ఏపీలో ఈ – చలాన్ స్కామ్.. కేసు నమోదు చేసిన ఈడీ
ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్యే ట్రాఫిక్ ఈ-చలాన్లలో నిధుల గోల్ మాల్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన విషయం విదితమే.. వాహనదారుల నుండి పోలీసులు వసూలు చేసే నిధులను సొంత ఖాతాలకు డేటా ఇవాల్వ్ సొల్యూషన్స్ కంపెనీ మళ్లించుకున్నట్టు అభియోగాలు నమోదు చేశారు. సుమారు 36.53 కోట్ల రూపాయలు నిధులు దారి మల్లాయని కేసు నమోదు చేశారు పోలీసులు.. ఈ చల్లాన్ ద్వారా రూ.101 కోట్లకు పైగా వసూలు చేసిన డేటా ఇవాల్వ్ సంస్థ.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తంలో కొంత భాగాన్ని సొంత ఖాతాలకు తరలించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.. అయితే, దీనిపై మరింత లోతుగా విచారణ జరపాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.. మరోవైపు ఏపీ ట్రాఫిక్ ఈ చలాన్ స్కామ్‌పై కేసు నమోదు చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. ట్రాఫిక్ చలాన్ల వసూళ్ల ద్వారా వచ్చిన నిధులను అవినాష్ అనే వ్యక్తి దారిమళ్లించినట్టు అభియోగాలు మోపారు.. అవినాష్ కి చెందిన ఇవాల్వ్ సంస్థతోపాటు పలువురుపై కేసు నమోదు చేశారు.. 36 కోట్ల రూపాయలకు పైగా నిధులను దారి మళ్లించారని అవినాష్ పై ఆరోపణలు ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ అల్లుడే అవినాష్ కావడంతో.. కేసు మరింత ఆసక్తికరంగా మారింది. రోజర్ పే ద్వారా వచ్చిన డబ్బులని సొంత సంస్థలకి దారి మళ్లించారు అవినాష్.. ప్రభుత్వ ఖజానాలో జమ చేయాల్సిన డబ్బులు మళ్లించడంతో ప్రభుత్వానికి నష్టం చేకూర్చాడు.. ట్రాఫిక్ చలాన్ల నిధుల మళ్లింపులో హవాలా, మనీ ల్యాండరింగ్ జరిగినట్లుగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌డైరెక్టరేట్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
చంద్రబాబుకు హైకోర్టులో ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో ఊరట లభిచింది.. ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం.. చంద్రబాబు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై సోమవారం విచారణ పూర్తిచేసిన హైకోర్టు.. ఈ రోజు తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు తీర్పు వెల్లడించారు. మొత్తంగా అనారోగ్య కారణాల రీత్యా చంద్రబాబుకు నవంబర్ 24వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.. ఇప్పుడు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా.. ప్రధాన బెయిల్ పిటిషన్‌పై వచ్చే నెల 10వ తేదీన విచారణ జరపనుంది హైకోర్టు.. కాగా, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే కాగా.. పలు మార్పు చంద్రబాబు రిమాండ్ ను పొడిగిస్తూ వచ్చింది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. గత 53 రోజులగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో వున్నారు చంద్రబాబు నాయుడు.. హైకోర్టు తీర్పుతో ఆయనకు భారీ ఊరట లభిచింది. దీంతో.. సాయంత్రానికి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదలయ్యే అవకాశం ఉంది.
చంద్రబాబుకు మధ్యంతర బెయిల్.. కోర్టు విధించిన షరతులు ఇవే..
ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభిచింది.. ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం.. చంద్రబాబు అనుబంధ పిటిషన్‌పై సోమవారం విచారణ పూర్తిచేసిన హైకోర్టు.. ఈ రోజు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. అనారోగ్య కారణాల రీత్యానవంబర్ 24వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు అంటే 24వ తేదీ వరకు వాయిదా వేసింది.. ఇదే సమయంలో చంద్రబాబుకు కొన్ని షరతులు విధించింది న్యాయస్థానం.. ఇక, మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో ఈ రోజు సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదల కానున్నారు. మరోవైపు మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు.. హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు తరఫు న్యాయవాదాలు.. ఆ పిటిషన్‌ను విచారణకు అనుమతించింది హైకోర్టు.. మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ చేపట్టనుంది.
