పదో తరగతి ఫలితాల్లో సంచలనం.. తొలిసారిగా 600కు 600 మార్కులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. అయితే, గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఉత్తీర్ణత శాతం నమోదైంది. కాగా, ఇవాళ విడుదలై టెన్త్ ఎగ్జామ్ ఫలితాల్లో ఓ విద్యార్థిని సంచలనం సృష్టించింది. కాకినాడకు చెందిన నేహాంజని అనే స్టూడెంట్ ఏకంగా 600 మార్కులకు గానూ 600 స్కోర్ సాధించింది. రాష్ట్ర చరిత్రలో 100 శాతం మార్కులు సాధించిన తొలి విద్యార్థినిగా ఈ విద్యార్థి నయా రికార్డ్ సృష్టించింది. అయితే ల్యాంగ్వేజ్ పేపర్లలో సైతం 100కు వంద మార్కులు రావడం, మొత్తానికి వంద శాతం మార్కులు సాధించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఉగ్రదాడి ఘటన తీవ్రంగా కలచివేస్తోంది: పవన్ కల్యాణ్
పహల్గాం సమీప బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి తనను తీవ్రంగా కలచివేస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు జనసేన అధినేత ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో అందరం దృఢంగా ఉందాం అని, మన భారత ఐక్యతను ఉగ్రవాదం విచ్ఛిన్నం చేయలేదని పేర్కొన్నారు. ఉగ్రదాడిలో మరణించిన వారి గౌరవార్థం జనసేన పార్టీ తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు సంతాప దినాలను పాటిస్తుందని పవన్ కల్యాణ్ చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బైసరన్ లోయలోకి సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు.. పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు.
రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరుకు గోరంట్ల తరలింపు!
రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను గుంటూరు పోలీసులు కస్టడిలోకి తీసుకున్నారు. కోర్టు ఇచ్చిన కస్టడీ ఉత్తర్వులను సెంట్రల్ జైలు అధికారులకు అందించి.. కస్టడీకి తీసుకున్నారు. రెండు రోజుల కస్టడీ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి ప్రత్యేక వాహనంలో గోరంట్ల మాధవ్‌ను తీసుకుని ఎస్కార్ట్ సిబ్బంది గుంటూరుకు బయలుదేరి వెళ్లారు. టీడీపీ నేత చేబ్రోలు కిరణ్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించిన కేసులో ఈనెల 10వ తేదీ నుండి గోరంట్ల మాధవ్‌తో పాటు మరో ఐదుగురు రిమాండ్‌లో ఉన్నారు. వీరందరికీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో వైద్య పరీక్షలు నిర్వహించి.. గుంటూరు పోలీసులకు అప్పగించారు. తిరిగి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి.. నగరంపాలెం పోలీసు స్టేషన్‌కు పోలీసులు తీసుకుని వెళ్లనున్నారు. రెండు రోజుల కస్టడీ అనంతరం గురువారం సాయంత్రం గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అక్కడి నుండి తిరిగి గురువారం రాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు గుంటూరు పోలీసులు తరలించనున్నారు.
నలుగురు ఉగ్రవాదుల ఫొటో విడుదల.. రైఫిల్స్‌తో పోజు
పహల్గామ్ పర్యాటక ప్రాంతంలో మంగళవారం టూరిస్టులపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డ నరహంతకుల ఫొటోను భద్రతా సంస్థలు విడుదల చేశాయి. తొలుత ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలను విడుదల చేశాక.. తాజాగా నలుగురు అనుమానితుల ఫొటోను తాజాగా భద్రతా సంస్థలు విడుదల చేశాయి. ఫొటోలో ఏకే-47 రైఫిల్స్ పట్టుకుని ఫొటోలో పోజులిచ్చారు. వీరిలో ముగ్గురి పేర్లు సులేమాన్ షా, అబు తల్హా, ఆసిఫ్ ఫౌజీ అని అధికారులు వెల్లడించారు. అలాగే ఘటనాస్థలిలో ఏకే-47 తుపాకీ పట్టుకుని ఉన్న ఆ ఉగ్రవాది చిత్రం కూడా బయటకు వచ్చింది. పహల్గామ్ దాడి వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి లష్కరే తోయిబా అగ్ర కమాండర్ సైఫుల్లా సాజిద్ జట్‌గా అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇతడు ఇస్లామాబాద్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తాడని గుర్తించింది. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రాంతానికి చెందిన వాడిగా కనిపెట్టారు. ఇక ఈ ఉగ్రవాదులకు స్థానిక ఇద్దరు స్థానికులు సహకరించినట్లుగా గుర్తించారు. ఇక ఉగ్రవాదులు బాడీ కెమెరాలు ధరించినట్లుగా కనుగొన్నారు.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంత ప్రచారం.. గ్రామస్థాయి నుంచే జరగాలి..
హైదరాబాద్ లో పరిశీలకుల సమావేశం ముగిసింది. జిల్లాకు ఇద్దరు పరిశీలకుల కేటాయించారు. మండల అధ్యక్షుల ఎంపికకు ఐదుగురి పేర్లు.. బ్లాకు కాంగ్రెస్ కి ముగ్గురు పేర్లు పీసీసీకి ఇవ్వాలి.. 70 మంది పరిశీలకులకు ఆహ్వానం పంపించాలని ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ తెలిపింది. ఈ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన వాళ్ళను పరిశీలకులుగా పీసీసీ తొలగించింది. మీటింగ్ కి రాని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో పాటు మరో ఐదుగురు నేతలు.. పరిశీలకుల నుంచి వీళ్ళను తొలగించాలని మీనాక్షి నటరాజన్ ఆదేశాలు జారీ చేసింది. ఇక, 2017 నుంచి పార్టీలో ఉన్న వాళ్ళనే కమిటీలో ఉండాలని తెలిపింది. అలాగే, మహిళల ప్రాతినిధ్యం పెంచుకోవాలి.. ఏప్రిల్ 25 నుంచి 30వ తేదీ వరకు జిల్లా స్థాయి సమావేశాలు జరగనున్నాయని ప్రకటించింది.
