2019 లాగే.. 2024లో వైసీపీకి పట్టం కట్టాలి.. మళ్లీ సీఎంగా జగనే ఉండాలి..!
2019 లాగానే, 2024లోనూ వైసీపీకి పట్టం కట్టాలి.. మళ్లీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డే ఉండాలని ఆకాక్షించారు మంత్రి ఆదిమూలపు సురేష్.. పల్నాడులో నిర్వహించిన వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో అబద్ధపు హామీలు ఇచ్చి నట్టేట ముంచారని విమర్శించారు. పేదల గుండె తడి తెలిసిన సీఎం జగన్ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నా రు.. గతంలో పేదలకు అందని ఇంగ్లీష్ విద్యా, అణగారిన వర్గాలకు ఇప్పుడు అందుతుందన్నారు.. గొప్ప పదవుల్లో పేదలు, అణగారిన వర్గాలు ఉంటున్నారు.. గతంలో సామాజిక సాధికార అంశం ఓటు బ్యాంకుగా ఉండేదన్నారు. అయితే, ఇప్పుడు ప్రతి పేదవాడికి మేలు జరిగిందా లేదా? ప్రజలు ఆలోచించాలని సూచించారు. సీఎం వైఎస్ జగన్ సమాజంలో సంపద సృష్టిస్తున్నారు.. స్థూల ఉత్పత్తిలో మెరుగైన స్థానాన్ని ఏపీ సాధించింది.. మళ్లీ వైసీపీకి పట్టం కట్టాలి.. జగనే సీఎంగా ఉండాలి అన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.. ఇక, మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. చంద్రబాబు వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలు మోసానికి గురి అయ్యారు.. జగన్ పాలనలో అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు వస్తున్నాయన్నారు.. మళ్లీ పేదలను మోసం చేయడానికి చంద్రబాబు ఎత్తులు వేస్తున్నాడు అని మండిపడ్డారు. అంబేడ్కర్, జ్యోతి రావ్ పులే ఆశయాల సాధనకు కృషి చేస్తున్న సీఎం జగన్ కు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు మంత్రి పదవులు ఇచ్చిన నాయకుడు సీఎం జగన్.. లక్షా డెబ్బై ఆరువేల కోట్ల రూపాయలకు పైగా బడుగు వర్గాలకు ఇచ్చారని తెలిపారు. దుష్ట చతుష్టయం నుండి జగన్ ను కాపాడు కోవాలి.. జగన్ మరో సారి సీఎం కావాలి అని ఆకాక్షించారు మంత్రి మేరుగ నాగార్జున.
రైతుల ఆత్మహత్యల్లో.. అప్పుల్లో కూడా మన రాష్ట్రానిదే అగ్రస్థానం
రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.. రైతుల అప్పుల్లో కూడా మన రాష్ట్రానిదే అగ్రస్థానమే అని ఆరోపించారు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. వ్యవసాయ రంగంపై వేల కోట్ల ఖర్చు చేశామని ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందన్నారు. ఇక, నాకు విదేశాల్లో వేయి కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని కాకాని తప్పుడు ఆరోపణలు చేశారు.. అదేవిధంగా రైతుల కోసం వెచ్చించిన ఖర్చును కూడా తప్పుగా చూపించారని మండిపడ్డారు.. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.. అంతే కాదు రైతుల అప్పుల్లో కూడా మన రాష్ట్రానిదే అగ్రస్థానం అన్నారు. 400 పైగా మండలాలలో కరువు ఉంటే కేవలం 103 మండలాలను మాత్రమే ప్రకటించారని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులను పరిశీలించేందుకు టీడీపీ నేతల ఆధ్వర్యంలో స్టీరింగ్ కమిటీ పర్యటిస్తోందిన.. రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు.
కాంగ్రెస్ సరిగ్గా పాలిస్తే దేశం దుస్థితి ఇలా ఉండేదా?
