50 రోజులకు చేరిన చంద్రబాబు రిమాండ్.. నేడు ములాఖత్‌కు లోకేష్, భువనేశ్వరీ
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. ఆయన రిమాండ్ ఇవాళ్టితో 50వ రోజుకు చేరింది.. స్కిల్ స్కామ్ కేసులో గత నెల 9వ తేదీన అరెస్ట్ అయ్యారు చంద్రబాబు.. నవంబర్ 1వ తేదీ వరకు విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం చంద్రబాబు రిమాండ్ పొడిగించిన విషయం విదితమే.. ఇక, ఈ రోజు చంద్రబాబును ములాఖత్‌లో కలిశారు నారా లోకేష్ , భువనేశ్వరీ, టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్. మరోవైపు, స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టై.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. లేఖాస్త్రం సంధించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారుల ద్వారా.. ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి లేఖపంపించారు చంద్రబాబు. తమ అధినేత భద్రతపై ఇప్పటి వరకు టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. ఇప్పుడు స్వయంగా చంద్రబాబే తన సెక్యూరిటీపై సందేహాలు వెలిబుచ్చారు. రాజమండ్రి జైల్లోని భద్రతా లోపాల్ని ఏసీబీ కోర్టు జడ్జికి రాసిన లేఖలో ప్రస్తావించారు. ఈనెల 25వ తేదీన చంద్రబాబు మూడు పేజీల లేఖ రాసారు. అందులో చాలా అంశాలను ఆయన ప్రస్తావించారు. రాజమండ్రి జైల్లోని పలు లోపాలు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న తన ప్రాణాలకు ముప్పుగా పరిణమించినట్లు చంద్రబాబు తెలిపారు. సెప్టెంబర్ 10న తనను అరెస్టు చేసి 11న రాజమండ్రి జైలుకు రిమాండ్‌కు పంపారని, జైల్లోకి తాను ప్రవేశిస్తున్న సమయంలో తనను ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ఆరోపించారు. అలా తన ప్రతిష్టకు భంగం కలిగించడంతో పాటు… తన భద్రతకు ముప్పు కలిగించారని చంద్రబాబు పేర్కొన్నారు.
వెలుగులోకి మరో వాలంటీర్ అరాచకం.. యువతిపై అఘాయిత్యం.. ఆపై..!
తాజాగా ఏలూరులో వాలంటీర్ వ్యవహారం సంచలనంగా మారింది.. మహిళను లోబర్చుకొని వాలంటీర్ గర్భవతిని చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ గ్రామానికి చెందిన ఓ మహిళను లోబర్చుకున్న గర్భవతిని చేశాడు వాలంటీర్ మండిగ సత్య గణేష్.. అయితే, విషయం బయటకొస్తుందని నెల క్రితమే ఆ వాలంటీర్‌ను విధుల నుంచి తొలగించారు.. అప్పటి వరకు వివాహం చేసుకుంటానని చెప్పిన గణేష్.. తన శారీరక వాంఛ తీర్చుకున్నాడు.. పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. తీరా గర్భవతి అయ్యాక.. పెళ్లికి నిరాకరించాడు.. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు.. పోలవరం పోలీసులను ఆశ్రయించింది.. అయితే, కేసు నమోదు చేసిన పోలీసులు.. గణేష్ ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాగా, వాలంటీర్ వ్యవస్థపై ఓవైపు విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తుండగా.. మరోవైపు ఇలాంటి ఘటనలు అక్కడక్కడ వెలుగు చూస్తూనే ఉన్నాయి.. అయితే, అలాంటి వారిని ప్రభుత్వం ఉపేక్షించకుండా వెంటనే చర్యలకు దిగుతోన్న విషయం విదితమే.
జోరు పెంచిన కాంగ్రెస్.. తెలంగాణలోనూ కర్ణాటక అస్త్రం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు హీటు పుట్టిస్తున్నాయి.. రెండు విడతల్లో వంద మంది పేర్లు ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ప్రచారంపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అగ్రనేతలు ప్రచారం నిర్వహించగా.. ఇవాళ్టి నుంచి కర్ణాటక టాప్ లీడర్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తమపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వనున్నారు. ఇవాళ డీకే శివకుమార్, రేపు మల్లీకార్జున ఖర్గే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ .. తాండూరులో జరిగే కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. తర్వాత పరిగి, చేవెళ్ల నియోజకవర్గాల్లో డీకే ప్రచారం చేస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు తాండూరు, సాయంత్రం 4 నుంచి 5 వరకు పరిగి, సాయంత్రం 6 నుంచి 7 వరకు చేవేళ్లలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు డీకే.. కర్ణాటకలో కాంగ్రెస్ పథకాల అమలు తీరుపై తెలంగాణలో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు ఆయన కౌంటర్‌ఇచ్చే అవకాశం ఉంది.. ఎన్నికల్లో హామీ ఇచ్చి కాంగ్రెస్ అమలు చేయడం లేదనే బీఆర్ఎస్ ఆరోపణలపై డీకే ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
వందలో రెడ్డీలకే 37 స్థానాలు.. సీనియర్లలో అసంతృప్తి..!
