మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. నేడు సీఎం చంద్రబాబు కీలక సమీక్ష..
ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాయి.. ఆయా ప్రభుత్వాలు.. దీనిపై విపక్షాలు కొన్ని విమర్శలు చేసినా.. ఉచిత బస్సు ప్రయాణంతో.. బస్సుల్లో మహిళల రద్దీ మాత్రం పెరిగిపోయింది.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వైపు అడుగులు పడుతున్నాయి.. దీనిపై ఎన్నికల ప్రచార సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై దృష్టిసారించారు సీఎం చంద్రబాబు.. అందులో భాగంగా నేడు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రవాణా శాఖలో పలు అంశాలపై ఈ రోజు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. మహిళలకు ఫ్రీ బస్సు దిశగా ఆర్టీసీ అధికారులు కసరత్తు పూర్తి చేశారు. తెలంగాణ, కర్ణాటకలలో ఫ్రీ బస్సుల అమలును అధ్యయనం చేసే దిశగా నిర్ణయించే అవకాశం ఉంది. అధ్యయనం అనంతరం ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు విధి విధానాలు నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఏపీఎస్ఆర్టీసీలో నిత్యం ప్రయాణించే ప్రయాణికులలో 15 లక్షల వరకూ మహిళలు ఉన్నారు. ఉచిత బస్సు ప్రయణానికి నెలకు రూ. 250 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు.. మహిళలకు ఉచిత బస్సు అమలుకు ప్రభుత్వం నెలకు 25 శాతం వరకూ కార్పొరేషన్ కు వదిలేయాలి.. మరో రూ. 125 కోట్ల వరకూ నెలకు ఆర్టీసీకే ప్రభుత్వం రీఎంబర్సుమెంటు ఇవ్వాల్సి ఉంటుంది.. ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే.. ఇవాళ్టి సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షలో మహిళలకు ఉచిత బస్సుపై చర్చించి.. ఓ నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది.
మళ్లీ తెరపైకి వైజాగ్.. ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్..
విశాఖలో వెలుగు చూసిన ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్ మళ్లీ తెరపైకి వచ్చింది. కోట్ల రూపాయలు విలువైన 25 వేల కేజీల మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసు పురోగతి పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో సూత్రధారులు ఎవరో బహిర్గతం చేయాలని పొలిటికల్ డిమాండ్ ఊపందుకుంది. 2024 మార్చి 19న సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా 45 రోజులు ముందు… ఏపీ రాజకీయాలను దేశం అంతా ఉత్కంఠతో చూస్తున్న వేళ.. సీబీఐ బాంబు పేల్చింది. విశాఖపట్నం పోర్టుకు నిషేధిత మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్నట్టు కేసు నమోదు చేసింది. ఇంటర్ పోల్ సమాచారం ఆధారంగా కంటైనర్ టెర్మినల్ – VCTPLలో తనిఖీలు చేసి 25 వేల కేజీల డ్రైఈస్ట్ ను స్వాధీనం చేసుకుంది. ఆక్వా ఫీడ్ తయారీలో వాడే ఈస్ట్ కంటైనర్ ద్వారా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వెనుక పకడ్బందీ వ్యూహం వుందని అనుమానం కలిగింది. ప్రత్యేక బృందాలు కంటైనర్ తెరవగా డ్రగ్స్ అవశేషాలు వున్నట్టు తేలింది. ఈ కన్సైన్ మెంట్ ను సంధ్యా ఆక్వా బుక్ చేసింది. పరిశ్రమ అవసరాల కోసం బ్రెజిల్ లోని శాంటోస్ పోర్టు