*రాష్ట్ర ప్రజలకు శుభవార్త.. త్వరలోనే ఆ హామీల అమలు
రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలోనే ఆ రెండు హామీల అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈరోజు కేస్లాపూర్‌లోని నాగోబా దర్బార్‌లో స్వయం సహాయక సంఘాలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ రూ.1200 ఉందని, త్వరలో మహిళలకు రూ.500లకే ఇస్తామని తెలిపారు. అలాగే.. త్వరలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చారని గుర్తు చేశారు. స్కూల్ యూనిఫామ్‌లు కుట్టే అవకాశం స్వయం సహాయక బృందాలకే కల్పిస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలకు కడుపునొప్పి ఎందుకని ప్రశ్నించారు. ఇక.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ నాగోబాను దర్శించుకున్నారు. ఈ పూజల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
*ఇలాంటి దైర్యం చంద్రబాబు నాయుడు చేయగలరా…!
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో కార్యకర్తలు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప, హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త శాంతమ్మ పాల్గొన్నారు. ‘సిద్ధం’ పోస్టర్‌ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్రంలో ప్రతి మండలానికి వందల కోట్ల రూపాయలు పథకాల ద్వారా లబ్ధి జరిగిందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. హంద్రీనీవా పూర్తి చేసి వీలైనంత త్వరగా అన్ని ప్రాంతాలకు నీరు అందిస్తామన్నారు. చంద్రబాబు నాయుడు కోట్ల రూపాయలకు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఉపాధి హామీ దిన కూలి అయినా ఈరలక్కప్పకు సీఎం జగన్ మడకశిర టికెట్ ఇచ్చారని.. ఇలాంటి దైర్యం చంద్రబాబు నాయుడు చేయగలరా అంటూ సవాల్ విసిరారు. ఏ పార్టీ డబ్బు ఉన్నవాళ్ళకి టికెట్ ఇస్తుందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. 99.5 శాతం ఎన్నికల హామీలు అమలు చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని ఆయన తెలిపారు. గతంలో జన్మభూమి కమిటీలు వారికి కావాల్సిన వారికి మాత్రమే పథకాలు ఇచ్చేవారని ఆయన విమర్శించారు. రానున్న ఎన్నికల్లో భారీ విజయంతో జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుడిబండ మండలంలో పర్యటించారు. నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప ఇంటికి మంత్రి వెళ్లారు. ప్రజాబలంతోనే నిరుపేద అయిన ఈరలక్కప్పకు టికెట్ ఇచ్చామని ఆయన అన్నారు. పేదవాడిని శాసనసభ్యుడిగా చేసి చూపిస్తామని, ఇలాంటి అభ్యర్దిని పెట్టే సాహసం చంద్రబాబు చేయగలరా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు టిక్కెట్లు అమ్ముకుంటున్న విషయాన్ని కేశినేని నాని కూడా బయటపెట్టారన్నారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మడకశిర ప్రాంతంలో పర్యటిస్తారని అంటున్నారని… కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో లేదు… ఈసారి కూడా ఒక్క సీటు వచ్చే పరిస్థితి ఆ పార్టీకి లేదన్నారు. సీఎంను అకారణంగా టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. షర్మిలను చంద్రబాబు రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారని ప్రజలు గమనిస్తున్నారన్నారు. రఘువీరా రెడ్డి రాజశేఖర్ రెడ్డి అడుగులకు మడుగులు ఒత్తారని.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రఘువీరాకు అనేక పదవులు ఇచ్చి ప్రోత్సహించారని ఈ సందర్భంగా చెప్పారు. ఆయన మరణానంతరం కిరణ్ కుమార్ రెడ్డి వద్ద చేరి, ఎలా దోచుకున్నారో ప్రజలందరూ చూశారన్నారు. కొంతమందిని కలిసి రఘువీరా రెడ్డి వారిని మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు. మడకశిర ఎస్సీ నుంచి 2029లో జనరల్ అవుతుందని… ఆ సీటు ఇస్తామని చెప్తున్నారని తెలిసిందన్నారు. ఒకవేళ అదే జరిగితే ఆ సీటు నుంచి ఆయన కుటుంబసభ్యులే పోటీ చేస్తారన్నారు.