ఈ ఉగ్రదాడికి కారణం అదే.. అసదుద్దీన్ ఒవైసీ సంచలన ఆరోపణ!
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడికి నిఘా వైఫల్యమే కారణమని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఈ దాడిని ఊచకోతగా ఆయన అభివర్ణించారు. బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఇది ఉరి ప్రాంతం, పుల్వామా సంఘటనల కంటే ప్రమాదకరమైందని, బాధాకరమైందన్నారు. ఈ సంఘటనపై నరేంద్ర మోడీ ప్రభుత్వం జవాబుదారీతనంగా వ్యవహరించాని డిమాండ్ చేశారు. “పహల్గామ్‌లో మతం అడిగిన తర్వాత ఉగ్రవాదులు అమాయక ప్రజలను విచక్షణారహితంగా చంపారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాం. మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఈ ఘటనకు నిఘా వైఫల్యమే కారణం” అని ఒవైసీ హైదరాబాద్‌లో విలేకరులతో అన్నారు. ఈ ఉగ్రవాదులందరికీ ప్రభుత్వం గుణపాఠం నేర్పుతుందని, బాధిత కుటుంబాలకు వీలైనంత త్వరగా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కేసీఆర్ను చూడడానికి ఆయన మాటలు వినడానికి జనం సిద్ధమవుతున్నారు..
వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి దగ్గర జరుగుతున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించారు. సభ ప్రాంగణంలోనే ముఖ్య కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడి కేటీఆర్.. టీఆర్ఎస్ కి ఒక విశిష్టత ఉంది.. 25 ఏళ్లు పూర్తి చేసుకున్న పార్టీలు రెండు మాత్రమే ఉన్నాయి.. ఇక, తెలంగాణ ప్రజల గొంతుగా పార్టీ పేరు తెచ్చుకుంది టీఆర్ఎస్.. ప్రజలు ఏ బాధ్యత ఇచ్చిన దాన్ని ప్రజల ఆకాంక్షల మేరకు పని చేస్తున్న పార్టీ అని కేటీఆర్ పేర్కొన్నారు.
పహల్గామ్ టెర్రర్ అటాక్‌ని ఖండించిన చైనా..
జమ్మూ కాశ్మీర్‌లో పహల్గామ్ ఉగ్రదాడి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కాశ్మీర్ అందాలను చూసేందుకు వచ్చిన పర్యాటకుల్ని టెర్రరిస్టులు దారుణంగా చంపేశారు. మతం, పేరు అడుగుతూ మరీ హిందువుల్ని టార్గెట్ చేశారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 28 మంది మరణించారు. అంతర్జాతీయంగా పలు దేశాలు ఈ సమయంలో భారత్‌కి అండగా నిలుస్తున్నాయి. ఉగ్రవాదంపై పోరుకు సహకరిస్తామని చెబుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్, పుతిన్ వంటి ప్రపంచ నేతలు మృతులకు సంతాపం ప్రకటించారు.
‘‘కాశ్మీర్‌లో రక్తపాతం సృష్టిస్తాం’’.. దాడికి ముందు లష్కర్ కమాండర్..
పహల్గామ్ దాడికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడికి కొన్ని రోజులు ముందే, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కాశ్మీర్ తమ జీవనాడి అని, కాశ్మీర్ కోసం పోరాడుతున్నవారికి సాయం చేస్తామని చెప్పారు. పరోక్షంగా ఉగ్రవాదానికి మద్దతు ఉంటుందని చెప్పారు. మునీర్ ఈ వ్యాఖ్యలు చేసిన రోజుల వ్యవధిలోనే ఉగ్రదాడి జరిగింది. మంగళవారం జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో, కాశ్మీర్ అందాలను చూసేందుకు వచ్చిన అమాయకపు టూరిస్టుల్ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ దాడి వెనక పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబాకు చెందిన ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’’ ఉగ్రవాద సంస్థ హస్తం ఉంది.
మారిన హైడ్రా లోగో.. ఇకపై కొత్త లోగోతో హైడ్రా కార్యకలాపాలు
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) తన గుర్తింపులో ఒక పెద్ద మార్పును ప్రకటించింది. ఇంతకు ముందు ఈవీడీఎం (EVDM) లోగోను వినియోగిస్తున్న హైడ్రా, ఇకపై కొత్త లోగోతో తన కార్యకలాపాలను కొనసాగించనుంది. ఈ మార్పు సంస్థకు సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ గుర్తింపు పెంచేలా ఆకర్షణీయంగా రూపుదిద్దబడింది. హైడ్రా యొక్క కొత్త లోగోలో “హెచ్” అక్షరంపై నీటి బొట్టు ఆకృతిని చేర్చారు. ఈ రూపకల్పన నీరు, పరిరక్షణ, , ప్రభుత్వ ఆస్తుల రక్షణ వంటి హైడ్రా యొక్క లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది. ఈ లోగో హైడ్రా సంస్థ యొక్క సమర్థత, నమ్మకంతో కూడిన సేవలను ప్రతిబింబిస్తుంది.