నుంచి డ్రైఈస్ట్ దిగుమతి చేసుకుంది సంధ్యా ఆక్వా. మొత్తం కంటైనర్లో వచ్చిన వెయ్యి బ్యాగుల్లో 70 శాతం నిషేధిత ఉత్ప్రేరకాల ఆనవాళ్లు, అనుమానిత పదార్థాలు గుర్తించినట్టు ప్రాథమికంగా నిర్ధారించింది. అయితే ఒక్కో బ్యాగ్‌లో ఎంత మొత్తం డ్రగ్స్ ఉన్నాయి.. ఏఏ డ్రగ్స్ ఎంత మేర ఉన్నాయన్న అంశంపై సమగ్ర నివేదిక కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కి పంపించింది. తూర్పు తీరంలో ఈ స్థాయిలో నిషేధిత డ్రగ్స్ పట్టుబడ్డం దేశవ్యాప్త సంచలమైంది. ఐతే, కంటైనర్‌లో డ్రగ్స్ ఎలా వచ్చాయో తమకు తెలియదని ఎటువంటి విచారణ కైన సిద్ధమేనని సంధ్యా అక్వా ప్రకటించింది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసు విచారణ మందగమనం ఆరోపణలు చేస్తూ వైసీపీ పలు అనుమానాలు లేవనెత్తింది. విశాఖపట్నం ఔన్నత్యానికి మచ్చ తీసుకొచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో విచారణ వేగవంతం చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే బాధ్యత ఉత్తరాంధ్ర ఎంపీలదే అంటున్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. రాజకీయ కోణం లేదంటూనే మాదకద్రవ్యాల కేసులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లప్తంగా వ్యవహరిస్తుందన్న బలమైన ఆరోపణ బొత్స చేశారు. దీనిపై ప్రధానమంత్రికి లేఖ రాయాలని ఆయన ఎంపీలకు సూచిస్తున్నారు.
మదనపల్లెలో కాల్పుల కలకలం..
అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలో నాటు తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. మండలంలోని వలసపల్లి పంచాయతీ నవోదయ కాలనీలో దివాకర్, అతని స్నేహితులతో కలిసి ఆదివారం రాత్రి ఫుల్లుగా మద్యం తాగి గొడవ పడుతున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆనంద్, అనే వ్యక్తి ఎందుకు అల్లరి చేస్తున్నారని దివాకర్‌ని ప్రశ్నించారు. వీరి మధ్య మాట పెరగడంతో ఘర్షణకు దిగారు. ఇరు వర్గాలను వారించేందుకు రెడ్డి ప్రవీణ్ అనే వ్యక్తి అక్కడికి వెళ్లి మాట్లాడుతుండగా.. దివాకర్ ఇంటికి వెళ్లి నాటు తుపాకి తీసుకొచ్చి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నాటు తుపాకీ రవ్వలు తగిలి రెడ్డిప్రవీణ్ కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రికి తరలించే చికిత్స అందిస్తున్నారు. మదనపల్లి తాలూకా పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రాణం తీసిన సంప్రదాయం..! గుర్రపు స్వారీ ప్రాక్టీస్ చేస్తూ వ్యక్తి మృతి
వారి సంప్రదాయం ప్రకారం.. గుర్రపుస్వారీ చేయాలి.. ముఖ్యంగా దసరా ఉత్సవాల రోజు గుర్రంపై ఊరేగడం వారి పూర్వికుల నుంచి సంప్రదాయంగా వస్తుంది.. అయితే, ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలన్న ఉద్దేశంతో.. ఓ యువకుడు గుర్రపుస్వారీ నేర్చుకోవడానికి పూనుకున్నాడు.. అదే అతడి ప్రాణాల మీదకు తెచ్చింది.. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మద్దికేరలో గుర్రపు స్వారీ చేస్తూ కిందపడిన పృథ్వీరాజ్ రాయుడు అనే యువకుడికి తీవ్రగాయాలు అయ్యాయి.. ఆ వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరించారు స్థానికులు.. కానీ, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పృథ్వీరాజ్ రాముడు ప్రాణాలు విడిచాడు.. కాగా, పూర్వీకుల నుండి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగించాలని ఉద్దేశంతో గుర్రపు స్వారీ నేర్చుకునేందుకు సిద్ధమయ్యాడు పృథ్వీరాజ్ రాముడు.. కొత్తవారు ఎవరైనా సరే.. గ్రురం పరుగులు పెడుతుంటే.. బ్యాలెన్స్ చేయడం కష్టం.. అదే పరిస్థితి రాముడుకు ఎదరైంది.. గుర్రం ఎక్కి ప్రాక్టీస్ చేస్తుండగా.. అది పరుగులు తీసింది.. కొద్దిసేపు ముందుకు సాగిన అతడు.. ఆ తర్వాత గుర్రంపై నిలవలేకపోయాడు.. బైక్‌పై గుర్రాన్ని వెంబడిస్తూ కొందరు యువకులు.. అదుపుచేసే ప్రయత్నం చేసినా గుర్రం పరుగులు ఆపలేదు.. దీంతో.. అదుపుతప్పి గుర్రంపై నుంచి రోడ్డుపై పడిపోయాడు.. తీవ్రగాయాలతో ప్రాణాపాయస్థితిలోకి వెళ్లిన పృథ్వీరాజు రాయుడును స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కానీ, అతడి ప్రాణాలు కాపాడలేకపోయారు.. చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మృతి చెందాడు ఆ యువకుడు.. దీంతో.. ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.. అయితే, మద్దికెరలో దసరా ఉత్సవాలలో గుర్రంపై ఊరేగడం యాదవరాజు వంశీయుల సంప్రదాయం. యాదవరాజుల వంశానికి చెందిన పృథ్వీరాజ్ మృతి చెందడంతో.. ఈ ఏడాది దసరా ఉత్సవాలలో గుర్రపు స్వారీ పందేలు జరుగుతాయా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
వెయ్యి కోట్ల కుంభకోణంలో మాజీ సీఎస్ సోమేశ్ కుమార్..!
తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపులు రూ. 1000 కోట్ల అక్రమాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఫోరెన్సిక్ ఆడిట్ లో 75 కంపెనీలు అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. మార్షల్ ట్యాక్స్ కమిషనర్ రవి ఫిర్యాదుతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో పాటు పలువురిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. కమర్షియల్ ట్యాక్స్ అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్‌పై కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఈ నెల 26న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఏ-5గా చేర్చారు. అప్పట్లో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా ఉన్న సోమేశ్ కనుసన్నల్లో హైదరాబాద్ ఐఐటీ రూపొందించిన సాఫ్ట్ వేర్ ఆధారంగా ప్రభుత్వానికి రావాల్సిన నిధులను పక్కదారి పట్టించి ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఫిర్యాదు మేరకు అదనపు కమిషనర్ (సేల్స్ ట్యాక్స్) ఎస్సీ కాశీ విశ్వేశ్వరరావు (ఏ-1), డిప్యూటీ కమిషనర్ శివరామ్ ప్రసాద్ (ఏ-2), ప్రొఫెసర్ శోభన్ బాబు (అసిస్టెంట్ ప్రొఫెసర్, ఐఐటీ హైదరాబాద్), ప్లియాంటో టెక్నాలజీస్ (A-4)ని నిందితులుగా పేర్కొన్నారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 406, 409, 120-బి, ఐటీ చట్టంలోని సెక్షన్ 65 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఢిల్లీ కోచింగ్ సెంటర్ మృతుల్లో తెలంగాణ వాళ్లు లేరు.. క్లారిటీ ఇచ్చిన ఐఏఎస్ గౌరవ్ ఉప్పల్