హైకోర్టు చంద్రబాబు బెయిల్ కండీషన్ల విషయానికి వస్తే..
* షరతులతో కూడిన 4 వారాల మధ్యంతర బెయిల్ ఇస్తూనే షరతులు విధించిన హైకోర్టు.
* ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన కూడదు.
* కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయకూడదు.
* ఆరోగ్య కారణాలతో మంజూరు చేసిన బెయిల్ కాబట్టి.. ఇల్లు, ఆసుపత్రికి మాత్రమే పరిమితం కావాలి.
* చంద్రబాబుతో ఇద్దరు డీఎస్పీలు, ఎస్కార్ట్ ఉంచాలి అన్న ప్రభుత్వ అభ్యర్ధనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న న్యాయమూర్తి..
* Z+ సెక్యూరిటీ విషయంలో.. కేంద్ర నిబంధనలమేరకు అమలు చేయాలని, చంద్రబాబుకు సెక్యూరిటీ అంశంలో కోర్టు జోక్యం ఉండదన్న హైకోర్టు.
ఆ తర్వాతే జైలు నుంచి బయటకు చంద్రబాబు..!
ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు న్యాయస్థానం.. అనారోగ్య కారణాల రీత్యానవంబర్ 24వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు అంటే 24వ తేదీ వరకు వాయిదా వేసింది.. ఇక, మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో.. సాయంత్రం 4 గంటల తర్వాతే చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని రాజమండ్రి జైలు అధికారులు చెబుతున్నారు. బెయిల్ కాపీ తీసుకుని జైలుకి వెళ్లనున్నారు చంద్రబాబు తరఫు న్యాయవాదులు.. అయితే, బెయిల్ పేపర్లు అందిన తర్వాత ప్రొసీజర్స్ కంప్లీట్ చేసి తర్వాత జిల్లా ఎస్పీకి సమాచారం ఇవ్వనున్నారు జైలు అధికారులు.. జైలు దగ్గరికి జిల్లా పోలీసులతో పాటు ఎన్ ఎస్ జీ బృందం రానున్నాయి.. ఇప్పటికే రాజమండ్రిలోనే చంద్రబాబు ఎన్ ఎస్ జీ ఉంది.. అయితే, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రాబాబు బయటకు వచ్చిన తర్వాత.. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రాజమండ్రి మధురపూడి విమానాశ్రయం వరకు ర్యాలీగా వెళ్తారని టీడీపీ నేతలు చెబుతున్నమాట.. ఇక, ప్రత్యేక విమానంలో రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్లనున్నారు చంద్రబాబు.. హైదరాబాద్‌లోని ఎన్వీ ప్రసాద్ ఐ ఆస్పత్రి చికిత్స చేయించుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. ఇక, చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా హైకోర్టు కొన్ని షరతులను విధించిన విషయం విదితమే.. అయతే, చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నాయి టీడీపీ శ్రేణుల.. త్వరలోనే ఆయనకు పూర్తిస్థాయిలో బెయిల్ కూడా వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో ఇసుక దోపిడీ..! పురంధేశ్వరి సంచలన ఆరోపణలు
ఏపీలోని ఇసుక దోపిడీ జరుగుతోందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. కోట్లాది రూపాయల మేర ఇసుక దోపిడీ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు.. ప్రజా సమస్యలని ప్రస్తావించడం మా ప్రధాన అజెండాగా స్పష్టం చేసిన ఆమె.. ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. నేను వివిధ అంశాలను ప్రస్తావిస్తోంటే.. నాపై విమర్శలు చేశారని మండిపడ్డారు. ఏపీలో ఇసుక దోపిడీ జరుగుతోంది.. గతంలో ట్రాక్టర్ ఇసుక రూ. వేయి లభించేది.. కానీ, ఇప్పుడు రూ. 5-6 వేలుగా ఉందన్నారు.. ఇసుక ధరలు పెరగడం వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక ధర పెరగడంతో నిర్మాణ రంగం కుదేలైందని.. దీంతో సుమారు 35 లక్షల మంది ఉన్న భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక పాలసీని మార్చి.. ఒకే కాంట్రాక్టరుకు ఇచ్చారు. ఎవ్వర్నీ పోటీకి రానివ్వకుండా జేపీ వెంచర్స్‌కు కట్టబెట్టారు.. సబ్ లీజ్ ఇవ్వకూడదనే నిబంధన ఉంది.. కానీ, దానిని ఉల్లంఘించారని దుయ్యబట్టారు పురంధేశ్వరి. శేఖర్ రెడ్డికి సంబంధించిన టర్న్ కీ ఎంటర్‌ప్రైజెస్‌కు జేపీ వెంచర్స్ సంస్థ సబ్ లీజుకు ఇచ్చింది. సబ్ లీజ్ తీసుకున్న టర్న్ కీ సంస్థను పంపేసి.. కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అనధికారికంగా కట్టబెట్టారని ఆరోపించారు. జిల్లాల వారీగా ఇసుక రీచ్‌లను అమ్మేశారు. ఇసుక దోపిడీలో భాగంగా తాడేపల్లి ప్యాలెస్‌కు రూ. 