రాజకీయాలు చేసే రఘువీరారెడ్డికి ఈ ఎన్నికల్లో పోటీ చేసే దైర్యం ఉందా అంటూ మంత్రి పెద్దిరెడ్డి సవాల్ విసిరారు.
*కిలాడి బ్యాంక్ మేనేజర్.. బ్యాంకులో కుదువ పెట్టిన బంగారంతో వడ్డాణం
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు యూనియన్ బ్యాంకు శాఖ మేనేజరుగా పనిచేస్తున్న దావులూరి ప్రభావతిపై పెనమలూరు పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. బ్యాంక్ మేనేజర్ బ్యాంకులో కుదువ పెట్టిన బంగారంతో వడ్డాణం చేయించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గతంలోనూ పలువురిని మోసం చేసి గంగూరు యూనియన్ బ్యాంక్ మేనేజర్ డబ్బులు గుంజినట్లు పేర్కొన్నారు. గంగూరు బ్యాంకు మేనేజరుపై పెనమలూరు పోలీసుల కేసు నమోదు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గంగూరు యూనియన్ బ్యాంకు శాఖ మేనేజరుగా పనిచేస్తున్న ప్రభావతికి భర్తతో విబేధాలున్నాయి. ఆమె స్వగ్రామం నూజివీడు మండలం మర్రిబంధం గ్రామం కాగా.. అదే గ్రామానికి చెందిన కవులూరి యోగేశ్వరరావుకు హైదరాబాద్‌లో ఉన్న బ్యాంకు ఖాతాను ప్రభావతి గంగూరు శాఖకు ట్రాన్స్ఫర్ చేయించింది. ఈ సందర్భంగా యోగేశ్వరరావు తన వద్ద ఉన్న 380 గ్రాముల బంగారం కోసం లాకరు అడిగాడు. ప్రభావతి లాకరులో బంగారం దాయటం కన్నా బ్యాంకు రుణం తీసుకోమని ఆయనకు సూచించింది. దీంతో యోగేశ్వర రావు రూ.2 లక్షలు రుణం తీసుకున్నాడు. తీసుకున్న రుణాన్ని ఆయన గతేడాది నవంబరులో చెల్లించాడు. అనంతరం బ్యాంకులో తనఖా పెట్టిన బంగారు ఆభర ణాలు గురించి అడగ్గా ఆ నగలు తన వద్దనే ఉన్నాయని ప్రభావతి తెలిపింది. ఈ విషయమై గంగూరులోని తన ఇంటికి వచ్చి మాట్లాడమని కోరింది. యోగేశ్వరరావు ఆమె ఇంటికి వెళ్లి బంగారు ఆభర ణాలు విషయమై ప్రశ్నించగా తనంటే ఇష్టమని, పెళ్లి చేసుకోమని కోరింది. బంగారు ఆభరణాలతో వడ్డాణం చేయిస్తున్నానని చెప్పింది. ఒక్కసారిగా యోగేశ్వరరావు షాక్ తిన్నాడు. ఈ ఘటనపై యోగేశ్వరరావు పోలీసులను ఆశ్రయించాడు. తన ప్రమేయం లేకుండా తన సంతకాన్ని ప్రభావతి ఫోర్జరీ చేసి ఆభరణాలు కాజేసిందని పేర్కొన్నాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
*హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిన ఝార్ఖండ్ పాలిటిక్స్
ఝార్ఖండ్ (Jharkhand) సంక్షోభానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఎట్టకేలకు చంపయ్ సోరెన్ (Champai Soren) సీఎంగా ప్రమాణం చేశారు. హేమంత్ సోరెన్ (Hemant Soren) అరెస్ట్ తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో తీవ్ర సందిగ్ధం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా చంపయ్ సోరెన్‌ను 43 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకున్నట్లు మద్దతుతో కూడిన లేఖను గవర్నర్ రాధాకృష్ణన్‌కు అందజేశారు. ప్రమాణస్వీకారానికి ఆహ్వానించాలని విజ్ఞప్తి చేసినా కొన్ని గంటల పాటు గవర్నర్ హోల్డ్‌లో పెట్టారు. దీంతో రాజ్‌భవన్ వేదికగా ఏదో కుట్ర జరుగుతోందని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి అనుమానించింది. మొత్తానికి గురువారం అర్ధరాత్రి గవర్నర్.. చంపయ్‌ను ప్రమాణస్వీకారానికి పిలిచారు. ఇక శుక్రవారం ఉదయం చంపయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇదిలా ఉంటే అసెంబ్లీలో బలనిరూపణకు గవర్నర్ 10 రోజులే సమయం విధించారు. దీంతో మరోసారి కూటమిలో భయాందోళన మొదలైంది. ఈ మధ్యలో ఏదైనా జరగొచ్చన్న సందేహంతో జేఎంఎం క్యాంప్ రాజకీయాలకు తెరలేపింది.
