నేడు వైసీపీ మేనిఫెస్టో విడుదల.. నవరత్నాలకు అప్‌గ్రేడెడ్ వెర్షన్..!
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే నామినేషన్ల స్వీకరణతో పాటు నామినేషన్ల పరిశీలన కూడా పూర్తి అయ్యింది.. ఇక, ఎన్నికల ప్రచారంలో ఆది నుంచి దూకుడు చూపిస్తోన్న అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల మేనిఫెస్టోపై ప్రత్యేకంగా దృష్టిసారించింది.. గత ఎన్నికల్లో నవరత్నాల పేరుతో ప్రజల్లోకి వెళ్లి.. ఘన విజయాన్ని అందుకున్న ఆ పార్టీ.. ఈ సారి కూటమిని ఎదురుక్కొనేందుకు సిద్ధం అవుతోంది.. అందులో భాగంగా.. నవరత్నాలను అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తున్నారాట.. మొత్తంగా ఈ రోజు వైసీపీ మేనిఫెస్టో విడుదల కానుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్. నవరత్న హామీలను కొనసాగించనున్నారు. అంతేకాదు.. డీబీటీ పథకాలకు సంబంధించి నగదు పెంపు హామీలు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వీటితోపాటు కొత్తగా పారిశ్రామీకరణ, ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టింది వైసీపీ. మహిళలు, రైతులు, యువకులు, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా మేనిఫెస్టో రూపొందించినట్టు సమాచారం. ఈసారి పేదలతోపాటు మధ్యతరగతి వర్గాలకు లబ్ధి చేకూర్చే పథకాలను మేనిఫెస్టోలో చేర్చవచ్చని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. దీంతోపాటు మౌలిక సదుపాయాల కల్పనపై హామీలను మ్యానిఫెస్టోలో చేర్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గతంలో కంటే ప్రతి విషయంలోనూ అధిక లబ్ధి కలిగించేలా మేనిఫెస్టో వుంటుందని వైఎస్సార్‌సీపీ నేతలు చెబుతున్నారు. ప్రతిపక్షాలు ఇస్తున్న అడ్డగోలు హామీల మాదిరిగా, వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో ఉండబోదని అంటున్నారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏ ఉండబోతోంది.. అన్ని వర్గాలను ఆకట్టుకోవడానికి సీఎం వైఎస్ జగన్ ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు..? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మీరు ఓటు వేయండి.. ప్రతి ఒక్కరితో ఓటు వేయించండి..
మీరు ఓటు వేయండి.. ప్రతి ఒక్కరితో ఓటు వేయించండి అని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కామెంట్స్.. గుంటూరులో పర్యటించిన ఆయన.. మొదటి సారి ఓటు వేయనున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు.. ఓటు వేయడం, మన హక్కు మాత్రమే కాదు, భారత దేశ పౌరుడిగా మన భాధ్యత అని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యన్ని పరి పుష్టి చేయడానికి ప్రతి ఒక్కరూ ఓటు వేయడం అనే భాధ్యత తీసుకోవాలని సూచించారు. మీరు ఓటు అనే పండుగలో మీ హక్కు వినియోగించుకోవడం కోసం, ఎన్నికల కమిషన్ విస్తృత ఏర్పాట్లు చేసిందని తెలిపారు.. మీరు ఓటు వేయండి.. ప్రతి ఒక్కరితో ఓటు వేయించండి అని సూచించారు ముఖేష్ కుమార్ మీనా. ఇక, గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే, కొన్ని అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉందన్నారు ముఖేష్ కుమార్ మీనా.. విద్యార్థులు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారాని గుర్తించాం.. వారిని పోలింగ్ బూత్‌కు తీసుకొచ్చే విధంగా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు.. అయితే, ఈ ఎన్నికల్లో 83 శాతం ఓటింగ్ పర్సంటేజ్ లక్ష్యంతో పనిచేస్తున్నాం అని వెల్లడించారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా.
నేడు నాగర్ కర్నూల్ లో కేసీఆర్ రోడ్ షో..