2 వేల కోట్లు వెళ్లాయని సంచలన ఆరోపణలు గుప్పించారు.. హైదరాబాద్‌లోని సుధాకర్ అనే వ్యక్తి ఈ ఇసుక దందాను పర్యవేక్షిస్తున్నారు. ఇసుక దోపిడీకి ఓ ఐఏఎస్ అధికారి సహకరిస్తున్నట్టు మాకు సమాచారం ఉందన్నారు. జేపీ వెంచర్స్ సంస్థతో ఒప్పందం ముగిసిన తర్వాత కూడా ఇంకా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు.. అనధికారికంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి.. బిల్లుల్లో ఉండే లెక్కలకూ.. జరుపుతోన్న తవ్వకాలకు భారీ వ్యత్యాసం ఉందని విమర్శించారు. భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరపకూడదనే నిబంధనలున్నాయి.. కానీ, దాన్ని ఉల్లంఘిస్తున్నారు. నదీ గర్భంలో తవ్వకాలు జరపకూడదనే నిబంధనలున్నా.. రోడ్లు వేసి మరీ డీప్ డ్రెడ్జింగ్ చేసేస్తున్నారు. వర్షాకాలంలో తవ్వకూడదనే నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. పరిధిని మించి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి అంటూ ఆరోపణలు గుప్పించారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.
చికిత్స కోసం మాత్రమే చంద్రబాబుకు బెయిల్.. నిర్దోషి అని కాదు..!
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే.. అనారోగ్య సమస్యల దృష్ట్యా ఆయనకు వచ్చే నెల 24వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది హైకోర్టు.. 53 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న తమ పార్టీ అధినేత బయకు రానుండడంతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.. అయితే, చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌పై స్పందిస్తూ సెటైర్లు వేశారు మంత్రి అంబటి రాంబాబు.. హై కోర్టులో చంద్రబాబుకు మద్యంతర బెయిల్ మాత్రమే ఇచ్చారన్న ఆయన.. న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది అని టీడీపీ నాయకులు హంగామా చేస్తున్నారు.. టీడీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానాలి.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవుపలికారు. ఈ కేసులో నిర్దోషి అని చంద్రబాబుకు బెయిల్ ఇవ్వలేదు.. అనారోగ్య కారణాలతో మాత్రమే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందన్నారు మంత్రి అంబటి.. డాక్టర్ లు ఇచ్చిన నివేదిక ప్రకారం చికిత్స కోసం మాత్రమే చంద్రబాబు కు బెయిల్ వచ్చింది.. కంటి వైద్య కోసం మానవతా దృక్పథంతో కోర్టు బెయిల్ ఇచ్చిందన్న ఆయన.. యుద్ధం ఇప్పుడే మొదలైందని నారా లోకేష్ అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు.. ఈ కేసులో చాలా విచారణ మిగిలే ఉంది.. విదేశాలకు పారిపోయిన నిందితులను తీసుకు వచ్చి విచారణ చేయించాలన్నారు. 1983లో ఎక్కడైతే ఎన్టీఆర్ జెండా ఎగుర వేశాడో.. అక్కడ టీడీపీ జెండా పీకేసిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీడీపీ జెండా పీకేశారు, ఆంధ్రలో త్వరలో పీకేస్తారు.. ఇది నిజం అంటూ జోస్యం చెప్పారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ కు జ్ఞానోదయం అయ్యింది.. అందుకే టీడీపీకి రాజీనామా చేశాడు.. ఎన్టీఆర్‌ను చంపిన చేతులతోనే ఆయన పెట్టిన టీడీపీని కూడా చంపేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యానించారు మంత్రి అంబటి రాంబాబు.