బీఆర్‌ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల కోసమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంథనిలో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. దేశంలో రాజకీయ పరిణతి పెరగాలి.. ప్రజస్వామ్య పరిణతి వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఎన్నికల్లో ఆయా పార్టీల ఆలోచనా విధానాన్ని, వైఖరిని చూసి ఓటేయాలని ప్రజలను కోరారు.1956 వరకు ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్సేనని.. 52 ఏండ్ల పాటు తెలంగాణ ప్రజలు నరకం చూశారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం కాంగ్రెస్ కాదా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ సరిగ్గా పాలిస్తే దేశం దుస్థితి ఇలా ఉండేదా అంటూ ప్రశ్నించారు. పుట్టమధు మంథనికి ఎంత చేయాలో అంత చేశారు.. మీరే మధు పని చేశారన్నారు. రేవంత్ 24 గంటల కరెంట్ వద్దు అంటున్నాడని.. కర్ణాటకలో ఇట్లనే చేశారు… 5 గంటల కరెంట్ ఇస్తున్నారని సీఎం అన్నారు. కర్ణాటక ఉపముఖ్యమంత్రే ఈ విషయాన్ని ఒప్పుకున్నారన్నారు. శ్రీధర్ బాబు కుటుంబం 6 సార్లు గెలిచారని… పుట్టమధు ఎందుకు గెలవకూడదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో కూర్చున్న వారికి ఓటేస్తే లాభం లేదు.. లోకల్‌గా వుండే పుట్టమధును గెలిపించాలని కోరారు. బీసీ బిడ్డకు అవకాశం వచ్చింది… వినియోగించుకోవాలన్నారు. మధుని గెలిపిస్తే ఒక రోజంతా మంథనిలో ఉండి.. వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రాహుల్ రైతు బంధు వద్దంటున్నారు.. రాహుల్ కి ఎద్దు ఉన్నదా ఎవుసం ఉందా అంటూ ప్రశ్నించారు.
మరో 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీపీఎం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీపీఎం పార్టీ మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కోదాడ నియోజకవర్గం నుంచి మట్టిపల్లి సైదులు, మునుగోడు నుంచి దోనూరు నర్సిరెడ్డి, ఇల్లందు నుంచి దుగ్గి కృష్ణలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తారని సీపీఎం ఖమ్మం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 14 మంది అభ్యర్థులతో తొలి జాబితా, ఇద్దరు అభ్యర్థులతో రెండో జాబితాను ఇప్పటికే సీపీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలోకి దిగనున్నారు. తమ్మినేని మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీపీఎం పార్టీ పోటీ చేస్తున్న అభ్యర్థులను నిన్న ప్రకటించామన్నారు. ఇవాళ మరో ముగ్గురు అభ్యర్థులను ప్రకటిస్తున్నామన్నారు. కోదాడ నుంచి మట్టిపల్లి సైదులు పోటీ చేస్తారని తెలిపారు. మునుగోడులో గతంలో బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఎన్నికల బరిలోకి రాబోతున్నారని.. వారిని సీపీఐ పార్టీ సమర్థిస్తుంది కానీ సీపీఎం పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. మునుగోడు అభ్యర్థిగా సీపీఎం సీనియర్ నాయకుడు దోనూరి నర్సిరెడ్డిని పోటీలో ఉంచుతామన్నారు. ఇల్లందు స్థానంలో కూడా మేమే అనివార్యంగా పోటీ చేయాల్సి వస్తుంది.. అక్కడ దుగ్గి కృష్ణను సీపీఎం పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉంచుతున్నామన్నారు.
ఏదో ఒక రోజు సీఎం అవుతా..
కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒక రోజు సీఎం అవుతానని ఆయన అన్నారు. కానీ నాకు సీఎం కావాలని లేదని కోమటిరెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంతా తన హయాంలోనే జరిగిందన్నారు. మీ ఆదరణ చూస్తుంటే చర్మం వలిచి చెప్పులు కుట్టించినా తక్కువేనని ఆయన అన్నారు. మాయమాటలు చెప్పి 2018లో బీఆర్ఎస్ గెలిచి.. మోసం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పోలింగ్‌కు ముందు రైతుబంధు డబ్బులు అకౌంట్‌లో వేస్తారు.. మోసపోవద్దన్నారు. ఏపీలో కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుంది అని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపిందన్నారు. ఉద్యోగ ఖాళీల భర్తీలో ప్రభుత్వం విఫలమైందన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆత్మహత్యల కోసం తెలంగాణ తెచ్చుకోలేదన్నారు.ప్రభుత్వ, రిటైర్డ్ ఉద్యోగులకు జీతాలు సరైన సమయంలో అందించడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని ఆయన మండిపడ్డారు. ఉపాధి అవకాశాలు కల్పన లక్ష్యంగా పనిచేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒకటో తేదీనే జీతాలు ఇస్తామన్నారు.
పాక్‌లో ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హతం.. ఈ ఏడాది 18 మంది ఖతం..
ఇన్నాళ్లు భారత వ్యతిరేక ఉగ్రవాదులకు పాకిస్తాన్ సురక్షితం అని భావిస్తుండే వారు.. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. ఏ ఉగ్రవాది ఎప్పుడు ఎలా కిడ్నాప్ అవుతాడో, ఎప్పుడు ఎక్కడ చనిపోయి పడుంటాడో తెలియని పరిస్థితి నెలకొంది. ఎంతలా అంటే పాక్ గూఢాచర సంస్థ ఐఎస్ఐకి కూడా తెలియకుండా గుర్తుతెలియని వ్యక్తులు ఉగ్రవాదుల్ని కాల్చి పడేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఉగ్రదాడులకు పాల్పడిన వారు, భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఖతం అవ్వడం పాకిస్తాన్‌కి మింగుడుపడటం లేదు. యథావిధిగా ఈ హత్యల వెనక శతృదేశ గూఢాచర సంస్థ ఉందని పరోక్షంగా భారత్ నిఘా ఏజెన్సీ ‘ రా ’ని వ్యాఖ్యానించడం తప్పితే ఏం చేయలేకపోతున్నారు. తాజాగా భారత దేశంలో సుంజ్వాన్ ఆర్మీ క్యాంప్‌పై 2018లో ఉగ్రదాడికి వ్యూహకర్తగా వ్యవహిరించిన లష్కరే తోయిబా కమాండర్ ఖవాజా షాహిద్ అలియాస్ మియా ముజాహిద్ కిడ్నాప్ గురై, కుక్కచావు చచ్చాడు. ఐఎస్ఐ ఎంత వెతికినా ఇతని ఆచూకీ లభించలేదు. చివరకు తల నరికివేయబడిన స్థితిలో శవం దొరికింది. ఈ ఘటన ఎల్ఓసీకి సమీపంలోని పాక్ ఆక్రమిత్ కాశ్మీర్(పీఓకే)లో జరిగింది. హత్యకు ముందు లష్కర్ ఉగ్రవాదిని దారుణంగా టార్చర్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇతను పీఓకేలోని నీలం వ్యాలీలో ఉంటున్నాడు. అయితే ఇతన్ని ఎవరు చంపారనే దానిపై పాక్ ప్రభుత్వానికి ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా చంపినట్లు బాధ్యత వహించలేదు.
ఇది కదా కారంటే..? రూ.150 ఖర్చు చేస్తే.. 300 కిలోమీటర్లు వెళ్లొచ్చు..
