రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ రాణి కుముదిని..
రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి రాణి కుముదిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ)గా నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ జిష్టుదేవ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు పార్థసారధి ఆ పదవిలో కొనసాగారు. ఆయన పదవీ కాలం ఇటీవలే ముగియడంతో ప్రభుత్వం రాణి కుముదిని నియమించింది. 1988 బ్యాచ్‌కి చెందిన కుముదిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. కేంద్ర సర్వీసుల అనంతరం తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2023 ఎన్నికలకు ముందు ఆమె పదవీ విరమణ చేశారు. ఎస్‌ఈసీగా పార్థసారధి పదవీకాలం ఈ నెల ఎనిమిదో తేదీతో ముగిసింది. ఫలితంగా, కాంగ్రెస్ ప్రభుత్వం రాణి కుముదిని SEC గా నియమించింది. ఈ మేరకు గవర్నర్ జిష్టుదేవ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె మూడేళ్లపాటు ఎస్‌ఈసీగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొత్త ఎస్ఈసీ నియామకానికి ప్రాధాన్యం ఏర్పడింది. మరోవైపు రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ ఎంజీ గోపాల్‌ను ప్రభుత్వం నియమించింది. 1983 బ్యాచ్‌కు చెందిన గోపాల్ యూనియన్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఆయనను రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా మూడేళ్లపాటు నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఉండవల్లిలో ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి నారా లోకేష్..
ఇటీవల సంభవించిన వరదలకు తమ ఇల్లు పూర్తిగా నీట మునిగాయని, ఆస్తులు ధ్వంసం అయ్యాయని మంత్రి నారా లోకేష్ కు తమ ఆవేదన చెప్పుకున్నారు బాధితులు.. నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు బాధితులు. అలాగే ఆభరణాల తయారీ కోసం తాము ఇచ్చిన 630 గ్రాములు బంగారాన్ని, మంగళగిరిలో పనిచేసే పశ్చిమ బెంగాల్ కు చెందిన, గో బెడ్ అనే వ్యక్తి అపహరించాడని.. బంగారంతో సహా పశ్చిమ బెంగాల్ పారిపోయాడని మంత్రి నారా లోకేష్ కు ఫిర్యాదు చేసారు బాధితులు. ఆ నిందితుడిని అరెస్టు చేసి తమ బంగారం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు బాధితులు.. పలు అనారోగ్య, ఆర్థిక సమస్యలపై మంత్రి నారా లోకేష్ కు వినతుల సమర్పించారు బాధితులు. వారందరి వినతిపత్రులు స్వీకరించిన మంత్రి నారా లోకేష్ అతి త్వరలో వాటికి పరిష్కారం చూపించే విధంగా పనులు జరుగుతాయని వారికి తెలిపారు.
గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణనాథుడు..
ఖైరతాబాద్‌లో భారీ గణనాథుని నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 1.39 గంటలకు ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం పూర్తయింది. 4వ క్రేన్ దగ్గర 70 అడుగుల ఖైరతాబాద్ బొజ్జ గణపయ్య నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. దీంతో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన క్రతువు వైభవంగా సాగింది. 70 అడుగుల భారీ మహా గణనాథుని విగ్రహాన్ని వేలాది మంది భక్తుల మధ్య డప్పుల మోత, డీజేల కోలాహలమైన సంగీతం మధ్య ట్యాంక్‌బండ్‌కు ఊరేగింపుగా తీసుకెళ్లారు. శోభాయాత్రను తిలకించేందుకు వేలాది మంది భక్తులు రోడ్లపైకి రావడంతో ఖైరతాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మహా గణపతిని చూసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
వరద బాధితులను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత
వరద ప్రభావిత ప్రాంతలలో నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. రాణిగారితోట 17, 18వ డివిజన్ లలో జరిగిన కార్యక్రమంలో వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాశ్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. నగరంలోని వరద బాధితులను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. పెద్ద మనసుతో ఒక కోటీ పది లక్షల సహాయం మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు అని ఆయన తెలిపారు. యాభై వేల కుటుంబాలకు నిత్యవసర సరుకులను ఇంటి ఇంటికీ పంపిణీ చేస్తున్నాం.. తూర్పు నియోజకవర్గంలో 15, 16, 17, 18 డివిజన్ లలో వరద ప్రభావానికి గురైన నాలుగు డివిజన్ లలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశామన్నారు. ఈ వరదలకు టీడీపీ, చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం కారణం కాదా అని దేవినేని అవినాష్ ప్రశ్నించారు.
భూమిలేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12వేలు.. ప్రభుత్వం కొత్త పథకం..
భూమిలేని రైతు కూలీలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు. సంవత్సరానికి 12 వేలు చొప్పున ఇచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
చింతకాని మండల దళితబంధు లబ్ధిదారులకు నాగులవంచలో రెండోవిడుత యూనిట్ల మంజూరు పత్రాలను అందజేశారు. ప్రజల చేత.. ప్రజల అవసరాల కోసం ఏర్పడినదే ఈ ప్రజాపాలన ప్రభుత్వం అని అన్నారు. భారత రాజ్యాంగం మేరకు ప్రజాపాలన కొనసాగుతుందన్నారు. ప్రజాస్వామ్యని గౌరవించ్ఛే ప్రతి ఒక్కరు ఈ ప్రజాపాలనను స్వాగతించాలన్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం ఉద్దేశం అదే.. పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై ప్రస్తుతం వాదోపవాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కానివ్వకుండా పోరాడుతామని వైసీపీ ఇప్పటికే ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై ఎంపీ పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ధ్వంసం చేయాలనే ఆలోచన కేంద్రానికి లేదని.. స్టీల్ ప్లాంట్‌ని కాపాడి, లాభాల్లోకి తీసుకురావాలనేదే కేంద్రం ఉద్దేశమని పురంధేశ్వరి వెల్లడించారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించారన్నారు. ఇవాళ ప్రధాని మోడీ పుట్టినరోజు అని, బీజేపీకి ప్రత్యేకమైన రోజు అని ఆమె వ్యాఖ్యానించారు. మోడీ పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రి క్వారీ అన్నా క్యాంటిన్ ఒకరోజు ఖర్చును బీజేపీ భరించిందని తెలిపారు. ప్రధాని మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కానుందని వెల్లడించారు. రాజమండ్రిలో గౌతమీ నేత్రాలయం, రోటరీ క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయం పురంధేశ్వరి ప్రశంసించారు.
త్రివిక్రమ్ మీద కంప్లైంట్ తీసుకోలేదు.. మరోసారి గురూజీపై పూనమ్ సంచలనం
గతంలో కొన్నిసార్లు ప్రత్యక్షంగా కొన్నిసార్లు పరోక్షంగా గురూజీగా పిలవబడే త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ పూనమ్ మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ ను టార్గెట్ చేసింది. ప్రస్తుతం జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఆరోపణలు హాట్ టాపిక్ అవుతున్న నేపథ్యంలో పూనమ్ కౌర్ తొలుత జానీని మాస్టర్ అని పిలవకండి, మాస్టర్ అని పిలవాలంటే దానికి కాస్త గౌరవం ఉంచాలి అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఆ వివాదం సద్దుమణగక ముందే ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఇచ్చిన కంప్లైంట్ అసలు తీసుకున్నారా అని ఆమె ప్రశ్నించింది. నాకు అలాగే కొంతమందికి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకపోవచ్చు నన్ను అందుకే సైలెంట్ గా ఇగ్నోర్ చేశారు. నేను అప్పుడు ఉన్న హెడ్స్ కి కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రశ్నించాలని ఆమె కోరారు. గతంలో కూడా పూనం త్రివిక్రమ్ శ్రీనివాస్ వల్లే తనకు తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాలు లేకుండా పోయాయని ఆరోపణలు గుప్పించారు. చాలా సందర్భాలలో ఆమె త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు నేరుగా ప్రస్తావించగా కొన్ని సందర్భాలలో గురూజీ అంటూ ఆమె పరోక్షంగా కౌంటర్లు వేస్తూ ఉండేవారు. ఇక ఇప్పుడు జానీ మాస్టర్ వ్యవహారం వాడి వేడిగా సాగుతున్న సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు మీదకు తీసుకురావడం హాట్ టాపిక్ అవుతోంది.