చంద్రబాబుకు మధ్యంతర బెయిల్.. ఇలా స్పందించిన పవన్ కల్యాణ్
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి 53 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.. అనారోగ్య సమస్యల దృష్ట్యా.. నవంబర్ 24వ తేదీ వరకు ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.. ఇక, చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.. చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యం కలగాలన్న ఆయన.. చంద్రబాబుకు హైకోర్టు ద్వారా మధ్యంతర బెయిల్ లభించడం సంతోషకరం అన్నారు.. సంపూర్ణ ఆరోగ్యంతో.. ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చంద్రబాబు అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం అని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. అందరం ఆయన్ని స్వాగతిద్దాం అంటూ రాసుకొచ్చారు పవన్ కల్యాణ్.
నేడు ఢిల్లీకి కిషన్ రెడ్డి.. బీజేపీ మూడో జాబితాపై అగ్రనేతలతో చర్చ..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ సాయంత్రం న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కిషన్ రెడ్డి పార్టీ అగ్రనేతలతో చర్చించనున్నారు. నవంబర్ 1న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో బీజేపీ మూడో జాబితాను ఖరారు చేసే అవకాశం ఉంది. మూడో జాబితాలో మహిళలు, బీసీలకు పెద్దపీట వేసే అవకాశం ఉంది. 52 మంది అభ్యర్థులతో భాజపా ఈ నెల 22న తొలి జాబితాను విడుదల చేసింది. ఈ నెల 27న బీజేపీ రెండో జాబితాను విడుదల చేసింది. మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి కుమారుడు ఏపీ మిథున్ రెడ్డి పేరును బీజేపీ ప్రకటించింది. ఈ ఒక్క పేరుతోనే రెండో జాబితా విడుదలైంది. మూడో జాబితా కోసం బీజేపీ నాయకత్వం కసరత్తు చేస్తుంది. మూడో జాబితాలో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కూడా టికెట్లు కేటాయించే అవకాశం లేకపోలేదు. బీజేపీ ఇంకా 66 స్థానాలను ప్రకటించాల్సి ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేయనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 20 సీట్లు ఇవ్వాలని కోరుతోంది. అయితే, జనసేనకు 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించేందుకు భాజపా సుముఖంగా ఉంది. ఈ విషయమై పార్టీ ముఖ్య నేతలతో కిషన్ రెడ్డి చర్చించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన పొత్తుపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో చర్చించిన సంగతి తెలిసిందే.
హార్దిక్ పాండ్యా ఎంట్రీ ఇస్తే.. వేటు పడేది సూర్యకుమార్‌పై కాదు!
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే. చీలమండ నొప్పితో విలవిల్లాడిన హార్దిక్.. తన ఓవర్ పూర్తిచేయకుండానే మధ్యలోనే మైదానం వీడాడు. ఆపై న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లతో మ్యాచ్‌లకు అతడు దూరమయ్యాడు. ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్న హార్దిక్.. గాయం నుంచి కోలుకుని ఫిట్‌నెస్ ట్రెయినింగ్ ఆరంభించినట్లు తెలుస్తోంది. త్వరలనే భారత తుది జట్టులో అతడు చేరనున్నాడు. వరల్డ్‌కప్ 2023 లీగ్ దశ ముగిసేనాటికి పూర్తిగా కోలుకుని నవంబరు 15 నాటికి హార్దిక్ పాండ్యా జట్టుతో చేరే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. నవంబరు 15న తొలి సెమీ ఫైనల్, 16న రెండో సెమీ ఫైనల్ ఉండగా.. 19న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. వరుస విజయాలతో భారత్ ఇప్పటికే దాదాపుగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవడంతో.. హార్దిక్‌ను ఆడించే సాహసం టీమ్ మేనేజ్మెంట్ చేయట్లేదట. సెమీస్ నుంచే హార్దిక్‌బరిలోకి దిగుతాడని తెలుస్తోంది.
యానిమల్ మూవీ రన్ టైం విషయంలో వస్తున్న ఆ వార్త నిజమేనా..?