ఝార్ఖండ్ అసెంబ్లీలో 81 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 41 ఎమ్మెల్యేల బలం ఉంటే చాలు. సంకీర్ణ ప్రభుత్వానికి 43 ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు బీజేపీకి (BJP) కూడా 35 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కొంత మంది ఎమ్మెల్యేలను పువ్వుపార్టీ లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ఆదేశాల మేరకు 43 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు (Hyderabad) తరలిస్తున్నారు. గురువారమే తరలించాలని చూసినా పొగమంచు కారణంగా విమాన ప్రయాణానికి అంతరాయం కలిగి ఆగిపోయారు. శుక్రవారం మాత్రం రెండు ప్రత్యేక విమానాల్లో ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఝార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష వరకూ ఎమ్మెల్యేలంతా ఇక్కడే మకాం వేయనున్నారు. ఝార్ఖండ్‌కు చెందిన జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీకి చెందిన 43 మంది ఎమ్మె్ల్యేలను ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్‌కు తరలిస్తు్నారు. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలోనే కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎమ్మెల్యేలు భద్రంగా ఉండాలంటే హైదరాబాదే సేఫ్ అని ఏఐసీసీ భావించింది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు షిఫ్ట్ చేస్తున్నారు. 10 రోజుల పాటు ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌లోనే మకాం వేయనున్నారు. ఝార్ఖండ్ అసెంబ్లీలో 81 స్థానాలు ఉన్నాయి. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీకి 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక బీజేపీకి 35 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఇంకో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉంటే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కూటమి ఎమ్మెల్యేలకు గాలం వేస్తోందని.. వారితో బేరసారాలు నడుపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.
*మేయర్ ఎన్నికల్లోనే ఇలా చేస్తే.. బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏం చేస్తుందో.
చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు అన్యాయమని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆరోపిస్తోంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ రోజు ఆప్ నిరసనకు పిలుపునిచ్చింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్ చేసి గెలుపొందిందని, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ స్థాయికైనా వెళ్లొచ్చని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. బీజేపీ వైఖరికి నిరసనగా ఢిల్లీలో బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయానికి ముందు ఆప్ ప్రదర్శన నిర్వహించింది. పోలీసులు భారీగా మోహరించి ఆప్ కార్యకర్తల్ని అడ్డుకున్నారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ ఓట్లను దొంగలించిందని కేజ్రీవాల్ ఆరోపించారు. మేయర్, సీనియర్ డిప్యూటీ మేయర్ మరియు డిప్యూటీ మేయర్ పదవులకు మంగళవారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్-ఆప్ కూటమిని ఓడించి అన్నింటిని గెలుచుకుంది. గత కొన్నేళ్లుగా బీజేపీ రిగ్గించ్ చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి, ఈవీఎం ట్యాంపరింగ్, ఓటర్ల జాబితా నుంచి ఓట్లను తొలగించడం వంటివి చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయని, అయితే వాటికి ఆధారాలు కనుగొనబడలేదని, కానీ చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని కేజ్రీవాల్ అన్నారు. మేయర్ ఎన్నికల్లోనే ఇలాంటి అవకతవకలకు పాల్పడిగే, పార్లమెంట్ ఎన్నికల్లో పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని కాపాడాలని ఆయన కోరారు.