ఢిల్లీలోని ఓ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లో నీటిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. విద్యార్థుల మృతితో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. మృతి చెందిన విద్యార్థుల్లో యూపీకి చెందిన బయాలజీ విద్యార్థిని శ్రేయా యాదవ్, కేరళకు చెందిన జేఎన్‌యూ పీహెచ్‌డీ విద్యార్థి నెవిన్ డెల్విన్, బీహార్‌కు చెందిన తానియా సోనీ అనే విద్యార్థిని ఉన్నారు. మృతి చెందిన ముగ్గురిలో తెలంగాణ యువతి ఒకరు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమె తెలంగాణ స్థానికురాలు కాదని, బిహార్ రాష్ట్రానికి చెందిన యువతిగా ఢిల్లీ పోలీసులు ధృవీకరించారు. మృతురాలు తానియా సోనీ బిహార్ రాష్ట్రం నుంచి వచ్చి ఢిల్లీలోని సివిల్ సర్వీస్ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్నట్లు తేలింది. మృతురాలి తండ్రి కోల్ ఇండియా సంస్థలో గెజిటెడ్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఆయన డిప్యూటేషన్ మీద మంచిర్యాలలోని సింగరేణి కంపెనీలో పని చేస్తున్నారు. ఘటన విషయం తెలుసుకున్న వెంటనే ఢిల్లీకి చేరుకున్న ఆయన మృతదేహాన్ని బిహార్ తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. మృతిచెందిన యువతి తెలంగాణ వాసి అని వార్తలు వస్తున్న వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి ఇదే విషయమై ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. యువతితో పాటు ఇంకెవరైనా బాధితులు తెలంగాణకు చెందిన వారు ఉన్నారేమోనని ఆరా తీశారు. చనిపోయిన వారిలో గానీ, భవనం నుంచి సురక్షితంగా బయటకు వచ్చిన మిగిలిన 30 మందిలో ఎవరూ తెలంగాణకు చెందిన వారు లేరని సీఎంకు గౌరవ్ ఉప్పల్ క్లారిటీ ఇచ్చారు.
ఏజ్ తక్కువని పెళ్లి చేసుకున్న భార్య.. చీటింగ్ కేసు పెట్టిన భర్త
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ భర్త తన భార్యపై చీటింగ్ కేసు పెట్టాడు. భార్య తనను నమ్మించి మోసం చేసిందని భర్త ఆరోపించాడు. ఆమె తన వద్ద నిజాన్ని దాచిందన్నారు. అందుకే ఇప్పుడు భర్త విడాకులు కోరుతున్నాడు. తన భార్య, అత్తమామలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది. విషయం సర్ఖేజ్ ప్రాంతానికి సంబంధించినది. ఇక్కడ మే 2023లో పాలన్‌పూర్ గ్రామానికి చెందిన ఒక అమ్మాయితో అతనికి సంబంధం కుదిరింది. ఇరు కుటుంబాల వారు ఒకరినొకరు కలిశారు. బాలిక వయస్సు 32 సంవత్సరాలు. వరుడికి 34 ఏళ్లు. అందుకే ఇరుకుటుంబాలు పెళ్లికి అంగీకరించారు. వారిద్దరూ 19 జూన్ 2023న వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ వారసుడు కావాలనుకుని ఓ బిడ్డను కనాలని ప్లాన్ చేసుకున్నారు. ఎంత ప్రయత్నించినా ఆ మహిళ గర్భం దాల్చలేదు. ఇందుకోసం ఇద్దరూ సమీపంలోని మహిళా వైద్యుల వద్దకు వెళ్లారు. లేడీ డాక్టర్ కొన్ని మందులు ఇచ్చారు. అయినప్పటికీ, గర్భం దాల్చడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వరుడికి అనుమానం రావడంతో తన భార్యకు మళ్లీ సోనోగ్రఫీ చేయించాడు. దీని తరువాత, సెప్టెంబర్ 2023 లో భర్త తన భార్యతో కలిసి పాల్దిలోని గైనకాలజిస్ట్ వద్దకు వెళ్ళాడు. అక్కడ డాక్టర్ అతనికి షాకింగ్ నిజం చెప్పాడు. దీంతో అతడి కాళ్ల కింద నేల కదిలింది.
