తెలంగాణ ఆత్మ గౌరవానికి బ్రాండ్ అంబాసిడర్.. రేవంత్
ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారని కేటీఆర్ మాట్లాడితే ఆశ్చర్యంగా అనిపిస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలు మా మధ్య పుల్లలు పెడుతున్నారని.. సీతక్క ఆడ బిడ్డలందరికీ ప్రతీక అని ఆయన అన్నారు. సీతక్క అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పోర్ట్ ఫోలియో నిర్వహిస్తున్నారన్నారు. కేసీఆర్ కమీషన్లలో కేంద్రానికి వాటా ఉందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఆత్మ గౌరవానికి బ్రాండ్ అంబాసిడర్.. సీఎం రేవంత్ అంటూ ఆయన పేర్కొన్నారు. ఎవరెవరు ఒక్కటైనా రేవంత్‌ని ఏం చేయలేరన్నారు. కేసీఆర్ అవినీతిని ప్రోత్సహించిందే బీజేపీ అని.. అనుమతుల్లేని ప్రాజెక్టులకు కేంద్రం అప్పు ఇచ్చిందంటే అర్థం చేసుకోవచ్చన్నారు. కృష్ణా జలాలను కేసీఆర్ తన మిత్రుడు జగన్‌కి తాకట్టు పెట్టారని ఆయన ఆరోపణలు చేశారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి శ్రీనగర్ చేరుకున్న ప్రధాని మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు శ్రీనగర్‌లో పర్యటించనున్నారు. ‘అభివృద్ధి చెందిన భారత్, అభివృద్ధి చెందిన జమ్మూ కాశ్మీర్’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన బక్షి స్టేడియానికి చేరుకున్నారు. వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రపాలిత ప్రాంతానికి ప్రధానమంత్రి సుమారు రూ. 5,000 కోట్ల బహుమతిని ఇవ్వనున్నారు. ప్రధాన మంత్రి తన పర్యటనలో అనేక అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తారు.
శ్రీనగర్‌లో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నీరు, భూమి, ఆకాశం నుండి గట్టి నిఘా నిర్వహించబడుతుంది. ప్రధాని భద్రత కోసం ఎన్‌ఎస్‌జీ కమాండో బాధ్యతలు స్వీకరించారు. ర్యాలీ వేదిక చుట్టూ షార్ప్ షూటర్లను మోహరించారు. సీఆర్‌పీఎఫ్, పోలీసులు ప్రతి సందుపైనా నిఘా ఉంచారు. వైమానిక దళానికి చెందిన MI-17 హెలికాప్టర్లు ఆకాశం నుండి నిశితంగా గమనిస్తున్నాయి. దీంతో పాటు సీసీటీవీ, డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు. అదే సమయంలో మార్కోస్ కమాండోలు సిద్ధంగా ఉన్నారు. శ్రీనగర్‌లోని ప్రతి కూడలిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
చంద్రబాబు-పవన్‌ను నమ్మడం అంటే కాటేసే పాముని నమ్మినట్టే..!
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. చంద్రబాబు – పవన్ ను నమ్మడం అంటే కాటేసే పాముని నమ్మడం – తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడం లాంటిదే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు, దత్త పుత్రుడు ఇద్దరి పేర్లు చెబితే అక్క చెల్లేళ్లకు మోసం, వంచన గుర్తుకు వస్తాయి.. వివాహ వ్యవస్థకు కళంకం తెచ్చిన వ్యక్తి దత్తపుత్రుడని.. కార్లు మార్చినట్టు భార్యలను మార్చిన వ్యక్తి దత్తపుత్తుడు అని హాట్ కామెంట్లు చేశారు. మేనిఫెస్టో అంటే ఎన్నికల సమయంలో రంగుల కాగితాలు చూపించి తర్వాత చెత్త బుట్టలో పడేయడం కాదు.. 2014 ఎన్నికల్లో జనసేన- టీడీపీ మేనిఫెస్టోలో అంశాలను ప్రస్తావించి.. వైఫల్యాలను ఎత్తి చూపారు సీఎం.. పొదుపు సంఘాల రుణాలను రద్దు చేస్తామని ప్రకటించారు.. బాబు వస్తున్నాడు.. రుణ విముక్తి చేస్తాడని ప్రకటనలు ఇచ్చి మరీ మోసం చేశారు అంటూ దుయ్యబట్టారు.
అమర్నాథ్ నాకు మరో తమ్ముడు.. గుండెల్లో పెట్టుకుంటా..
మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. అనకాపల్లి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. బటన్ నొక్కి వైఎస్సార్ చేయూత సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. విపక్షాలపై విరుచుకుపడ్డారు.. ఇక, అమర్నాథ్, భరత్‌పై కీలక కామెంట్లు చేశారు.. కుడి, ఎడమ అమర్నాథ్, భరత్ వున్నారు ఇద్దరు తమ్ముళ్లు… అమర్నాథ్ కు భవిష్యత్ లో చాలా మంచి జరుగు తుంది.. నా గుండెల్లో పెట్టుకుంటాను అన్నారు. భరత్ పోటీ చేస్తున్నాడు ఆశీర్వదించండి అని విజ్ఞప్తి చేశారు.
మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు.. సర్క్యులర్ జారీ
తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మార్చి ప్రారంభం నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల మేర పెరిగినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వేసవి ప్రారంభానికి ముందు రాష్ట్రంలో 32 నుంచి 37 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ తరుణంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పగటిపూట ఎండలు తీవ్రంగా ఉండడంతో తెలంగాణలో హాఫ్ డే స్కూళ్లను నడపాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. మార్చి 15 నుంచి రాష్ట్రంలోని పాఠశాలల్లో ఒకరోజు తరగతులు నిర్వహించాలని చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది.
అమావాస్యే అడ్డు..! త్వరలో శుభవార్త వింటారు..
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరడం దాదాపు ఖరారు అయినట్టు తెలుస్తోంది.. ఈ రోజు వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్, ఎంపీ మిథున్‌రెడ్డితో పాటు కాకినాడ జిల్లాకు చెందిన పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలు అంతా.. కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్లి.. ఆయనతో సమావేశం అయ్యారు.. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడకు వచ్చామని.. పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. అయితే, ఆయన ఆలోచించి తన నిర్ణయం చెబుతానని చెప్పినట్టుగా వైసీపీ నేతలు చెబుతున్నారు.. మరోవైపు.. తన అనుచరులతో ముద్రగడ పద్మనాభం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. త్వరలోనే శుభవార్త వింటారని.. అమావాస్య తర్వాత దానికి సంబంధించిన నిర్ణయం చెబుతానన్నారట.. మనకి ఉన్నత అవకాశం ఇచ్చే వారిని మనం గౌరవించాలి.. కచ్చితంగా రాజకీయాలు చేస్తాను అంటూ తన అనుచరుల దగ్గర ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారట..
ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్కు కీలకమైనవి..
ఈ ఎన్నికలు రాష్ర్ట భవిష్యత్ కు కీలకమైనవి అని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవ్వడం చారిత్రక అవసరం ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడు కాదు అర్జునుడు.. జగన్ సైన్యంలో సైనికుడిగా పని చేస్తాను అని ఆయన వెల్లడించారు. జగన్ ను ముఖ్యమంత్రి చేయడానికి పోటీ నుంచి తప్పు కోవడానికైన సిద్ధం అని అమర్నాథ్ చెప్పుకొచ్చారు.
జగన్‌కు నమ్మకద్రోహం చేసిన వారిని ప్రజలు క్షమించరు…
నెల్లూరు ( Nellore ) జిల్లాలోని కోవూరులో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ లోక్ సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి ( Vijaysai Reddy) పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సామాజిక వర్గానికీ జగన్ ( Jagan ) కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు అని తెలిపారు. కార్పొరేషన్ పెట్టారు కానీ నిధులు ఇవ్వడం లేదని విమర్శలు చేస్తున్నారు.. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం కూడా ఇన్ని కార్పొరేషన్ లను పెట్టలేదు అని ఆయన గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాలు.. పేదలను సమానంగా జగన్ చూస్తున్నారు.. చరిత్ర పుటల్లో సీఎం జగన్ నిలిచిపోతారు.. ఆయన సుపరిపాలన మనం పుస్తకాల్లో చదువుకుంటాం అని ఎంపీ అభ్యర్థ విజయసాయి రెడ్డి ( Vijaysai Reddy) పేర్కొన్నారు.
రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా నేనే పోటీ చేస్తా..
TDP- Janasena: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ( Rajahmundry Rural ) లో టీడీపీ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించిన అనంతరం గోరంట్ల బుచ్చయ్య చౌదరి ( Gorantla Butchaiah Chowdary ) మీడియాతో మాట్లాడుతూ.. రాజమండ్రి రూరల్, నిడదవోలు టీడీపీ- జనసేన ( TDP- Janasena ) ఉమ్మడి అభ్యర్థుల విషయంలో అధిష్టానం క్లారిటీ ఇచ్చిందని స్పష్టం చేశారు. పొత్తులో టిక్కెట్లు విషయమై ఎటువంటి విభేదాలు లేవని అన్నారు. రాజమండ్రి రూరల్ నుండి టీడీపీ ( TDP ) అభ్యర్థిగా నేనే పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. ఇక, నిడదవోలు నుంచి జనసేన అభ్యర్థిగా కందులు దుర్గేష్ పోటీ చేస్తారని వెల్లడించారు. ఈ మేరకు టీడీపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థుల రెండో జాబితాలో పేర్లు ఖరారు చేస్తారని తెలిపారు.
కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఉన్మాద భాష మాట్లాడుతున్నాడు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష సరైంది కాదని, ఆయన మాట్లాడే భాష పై సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయాలన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా తో మాట్లాడుతూ.. కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఉన్మాద భాష మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. 90 రోజుల నుండి రేవంత్ రెడ్డి మాట్లాడే భాష పై …రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, బొంద పెడతాం, మానవ బాంబులు అయితాం, పండబెట్టి తోక్కుతాం అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు అని ఆయన ధ్వజమెత్తారు. స్థాయి లేని వారు చాల మందీ కేసీఆర్ పై మాట్లాడారని, అయిన మేము ఎన్నడు ఎవరిని ఏమీ అనలేదన్నారు. మేము ప్రభుత్వంని పడగొడుతాంమని ఎక్కడ చెప్పలేదని, రేవంత్ రెడ్డి పక్కన ఉండే వాళ్ళతోనే , రేవంత్ రెడ్డికీ ప్రమాదం ఉన్నది… కాబట్టే అలా మాట్లాడుతున్నాడన్నారు. పాలమూరు వలసలను, పచ్చగా చేసిన ఘనత కేసీఆర్ ది నిరంజగన్ రెడ్డి కొనియాడారు. పాలనపై దృష్టి పెట్టకుండా… కేసీఆర్ ను తిట్టడానికి ఉన్నట్లు కనిపిస్తుందన్నారు.
ఆర్టీసీ సంస్థ, ఆర్టీసీ ఉద్యోగులు రాష్ట్రానికి పునాది
ఆర్టీసీలో ఉత్తమ ఉద్యోగులకు అవార్డులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ లో ఉద్యోగులు ఎదురు పీఆర్సీ , పెండింగ్ బిల్స్ పై త్వరలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి తో ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాల్సిన 2017 ,2021 పిఆరిసీ పెండింగ్ బిల్స్ కి సంబంధించిన దానిపై ఈరోజే మాట్లాడతా అని ఆయన వెల్లడించారు. ఆర్టీసీ సంస్థ, ఆర్టీసీ ఉద్యోగులు రాష్ట్రానికి పునాది అని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. ఆర్టీసీ ఉద్యోగులు మేడారం జాతర కోసం చాలా కష్టపడ్డారని, ఎలక్షన్స్ కోడ్ , కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మహాలక్ష్మి స్కీమ్ వర్క్ లోడ్ కారణంగా ఆర్టీసీ బకాయిల పై నిర్ణయం అలస్యమైందని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు మాహాలక్షి పథకం పేరు మీద అవార్డ్స్ ఇవ్వాలని నిర్ణయించామని, ఇప్పటికే సీఎం ఆర్టీసీ కార్మికుల 280 కోట్ల బాండ్స్ ప్రకటించారు అవి కూడా రెండు మూడు రోజుల్లో పేమెంట్స్ రిలీజ్ చేస్తామన్నారు మంత్రి పొన్నం. ఎన్నికల కోడ్ వస్తె ఆగిపోకుండా ముందే పేమెంట్ స్టార్ట్ చేయాలని ఎండి గారిని కోరుతున్నానని, ఆర్టీసీ లో ఆపరేషన్ లాస్ నుండి లాభాల్లోకి రావడానికి కృషి చేస్తున్నామన్నారు. మహాలక్ష్మి పథకంతో నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల పాట పట్టింది.. ఆర్టీసీ మహాలక్ష్మి స్కీమ్ తో కళకళలాడుతోందని, కొత్త బస్ లు, ఉద్యోగుల నియామకాల ను త్వరలోనే చేపడతామన్నారు. అవార్డ్స్ పొందుతున్న వారిని స్ఫూర్తిని తీసుకొని మిగతా ఉద్యోగులు మంచిగా పని చేయాలని ఆయన కోరారు.
మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన NDSA బృందం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని నేషనల్ డ్యాం సెఫ్టీ అథారిటీ బృందం పరిశీలించింది. సిడబ్ల్యుసి మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటి కుంగిన బ్యారేజ్ పియర్స్ ను పరిశీలించింది. ఉదయం 8:30 కు L&T క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్న నిపుణుల బృందం అల్పాహారం ముగించుకుని తొమ్మిదిన్నరకు బ్యారేజ్ పైకి చేరుకున్నారు. 9:30 నుండి 1:30 వరకు సుమారు నాలుగు గంటల పాటు బ్యారేజీ లోని 7 వ బ్లాక్ లోని దెబ్బతిన్న,పగుళ్ల వచ్చిన 18 నుండి 21 పియర్లను పరిశీలించారు. కుంగిన పిల్లర్ల వద్ద బ్యారేజీ పై నుండి పరిశీలించి బ్యారేజీ కుడి, ఎడమవైపు రెండు వైపులా కిందికి దిగి పూర్తిగా అనలైజేషన్ చేసుకున్నారు. ఇరిగేషన్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ NDSA నిపుణుల బృందం లంచ్ తర్వాత అన్నారం సరస్వతీ బ్యారేజీని, రేపు సుందిళ్ల బ్యారేజీని పరిశీలించనున్నట్టు సమాచారం.