జేసీ సంచలనం.. సీమను తెలంగాణలో కలపాల్సిందే..!
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.. రాయలసీమను తెలంగాణలో కలపాలంటూ పేర్కొన్నారు జేసీ.. రాయలసీమను తెలంగాణలో కలుపుకోవాల్సిన అవసరం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కి ఉందన్నారు. అసలు రాయల తెలంగాణ (రాయలసీమ, తెలంగాణ) కావడానికి ఎవరికీ అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.. ఈ విషయంపైనే నాయకులు అందరితో మాట్లాడుతున్నా.. నేతలను సమీకరిస్తున్నానని తెలిపారు. ఇక, ఎన్నికల తర్వాత వేదికపై ఉన్న నేతలందరిని కలుస్తానని ప్రకటించారు జేసీ దివాకర్‌రెడ్డి. రాయలసీమను తెలంగాణలో కలిపినప్పుడే రాయలసీమ సాగునీటి సమస్య తీరుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు.. రాష్ట్రాలను విడగొట్టడం కష్టం.. కానీ, కలపడం సులభమని అని వ్యాఖ్యానించారు. మరోవైపు.. తమ వాళ్లు ప్రత్యేక రాయలసీమ అంటున్నారు.. అది సాకారం అయితే మంచిదేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు జేసీ దివాకర్‌రెడ్డి.
రైతులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్..
విదేశాల్లో డిమాండ్ ఉన్న వంగడాలపై రైతుల్లో అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలపై సమీక్ష నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. ఇక, ఈ సమీక్షా సమావేశంలో రబీలో ఈ– క్రాప్ బుకింగ్ పై సీఎంకు వివరాలు అందించారు అధికారులు. వైఎస్‌ఆర్ యంత్ర సేవా పథకం కింద కిసాన్ డ్రోన్లు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.. ఈ జులై నాటికి 500 డ్రోన్లు ఇచ్చేందుకు వ్యవసాయశాఖ కార్యాచరణ సిద్ధం చేయగా.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 1,500కు పైగా డ్రోన్లు ఇచ్చే దిశగా వ్యవసాయశాఖ చర్యలు తీసుకుంటుంది.. ఇక, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.. తిరుపతి, కడప, మార్టేరు, విజయనగరంలలో డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇచ్చేందుకు వర్శిటీ చర్యలు తీసుకుంటున్నాయి.. విజయనగరంలో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ధాన్యానికి మరింత ధర వచ్చేలా రైతులకు తగిన అవకాశాలు కల్పించాలని.. విదేశాల్లో డిమాండ్ ఉన్న వంగడాలను సాగు చేయడంపై రైతుల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.. రైతులకు అవసరమైన వంగడాలు, వాటి విత్తనాలను అందుబాటులో ఉంచాలన్న ఆయన.. సీఎం యాప్ ద్వారా వివిధ ప్రాంతాల్లో వివిధ పంటలకు వస్తున్న ధరలు, వాటి పరిస్థితులపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. నిరంతరం మాక్ డ్రిల్ చేస్తూ పని తీరును పర్యవేక్షించాలన్నారు. ఇక, మే నెలలో రైతు భరోసా ఇన్‌స్టాల్‌మెంట్ ఇచ్చేందుకు సిద్ధం కావాలని.. వైయస్సార్ రైతుభరోసా కింద రైతులకు డబ్బు జమ చేసేందుకు సిద్ధం కావాలని.. అర్హులైన రైతుల జాబితాలను వెల్లడించేందుకు చర్యలు తీసుకోవాలని.. మే 10 కల్లా అర్హులైన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలపై సమీక్ష సందర్భంగా అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.
సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. అవినాష్‌రెడ్డికి నిరాశ..!
సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి బెయిల్ వ్యవహారంపై వివేకా కూతురు సునీత.. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ రోజు వాదనలు ముగిశాయి.. సుప్రీంకోర్టులో సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించగా.. ఎంపీ అవినాష్ రెడ్డి తరఫున మరో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇరువర్గాల వానదలు విన్న సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిపై తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను పూర్తిగా పక్కన పెట్టింది సుప్రీంకోర్టు.. అవినాష్ ముందస్తు బెయిల్ ఉత్తర్వులను నిలిపివేసింది. తెలంగాణ హైకోర్టు అలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని స్పష్టం చేసింది.. సీబీఐకి హైకోర్టు అలాంటి నిబంధనలను విధించడం సరికాదని పేర్కొన్న సుప్రీంకోర్టు.. హైకోర్టు ఆదేశాల వల్ల సీబీఐ దర్యాప్తుపై ప్రభావం పడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.. మరోవైపు.. జూన్ నెలాఖరు వరకు సీబీఐ దర్యాప్తు గడువును ఈ సందర్భంగా పొడిగించింది సీజేఐ ధర్మాసనం.. కాగా, ఈ నెల 25వ తేదీ వరకు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వైఎస్ సునీత.. గత శుక్రవారం ఈ పిటిషన్‌పై తొలిసారి విచారణ జరిగింది.. హైకోర్టు ఉత్తర్వులను తప్పుబట్టిన సుప్రీం.. తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది..
