ఖమ్మం మార్కెట్‌ను ఆదర్శవంతమైన మార్కెట్‌గా తీర్చి దిద్దుతా!
ఖమ్మం పత్తి మార్కెట్‌లో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 400 పత్తి బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. సంక్రాంతికి ముందు కొందరు వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేసిన పత్తి అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. ఈ ఘటనపై రాత్రే స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.. నేడు ఖమ్మం మార్కెట్‌ను పరిలిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాత్రి పత్తి కాలిపోవడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. ఖమ్మం మార్కెట్‌ను ఆదర్శవంతమైన మార్కెట్‌గా తీర్చి దిద్దుతా అని తెలిపారు. రైతులకు, వ్యాపారస్తులకు సౌకర్యంగా ఉండేలా కొత్త మార్కెట్‌ను నిర్మిస్తా అని మంత్రి హామీ ఇచ్చారు.
‘మార్కెట్‌లో రాత్రి పత్తి కాలిపోవడం దురదృష్టకరం. కారణం ఏంటో నాకు ఇంకా తెలీదు. నష్టం అంచనా వేస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చూస్తా. ఈ మార్కెట్‌ను ఆదర్శవంతమైన మార్కెట్‌గా తీర్చి దిద్దుతా. ఈ మార్కెట్‌ను రూ.100 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేస్తా. మార్కెట్ చుట్టుపక్కల విషాలవంతమైన రోడ్లు ఎర్పాటు చేస్తాం. మన మార్కెట్‌ని చూసి తెలంగాణ రాష్ట్రంలో అన్నీ మార్కెట్‌లు ఉండేలా చేస్తా. సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పారు. రైతులకు, వ్యాపారస్తులకు సౌకర్యంగా ఉండేలా కొత్త మార్కెట్‌ను నిర్మిస్తాం. పత్తి మార్కెట్‌ను కూడ ఆ రోజు నేనే ఏర్పాటు చేశా, ఇది కాలేజ్ స్థలం’ అని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.
ఆరు గ్యారంటీలు ఇచ్చేవరకు ప్రశ్నిస్తాం.. కడుగేస్తాం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ప్రక్కదారి పట్టించడానికే అరెస్టులని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. గట్టిగా ఆరు గ్యారంటీలు అడిగుతే తమపై కేసులు పెడుతున్నారు.. కేటీఆర్ ఇచ్చిన పథకాలను అడిగితే తమపై కేసులు పెడుతున్నారని కౌశిక్ రెడ్డి తెలిపారు. ఈ- ఫార్ములా కేసు ఓ లొట్టపీసు కేసు అని ఆరోపించారు.. రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలన నడుపుతున్నారు.. కేటీఆర్ టెస్లా కంపెనీని హైదరాబాద్ తీసుకురావడానికి ఇన్వెస్ట్ చేయడానికి ఫార్ములా- ఈ తీసుకువచ్చారని అన్నారు. కేటీఆర్ రూ.55 కోట్లు ఆఫిషియల్‌గా పంపామని చెప్పారు.. కరప్షనే లేనప్పుడు కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. ప్రోసీజర్ లాప్స్ లేదు.. ఒకవేళ ప్రోసిజర్ లాప్స్ ఉంటే చీఫ్ సెక్రటరీ బాధ్యత వహించాలని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
దేశంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయాణంలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్‌టిసి) కింద కేంద్ర ఉద్యోగులు ఇప్పుడు తేజస్ ఎక్స్‌ప్రెస్, వందే భారత్ ఎక్స్‌ప్రెస్, హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ వంటి లగ్జరీ రైళ్లలోను ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. ఈ సౌకర్యం ద్వారా ఉద్యోగులు తాము అర్హత ఉన్న రైళ్లలో పూర్తిగా ఉచితంగా ప్రయాణించవచ్చు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DOPT) విడుదల చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం, ఎల్‌టిసి కింద ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న రాజధాని, శతాబ్ది రైళ్లతోపాటు, తేజస్, వందే భారత్, హమ్‌సఫర్ వంటి రైళ్లను కూడా జోడించారు. ఈ నిర్ణయం ఉద్యోగుల నుండి వచ్చిన సూచనల అనంతరం తీసుకున్నట్లు డిఒపిటి తెలిపింది.
నేటి నుంచి సీఎం విదేశీ పర్యటన.. భారీ పెట్టుబడులే లక్ష్యం!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. జనవరి 17 నుంచి 24 వరకు సింగపూర్, స్విట్జర్లాండ్ దేశాల్లో సీఎం పర్యటించనున్నారు. సీఎంతో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ పర్యటనల్లో పాల్గొననున్నారు. గురువారం రాత్రి 10 గంటలకు ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి బృందం సింగపూర్‌కు బయలుదేరుతుంది. 17, 18, 19 తేదీల్లో సింగపూర్‌లో మూడు రోజులు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతారు.
ప్రపంచంలో పేరొందిన సింగపూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌ని రేవంత్ రెడ్డి బృందం సందర్శిస్తుంది. నైపుణ్య అభివృద్ధికి ఆ యూనివర్సిటీ ఎంచుకున్న కోర్సులు, అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయనుంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకారం అందించేందుకు సింగపూర్ ఐటీఈతో సీఎం ఒప్పందం చేసుకుంటారు. సింగపూర్‌లో రివర్ ఫ్రంట్‌ను సందర్శిస్తారు. ప్రపంచ స్థాయిలో మూసీ పునరుజ్జీవనం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నందున అక్కడి రివర్ ఫ్రంట్ ఏరియా అభివృద్ధి చేసిన తీరుతెన్నులను పరిశీలిస్తారు.
18న ఏపీకి అమిత్‌షా.. రెండు రోజుల పర్యటన..
ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతల పర్యటనలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఈ మధ్య ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన విషయం విదితమే కాగా.. ఈ నెల 18వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. ఏపీకి రాబోతున్నారు.. ఆదివారం రోజు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు అమిత్‌షా రానున్నారు రాష్ట్ర బీజేపీ ప్రకటించింది.. ఈ పర్యటనలో భాగంగా 19వ తేదీన కృష్ణా జిల్లా, గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎన్ఐడీఎం (NIDM) ప్రాంగణాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారని తెలిపారు.. ఈ పర్యటన కోసం శనివారం రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోన్న అమిత్‌షా.. ఆ రోజు రాత్రి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో భేటీ అవుతారని.. అనంతరం విజయవాడలోని హోటల్లో బస చేస్తారని పేర్కొన్నారు..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ కేబినెట్ సంక్రాంతి కానుక
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ కేబినెట్ సంక్రాంతి కానుక అందించింది. ఉద్యోగులందరికీ 8వ వేతన సంఘాన్ని అమలు చేసేందుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలిపారు. గురువారం ఢిల్లీలో ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ సమావేశం అయింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ.3,985 కోట్ల వ్యయంతో ఇస్రో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏడవ వేతన సంఘం పదవీకాలం 2026లో ముగుస్తుంది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారని అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2026 జనవరి 1 నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నాయి. త్వరలోనే కొత్త కమిషన్ ఛైర్మన్, ఇద్దరు సభ్యులను నియమించనున్నారు.
నువ్వు మహా డ్రామా రావు అని తెలుసు ప్రజలకు
తెలంగాణ ప్రజల డబ్బుతో నీ దోస్తులను కాపాడిన ఘనత నీది కేటీఆర్ అంటూ విమర్శలు గుప్పించారు ఎంపీ చామల కిరణ్ కమార్ రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల చెవిలో పువ్వు పెట్టకు కేటీఆర్.. నువ్వు మహా డ్రామా రావు అని తెలుసు ప్రజలకు అని ఆయన మండిపడ్డారు. నీ నటనకు ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉందని ఆయన సెటైర్లు వేశారు. తెలంగాణలో మేమే ఎప్పుడు అధికారంలో ఉంటామని ఒక నియంత లాగా మీ నాయన నువ్వు వ్యవహారించారని, నీ బాగోతం.. నువ్వు, తెలంగాణ ప్రజలకు తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. నువ్వు ఒక యువరాజువు అని నీ దోస్తులకు దోచిపెట్టడం కోసమే ఈ కార్ రేస్ చేశావని ప్రజలందరికీ తెలుసు అని ఆయన అన్నారు. FEO ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనేది హైదరాబాద్ కి నేనే తీసుకొచ్చాను, దానిని కాపాడాలని ఇది హైదరాబాద్ కి తలమానికం అని, అందుకోసమే హెచ్ఎండిఏ నుంచి 55 కోట్ల రూపాయలు ఖర్చు చేశానని గొప్పలు, ప్రగల్బాలు పలుకుతున్నావు కేటీఆర్, నిజ నిజాలు వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలుసు అని, ఏస్ నెక్స్ట్ జెనరేషన్స్ గ్రీన్‌కో సంస్థ యాజమాన్యం నీకు అత్యంత దగ్గర మిత్రులు అని ఆయన అన్నారు.