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నేడు నాగర్‌కర్నూల్‌లో జరిగే రోడ్‌షోలో కేసీఆర్ పాల్గొననున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుపు కోసం ప్రసంగించనున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌లో జరిగే పార్టీ ఆవిర్భావ వేడుకల్లో కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గాల్లో భారసాల అభ్యర్థులు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌లు తమ గెలుపునకు దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు నాగర్ కర్నూల్ లోని ఉయ్యాలవాడ నుంచి బస్టాండ్ వరకు రోడ్ షో కొనసాగనుంది. అక్కడ కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ పాల్గొంటారు. దీంతో జిల్లాలో కేసీఆర్ రెండు రోజుల బస్సు యాత్ర ముగుస్తుంది. కాగా.. శుక్రవారం మహబూబ్ నగర్ లో భరత నాయకుడు, మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన పోరుబాట బస్సు యాత్ర విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. పాలమూరులో రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో తొలిరోజు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ చౌరస్తా నుంచి క్లాక్ టవర్ వరకు రాస్తారోకో నిర్వహించగా, అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. కేసీఆర్‌కు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పూలవర్షం కురిపించారు. క్లాక్‌టవర్ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. భారీగా తరలివచ్చిన జనం కేసీఆర్‌పై అభిమానాన్ని చాటుకోవడంతో స్థానిక నేతలు మళ్లీ ఉత్సాహం నింపారు. సమావేశం అనంతరం కేసీఆర్ పాలకొండలోని శ్రీనివాస్ గౌడ్ ఫాంహౌస్‌కు వెళ్లారు. నిన్న శుక్రవారం రాత్రి ఆయనకు అక్కడే బస ఏర్పాటు చేశారు.
నేడు బీఆర్‌ఎస్ 24వ ఆవిర్భావ దినోత్సవం..
నేడు బీఆర్‌ఎస్ 24వ ఆవిర్భావ దినోత్సవాల్సి ప్రతి ఒక్కరు తమ కార్యాలయాల్లో జరుపుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 2001 ఏప్రిల్ 27న జలదర్శిలో రెపరెపలాడిన గులాబీ జెండా విజయవంతమై 23 ఏళ్లు పూర్తి చేసుకొని 24 ఏళ్లలోకి అడుగుపెడుతోందన్నారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యకర్తలు, నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్‌లో పార్టీ జెండాను కెటి రామారావు ఆవిష్కరించనున్నారు. పార్లమెంటరీ ఎన్నికల్లో పార్టీ మొత్తం నిమగ్నమై ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల్లో ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించాలని పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆవిర్భావ వేడుకల్లో పార్టీ జిల్లా అధ్యక్షులు, కార్యవర్గం, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన సూచించారు. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ను దృష్టిలో ఉంచుకుని, బీఆర్‌ఎస్ పార్టీ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఎలాంటి ఆర్భాటాలు లేకుండా నిర్వహించాలని పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు అన్ని జిల్లాల కార్యాలయాల్లో పార్టీ జెండాలను ఎగురవేయాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.టి.రామారావు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంటరీ ఎన్నికల కార్యక్రమాల్లో పార్టీ మొత్తం నిమగ్నమై ఉన్న నేపథ్యంలో జిల్లా కార్యాలయ కేంద్రంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా పార్టీ కమిటీతో పాటు పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొనాలని కోరారు.
చిన్నారుల అక్రమ రవాణా.. 95 మందిని రక్షించిన అధికారులు
పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న చిన్నారులను రెస్క్యూ ఆపరేషన్ చేసి ఉత్తరప్రదేశ్ చైల్డ్ కమిషన్ రక్షించింది. 95 మంది చిన్నారులను అధికారులు రక్షించారు. బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తుండగా చాకచక్యంగా చిన్నారులను కాపాడారు. ఇంత పెద్ద స్థాయిలో పిల్లల అక్రమ రవాణా చేయడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులను అక్రమ రవాణా చేస్తున్నట్లుగా సమాచారం రాగానే సీడబ్ల్యూసీ సభ్యులు చిన్నారులను రక్షించారని అయోధ్య చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ సర్వేష్ అవస్థి తెలిపారు. యూపీ చైల్డ్ కమిషన్ సభ్యురాలు సుచిత్ర చతుర్వేది ఫోన్ చేసి సమాచారం అందించారని తెలిపారు. బీహార్ నుంచి మైనర్ పిల్లలను అక్రమంగా సహరాన్‌పూర్‌కు రవాణా చేస్తున్నారని.. వారు గోరఖ్‌పూర్ వెళ్తున్నట్లుగా తెలిసిందన్నారు. అయోధ్య మీదుగా వెళ్తున్నారని చెప్పారు. పిల్లల్ని రక్షించి వారికి ఆహారం.. వైద్యం అందించినట్లుగా అవస్తి చెప్పారు. రక్షించబడిన చిన్నారులంతా 4-12 ఏళ్లలోపు వారేనని తెలిపారు. తల్లిదండ్రుల నుంచి ఎలాంటి సమ్మతి పత్రాలు లేకుండానే పిల్లల్ని తీసుకెళ్తున్నట్లుగా సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ తెలిపారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియలేదని పేర్కొన్నారు. పిల్లలంతా పన్నేండ్లలోపు వారేనని తెలిపారు. తల్లిదండ్రుల్ని సంప్రదించి పిల్లల్ని వారికి అప్పగిస్తామని సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో అమృతపాల్ సింగ్ పోటీపై కుటుంబ సభ్యులు ఏమన్నారంటే..!