సీఆర్‌డీఏ కమిషనర్‌కి హైకోర్టు కీలక ఆదేశాలు
హైకోర్టు ముందు విచారణకు హాజరు కావాలంటూ సీఆర్‌డీఏ కమిషనర్‌కి ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. జూన్ 20వ తేదీన హాజరు కావాలని పేర్కొంది న్యాయస్థానం.. హైకోర్టుకు వెళ్లే దారిలో కనీస వసతులు కల్పించలేదని దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ రోజు కోర్టుకు రావాలని కమిషనర్ కి గతంలోనే ఆదేశాలు ఇచ్చింది.. అయితే, కర్ణాటక ఎన్నికల విధుల్లో ఉన్న కారణంగా హాజరు కాలేక పోతున్నట్టు హైకోర్టుకు తెలిపారు సీఆర్‌డీఏ కమిషనర్.. ఇదే సమయంలో.. కోర్టుకు వెళ్లే మార్గంలో జరుగుతున్న పనుల క్రమాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు సీఆర్‌డీఏ కమిషనర్ తరపు న్యాయవాది.. ఇక, జూన్ 20వ తేదీన కోర్టు ముందు హాజరు కావాలంటూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. కాగా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీఆర్డీఏ కమిషనర్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. విజయవాడ, మంగళగిరి, గుంటూరు నుంచి హైకోర్టుకు చేరుకునే సీడ్ యాక్సెస్ రోడ్డు, ఇతర రోడ్లలో వీధి లైట్ల వ్యవహారంపై సీరియస్ అయ్యింది. తాము లైట్లు ఏర్పాటు చేయాలని ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఏపీ సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ స్వయంగా హైకోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని గతంలో ఆదేశించిన విషయం విదితమే. ఇప్పుడు మరోసారి హాజరుకావాల్సిందేనంటూ హైకోర్టు స్పష్టం చేసింది.
షర్మిలపై కేసు పెట్టే దమ్ముందా..?
తనపై తప్పుడు కేసులు పెట్టే పోలీసులకు వారిని కొట్టిన షర్మిలపై కేసులు పెట్టే దమ్ముందా అని కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి ప్రశ్నించారు. తాను ఏమీ చేయకుండానే గతంలో ఖమ్మంలో న్యూసెన్స్ కేసు పెట్టారని మండిపడ్డారు. ఇప్పుడు షర్మిలపై ఎందుకు కేసు నమోదు చేయరన్నారు. ‘వెనకాల ఏం జరుగుతుందో?’ అంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఈరోజు ఉదయం లోటస్‌పాండ్‌లోని తన నివాసం నుంచి బయల్దేరిన వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. సిట్ కార్యాలయానికి వెళ్తున్నారనే సమాచారంతో ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా చూసేందుకు ఆమెను బయటకు రాకుండా నిలిపివేశారు పోలీసలు. అయితే.. దీంతో పోలీసులతో వైఎస్ షర్మిల వాగ్వాదానికి దిగడమే కాకుండా.. అడ్డుకునేందుకు యత్నించిన ఎస్సై, మహిళా కానిస్టేబుల్‌ను చేతితో పక్కకు నెట్టేశారు. వారితో దురుసుగా ప్రవర్తించారు. అంతేకాకుండా అక్కడే రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో లోటస్‌పాండ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో వైఎస్ షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంతేకాకుండా.. వైఎస్ షర్మిలపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. షర్మిలపై ఐపీసీ 332, 353, 509, 427 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు పోలీసులు. సిట్ కార్యాలయానికి బయల్దేరిన వైఎస్ షర్మిల కారును ఆపేందుకు యత్నిస్తుండగా, కానిస్టేబుల్ గిరిబాబుపై కారును ఎక్కించారు. పోలీసులపై షర్మిల దాడి చేశారు. అయితే కారు ఎక్కించడంతో గాయపడ్డ గిరిబాబును స్టార్ ఆస్పత్రికి తరలించారు. స్కానింగ్ చేయగా, కాలి లిగ్మెంట్‌కు గాయం అయినట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో బాధిత పోలీసుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు.