*ఝార్ఖండ్, ప్రత్యేక దేశంపై లోక్‌సభలో రగడ.. విపక్షాల వాకౌట్
పార్లమెంట్ (Parliament) బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ప్రారంభమైన రెండ్రోజులు సాఫీగా సాగినా శుక్రవారం మాత్రం హాట్ హాట్‌గా నడిచాయి. బుధవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంతో సభ ప్రారంభమైంది.. గురువారం మాత్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బడ్జెట్ ప్రసంగంతో ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం మాత్రం ఉభయ సభలు ప్రారంభం కాగానే ఇండియా కూటమి సభ్యులు ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ (Hemant Soren) అరెస్ట్ అంశాన్ని లేవనెత్తారు. దీంతో ఉభయ సభలు గందరగోళం చోటుచేసుకుంది. రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge) మాట్లాడుతూ.. బీహార్‌లో నితీష్‌కుమార్ (Nitish Kumar) రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారని.. ఝార్ఖండ్‌లో కూటమికి సంపూర్ణ మద్దతు ఉన్న కూడా ప్రమాణస్వీకారానికి మాత్రం ఆలస్యం చేశారని ఆరోపించారు. బీజేపీ జోక్యంతోనే ఝార్ఖండ్‌లో హేమంత్ సోరెన్‌ను అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. ఖర్గే వ్యాఖ్యలను కేంద్రమంత్రి పీయూస్ గోయల్ ఖండించారు. ఝార్ఖండ్‌లో జరిగిన భూకుంభకోణం కారణంగానే హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యారని.. ఆ కారణంగానే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని తెలిపారు. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన వ్యక్తిని కాంగ్రెస్ ప్రోత్సహిస్తుందా? అని కేంద్రమంత్రి నిలదీశారు. ఇదే అంశంపై లోక్‌సభలోనూ రచ్చ నడిచింది. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఇదిలా ఉంటే మధ్యంతర బడ్జెట్లో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగిందని.. ఇలాగైతే సౌతిండియాను ప్రత్యేక దేశంగా చేయాలంటూ డిమాండ్ చేయాల్సి వస్తోందని కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ (DK Suresh) గురువారం వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కూడా ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. సోనియాగాంధీ (Sonia Gandhi) క్షమాపణ చెప్పాలని కేంద్రమంత్రులు పీయూస్ గోయల్, ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే స్పందిస్తూ.. ప్రత్యేక దేశ డిమాండ్‌ను కాంగ్రెస్ అంగీకరించబోదని తేల్చిచెప్పారు. డీకే సురేష్ వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు.
*మాజీ సీఎం హేమంత్ సొరెన్‌కి 5 రోజుల ఈడీ కస్టడీ..
భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్‌ని శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 5 రోజుల కస్టడీకి తీసుకుంది. ఈ కేసులో కేసులో హేమంత్ సోరెన్‌ను ఏడు గంటలకు పైగా విచారించిన తర్వాత బుధవారం ఈడీ అరెస్ట్ చేసింది. అయితే, దీనిపై ఆయన ఏక కాలంలో జార్ఖండ్ హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించారు. ఈ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి అంతకుముందు రోజు సుప్రీంకోర్టు నిరాకరించింది. జార్ఖండ్ హైకోర్టుని ఆశ్రయించాల్సిందిగా సూచించింది. జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాల్సిందిగా 48 ఏళ్ల జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) చీఫ్ హేమంత్ సొరెన్‌ని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎంఎం సుందరేష్, బేల ఎం త్రివేదిలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం కోరింది. దర్యాప్తు సంస్థ జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని, అరెస్టును చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన పక్షంలో అత్యున్నత న్యాయస్థానం ఈ విధంగా స్పందించింది. ఈడీ అరెస్ట్ చేయడం కన్నా ముందే ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రంలో జేఎంఎం, కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉంది. మరోవైపు ఈ రోజు హేమంత్ సొరెన్ నమ్మకస్తుడు చంపై సోరెన్ కొత్త ముఖ్యమంత్రగి ప్రమాణస్వీకారం చేశారు.
