పోచారం ఐటీ కారిడార్‌లో సైకో వీరంగం.. దాడిలో చిన్నారి మృతి
మేడ్చల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ సైకో వీరాంగం సృష్టించాడు. రోడ్డుపై వెళ్తున్నవారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. సైకో దాడిలో గాయపడిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సైకో చేసిన రాళ్ల దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన జగేశ్వర్ తన భార్య, కుమార్తె రియాకుమారి(6)తో కలిసి పోచారం మునిసిపాలిటీలో నివాసం ఉంటూ భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన హప్నహెమ్‌బ్రూమ్(30) అనే యువకుడు శుక్రవారం అక్కడే పనిలో చేరాడు. అయితే హప్న ఉన్నట్టుండి సైకోగా మారాడు.
ఓ ఇంట్లో భారీ పేలుడు.. నలుగురు మృతి
హర్యానాలోని బహదూర్‌గఢ్‌లో శనివారం సాయంత్రం 6:30 గంటలకు ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో నలుగురు కుటుంబ సభ్యులు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనను పరిశీలించిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ పేలుడు గ్యాస్ సిలిండర్ పేలడంతో జరిగి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. మరోవైపు.. పోలీసులు పేలుడు బెడ్ రూమ్‌లో జరిగిందని చెబుతున్నారు. డీసీపీ మయాంక్ మిశ్రా మాట్లాడుతూ.. “ఇది సిలిండర్ పేలుడు కాదు, పేలుడు బెడ్ రూమ్‌లో జరిగినది. దీని ప్రభావం మొత్తం ఇంటిపై పడింది. నలుగురు అక్కడికక్కడే మరణించారు, ఒకరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు” అని చెప్పారు.
చేయని శపథం లేదు.. ఆడని అబద్దం లేదు.. అక్షరాల 420 అబద్దపు హామీలు
సోషల్ మీడియా వేదికగా(ఎక్స్) కేటీఆర్ రేవంత్ సర్కార్ పై మండిపడ్డారు. రుణమాఫీపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అసెంబ్లీలో చేసిన ప్రకటనపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. అధికారం కోసం కాంగ్రెస్ ఎక్కని గుడి లేదు- మొక్కని దేవుడు లేడు.. చేయని శపథం లేదు-ఆడని అబద్దం లేదు.. ఒకటా రెండా.. అక్షరాల 420 అబద్దపు హామీలు. నిండు శాసన సభ సాక్షిగా తెలంగాణ రైతన్న గుండెలపై గునపం దింపిన ఇందిరమ్మ రాజ్యం అని ఎక్స్ లో రాసుకొచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ప్రభాకర్ రావు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు 65 ఏళ్ల వయసు ఉందని అనారోగ్యంతో బాధపడుతున్నానని పిటిషన్ లో పేర్కొన్నారు. తాను వైద్యం కోసమే అమెరికా వెళ్ళినట్టు నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశానని ప్రభాకర్ రావు తెలిపారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవంటూ హైకోర్టుకు ప్రభాకర్ రావు తెలిపారు. అమెరికా వెళ్ళినా దర్యాప్తు అధికారితో టచ్ లో ఉన్నాను అంటు ప్రభాకర్ రావు వెల్లడించారు.
ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా జరగాలి
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఐఓసీ కార్యాలయంలో హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి పోన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లాల అదనపు కలెక్టర్లు, మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. వేసవి కాలం సమీపిస్తున్నందున గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా నిర్వహించి, పేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని, వరి కోతలు కొనసాగుతున్న నేపథ్యంలో, కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలన్నారు. రేషన్ కార్డుల పంపిణీ త్వరలో జరగనుంది. ఉగాది నుంచి నల్గొండ జిల్లాలో సన్న బియ్యం పంపిణీ ప్రారంభమవుతుందని, ప్రజలు సమస్యలు ఎదుర్కొన్నా, అధికారులు వాటిని పరిష్కరించకుండా, మంత్రివర్గ దృష్టికి తేవకుండా ఉంటే, ఆందోళనలకు కారణం అధికారులే అవుతారని మంత్రి హెచ్చరించారు.
ఎయిరిండియాపై డేవిడ్ వార్నర్ ఫైర్.. కారణమిదే..?
