అమానుషం.. మామ మొఖంపై చెప్పుతో కొట్టిన కోడలు..
మానవత్వం మంటగలుస్తోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వృద్ధులపై విచక్షణారహితంగా కొందరు దాడులు చేస్తున్నారు. ఆస్తుల కోసం కొందరు, భారమై మరికొందరు వృద్ధులపై దాడికి పాల్పడుతున్నారు. తాజాగా ఓ కోడలు తన మామను వృద్ధుడని కూడా చూడకుండా చెప్పుతో దాడి చేసింది. వీల్ చైర్ లో కూర్చున్న మామ వద్దకు పరుగున వచ్చిన కోడలు చెప్పుతో కొట్టింది. ఈ ఘటన నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. నవంబర్ 20వ తేదీ ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఈ ఘటన వైరల్ అవుతోంది.
నా ప్రజలతో కొన్ని విషయాలు పంచుకోవాలని అనుకుంటున్నా.. సీఎం రేవంత్ ట్వీట్..
ప్రజాపాలన మొదటి సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా నా ప్రజలతో కొన్ని విషయాలు పెంచుకోవాలని అనుకుంటున్నానని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ మొదటి సంవత్సరంలో వ్యవసాయ రుణాల మాఫీ, పంట బోనస్, ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల్లో మీ ప్రభుత్వం రికార్డు సృష్టించిందని సీఎం తెలిపారు. మన మహిళా సంక్షేమ పథకాలు, కుల గణన, పర్యావరణ, కేంద్రీకృత పట్టణాభివృద్ధి విధానాలు ఇతర ప్రభుత్వాల అనుకరణ కోసం చర్చిస్తున్నామన్నారు. మన ప్రభుత్వం సాధించిన కొన్ని కీలక విజయాలను క్లుప్తంగా జాబితా ఇస్తున్నానని సీఎం ట్వీట్ ద్వారా వివరించారు.
పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ!
పచ్చని కాపురంలో ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ చిచ్చుపెట్టింది. భార్య వ్యవహారాన్ని పసిగట్టి బుద్ధి చెప్పాలనుకున్న భర్త.. ఆమె ముందే ప్రియుడికి దేహశుద్ధి చేశాడు. భార్యతో మాట్లాడుతున్న ప్రియుడిపై ఆమె భర్త, అతని అనుచరులు దాడి చేశారు. ఈ ఘటన శనివారం రాత్రి అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి వద్ద చోటుచేసుకుంది. మదనపల్లె రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి..
అన్నమయ్య జిల్లా ములకల చెరువు మండలం వడ్డిపల్లికి చెందిన ఇంద్ర శేఖర్ (20)కు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వివాహిత పరిచయం అయింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు అప్పుడప్పుడు కలుసుకునేవారు. ఇంద్ర శనివారం వివాహితకు ఫోన్ చేసి మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు పిలిపించుకుని మాట్లాడుతున్నాడు. అదే సమయంలో ఆమె భర్త, అతని అనుచరులు ఆసుపత్రి వద్దకు వచ్చారు. చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటున్న వీరిద్దరినీ గుర్తించి.. రాళ్లతో దాడి చేశారు. ఆపై ఇంద్రను చితకబాదారు. దాడిలో ఇంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది, స్థానికులు అడ్డుకున్నారు.
ఏడాది పాలనపై హరీష్ రావు చార్జీషీట్.. పొన్నం ప్రభాకర్ కౌంటర్..
కాంగ్రెస్ ఏడాది పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చిన చార్జీషీట్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలు ఇచ్చింది చార్జిషీట్ కాదు రిప్రజెంటేషన్ గా భావిస్తున్నామని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ వేరు కాదని తెలిపారు. వాళ్ళు ఇచ్చిన ప్రజెంటేషన్ చార్జిషీట్.. పార్టీలు మాకు ఇచ్చిన రిప్రజెంటేషన్ గా భావించి వాటిని కూడా పరిశీలిస్తామన్నారు. కానీ దురదృష్టకరం ఏమిటంటే సంవత్సర కాలం పరిపాలన తరువాత ఇవాళ మమ్మల్ని విమర్శించిన చార్జిషీట్ ఫైల్ చేసిన బాగుంటుండే అన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుండే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మళ్ళీ సంవత్సరం కాగానే చార్జిషీట్ అని ఇస్తే ఇది భావ్యం కాదన్నారు.
మీ సేవ మొబైల్ యాప్ ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు..
మీ సేవ మొబైల్ యాప్ ను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. మొబైల్ లోనే మీ సేవ సర్వీసులు పొందేలా యాప్ రూపకల్పన చేశారు. మీ సేవలో మరో తొమ్మిది రకాల సర్వీసులను ప్రభుత్వం యాడ్ చేసినట్లు తెలిపారు. గ్యాప్ సర్టిఫికెట్.. సిటిజన్ నేమ్ చేంజ్ వంటి తొమ్మిది రకాల అంశాలను కొత్తగా అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇన్ని రోజులు ఫిజికల్ గా వెళ్లి తీసుకునే అంశాలను ఇక నుంచి మీ సేవ నుంచే పొందే అవకాశం కల్పించామన్నారు. మీ సేవలో కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అన్ని విభాగాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి అభివృద్ధిని ముందుకు సాగించాలని పని చేస్తున్నామని తెలిపారు.