*బ్రేకింగ్.. రాజకీయాలలోకి స్టార్ హీరో విజయ్.. పార్టీ పేరు అధికారిక ప్రకటన
తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తాడన్న ఉత్కంఠకు ఎట్టకేలకు ఈ రోజు సమాధానం దొరికింది. ఢిల్లీ వెళ్లి భారత ఎన్నికల సంఘం వద్ద పార్టీ పేరు నమోదు చేసుకున్నారు హీరో విజయ్. ఇక సంబంధిత పత్రాలను ఆన్లైన్లో కూడా షేర్ చేశారు. అంతేకాదు టీవీకే విజయ్ పేరిట ప్రత్యేక సోషల్ మీడియా ఖాతాలు ప్రారంభమయ్యాయి. మొదటిసారిగా ఒక నివేదిక ప్రచురించబడింది. తమిళనాడు వెట్రి కజగం పేరుతో రాసిన లేఖలో ప్రియమైన తమిళనాడు ప్రజలందరికీ నా వినయపూర్వకమైన నమస్కారాలు.”విజయ్ పీపుల్స్ మూవ్మెంట్” అనేక సంవత్సరాలుగా తన శక్తి మేరకు అనేక సంక్షేమ పథకాలు, సామాజిక సేవలు మరియు సహాయ సహకారాలు చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. అయితే, ఒక స్వచ్ఛంద సంస్థ మాత్రమే పూర్తి సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ సంస్కరణలు తీసుకు రావడం అసాధ్యం, దానికి రాజకీయ అధికారం కావాలి. ప్రస్తుత రాజకీయ వాతావరణం మీ అందరికీ తెలిసిందే. ఒకవైపు పాలనాపరమైన దురాచారాలు, “అవినీతి రాజకీయ సంస్కృతి”, మరోవైపు మన ప్రజలను కుల, మతాల వారీగా విభజించేందుకు ప్రయత్నిస్తున్న “విభజన రాజకీయ సంస్కృతి” మన ఐక్యతకు, ప్రగతికి అడ్డంకులుగా ఉన్నాయి. నిస్వార్థ, పారదర్శక, కుల రహిత, దార్శనికత, అవినీతి రహిత సమర్ధవంతమైన పరిపాలనకు దారితీసే మౌలికమైన రాజకీయ మార్పు కోసం ముఖ్యంగా తమిళనాడులో ప్రతి ఒక్కరూ తహతహలాడుతున్నారనేది వాస్తవం అని అన్నారు. మరీ ముఖ్యంగా, తమిళనాడు రాష్ట్ర హక్కులపై ఆధారపడిన మన భారత రాజ్యాంగానికి లోబడి ఇటువంటి రాజకీయాలు ఉండాలి, ఈ భూమికి “బిర్బోకోమ్ ఎల్లా బియొక్కుమ్” (పుట్టుకతో అందరూ సమానమే) అనే సమానత్వ సూత్రంపై ఆధారపడి ఉండాలని పేర్కొన్నారు. ఇటువంటి మౌలికమైన రాజకీయ మార్పు ప్రజల ఏకగ్రీవ అభిమానం మరియు ప్రేమ కలిగిన ప్రజాశక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని అందుకే టీవీకే తమిళనాడు వెట్రి కజగం పార్టీతో ప్రజల్లోకి వస్తున్నామని పేర్కొన్నారు.
*శృంగార తార పూనమ్ పాండే.. అసలు ఎవరీమె.. ఆమె నగ్న చరిత్ర ఏంటీ..?
Poonam Pandey: పూనమ్ పాండే.. ఈ పేరు నేడు సోషల్ మీడియాలో మారుమ్రోగుతుంది. పూనమ్.. ఒక శృంగార తార, ఒక మోడల్, ఒక నటి. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ఆమె ఎంచుకున్న మార్గం అందాల ఆరబోత. మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన పూనమ్ 32 ఏళ్ళ వయస్సులో గర్భాశయ క్యాన్సర్ తో నేడు కన్నుమూసింది. దీంతో ఆమె గురించి తెలుసుకోవాలని చాలామంది పూనమ్ గురించి గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. పూనమ్ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించింది. 12వ తరగతి తర్వాత మోడలింగ్ చేయసాగింది. 2010లో గ్లాడ్‌రాక్స్ పత్రిక నిర్వహించిన అందాల భామల పోటీలో తొలి 8 మందిలో ఒకరిగా నిలిచింది. అలాగే ఒక ఫ్యాషన్ పత్రిక కవర్ పేజీపై పూనమ్ అందాలను ఆరబోసి బాలీవుడ్ లోని ప్రముఖుల కంట్లో పడింది. అలా నటిగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.
పూనమ్ జీవితాన్ని మార్చేసిన వరల్డ్ కప్
సాధారణంగా క్రికెట్ అభిమానులతో పాటు ప్రతి భారతీయుడు కోరుకొనేది వరల్డ్ కప్. 2011 లో ప్రతి ఒక్కరి కన్ను వరల్డ్ కప్ మీదనే ఉంది. ఇక ఇదే తనకు అదునైన సమయం అనుకుంది పూనమ్. దేశం మొత్తం ఒక్కసారిగా తన గురించి మాట్లాడాలనుకుంది. వెంటనే.. ఇండియా వరల్డ్ కప్ సాధిస్తే.. వాంఖడే స్టేడియంలో నగ్నంగా తిరుగుతాను అని సంచలన ప్రకటన చేసింది. అనుకున్నట్లుగానే అందరి అటెన్షన్ ఆమెమీదకు చేరింది. నిజం చెప్పాలంటే.. చాలామంది పూనమ్ నిజంగా చేస్తుందా.. ? లేదా.. ? చూడాలనే ఇండియా గెలవాలని కోరుకున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఎట్టకేలకు ఇండియా గెలిచింది. చెప్పినవిధంగానే పూనమ్ నగ్నంగా తిరగడానికి రెడీ అయ్యింది. కానీ, స్టేడియంలో ఒక అమ్మాయి నగ్నంగా తిరగడాన్ని బీసీసీఐ ఒప్పుకోలేదు. అయినా మాట మీద నిలబడిన పూనమ్.. ఎవరు లేని సమయంలో నగ్నంగా తిరిగి వీడియో రిలీజ్ చేసింది. ఇక ఆ అమ్మాయి ధైర్యాన్ని చూసి ప్రతి ఒక్కరు ముక్కున వేలేసుకున్నారు. అలా పూనమ్ అనుకున్నది సాధించింది.
శృంగార యాప్
పూనమ్ పాండే శృంగార తారగా మారడం ఆమె అమ్మకు ఇష్టం లేదు. స్టేడియంలో నగ్నంగా తిరుగుతాను అని ప్రకటించినప్పుడే ఆమె చితకబాది.. ఇంట్లోనుంచి బయటకి పంపించేసిందని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. అయినా పూనమ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. సాధారణంగా శృంగార తారల వీడియోలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, పూనమ్ మాత్రం తన స్వంత గుర్తింపును తానే సంపాదించుకుంది. ఓన్లీ ఫ్యాన్స్ అనే యాప్ లో తన ప్రైవేట్ వీడియోలను, ఫోటోలను అప్లోడ్ చేసి.. డబ్బు సంపాదించేది. ముందుగా ఈ శృంగార తార.. అందమైన భంగిమలతో ఆ వీడియోకు ఒక ప్రోమోను రెడీ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసేది. దాని ఫుల్ వీడియో కోసం డబ్బులు కట్టి చూడాలని , ఓన్లీ ఫ్యాన్స్ యాప్ లో చూడమని కోరేది. ఇక ఈ యాప్ లో 210 ప్రైవేట్ ఫోటోలు, 269 ప్రైవేట్ వీడియోలు, 298 లైవ్ స్ట్రీమింగ్స్ షేర్ చేసింది. ఇక ఈ యాప్ ద్వారా ఈ చిన్నది బీగానే సంపాదించింది. అంతేకాకుండా ఈ వీడియోల ద్వారా.. బాలీవుడ్ లో కొన్ని శృంగార సినిమాల్లో కూడా నటించింది.
