భద్రాద్రి జిల్లా సరిహద్దులోకి పెద్దపులి.. ప్రజలకు అధికారుల హెచ్చరికలు
ములుగు జిల్లా తాడ్వాయి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న పెద్దపులి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి ప్రవేశించింది. పినపాక ఇల్లందు కొత్తగూడెం అటవీ పరిసర ప్రాంతాల్లో పులి తిరుగుతున్నట్లుగా గుర్తించారు అటవీశాఖ అధికారులు. ఈ పులి అటు ములుగు జిల్లాలోకి, ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి తిరుగుతున్న పరిస్థితి ఉందని తెలిపారు. గత మూడేళ్ల క్రితం కూడా కరకగూడెం ఆళ్లపల్లి రేగళ్ల అటవీ ప్రాంతాల్లో పర్యటించిందని అన్నారు. అప్పటిలో ఒక ఆవుని కూడా పులి చంపి తిందని, ఆ తర్వాత నుంచి పులి ఆనవాళ్లు కనిపించకుండా పోయాయని అన్నారు. మళ్ళీ తిరిగి పులి ఆనవాళ్లు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు.
ముగిసిన రెండో రోజు ఆట.. ఆస్ట్రేలియా భారీ స్కోరు
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు బ్రిస్బేన్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆతిధ్య జట్టు ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు చేసింది. 7 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (152), స్టీవ్ స్మిత్ (101) సెంచరీలతో అదరగొట్టారు. ఈ క్రమంలో.. ఆసీస్ భారీ స్కోరు చేసింది. రెండో రోజు తొలి సెషన్ లో భారత్ ఆధిపత్యం చెలాయిస్తే.. రెండో సెషన్ మొత్తం ఆస్ట్రేలియాదే కొనసాగింది. ఈ ఇద్దరి బ్యాటర్లను పెవిలియన్ కు పంపేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
రాష్ట్ర విభజన కంటే.. వైసీపీ ప్రభుత్వం వల్లే ఎక్కువ నష్టం: సీఎం చంద్రబాబు
2047 విజన్ అనేది వ్యక్తి కోసం, కులం కోసం కాదని.. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు తెచ్చేందుకు ఇచ్చే హామీ అని సీఎం చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్లలో ఇంత స్వేచ్చగా రాష్ట్రంలో మాట్లాడుకున్నామా? అని సీఎం ప్రశ్నించారు. పొట్టి శ్రీరాములు స్వగ్రామంలో అభివృద్ధి పనులు చేయాలని ఆదేశాలు ఇస్తే.. వాటిని వైసీపీ రద్దు చేసిందని మండిపడ్డారు. 3 రాజధానుల పేరుతో అమరావతిపై కక్షతో వ్యవహరించారని, పోలవరంను నాశనం చేసి పక్కన పెట్టారని ధ్వజమెత్తారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ తర్వాత ఉద్యమం వచ్చిందని, తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయిందని సీఎం పేర్కొన్నారు.
పైసలా కోసం పార్టీ మారినవాడు నాయకులా..? సంజయ్ పై కవిత కామెంట్
జగిత్యాల జిల్లా ఎమ్మెల్యే సంజయ్ పై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. పైసల కోసం సంజయ్ పార్టీ మారాడు పైసలా కోసం పార్టీ మారినవాడు నాయకులు కారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. దరూర్ వద్దకు చేరుకున్న కవితను బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. దరూర్ బైపాస్ వద్ద అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో పెట్టిన విగ్రహం తెలంగాణ తల్లి కాదని అన్నారు.
లండన్‌లో 24 ఏళ్ల భారతీయ మహిళ హత్య.. భర్తే కాలయముడు
లండన్‌లో నివసిస్తున్న 24 ఏళ్ల భారతీయ యువతి హర్షిత బరేలా హత్యకు గురైంది. నవంబర్ 14న ఆమె మృతదేహాన్ని కారు ఢిక్కీ నుంచి స్వాధీనం చేసుకున్నారు. తన కూతురు హత్యపై తల్లి సుదేష్ కుమారి మీడియాతో మాట్లాడుతూ.. తన భర్త తనను చంపేస్తానని కొన్ని వారాల క్రితమే చెప్పిందని తెలిపింది. “నేను అతని వద్దకు తిరిగి వెళ్ళను, అతను నన్ను చంపేస్తాడు” అని హర్షిత తన తల్లితో చెప్పింది. తన భర్త పంకజ్ లాంబా తనకు నరకం చూపిస్తున్నాడని హత్యకు ముందు హర్షిత తల్లితో చెప్పింది. హర్షిత బరేలా ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్ నుంచి లండన్ వెళ్లింది. ఆగస్టు 2023లో పంకజ్ లాంబాతో వివాహం జరిగింది.
2027లో జమిలి ఎన్నికల్లో వైసీపీ గెలవడం ఖాయం
జమిలీ ఎన్నికలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికల్లో భాగంగా 2027లో ఎన్నికలు వస్తాయని, వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రకు తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందని.. గత ఎన్నికల్లో ఏ పార్టీ కార్యాలయంగా వేదికగా విజయం సాదించామో మళ్లీ అదే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందంగా ఉందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఓడిపోయామనే ఆందోళన అవసరం లేదని.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అందరినీ కలుపుకుపోవాలన్నారు. కార్యకర్తలకు వైఎస్ జగన్ అండగా ఉంటారని.. వారికి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకుంటారని అన్నారు. నిత్యం కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. “జమిలి ఎన్నికలు వస్తాయి.. వన్ నేషన్ వన్ ఎలెక్షన్ జరుగుతాయి.. 2027 ఎన్నికలకు అందరం సిద్ధంగా ఉండాలి. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను వస్తాయి..అసెంబ్లీ, ఎంపీ స్థానాలు పెరుగుతాయి.. మూడు స్థానాల్లో ఒక స్థానం మహిళకు వస్తుంది.మహిళలకు వైఎస్ జగన్ తగిన ప్రాధాన్యం ఇస్తారు.. నాకు విశాఖ నుంచి పోటీ చేసే ఆలోచన లేదు. పార్టీని గెలిపించడమే నా పని.” అని ఆయన అన్నారు.