మార్కెట్‌లోకి ఎన్నో రకాల కార్లు వస్తున్నాయి.. పెట్రోల్, డీజిల్‌తో పాటు ఈవీ కార్లు, హైడ్రోజన్‌తో నడిచే కార్లు కూడా ఉన్నాయి.. కానీ, ఏ కారు మెయిటెన్ చేయాలన్నా ఖర్చుతో కూడుకున్న పని.. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగిపోవడంతో.. కొందరు కారు ఉన్నా.. దానిని బయటకు తీయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి.. మరోవైపు.. యువతరం కొత్త కొత్త ఆవిష్కరణలతో మార్కెట్‌లోకి వస్తుంది.. చాలా తక్కువ ఖర్చుతో ఓ కారును రూపొందించాడు ఓ రైతు బిడ్డ.. గత ఏడాది మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు చెందిన రైతు బిడ్డ ‘హర్షల్ నక్షనేని’ హైడ్రోజన్‌తో నడిచే కారును రూపొందించి అందరి చేత ప్రశంసలందుకున్నాడు. అయితే, తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆ కారును పరిశీలించారు.. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. తక్కువ ధరకే అధిక మైలేజీని అందిస్తున్న ఈ కారు చూడడానికి ఆకర్షణీయంగా ఉండేలా ప్రత్యేకమైన డిజైన్ ను కలిగి ఉంది. ఇంత గొప్ప కారును తయారు చేసిన నక్షనేనిని.. దేవేంద్ర ఫడ్నవీస్ అభినందించారు. అంతే కాకుండా ఆయనను కలవడం ఆనందంగా ఉందని సోషల్ మీడియాలో వెల్లడించారు.. ఆకుపచ్చ రంగులో కనిపించే ఈ కారు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా పనిచేసే ‘సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్’ను పొందిందని హర్షల్ వివరించారు. ఇది ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్‌లో వైరల్ అవుతోంది. ఇందులో కారు తనంతట తానుగా ముందుకు వెళ్తుంది.. ఈ హైడ్రోజన్ కారును తయారు చేసేందుకు హర్షల్ నక్షనేయ్ దాదాపు రూ. 25 లక్షలు ఖర్చు చేసినట్లు ఆయన వెల్లడించారు. కేవలం రూ.150కే హైడ్రోజన్‌ను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 300 కిలోమీటర్ల రేంజ్‌ను ఈ కారు అందిస్తుందన్నారు.
వందేభారత్ ఎక్స్ప్రెస్లో లెజెండ్స్ లీగ్ క్రికెట్ ట్రోఫీ ప్రచారం.. పాల్గొననున్న స్టార్ క్రికెటర్లు
లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్‌ఎల్‌సీ) రెండవ ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. ఈ నెల 18 నుంచి డిసెంబర్ 9 వరకు ఎల్‌ఎల్‌సీ టోర్నీ జరుగనుంది. డెహ్రాడూన్, రాంచీ, జమ్ము, విశాఖపట్నం, సూరత్ నగరాల్లో లెజెండ్స్ లీగ్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ టోర్నీలో అర్బన్ రైజర్స్ హైదరాబాద్, ఇండియా క్యాపిటల్స్, మణిపాల్ టైగర్స్, గుజరాత్ జెయిం ట్స్, సదరన్ సూపర్ స్టార్స్, బిల్వారా కింగ్స్ పోటీపడుతున్నాయి. అయితే రెండో సీజన్‌కు ప్రచారం కల్పించడంలో భాగంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఎల్‌ఎల్‌సీ ట్రోఫీ టూర్ నిర్వహిస్తామని నిర్వాహకులు ప్రకటించారు. రేపటి నుంచి ఢిల్లీలో ప్రచారం ప్రారంభం అవుతుంది. 15 రోజుల పాటు.. 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రచారం జరుగనుంది. ఈ ప్రచారంలో పలువురు కేంద్ర మంత్రులు, భారతీయ రైల్వే బృందం భాగం కానున్నారు. దేశంలోని ప్రముఖ క్రీడా ప్రముఖులు కూడా ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో పాల్గొంటారు. గౌతమ్ గంభీర్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, క్రిస్ గేల్, కెవిన్ పీటర్సన్, ఎస్ శ్రీశాంత్, పార్థివ్ పటేల్, షేన్ వాట్సన్, ప్రవీణ్ కుమార్, ఝులన్ గోస్వామి వంటి వెటరన్‌లు ఈ ప్రత్యేక ప్రచారంలో చేరనున్నారు.