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎయిరిండియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరు ఎయిర్ పోర్టు నుంచి ఆస్ట్రేలియాకు తాను వెళ్లాల్సిన విమానం గంట ఆలస్యం అయింది. దీంతో.. సోషల్ మీడియా వేదికగా డేవిడ్ వార్నర్ ఎయిరిండియాపై ఫైర్ అయ్యారు. ‘X’లో పైలెట్ ఆలస్యంగా వస్తున్నాడని తెలిసి కూడా గంట ముందే బోర్డింగ్ ఎందుకు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పైలెట్ లేని విమానంలో గంటపాటు ఎదురు చూడాలా..? అని పోస్ట్ చేశారు. వార్నర్ వ్యాఖ్యలపై ఎయిరిండియా స్పందించింది. ఈ ఆలస్యానికి కారణం.. బెంగళూరులో ప్రతికూల వాతావరణ పరిస్థితులే అని తెలిపింది. వాతావరణ సమస్యల కారణంగా అనేక విమానయాన సంస్థలు విస్తృతంగా విమానాల మళ్లింపులు, ఆలస్యాలను ఎదుర్కొన్నాయని పేర్కొంది. ఈ కారణంగా ఆ విమానానికి కేటాయించిన సిబ్బంది మరో పనిలో బిజీగా ఉన్నారని.. ఇది మరింత ఆలస్యానికి దారితీసిందని ఎయిర్ ఇండియా వివరణ ఇచ్చింది. అసౌకర్యానికి బాధితులైన వార్నర్, ఇతర ప్రయాణీకులకు ఎయిర్ ఇండియా విచారం వ్యక్తం చేసింది.
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై మరో కీలక పరిణామం
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన నోటీసులపై ఎటువంటి స్పందన రాకపోవడంతో, కోర్టు మరోసారి ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారణ ఈ నెల 25న సుప్రీంకోర్టులో జరగనుంది. గతంలో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి, అసెంబ్లీ కార్యదర్శికి, 10 మంది ఎమ్మెల్యేలకు, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. అయితే, బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్‌పై ఈ నెల 22 లోపు సమాధానం ఇవ్వాలని నోటీసులు పంపించగా, నిర్ణీత గడువు ముగియడంతో కోర్టు మరోసారి నోటీసులను జారీ చేసింది.
కుషాయిగూడలో దారుణ ఘటన.. చెత్త తొలగిస్తుండగా కెమికల్ బ్లాస్ట్, కార్మికుడి మృతి
హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చెత్తను తొలగించే క్రమంలో గుర్తు తెలియని కెమికల్ పేలుడు సంభవించి ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం చోటుచేసుకున్నది. కుషాయిగూడలోని స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ ఏరియాలో సాడక్ నాగరాజు అనే కార్మికుడు చెత్తను తొలగించే పనిలో ఉన్నాడు. పని చేస్తున్న సమయంలో, చెత్తలో మిళితమైన కొన్ని కెమికల్స్ ఆకస్మాత్తుగా పేలడంతో నాగరాజుకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనా స్థలంలోనే అతను మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.
బెట్టింగ్ యాప్ప్‌కు ప్రమోషన్ చేస్తున్న అగ్రహీరోలపై ఫిర్యాదు..!
తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రచారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు ఈ యాప్స్‌ను ప్రమోట్ చేయడం, వారి ఇమేజ్‌ను ఉపయోగించి ప్రజలను ఆకర్షించడం ఇప్పుడు చర్చకు దారితీసింది. ఈ వివాదంలో నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లు ప్రధాన పాత్ర పోషించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు చిత్రసీమలో అగ్రస్థానంలో ఉన్న బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లు ఇటీవల “Fun88” అనే బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆహా ఓటీటీ వేదికపై ప్రసారమైన ‘Unstoppable Season 2’ షోలో ఈ యాప్‌కు ప్రమోషన్ ఇచ్చారని మారేడుపల్లి పోలీస్ స్టేషన్‌లో రామారావు ఇమ్మనేని అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు..
మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు నమోదు అయింది. 2020లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమ్యాన్నాని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించారని అభియోగాలు ఉన్నాయి. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారని ఆమెపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో విడదల రజనీపై కేసు నమోదు చేశారు. ఆమెను ఈ కేసులో ఏ1గా చేర్చారు ఏసీబీ అధికారులు. ఏ2గా ఐపీఎస్ అధికారి జాషువా పై కేసు నమోదు చేశారు. ఏ3గా గోపి, ఏ4గా రజనీ పీఏ దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చింది. విడదల రజనీ వాటా 2 కోట్లు ఇచ్చినట్టు కేసు నమోదు చేయగా.. విడదల రజనీ మరిది గోపి, జాషువాలకు చెరో 10 లక్షలు ఇచ్చినట్లు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో.. నిందితులపై అవినీతి నిరోధక చట్టంలో ఉన్న 7, 7ఏ, IPC లో ఉన్న 384, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. లంచం తీసుకోవటం, అనుచిత లబ్ధి చేకూర్చటంపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.