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ సినిమాలో రణ్ బీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది..అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. అయితే మూవీ రన్‌టైమ్‌పై సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర వార్త తెగ వైరల్ అవుతుంది యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈ మూవీ మూడు గంటల ముప్పై నిమిషాల లెంగ్త్‌తో విడుదల కాబోతున్నట్లు సమాచారం.స్టోరీ కన్వీన్సింగ్‌గా చెప్పాలంటే రన్‌టైమ్ విషయంలో రాజీపడకూడదని డైరెక్టర్ సందీప్ వంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకే మూడున్నర గంటల నిడివితో ఈ సినిమా ను రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్లు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తోన్నాయి.అదే నిజమైతే రీసెంట్ టైమ్స్‌లో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో లెంగ్త్ పరంగా అతి పెద్ద మూవీగా యానిమల్ నిలవడం ఖాయమని ఫ్యాన్స్ చెబుతున్నారు.. ఈ సినిమా రన్‌టైమ్ గురించి సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తోన్నారు. యానిమల్ మూవీకి రెండు ఇంటర్వెల్ బ్రేక్స్ ఇవ్వాలేమో అని కామెంట్స్ చేస్తున్నారు..కబీర్‌సింగ్ సక్సెస్ అనంతరం దాదాపు రెండేళ్ల విరామం తర్వాత సందీప్ వంగా యానిమల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.యానిమల్ మూవీ నుంచి ఇటీవల రిలీజైన పాటల్లో రణ్ బీర్ కపూర్, రష్మిక కెమిస్ట్రీ, లిప్‌లాక్‌లు ఎంతో హైలైట్ అయ్యాయి. ఈ లిప్‌లాక్‌లు సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీని తీసుకొచ్చాయి.తండ్రీకొడుకుల డ్రామాతో రూపొందుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. మరో సీనియర్ హీరో బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. యానిమల్ మూవీ హిందీ మరియు తెలుగుతో పాటు పాన్ ఇండియన్ లెవెల్‌లో డిసెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. టీ సిరీస్ సంస్థతో కలిసి సందీప్ వంగా యానిమల్ మూవీని నిర్మిస్తున్నాడు.
కన్నీళ్లు తెప్పిస్తున్న ప్రేమమ్ డైరెక్టర్ పోస్టు.. ఇక భారం కాదలచుకోలేనంటూ!
సాయి పల్లవితో బ్లాక్ బస్టర్ ప్రేమమ్ మూవీ చేసిన తీసిన మలయాళ డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రన్, తాను సినిమా డైరెక్షన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అల్ఫోన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక నోట్ ఈమేరకు షేర్ చేశారు. తాను ఒక రోగంతో బాధపడుతున్నాను అని అనౌన్స్ చేసి ఆ తర్వాత పోస్ట్‌ను తొలగించారు. ఆయన ముందు షేర్ చేసిన పోస్ట్ ఇలా ఉంది, “నేను నా సినిమా థియేటర్ కెరీర్‌ను ఆపివేస్తున్నా, నేను ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌ని కలిగి ఉన్నానని నిన్న స్వయంగా కనుగొన్నాను. మరెవరికీ భారం కాకూడదనుకుంటున్నా, నేను పాటలు, వీడియోలు -షార్ట్ ఫిల్మ్‌లు అలాగే OTT కోసం సినిమాలు చేస్తూనే ఉంటా. నేను సినిమా నుండి తప్పుకోవాలనుకోలేదు, కానీ నాకు వేరే మార్గం లేదు. నేను నిలబెట్టుకోలేని వాగ్దానాలు చేయడం నాకు ఇష్టం లేదు. ఆరోగ్యం బలహీనంగా ఉన్నప్పుడు, జీవితం ఇంటర్వెల్ బ్లాక్ ఇచ్చినట్టే అర్ధం చేసుకోవాలని అంటూ ఆయన రాసుకొచ్చారు. అంతేకాక ఆ పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చాడు, “నేను ఆరోగ్యంగా లేనందుకు ప్రతి ఒక్కరు నన్ను క్షమించండి. కారణం ఏమిటో నాకు తెలియదు కానీ నాకు చిన్నప్పటి నుండి ఈ సమస్య ఉంది, ఆటిజం గురించి అర్థం చేసుకున్న తర్వాత నేను అదే అనుకుంటున్నాను. అందుకే సినిమాలు ఆలస్యమవుతోందని అంచనా. కానీ నేను మీ అందరికీ వినోదాన్ని అందించడం ఆపనని రాసుకొచ్చారు. నిజానికి అల్ఫోన్స్ ఫహద్ ఫాసిల్‌తో ఒక సినిమా ప్రకటించారు. దాదాపు 7 సంవత్సరాల తర్వాత అల్ఫోన్స్ దర్శకత్వంలో పృథ్వీరాజ్, నయనతార, సెంబన్ వినోద్ సహా పలువురు మలయాళ నటీనటులు నటించిన ‘గోల్డ్’ గత ఏడాది డిసెంబర్ 29న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైంది. గోల్డ్ మిశ్రమ సమీక్షలకు అందుకున్న క్రమంలో విమర్శిస్తూ అల్ఫోన్స్ పుత్రన్ చేసిన ఫేస్‌బుక్ పోస్ట్ కూడా వైరల్‌గా మారడంతో ఆయన దానిని తొలగించడం గమనార్హం. ప్రస్తుతం ఆయన గిఫ్ట్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
గ్రాండ్ గా వరుణ్, లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. ఒకే ఫ్రేమ్ లో మెగా, అల్లు కుటుంబాలు..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల పెళ్లి సంబరాలు ప్రారంభం అయ్యాయి.. ఇటలీలో వీరి పెళ్లి కానున్న విషయం తెలిసిందే.. టుస్కానీ వేదికగా జరుగుతున్న ఈ డెస్టి నేషన్ వెడ్డింగ్‌కు ఇప్పటికే ఏర్పాట్లు గ్రాండ్‌గా పూర్తయ్యాయి.. వీరి పెళ్లి వేడుకలో భాగంగా నిన్న రాత్రి కాక్ టెయిల్ పార్టీ ఘనంగా జరిగింది. కాబోయే దంపతులు వరుణ్, లావణ్యలతో పాటు మెగా, అల్లు కుటుంబ సభ్యులు, లావణ్య త్రిపాఠీ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వెడ్డింగ్ పార్టీలో పాల్గొన్నారు. తాజాగా ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఈ పార్టీలో మెగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు ఇద్దరు కూడా వైట్ కలర్ డ్రెస్సులో మెరిశారు.. రామ్ చరణ్, ఉపాసన దంపతులు వైట్ అండ్ బ్లాక్ డ్రెస్‌లో ముస్తాబు చేశారు. ఇక అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ బ్లాక్ కలర్ సూట్‌లో స్టైలిష్‌గా కనిపించారు. ప్రస్తుతం వరుణ్, లావణ్యల కాక్ టెయిల్ పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. ప్రస్తుతం హల్డీ వేడుక, పూల్ పార్టీ జరుగుతుంది.. ఈ వేడుకలో అందరూ ఎల్లో, వైట్, పింక్ కలర్ దుస్తులు ధరించారు. ఇక హల్దీ వేడుక కోసం లావణ్య కు ఓ స్పెషల్ లెహంగా డిజైన్ చేయించారు. లావణ్యా త్రిపాఠి తల్లి చీరతో ఈ లెహంగా తయారైంది. హల్దీ వేడుక ఎప్పటికీ గుర్తుండి పోయేలా ఈ డ్రెస్‌ను డిజైన్ చేశారు. ఫేమస్ కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనా రావు ఈ లెహెంగాను డిజైన్ చేశారు. ఇక హల్దీ వేడుక పూర్తి అయిన తర్వాత సాయంత్రం ఐదున్నరకు మెహందీ వేడుకలు మొదలవుతాయి.. ఈ వేడుకల్లో కూడా మెగా, అల్లు ఫ్యామిలీలు సందడి చెయ్యనున్నారు.. నవంబర్ 1 న వరుణ్ తేజ్, లావణ్యలు ఒక్కటిగా కానున్నారు. బుధవారం మధ్యాహ్నం సరిగ్గా 2.48 గంటలకు లావణ్య మెడలో వరుణ్ మూడు ముళ్లు వేయనున్నాడు. ఇక పెళ్లి ముగిసిన తర్వాత రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి రిసెప్షన్ కార్యక్రమం జరుగుతుంది.. ఆ తర్వాత 5 న హైదరాబాద్ లో గ్రాండ్ గా పార్టీ జరగనుంది..