ధమ్ మసాలా బిర్యానీ.. గుద్ది పారేయ్ గుంటూర్నీ
సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఎప్పటినుంచో ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ రిలీజ్ అవుతుంది.. రిలీజ్ అవుతుంది అని చెప్పుకొస్తున్నారు తప్ప రిలీజ్ చేసింది లేదు. మొన్న దసరాకు కూడా ఈ సింగిల్ రిలీజ్ అవుతుంది అనుకున్నారు. కానీ, అప్పుడు కూడా రిలీజ్ చేయలేదు. ఇక ఈ మధ్యనే ఈ సాంగ్ లిరిక్స్ లీక్ అవ్వడంతో మేకర్స్ దిగివచ్చి.. ప్రోమో ను రిలీజ్ చేశారు. నేడు త్రివిక్రమ్ పుట్టినరోజు కావడంతో మొదటి సాంగ్ ను రిలీజ్ చేసి త్రివిక్రమ్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. ధమ్ మసాలా బిర్యానీ అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంది. థమన్ సంగీతం అందించిన ఈ సాంగ్ మొత్తం మహేష్ క్యారెక్టర్ ను తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి ఈ సాంగ్ కు లిరిక్స్ అందించారు. ఇక వీడియోలో మహేష్ ఊర మాస్ మసాలా లుక్ లో అదరగొట్టాడు. ఈ పాటను సంజిత్ హెగ్డే మరియు థమన్ లు కలిసి ఆలపించారు. మహేష్ ఇమేజ్ కి తగ్గట్లుగా మ్యూజిక్ ఉందని, అలాగే లిరిక్స్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి. మొత్తానికి ఫస్ట్ సింగిల్ తో సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేశారు. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో మహేష్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.
త్రివిక్రమ్ బర్త్ డే.. బండ్లన్న పోస్ట్ వైరల్
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో సైతం బండ్లకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఏ విషయం అయినా కూడా ముక్కుసూటిగా చెప్పుకొచ్చేస్తాడు. ఇవన్నీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ కు బండ్లన్న ఎంత పెద్ద ఫ్యాన్ అనేది అందరికి తెలిసిందే. ఫ్యాన్ అని కాకుండా బండ్లన్నను భక్తుడు అని పిలవాలి. పవన్ కళ్యాణ్ ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బండ్లన్న స్పీచ్ ఉండాల్సిందే ఇంకా చెప్పాలంటే.. బండ్లన్న స్పీచ్ కోసమే ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు వెళ్లేవారు. ఇక వీరిద్దరి మధ్యలో త్రివిక్రమ్ వచ్చాడు. త్రివిక్రమ్ వచ్చినదగ్గరనుంచి బండ్ల.. పవన్ కు దూరమయ్యాడని టాక్ నడిచింది. ఈ నేపథ్యంలోనే వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బండ్ల కు ఆహ్వానం రాలేదు. ఆ సమయంలో బండ్ల.. త్రివిక్రమ్ పై విరుచుకుపడ్డాడు. అభిమానులతో త్రివిక్రమ్ గురించి ఘాటు ఆరోపణలే చేశాడు. అప్పుడు బండ్ల ఆడియో ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సమయం చిక్కినప్పుడల్లా.. గురూజీ ని విమర్శించే బండ్ల.. నేడు త్రివిక్రమ్ కు బర్త్ డే విషెస్ చెప్పడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. నేడు త్రివిక్రమ్ పుట్టినరోజు కావడంతో ఉదయం నుంచి సెలబ్రిటీలు అందరూ.. మాటల మాంత్రికుడుకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇక తాజాగా బండ్ల కూడా.. ” త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు .. మీకు జన్మదిన శుభాకాంక్షలు. గుంటూరు కారం సినిమా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు షాక్ అవుతున్నారు . మొన్నటివరకు ఓ రేంజ్ లో తిట్టేసి.. ఇప్పుడేంటి సడెన్ గా బర్త్ డే విషెస్ చెప్తున్నారు అని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం బండ్లన్న పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.