ప్లాస్టిక్ రహితంగా కుంభమేళా
ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన వేడుకల్లో మహా కుంభమేళా ఒకటి. ఈసారి కుంభమేళా 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నగరంలో జరగనుంది. ఈ గొప్ప కార్యక్రమం ప్రతి 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది. భారతదేశం నుంచి మాత్రమే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పవిత్ర నదుల్లో వందలాది సంవత్సరాలుగా కుంభ మేళా లు జరుగుతున్నాయని, ప్రయాగ రాజ్ లో జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభ మేళా జరగనుందన్నారు.
తెలుగు వారికి ఓ గుర్తింపు ఇచ్చిన వ్యక్తి పొట్టి శ్రీరాములు
మన కోసం ఎవరు నిలబడ్డారో వారిని మరువ కూడదని.. కొందరు తల్లిదండ్రులను కూడా మర్చిపోతున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తెలుగు వారికి ఓ గుర్తింపు ఇచ్చిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని.. సమాజం కోసం బ్రతికిన మహానుభావులు పొట్టి శ్రీరాములు అని పవన్ వ్యాఖ్యానించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసంగించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పొట్టి శ్రీరాములు గొప్పతనం మరింతగా తెలిసిందన్నారు. ఒక జాతికి, కులానికి పొట్టి శ్రీరాములు నాయకుడు కాదు.. ఆంధ్ర జాతికి శ్రీరాములు నాయకుడు అని ఆయన స్పష్టం చేశారు. మనం ఆంధ్రులుగా ఉన్నాం అంటే పొట్టి శ్రీరాములు బలిదానం కారణమన్నారు. 2047 విజన్ అనేది రాష్ట్ర భవిష్యత్ అని..2020 అంటే అప్పట్లో అందరికీ అర్థం కాలేదన్నారు. ఇప్పుడు 2020 విజన్ ఫలితాలు ఏంటో అందరికీ తెలుస్తున్నాయని పవన్ కల్యాణ్ అన్నారు.
భూమిలేని పేదలకు.. ప్రతి కుటుంబానికి రూ.12 వేలు ఇస్తాం
బోనస్ ఇవ్వడం లేదని బీఆర్‌ఎస్ ఆరోపణలు చేస్తున్నారని, పండిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం లేకుండానే గతములో కట్టిన ప్రాజెక్టుల తోటే ధాన్యం రికార్డు స్థాయి లో పండుతుందన్నారు. రైతులకు మేము చేసినంత గా ఎవ్వరూ చేయలేదని, మీరు రైతులను ఎంత మోసం చేశారో ప్రజలకు తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. ఏడాది కాలం లోనే 21 వేల కోట్ల రూపాయలు రుణ మాఫీ చేశాం మీరు చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే రైతుల రుణ మాఫీ చేశామని, దేశం లో ఏ రాష్ట్ర ములో ఇలా ఎన్ని కోట్లు రుణ మాఫీ చేసింది లేదన్నారు భట్టి విక్రమార్క. రైతు భరోసా 7600 కోట్లు వేశామని, మీ హయంలో మీరు బందు చేసిన పదేళ్లు బీఆర్‌ఎస్ కట్టనీ 1514 కోట్ల రూపాయల ఇన్స్యూరెన్స్ మేమే కట్టామన్నారు. 29,888 కోట్లు ఈ రాష్ట్రంలోని రైతులకి అందచేసామని, 50,953 కోట్లు వ్యవసాయానికి రైతాంగం కోసం నేరుగా చెల్లిస్తున్నామని ఆయన తెలిపారు. ఇవన్నీ బీఆర్‌ఎస్ ఎప్పుడు చేయలేదని, పదేళ్లలో పంట నష్టంను బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. భూమి లేని నిరుపేద కూలీలకు 12000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చామని, డిసెంబర్ 28న పార్టీ ఆవిర్భవించిన రోజున ప్రతి కుటుంబానికి ఇవ్వనున్నామన్నారు.
రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం చంద్రబాబు
అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా సోమవారం సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించునున్నారు. షెడ్యూల్ ప్రకారం.. తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 10:45 గంటలకు పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకోనున్న సీఎం.. వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. అనంతరం 11:05 నుంచి 12:05 గంటల వరకు ప్రాజెక్టు ప్రాంతంలోని గ్యాప్ వన్, గ్యాప్ టూ, డీ వాల్ నిర్మాణ పనులు, వైబ్రో కాంపాక్షన్ పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకోనున్నారు. ప్రాజెక్టు పనుల పరిశీలన అనంతరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు నిర్మాణ పనులకు సంబంధించిన అంశాలపై అధికారులు, కాంట్రాక్టు సంస్థలతో సమీక్షించనున్నారు. సమీక్ష అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయనున్నారు.