అర్బన్ నక్సలైట్స్ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు.. సీతక్క భావోద్వేగం..
రాష్ట్ర క్యాబినెట్‌లో అర్బన్ నక్సలైట్స్ ఉన్నారని బండి సంజయ్ వ్యాఖ్యలను మంత్రి సీతక్క భావోద్వేగానికి లోనయ్యారు. మహబూబాబాద్ లోని వ్యవసాయ మార్కెట్ లో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. అర్బన్ నక్సలైట్స్ ఉన్నారని బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నా అన్నారు. నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి నన్ను అనేక విధాలుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని తెలిపారు. నా మనసును నొప్పించారని మంత్రి సీతక్క భావోద్వేగానికి గురయ్యారు. నాకు చాలా బాధగా ఉందని అన్నారు.
సమాజ్‌వాదీ నేత ‘‘బీజేపీకి బీ-టీమ్’’..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి(ఎంవీఏ)లో విభేదాలకు కారణమవుతోంది. ఇటీవల శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన నేత, ఠాక్రేకి సన్నిహితుడు మిలింద్ నార్వేకర్.. బాబ్రీ మసీదు కూల్చివేత గురించి ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ పనిని చేసినందుకు గర్విస్తున్నానని పోస్ట్ చేశారు. ఈ పరిణామం ఎంవీఏ కూటమిలో చిచ్చు పెట్టింది. కూటమిలో మిత్రపక్షంగా ఉన్న సమాజ్‌వాదీ(ఎస్పీ) పార్టీ కూటమి నుంచి వైదొలిగింది.
కాకినాడ పోర్ట్ వ్యవహారంలో అన్ని తెలుస్తున్నాయి.. హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. 2018లో అప్పటి హోం మంత్రి చిన్నరాజప్ప చేతులు మీద భూమి పూజ జరిగిన అరిలోవా పోలీస్ స్టేషన్‌ను ఈ రోజు కూటమి ప్రభుత్వమే ప్రారంభించిందన్నారు. విశాఖలో రోడ్డు యాక్సిడెంట్ బాధితుల సహకార కేంద్రం ప్రారంభించామన్నారు. విశాఖలో రోడ్డు ప్రమాదాలలో బాధితులకు ఈ కేంద్రం సహకారం అందించనుందని వెల్లడించారు. రోడ్డు ప్రమాద బాధితుల సహాయం కోసం 7995095793 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామన్నారు. కొన్ని ఇన్స్యూరెన్స్ పాలసీలలో మార్పు రావాలని.. అందుకే ఈ పాలసీ మార్పు మీద దృష్టి పెడుతున్నామన్నారు. ఆటోల వల్ల కొంత సమస్య ఉందని.. ఆటోలకు ట్రాఫిక్ పరంగా శిక్షణ ఇస్తున్నామన్నారు.
ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోంది
జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏడాది పాలన విజయవంతంగా సాగిందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. గతంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాచరిక వ్యవస్థకు అద్దం పట్టేలా రూపొందించారని, కాంగ్రెస్ మాత్రం సామాజిక తెలంగాణ దృక్పథంతో ముందుకు సాగుతుందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రస్తుత తెలంగాణ తల్లి విగ్రహం రైతు బిడ్డ రూపంలో ఉందని, తెలంగాణ తల్లి చేయి హస్తం గుర్తును చూపిస్తుందని బీఆర్‌ఎస్ వాళ్ళు చేస్తున్న ప్రచారం తప్పు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇందిరమ్మ ఇళ్లు ఒక్కసారి ఇచ్చి వదిలేసే కార్యక్రమం కాదు
పదేళ్ల పాలనకు.. ఏడాది ఇందిరమ్మ పాలనకు స్పష్టమైన తేడా ఉందని, మా ప్రభుత్వం వచ్చాక ధరణిని ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేము వచ్చే నాటికి 2 లక్షల 40 వేల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ వస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి. డిసెంబర్ 1 నుంచి ధరణి పోర్టల్ ను NIC కి అప్పగించామని, 2024 కొత్త ఆర్వో ఆర్ చట్టాన్ని తయారు చేశామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదిస్తామని, గతంలో ధరణి 33 మాడ్యుల్స్ తో ఇబ్బందిగా ఉండేదన్నారు. మాడ్యుల్స్ ను తగ్గిస్తామని, వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థను గతంలో ఉన్న పెద్ద దొర రద్దు చేసారన్నారు. మళ్ళీ మేము ఈ వ్యవస్థలను తీసుకు వస్తామని, గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పింక్ షర్ట్స్ వేసుకున్న వాళ్ళకే వచ్చాయన్నారు. మేము అత్యంత నిరుపేదలకు మాత్రమే ఇళ్లు ఇస్తామని, ప్రతి నియోజక వర్గానికి 3500 ఇళ్లు అందిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఒక్కసారి ఇచ్చి వదిలేసే కార్యక్రమం కాదని, కేంద్రం ఇందిరమ్మ ఇళ్లకు నిధులు ఇవ్వకపోయినా మా ప్రభుత్వం ఇస్తుందన్నారు ఆయన.