అధికారులంతా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి
అధికారులంతా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలన్నారు మంత్రి సీతక్క. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా పని చేయండని ఆమె వ్యాఖ్యానించారు. మీ మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోండని, నిబద్ధతతో పనిచేసి శాఖ గౌరవాన్ని నిలబెట్టాలన్నారు. శాఖకు వన్నె తెచ్చేలా పనిచేయాలని ఆమె సూచించారు. శాఖపరంగా వాస్తవాలనే నివేదించండని, మా మెప్పుకోసం వాస్తవాలను దాచి పెట్టొద్దన్నారు. అధికారులు, అమాత్యులు వేరు వేరు కాదని, మీరు పొరపాట్లు చేసి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేయొద్దన్నారు మంత్రి సీతక్క. ఎవరూ తప్పులు చేయొద్దు, జైలు పాలు కావద్దని, మీ కింది ఉద్యోగులతో సంప్రదింపులు జరపండి, వారి సమస్యలను పరిష్కరించండన్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పెండింగ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైందని, రూ. 300 కోట్ల nrega బిల్లులను నిన్న విడుదల చేశామన్నారు. మల్టీ పర్పస్ వర్కర్ల వేతన బకాయిలను విడుదల చేశామని, పంచాయతీరాజ్ శాఖ తరహాలోనే ప్రతి విభాగంలో ఉద్యోగ సమస్యలను ఆన్లైన్ లో పరిష్కరించే విధానాన్ని అవలంబించండన్నారు మంత్రి సీతక్క.
బీసీ స్టడీ సర్కిల్స్ నోటిఫికేషన్ రిలీజ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలోని అన్ని బీసీ స్టడీ సర్కిళ్లలో ఫిబ్రవరి 15 నుంచి ఆర్ఆర్‌బీ, ఎస్ఎస్‌సీ, బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్ పరీక్షల కోసం 100 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా అర్హత గల అభ్యర్థులు తమ లక్ష్యాలను చేరుకునేందుకు సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఐటీ తిండి పెడుతుందా అని ఎగతాళి చేశారు.. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతుంది
ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీ అనుభవంతో ప్రజలకు సంపదను సృష్టిస్తా అని చెప్పా.. అభివృద్ధి వల్ల సంపద వస్తుందని సీఎ చంద్రబాబు అన్నారు. సంపద వల్ల సంక్షేమం సాధ్యమవుతుందని తెలిపారు. 1991లో ఆర్ధిక సంస్కరణలు వచ్చాయి.. 1993లో ఇంటర్నెట్ విప్లవం వచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చానన్నారు. రాష్ట్రానికి వెలుగులు ఇచ్చి తాను అధికారం కోల్పోయానని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసాం.. రహదారుల విస్తరణ 14 లైన్ల వరకు వెళ్ళిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమాల వల్ల ఆదాయం బాగా పెరిగిందని తెలిపారు. ఐటీ తిండి పెడుతుందా అని చాలా మంది ఎగతాళి చేసారు.. ఐటీ ఇప్పుడు ఎక్కడికో తీసుకు వెళ్ళిపోతుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇండియాలో ఆధార్ వ్యవస్థ బాగా బలంగా ఉంది.. ఆయుష్మాన్ భారత్, రైతు భరోసా అన్నిటికీ ఆధార్ ఉండాలన్నారు. ప్రతి ఇల్లు జియో ట్యాగింగ్ చేస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు.. సంపద సృష్టికి P4 విధానం తెస్తున్నామని సీఎం తెలిపారు. P4 అనేది గేమ్ ఛేంజర్ గా మారుతుందని చెప్పారు.