చేయడం మంచి ఆప్షన్. ఈ మ్యాచ్‌లో మా బ్యాటింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ యూనిట్‌గా మేం విఫలమయ్యాం. టోర్నీలో ఈసారి భారీ స్కోర్స్ నమోదవుతున్నాయి. 150 పరుగుల లక్ష్యం అంటే చాలా తక్కువ. 180-210 మంచి స్కోరని నేను భావిస్తున్నాను. మా బౌలర్లకు మేం పోరాడే లక్ష్యాన్ని ఇవ్వలేకపోయాం. మా తప్పిదాల నుంచి మేం పాఠాలు నేర్చుకుంటాం. ప్రతీ రోజు మనది కాదు. మేం ప్లే ఆఫ్స్ చేరాలంటే.. మిగతా 5 మ్యాచ్‌ల్లో కనీసం నాలుగు గెలవాలి. సమష్టి ప్రదర్శనతో ముందుకు వెళతాము’ అని అన్నాడు.
రాజసాబ్ లో స్పెషల్ సాంగ్..ముగ్గురు హీరోయిన్స్ తో ప్రభాస్ హంగామా..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు . గత ఏడాది సలార్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ప్రభాస్ వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో ప్రభాస్ “కల్కి 2898 ఏడి” సినిమా చేస్తున్నాడు .ఈ సినిమా జూన్ 27 న గ్రాండ్ గా విడుదల కానుంది .అలాగే మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కన్నప్ప మూవీలో ప్రభాస్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.ప్రస్తుతం కన్నప్ప మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.త్వరలోనే ఈమూవీ షూటింగ్ లో ప్రభాస్ జాయిన్ కానున్నాడు .ఇదిలా ఉంటే ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ది రాజాసాబ్”.టాలీవుడ్ టాప్ డైరెక్టర్ మారుతీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు మారుతీ ఈ సినిమాను తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కామెడీ హారర్ మూవీగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.. ఈ సినిమాలో ప్రభాస్ ఓ స్పెషల్ సాంగ్ లో నటించబోతున్నట్లు సమాచారం.ఈ పాటలో ప్రభాస్ ఏకంగా ముగ్గురు భామలతో ఆడిపాడనున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.. ఈ ముగ్గురూ ఒకే పాటలో ప్రభాస్‌తో స్టెప్పులేయనున్నట్లు సమాచారం.ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించే డాన్స్ మూమెంట్స్‌తో ఈ పాట ఉండనుందని సమాచారం.హరర్ కామెడీ జోనర్ లో ప్రభాస్ చేస్తున్న తొలి మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు వున్నాయి . ‘ప్రేమకథా చిత్రం’ తరహాలో హారర్‌తో పాటు అద్భుతమైన కామెడీ కూడా ఇందులో ఉంటుందని సమాచారం. వరుస యాక్షన్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ కు బోర్ కొట్టడంతో దర్శకుడు మారుతితో ఓ కామెడీ జోనర్ మూవీలో నటించాలని అనుకున్నాడు .అందుకు తగ్గట్టుగానే మారుతీ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.
కల్కి ఆ సినిమాకి కాపీ.. నాగ్ అశ్విన్ క్లారిటీ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది “సలార్” సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు .ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 ఏడి”. ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో విశ్వనటుడు కమల్ హాసన్ మరియు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ వంటి లెజెండరీ యాక్టర్స్ నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అయిన దీపికా పదుకోన్ మరియు దిశాపటాని ప్రభాస్ సరసన హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే టాలీవుడ్ స్టార్ యాక్టర్ అయిన రానా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్విని దత్ దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.అయితే ఈ సినిమాను ముందుగా మే 9 న విడుదల చేయాలనీ మేకర్స్ భావించారు .కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా 2024 జూన్ 27 విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ అధికారక ప్రకటన చేసింది.ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది . ఈ పోస్టర్‌లో అమితాబ్, ప్రభాస్ మరియు దీపికా పదుకోన్ నిలబడి ఉండగా ఎడారి లాంటి ప్రాంతంలో కొందరు పడి ఉండడం కనిపిస్తోంది. ఈ పోస్టర్ చూసాక ఈ చిత్రం హాలీవుడ్ సినిమా “డూన్” కు కాపీ అనే ప్రచారం ఊపందుకుంది.హాలీవుడ్ లో తెరకెక్కిన అనేక సైన్స్ ఫిక్షన్ సినిమాలకు డూన్ నవల ఎంతో స్ఫూర్తిగా నిలిస్తుందని చాలా మంది అభిప్రాయం . ఇక డూన్ నవల స్ఫూర్తితోనే డూన్ (2021 రిలీజ్) సినిమా కూడా తెరకెక్కింది.ఇప్పుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రానికి కూడా ఇదే నవల స్ఫూర్తి అని కొందరు వాదిస్తున్నారు.అయితే తాజాగా ఈ కాపీ ఆరోపణలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు.నాగ్ అశ్విన్ కాపీ ఆరోపణలను కొట్టిపారేసారు.కేవలం డూన్ లో ఇసుక అలాగే కల్కి మూవీలో ఇసుక ఉండటం వల్ల రెండు సినిమాలు ఒకే విధంగా ఉన్నాయని ప్రేక్షకులు నమ్మకూడదని ఆయన తెలిపారు.దీనితో కల్కి మూవీపై వస్తున్న ఆరోపణలపై క్లారిటీ వచ్చింది .ఇదిలా ఉంటే ఇటీవల ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన ‘అశ్వత్థామ’ గ్లింప్స్ ప్రేక్షకులకి తెగ నచ్చేసింది. మహాభారతాన్ని లింక్ చేస్తూ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మరి ఈ కల్కి మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.