మంత్రి సీతక్క నియోజకవర్గంలో తొలి కంటెయినర్ పాఠశాల
రాష్ట్రంలో తొలి కంటెయినర్ స్కూల్ అందుబాటులోకి రానుంది. తొలిసారిగా మలుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ స్కూల్‌ను కంటెయినర్‌లో ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి ఆనసూయ సీతక్క మంగళవారం నాడు ప్రారంభించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని కాంతనపల్లి అటవీ ప్రాంతంలో బంగారుపల్లి ఆవాస గ్రామం ఉంది. ప్రస్తుతం గుడిసెలో నడుస్తున్న పాఠశాల శిధిలావస్తకు చేరుకుంది. అటవి ప్రాంతం కావడంతో కొత్త పాఠశాల భవన నిర్మాణానికి అటవీ అధికారులు అనుమతులివ్వలేదు. దీంతో ఇక్కడ కంటెయినర్ పాఠశాల ఏర్పాటుకు మంత్రి సీతక్క శ్రీకారం చుట్టారు. ములుగు నియోజకవర్గంలోని తాడ్వాయ్ మండలంలో కంటెయినర్ ఆసుపత్రిని మంత్రి సీతక్క అందుబాటులోకి తేవడంతో స్థానిక ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయి. అదే కోవలో ఇప్పుడు కంటేయినర్ పాఠశాలను ప్రారంభిస్తున్నారు. ఈ కంటెయినర్ పాఠశాల 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవు ఉంటుంది. ఇందులో ఇద్దరు టీచర్లు పనిచేస్తుండగా..వారితో పాటు విద్యార్ధులు సౌకర్యవంతంగా కూర్చునే విధంగా కంటేయినర్ పాఠశాలను అందుబాటులోకి తెచ్చారు.
మోడీ 100 రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను వెల్లడించిన బండి సంజయ్
నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని అమలు చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇచ్చిన హామీలతోపాటు ప్రజా సంక్షేమం అనేక కార్యక్రమాలు చేపట్టినం. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసేదిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ‘‘మహిళల కోసం రూ.3 లక్షల కోట్ల కేటాయించినం. కనీస మద్దతు ధర కోసం రూ.2 లక్షలు కోట్లు కేటాయించినం. ముద్రా రుణపరిమితిని పెంచినం. రూ.5.36 లక్షల కోట్లతో 3 కోట్ల ఇండ్ల నిర్మాణమే లక్ష్యంగా పెట్టుకున్నం. 75 వేల మెడికల్ సీట్లను అదనంగా మంజూరు చేసినం. మూలధన వ్యయం కింద మౌలిక సౌకర్యాల కల్పనుకు రూ.11 లక్షల 11 వేల కోట్లు కేటాయించినం. బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్ ఛార్జీలను తగ్గించినం…ఇవన్నీ మచ్చుకు కొన్ని మాత్రమే.’’అని వివరించారు. మరి కాంగ్రెస పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలైందని, 6 గ్యారంటీలను కూడా ఎందుకు అమలు చేయలేకపోయిందని ప్రశ్నించారు. 9 నెలల మీ పాలనలో నెరవేర్చిన హామీలపై సమాధానం చెప్పాలని, లేనిపక్షంలో ప్రజలు కాంగ్రెస్ ను క్షమించబోరని అన్నారు. ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర నాయకులతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. మోడీ 100 రోజులపాటు రైతులు, యువత, మహిళలుసహా అన్ని వర్గాల అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలను వివరించారు.
హైదరాబాద్‌లో ప్రశాంతంగా వినాయక నిమజ్జనం జరుగుతుంది
భాగ్యనగరంలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతోందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్‌లో ఉన్న విగ్రహాలు త్వరగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నామన్నారు. గత ఏడాది లాగా ఆలస్యం కాకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. మండప నిర్వాహకులతో మాట్లాడి నిమజ్జనం జరిగేలా చూస్తున్నామన్నారు. బాలాపూర్ వినాయకుడు కూడా త్వరగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నామని చెప్పారు. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రణాళికలు సిద్ధం చేశామని ఆయన తెలిపారు. షిఫ్ట్ వారిగా 25 వేల మంది పోలీసులు బందోబస్తూ ఏర్పాటు చేశామని, నిమజ్జనం లో పోలీసులు అలసిపోకుండా షిఫ్ట్ లు ప్రకారం డ్యూటీ చేస్తున్నారన్నారు. లక్ష విగ్రహాలు సిటీలో ఉండొచ్చు, 20 నుండి 30 వేలు విగ్రహాలు పెండింగ్ ఉన్నాయని, రేపు ఉదయం లోగా నిమజ్జనం మొత్తం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని సీపీ ఆనంద్ తెలిపారు. గత ఏడాది లాగా కాకుండా ఏడాది త్వరగా నే నిమజ్జనం అయ్యేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, నిమజ్జనం కోసం వచ్చే ప్రజలు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లలో రావాలని కోరుతున్నామన్నారు. మీడియా లో వచ్చే లైవ్ టెలికాస్ట్ చూడాలని ప్రజలను కోరుకుంటున్నామన్నారు.