పెళ్లిలో షాకింగ్ ఘటన.. వరుడిపై యువతి యాసిడ్ దాడి
తమ ప్రేమని అంగీకరించలేదనో లేక తమని మోసం చేశారన్న కోపంతోనే.. అమ్మాయిలపై అబ్బాయిలు యాసిడ్ దాడులు చేసిన సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. అయితే.. ఛత్తీస్‌గఢ్‌లో అందుకు భిన్నంగా ఒక షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పెళ్లి మండపంలో ఓ యువతి.. వరుడిపై యాసిడ్ దాడికి పాల్పడింది. ఇంతకీ.. దాడి చేసిన ఆ యువతి ఎవరనుకున్నారు? మరెవ్వరో కాదు.. పెళ్లి మండపంలో ఉన్న వరుడి మాజీ ప్రియురాలు. తనని మోసం చేసి, మరొకరితో పెళ్లి చేసుకోబోతున్నందుకు తీవ్ర కోపాద్రిక్తురాలైన ఆ యువతి.. ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ ఘటనలో వరుడితో వధువు, మరో పది మందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్ బస్తర్ జిల్లాలోని భాన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛోటే అమాబల్ గ్రామంలో దముధర్ బాఘేల్ (25) అనే యువకుడికి 19 ఏళ్ల యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఏప్రిల్ 19వ తేదీన పెద్దలు వీరి వివాహాన్ని నిశ్చయించారు. చాలా గ్రాండ్‌గా వివాహ ఏర్పాట్లు చేశారు. ఆ పెళ్లి మండపంలో మొత్తం సందడి వాతావరణం ఉంది. ఇక కొద్దిసేపట్లో పెళ్లి జరగబోతోందనగా.. 22 ఏళ్ల యువతి చేతిలో యాసిడ్ పట్టుకొని, నేరుగా వరుడి వద్దకు వెళ్లింది. వెంటనే తనతో పాటు తెచ్చుకున్న యాసిడ్‌ను అతనిపై పోసింది. అదే కోపంలో వధువుపై కూడా యాసిడ్ పోసింది. ఆమెను అడ్డుకోబోయిన వారిపై కూడా యాసిడ్ పోయడంతో.. వారికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆ యువతి అక్కడి నుంచి పరారైంది. ఈ ఘటన సాయంత్రం జరగడం, అదే సమయంలో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో.. ఈ యాసిడ్ దాడికి పాల్పడిన నిందితుల్ని ఎవ్వరూ గమనించలేకపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. వరుడి మాజీ ప్రియురాలైన ఈ దారుణానికి పాల్పడిందని తేల్చారు. దీంతో.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై ఐపీసీ సెక్షన్ 326ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
వెండితెరపై ‘స్వాతి బలరామ్’ విజయగాథ!
తెలుగు పత్రికా ప్రపంచంలో స్వాతి వార, మాస పత్రికలు ఓ సంచలనం. తెలుగు పాఠకులు అందరూ ప్రతి గురువారం ‘స్వాతి’ వీక్లీ కోసం ఎదురుచూస్తారంటే అతిశయోక్తి కాదు. నాలుగు దశాబ్దాలుగా విజయవంతంగా నడుస్తున్న ఏకైక వారపత్రిక స్వాతి. ఆ పత్రికను విజయపథంలో నడుపుతున్న సంపాదకులు, ప్రచురణ కర్త వేమూరి బలరామ్ విజయగాథ ఇప్పుడు వెండితెరకెక్కబోతోంది. ఆ సినిమా టైటిల్ ‘స్వాతి బలరాం – అతడే ఒక సైన్యం’. ఈ సినిమా రూపకల్పనకు ప్రముఖ రచయిత, దర్శకుడు ప్రభాకర్ జైనీ శ్రీకారం చుట్టారు. ఇంతకు ముందు ఆయన దర్శకత్వంలో ‘క్యాంపస్ అంపశయ్య’, ‘ప్రణయ వీధుల్లో’, కాళోజీ నారాయణరావు బయోపిక్ ‘ప్రజాకవి కాళోజీ’ వచ్చాయి. జైనీ క్రియేషన్స్ పతాకంపై స్వాతి బలరామ్ బయోపిక్ ను విజయలక్ష్మీ జైనీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో నటీనటులను ఎంపిక చేసి సెట్స్ మీదకు సినిమాను తీసుకు వెళ్లనున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు.
అక్కడ కొత్త పచ్చబొట్టు.. శృతి నువ్వు మారిపోయావ్..?
విశ్వ నాయకుడు కమల్ హాసన్ నట వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైంది శృతి హాసన్. నటిగా, సింగర్ గా రెండు పక్కలా తనకు నచ్చిన వర్క్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. అయితే ఈ ఎంజాయ్.. కొన్నేళ్ల క్రితం శృతి జీవితంలో లేదు. ఎంతో ప్రాణంగా ప్రేమించిన ప్రేమికుడు వదిలేసి వెళ్ళిపోయాడు. డిప్రెషన్ కు గురైంది. మందుకు బానిసగా మారింది. దాని వలన తన రూపు రేఖలు కుడా మారిపోయాయి. అయితే ప్రేమను మర్చిపోవడానికి ప్రేమనే మందు అన్నట్లు శృతి జీవితంలోకి శంతను వచ్చాడు. అప్పటి నుంచి అమ్మడి జీవితం నవ్వులతో విరబూస్తోంది. వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. హిట్లు అందుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ఇక ఆ డిప్రెషన్ నుంచి శృతి ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని ఆమె చేసే చేతలలోనే తెలుస్తున్నాయి. మొదటి నుంచి శృతి ఫ్యాషన్ కు అనుగుణంగా ఉంటుంది. తాను వేసుకొనే బట్టల దగ్గర నుంచి ఒంటిపై వేయించుకొనే టాటూల వరకూ తన వ్యక్తిత్వాన్ని, తన మానసిక సస్థితిని తెలియజేస్తాయి. తాజాగా మరోసారి శృతి తన ఒంటిపై కొత్త పచ్చబొట్టుతో దర్శనమిచ్చింది. అయితే ఈసారి అమ్మడిలో కొత్తగా దైవ భక్తి కనబడడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.