వర్షం మాకు కలిసొచ్చింది: సూర్యకుమార్
టీ20 ఫార్మాట్‌లో సానుకూల దృక్పథం, భయంలేని ఆట తీరుతో ముందుకు సాగుతామని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. వర్షం రావడం తమకు కలిసొచ్చిందని, బ్యాటర్ల ఆటతీరు అద్భుతం అని ప్రశంసించాడు. ఇప్పటి వరకు బెంచ్‌కు పరిమితమైన వారిని తర్వాత మ్యాచ్‌లో ఆడించడంపై నిర్ణయం తీసుకుంటమని సూర్య చెప్పాడు. పల్లెకెలె వేదికగా ఆదివారం శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. దాంతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే సూర్య సేన కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ… ‘టోర్నమెంట్ ఆరంభానికి ముందు మేం ఎలా ఆడాలనుకుంటున్నామో చెప్పాం. ఇదే ధోరణితో ముందుకు వెళ్లాలనుకుంటున్నాం. చిన్న లక్ష్యమైనా లేదా భారీ ఛేదన అయినా ఇలానే ఆడుతాం. వాతావరణాన్ని పరిశీలించాక శ్రీలంకను 160 పరుగుల కంటే తక్కువకు కట్టడి చేయాలనుకున్నాం. మా బౌలర్లు రాణించారు. వర్షం రావడం మాకు కలిసొచ్చింది. మా బ్యాటర్ల ఆటతీరు అద్భుతం. ఇప్పటివరకు బెంచ్‌కు పరిమితమైన వారిని తర్వాత మ్యాచ్‌లో ఆడించడంపై నిర్ణయం తీసుకుంటాం. యువకుల ఆట పట్ల చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పాడు.
పారిస్ ఒలింపిక్స్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..రైమ్‌లతో పి.వి.సింధు ఆత్మీయ కలయిక
పారిస్ ఒలింపిక్స్ 2024 అట్టహాసంగా ప్రారంభమైంది. అథెట్లు, సెలబ్రిటీలు పంచుకునే ఆత్మీయ క్షణాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, బాడ్మింటన్ సెన్సేషన్ పి.వి.సింధు, రామ్‌చరణ్ పెంపుడు కుక్క బ్రాట్ మధ్య ఆహ్లాదకరమైన, ఆత్మీయమైన కలయిక జరిగింది. అనుకోకుండా జరిగిన ఈ కలయిక అభిమానులతో సహా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. చిరంజీవి, సురేఖ దంపతులతో కలిసి రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన దంపతులు పారిస్ ఒలింపిక్స్‌లో సందడి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న ఈ ఒలింపిక్స్‌లో వీరు సందడి చేయటం గ్లామర్ టచ్‌నిచ్చింది. రామ్ చరణ్, ఉపాసనల కుమార్తె క్లీంకార ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనలేదు. అయితే పారిస్ సిటీలో మాత్రం క్లీంకార, రైమ్‌లు కుటుంబంతో కలిసి సందడి చేశారు. పారిస్‌లో రామ్ చరణ్, రైమ్‌లతో బాడ్మింటన్ సెన్సేషన్ పి.వి.సింధు కలిశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. చరణ్, రైమ్‌లను సింధు కలిసినప్పుడు వారు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. అలాగే రైమ్‌ను ముద్దులాడుతూ సింధు అపూరమైన సమయాన్ని గడిపారు. ఈ వీడియోతో పాటు సింధు ఆటతీరుని ప్రశంసిస్తూ ఆమె రాబోయే మ్యాచుల్లో అద్భుతంగా రాణించాలని కోరుతూ రైమ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఈఫిల్ టవర్ దగ్గర గడిపిన అద్భుతమైన క్షణాలను ఫొటో రూపంలో షేర్ చేశారు. అలాగే పారిస్ సిటీలో తన వ్యక్తిగతమైన అనుభవాన్ని ఆయన తెలియజేశారు. చరణ్ సతీమణి ఉపాసన విషయానికి వస్తే, కుటుంబం అంతా ఒలిపింక్స్‌లో పాల్గొన్నప్పుడు ఆ అనుభవంతో పాటు అక్కడ గడిపిన క్షణాలను ఫొటోలు, వీడియోల రూపంలో తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒలింపిక్స్ లో పాల్గొనడం పట్ల తమ ఆనందాన్నితెలియజేయటంతో పాటు భారత బృందానికి శుభాకాంక్షలను అందించారు చిరంజీవి. ఈ క్రమంలో ఆయన సురేఖతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశారు.