ఉత్కంఠ రేపిన కాంగ్రెస్ రెండో జాబితా ఎట్టకేలకు విడుదల అయ్యింది. 45 మందితో సెకండ్ లిస్ట్ ప్రకటించింది హైకమాండ్. తీవ్ర కసరత్తు, వడపోతల తర్వాత అన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించింది. మొదట 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. తాజా లిస్ట్‌తో ఇప్పటి వరకు మొత్తం వంద స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లైంది. కమ్యూనిస్టులకు నాలుగు సీట్లు ఇచ్చేందుకే ఓకే చెప్పింది. ఇక మిగితా 15 స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. రెండో జాబితాలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. అంతే కాకుండా.. ముఖ్యమైన స్థానాల్లో కీలక నేతలకు అవకాశం కల్పించింది. గ్రేటర్ హైదరాబాద్ విషయానికొస్తే పీజేఆర్ వారసుల్లో ఆయన కుమార్తె విజయారెడ్డికి ఖైరతాబాద్ సీటు ఇచ్చి, కుమారుడు విష్ణువర్థన్‌రెడ్డికి టిక్కెట్ నిరాకరించింది. గద్దర్ వారసుల్లో కొడుకు సూర్యం బదులు కుమార్తె వెన్నెలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కేటాయించింది. జూబ్లిహిల్స్ నుంచి అజారుద్దీన్‌ను బరిలోకి దింపుతోంది. ఇటీవల పార్టీలో చేరిన జగదీశ్వర్ గౌడ్ కు శేరిలింగంపల్లి, బండి రమేష్‌కు కూకట్‌పల్లి టికెట్ ఇచ్చింది. మరోవైపు.. ఈ మధ్యే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రేఖా నాయక్‌కు కూడా ఈసారి అవకాశం కల్పించలేదు. మరోవైపు.. ఇంకా 19 స్థానాల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా.. అందులో సీపీఐ, సీపీఎంకు సీట్లు కేటాయించాల్సి ఉంది. ఇప్పటి వరకు వంద స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. అందులో రెడ్డిలకు 37 స్థానాలు కేటాయించింది. ఎస్సీలకు 19, ఎస్టీలకు 12, బీసీలకు 18 సీట్లు ఇచ్చింది. పెండింగ్‌లో ఉన్న సీట్లపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కసరత్తు ప్రారంభించింది. ఆ సీట్లలో కూడా కొందరికి నిరాశే మిగిలే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. గెలుపు గుర్రాల కోసం చివరి క్షణం వరకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేసినా.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లలో అసంతృప్తి కనిపిస్తోంది.. సామాజిక న్యాయంపై ఫోకస్ పెట్టలేదని ఆరోపణ వినిపిస్తు్న్నాయి.. నిన్నటి వరకు తిట్టిన నేతలకు కూడా టిక్కెట్లు ఎలా ఇస్తారు అంటూ మరికొందరు మండిపడుతున్నారు..
విజయవాడ నుంచి అమృత్ కలశ యాత్ర ప్రారంభం..
ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా నా మట్టి నా దేశం కార్యక్రమం ముగింపు దశకు చేరింది.. దీంతో, విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి అమృత్ కలశ యాత్ర ప్రారంభమైంది.. ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల్లోని 680 మండలాలు, 125 మున్సిపాల్టీలలోని ప్రజల నుంచి మట్టి, బియ్యం సేకరించిన కలశాలతో అమృత్ కలశ యాత్ర ట్రైన్ ప్రారంభమైంది.. ఈ కార్యక్రమంలో రైల్వే డీఆర్ఎమ్ నరేంద్ర పాటిల్, మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తదితరులు పాల్గొన్నారు. అమృత్ కలశ యాత్ర రైలును జెండా ఊపి ప్రారంభించారు రైల్వే డీఆర్ఎమ్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, అధికారులు.. ఇక, జాతీయ జెండాలతో రైల్వే స్టేషన్‌లో ప్రదర్శన నిర్వహించారు విద్యార్ధులు.. ఈ సందర్భంగా రైల్వే డీఆర్ఎమ్ నరేంద్ర పాటిల్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ.. మేరీ మాటీ మేరా దేశ్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.. ప్రధాని పిలుపు మేరకు ఏపీలోని అన్ని జిల్లాల నుంచి మట్టిని సేకరించి ఢిల్లీకి పంపిస్తున్నాం అన్నారు.. మేరీ మాటీ – మేరా దేశ్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.. విజయవాడ రైల్వే స్టేషన్‌లో వందలాది మంది చిన్నారులు జాతీయ పతాకాలతో దేశభక్తిని ప్రదర్శించారు.