ఖలిస్థాన్ అనుకూల నేత, వారిస్ పంజాబ్ దే అధినేత అమృతపాల్ సింగ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఇటీవల ఆయన న్యాయవాది ప్రకటించారు. తాజాగా దీనిపై కుటుంబ సభ్యులు కూడా క్లారిటీ ఇచ్చేశారు. జాతీయ భద్రతా చట్టం కింద ప్రస్తుతం అస్సాం జైల్లో ఉన్న అమృతపాల్ సింగ్‌ను ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై చర్చించారు. అనంతరం కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేయాలని అమృతపాల్ సింగ్‌పై ఒత్తిడి ఉందని ఆయన తల్లి బల్వీందర్ కౌర్ తెలిపారు. దీంతో అమృతపాల్ సింగ్ రాజకీయాల్లోకి రాబోతున్నారని చెప్పారు. ఖాదూర్ సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయబోతున్నట్లుగా ఆమె వెల్లడించారు. ఏ పార్టీ నుంచి పోటీ చేయట్లేదని పేర్కొన్నారు. ఇండిపెండెంట్‌గానే బరిలోకి దిగుతున్నట్లు ఆమె వివరించారు. అమృతపాల్ సింగ్‌కు పంజాబ్ సమస్యలు బాగా తెలుసు అని తల్లి కితాబు ఇచ్చింది.
తైవాన్‌లో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదు
తైవాన్‌ను మరోసారి భూకంపం హడలెత్తించింది. రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. ఎంత నష్టం జరిగిందన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. రాజధాని తైపీలో భూకంపం కారణంగా పలు భవనాలు కంపించాయి. 24.9 కి.మీ లోతులోభూకంపం సంభవించినట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది. తైవాన్‌లోని తూర్పు కౌంటీ హువాలియన్‌కు సమీపంలో శనివారం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని, నష్టం గురించి ఇంకా అంచనా వేయలేదని వాతావరణ శాఖ తెలిపింది.ఈ నెల ప్రారంభంలోనూ హువాలియన్‌లో 7.2 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి 17 మంది చనిపోయారు. పెద్ద ఎత్తున ఇళ్లులు ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా ఇటీవల కూడా పలుమార్లు భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ఇళ్లులు నేలకొరిగాయి. మరికొన్ని బీటలు వారాయి. ప్రాణ నష్టం సంభవించినట్లుగా వార్తలు రాలేదు. ఆస్తి నష్టం మాత్రమే జరిగినట్లుగా అధికారులు తెలిపారు.
శుక్రవారం సెంటిమెంట్ పక్కన పెట్టేసిన స్టార్ హీరోలు..
టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది.. సమ్మర్ లో రిలీజ్ అవుతాయని అనుకున్న సినిమాలు అన్ని ఇప్పుడు వాయిదా పడిన సంగతి తెలిసిందే… తాజాగా కొత్త రిలీజ్ డేట్ లను లాక్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.. అయితే ఈ సారీ హీరోలు శుక్రవారం సెంటిమెంట్ పక్కన పెట్టేసినట్లు తెలుస్తుంది.. అన్నీ సినిమాలు గురువారం విడుదల కాబోతున్నాయి.. ఏ హీరో సినిమా ఏ గురువారం విడుదల కాబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇండియన్2..
కమల్ హాసన్, శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా ఇండియన్ 2 గా రాబోతుంది.. గత కొన్నేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పుడు విడుదల సిద్ధంగా ఉంది.. ఏపీలో ఎన్నికల కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా జూన్ 13 న ఎట్టకేలకు విడుదల కాబోతుంది..
కల్కి 2898AD
గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. దీపికా, అమితాబ్, కమల్ హాసన్ లాంటి వాళ్లు నటిస్తున్న సినిమాను ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కుచెందిన వైజయంతీ మూవీస్ నిర్మిస్తోంది.. జూన్ లో సినిమా విడుదల కాబోతుంది.. ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తూ వస్తున్న మేకర్స్ మొత్తానికి కొత్త డేట్ ను ప్రకటించారు.. జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది..
పుష్ప 2..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా పుష్ప 2.. గతంలో వచ్చిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా రాబోతున్నారు.. ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది. ఈ మధ్యే టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఆ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి..
దేవర..
గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న సినిమా దేవర.. కొరటాల దర్శకత్వం లో తెరకేక్కుతుంది.. ఈ సినిమా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు 300 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.. ఈ సినిమాను రెండు పార్ట్ లు తెరకెక్కిస్తున్నారు.. మొదటి పార్ట్ ను అక్టోబర్ 10 న విడుదల చేస్తున్నారు..
సరిపోదా శనివారం…
న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ సరిపోదా శనివారం.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్ని అప్డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.. ఈ సినిమా తాజాగా విడుదల తేదీని లాక్ చేసుకుంది. ఆగస్టు 29 న విడుదల కాబోతుంది..