పూరి జగన్నాథ్ తో పోటీపై హరీష్ శంకర్ స్పందన..ఏమన్నాడంటే..?
మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కలయికలో వస్తోన్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. మాస్ కాంబినేషన్ లో రానున్న ఈ సినిమా అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఆదివారం మిస్టర్ బచ్చన్ టీజర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. హీరోయిన్ భాగ్యశ్రీతో పాటు దర్శక నిర్మాతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూరి జగన్నాధ్, రామ్ పోతినేనిల ‘డబుల్ ఇస్మార్ట్’ కు పోటీగా మిస్టర్ బచ్చన్ వేస్తున్నారా అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా హరీష్ శంకర్ బదులుగా సమాధానం ఇస్తూ ” పూరి జగన్నాధ్ తో నన్ను ఎప్పుడు పోల్చుకోను, అయన ఓక లెజెండరీ డైరెక్టర్, ఆయనతో ఎప్పుడు పోటీ పడను, ఓటీటీ సంస్థల ఒత్తిడి వలన అనుకున్న డేట్ కంటే కొద్దిగా ముందుకు రావడంతో అనుకోకుండా డేట్ క్లాష్ అవుతోంది. ముందుగా డబుల్ ఇస్మార్ట్ డేట్ వేశారు కానీ మాకు ఫైనాన్షియాల్ కారణాల వలన అదే డేట్ కు వస్తున్నాం. ఒక్క సినిమా క్లాష్ వలన పూరికి నాకు మాటలువుండవ్ అని నేను అనుకోను, అయన కూడా అనుకోరు. ఆగస్టు 15న రిలీజ్ చేయమని సలహా ఇచ్చింది మైత్రీమూవీస్ శశి. పూరి మీద పోటీ కోసం కాదు, రామ్ తో పోటీ కాదు, నా తరువాత సినిమా రామ్ తో చేయబోతున్నాను అలాంటప్పుడు క్లాష్ కు ఎందుకు వెళ్తాను, మేము తప్పక రావాల్సివస్తుంది అర్ధంచేసుకుంటారు అని అనుకుంటున్నాను. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ రెండు బ్లాక్ బస్టర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
అందుకే పవన్ కల్యాణ్ మామయ్యను ఎత్తుకున్నా: సాయి తేజ్
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం మంగళగిరిలో హీరో సాయి దుర్గా తేజ్ ఉత్సాహంతో తన మేనమామ పవన్‌ను హగ్ చేసుకుని.. అనంతరం ఎత్తుకున్నారు. ఇందుకు సంబంధిత విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జనసేనాని విజయం సాధించిన రోజు ఆయన్ను ఎత్తుకోవడంపై సాయి తేజ్ తాజాగా స్పందించారు. ‘ఉషా పరియణం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సాయి దుర్గా తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో సాయి తేజ్ మాట్లాడుతూ… ‘చిన్నప్పుడు నేను ఓ టోర్నమెంట్‌లో ఓడిపోయా. చాలా బాధపడుతూ ఇంటికి వచ్చాను. అప్పుడు పవన్ మామయ్య నాతో మాట్లాడాడు. ఒక్కసారే కాదురా పది సార్లు ఓడినా ఫర్వాలేదు కానీ ఆట బాగా ఆడాలని మామయ్య నాతో చెప్పారు. ఆయన ప్రోత్సాహంతో తర్వాత గెలిచాను. నేను గెలిచిన రోజు మామయ్య ఎలా ఆనందించారో.. ఆయన విజయంను నేను అలా ఎంజాయ్ చేశా’ అని చెప్పారు. రోడ్డు ప్రమాదం తరవాత ‘విరూపాక్ష’ సినిమాతో సాయి దుర్గ తేజ్ గ్రాండ్ కామ్‌బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో పాటు భారీ వసూళ్లు రాబట్టింది. విరూపాక్ష తర్వాత పవన్ కల్యాణ్‌తో కలిసి ‘బ్రో’ సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం సాయి తేజ్ ఓ పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో సినిమా చేస్తున్నారు. ఈ మూవీని హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్ రాకేశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.