ప్రేమ-పెళ్లి- వివాదం
ఏ ఆడపిల్ల జీవితంలో అయినా భర్త మంచివాడు అయితే.. ఆమె జీవితం వెలుగులతో నిండిపోతుంది. కానీ, పూనమ్ జీవితంలోకి సామ్ బాంబే రావడంతో చీకటి నిండుకుంది. సామ్ బాంబే అనే డైరెక్టర్ తో పూనమ్ ప్రేమాయణం మొదలుపెట్టింది. అతడితో కలిసి దిగిన ప్రైవేట్ ఫోటోలను, వీడియోలను తన యాప్ లో షేర్ చేయగా, వాటిని గూగుల్ బ్యాన్ చేసింది. ఇక ఈ ప్రేమ.. పెళ్ళికి దారి తీసింది. 2020 సెప్టెంబర్ 1న సామ్ బాంబేను పెళ్లాడింది పూనమ్. అప్పుడు కరోనా టెన్షన్ వల్ల ఈ వివాహాన్ని సింపుల్‌గా జరిపించారు. ఏదైతే అది అయ్యింది. పెళ్లి తరువాత ఈ జంట హ్యాపీగా ఉంటారు అనుకోని సంబురపడేలోపు.. పూనమ్ తన భర్త వేధింపులు తట్టుకోలేక పోలీస్ స్టేషన్ కు వెళ్లి కూర్చోంది. పట్టుమని పదిరోజులు కూడా కాకముందే భర్తపై గృహహింస కేసుపెట్టి మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అత్యాచార వేధింపులు, బెదిరింపుల కింద అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే భార్యాభర్తలిద్దరూ కలిసిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలా ఎన్నోసార్లు గొడవలు, కలిసిపోవడాలు తర్వాత చివరకు విడాకులు తీసుకున్నారు. అదే ఏడాదిలో పోలీసులు పూనమ్నూ అరెస్ట్ చేశారు. గోవాలోని ప్రభుత్వ స్థలంలో అశ్లీల వీడియో చిత్రీకరించినందుకుగానూ జైల్లో పెట్టారు. పోర్నోగ్రఫీ కేసులో కూడా ఈమె పేరు ప్రధానంగా వినిపించింది.
లాకప్ షో
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్ చేసిన లాకప్ షోలో పూనమ్ కంటెస్టెంట్ గా వెళ్లి సంచలనం సృష్టించింది. తమ జేవేయితంలో జరిగిన అతి దారుణమైన ఘటనలను ఈ షోలో చెప్పాల్సి ఉంటుంది. ఈ షోలో పూనమ్ పూర్తిగా ఓపెన్ అయ్యింది. “పెళ్లి చేసుకున్నాక టార్చర్ చూశాను. తల్లిదండ్రులూ ఏ కారణం లేకుండానే ఇంట్లో నుంచి గెంటేశారు. అందరూ కేవలం నన్ను డబ్బు సంపాదించే యంత్రంగానే చూశారు. నన్ను తిట్టుకునేముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సమయంలో ప్రతిఒక్కరు కూడా పూనమ్ కు సపోర్ట్ చేశారు. ఇక ఈ షో ముగిసాకా పూనమ్ బయట ఎక్కడా కనిపించలేదు. ఆమె గర్భాశయ క్యాన్సర్‌తో పోరాడుతుంది అని కానీ, హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటుంది అన్నది కానీ ఏ మీడియాకు కూడా తెలియరాలేదు. ఈ శృంగార తార మనసు ఎంతో పెద్దది. నిత్యం చిన్న పిల్లలతో, అనాధ పిల్లలతో సమయం గడిపేది. వారికి బహుమతులు తీసుకెళ్లి ఆనందపరిచేది. ఎంతో జీవితాన్ని చూడాల్సిన పూనమ్ ఇలా హఠాన్మరణం పొందడం బాధాకరమని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.