విజయవాడ ప్రజలకు గుడ్ న్యూస్
బెజవాడ వాసులకు గుడ్ న్యూస్.. విజయవాడ కేంద్రంగా త్వరలో రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయం ప్రారంభం కానుంది.. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ శివ హర్ష.. ప్రస్తుతం ఉన్న పాస్ పోర్ట్ సేవా కేంద్రానికి అదనంగా విజయవాడ బందర్ రోడ్డులో రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయం ప్రారంభించనున్నారు.. దీనిపై రీజనల్ పాస్ పోర్టు ఆఫీసర్ శివ హర్ష మాట్లాడుతూ.. రీజనల్ పాస్ పోర్టు సేవా కేంద్రానికి రోజుకు 2 వేల అప్లికేషన్స్ వస్తున్నాయి.. కోవిడ్ తరువాత పాస్ పోర్ట్ అప్లికేషన్స్ ఎక్కువగా వస్తున్నాయని వివరించారు.. అక్టోబర్ నెల వరకు 3 లక్షల పాస్ పోర్టులు జారీ చేశామని వెల్లడించారు.. పోస్టల్, పోలీసు శాఖల భాగస్వామ్యంతో పాస్ పోర్టులు త్వరితగతిన అందచేస్తున్నాం అని పేర్కొన్నారు. ఇక, విజయవాడ రీజనల్ ఆఫీసు కేంద్రంగానే ఇక పై పాస్ పోర్ట్ ప్రింటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు శివ హర్ష.. విజయవాడలో ఆఫీసు ప్రారంభం కావడం వల్ల త్వరగా సేవలు అందుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరో రెండు, మూడు నెలల్లోనే రీజనల్ పాస్ పోర్టు కార్యాలయం ప్రారంభిస్తాం.. గతం కంటే ప్రస్తుతం పాస్ పోర్టు సేవలు సులభతరం చేశామని వెల్లడించారు. తక్కువ సమయంలోనే పాస్ పోర్టులు అందజేస్తున్నాం అన్నారు. ఇదే సమయంలో దయచేసి ఎవరూ ఫేక్ సైట్లు, బ్రోకర్లను నమ్మొద్దు.. వారిని నమ్మి మోసపోవద్దు అని హెచ్చరించారు రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ శివ హర్ష.
అలా చేసి ఉంటే.. డబ్బుల కట్టలతో దొరికిన రేవంత్ ఊచలు లెక్క పెట్టేవారు: కేటీఆర్
తాము పగ, ప్రతీకార రాజకీయాలు చేయలేదని, అలా చేసి ఉంటే డబ్బుల కట్టలతో దొరికిన రేవంత్ రెడ్డి ఊచలు లెక్క పెట్టేవారు అని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, తలసరి ఆదాయంలోనూ తెలంగాణ నంబర్ వన్ అని పేర్కొన్నారు. తెలంగాణలో ఎవరూ రెండో శ్రేణి పౌరులు అంటూ ఉండరన్నారు. తెలంగాణలో కరువు లేదు, కర్ఫ్యూలు లేవు అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ప్రెస్ మీట్‌లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పలు విషయాలపై స్పందించారు. ‘ఎట్లా ఉండే తెలంగాణ.. ఎట్లా అయ్యింది అన్నది ప్రజలు గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించాలి. ఇప్పుడు తెలంగాణ అచరిస్తుందని దేశం అనుసరిస్తుంది. తెలంగాణలో సంతులిత, సమ్మిళిత, సమీకృత అభివృద్ధి జరుగుతోంది. తలసరి ఆదాయంలోనూ తెలంగాణ నంబర్ వన్. తెలంగాణ కర్ఫ్యూ లేదు.. కరువు లేదు. మోడీ హయాంలో పేదరికంలో నైజీరియాను ఇండియా దాటింది. దేశంలో వృద్ధి రేటులో తెలంగాణ టాప్-5లో ఉంది. ఒక్క పైసా అప్పు చేసిన ఉత్పదాక రంగం మీద పెట్టారు సీఎం కేసీఅర్. కర్ణాటకలో 5 గంటలు కరెంట్ ఇవ్వలేకపోతుంది అక్కడి ప్రభుత్వం. మన దగ్గర 24 గంటల కరెంట్’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.
బృహస్పతి భయంకరమైన ముఖాన్ని కెమెరాలో బంధించిన నాసా
బృహస్పతి రహస్యాన్ని ఛేదించేందుకు నాసా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నాసా అంతరిక్ష నౌక జునో.. బృహస్పతి భయంకరమైన ‘ముఖాన్ని’ తన కెమెరాలో బంధించింది. ఇటీవల నాసా ఈ చిత్రాలను విడుదల చేసింది. ఇందులో రెండు కళ్ళు, ఒక ముక్కు, నోరు కూడా కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ఈ చిత్రాల అర్థాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చిత్రంలో అల్లకల్లోలమైన మేఘాల తుఫాను కనిపిస్తుంది. ఇది చాలా భయానకంగా కనిపిస్తుంది. అంతరిక్షం అనేది మిస్టరీల గని, అనేక అపరిష్కృత చిక్కులు అనేకం ఉన్నాయి. వాటికి సమాధానాలు వెతకడానికి ప్రపంచవ్యాప్తంగా స్పేస్ ఏజెన్సీలు ప్రయత్నిస్తున్నాయి, NASA అంతరిక్ష నౌక జునో కూడా ఇలాంటి మిషన్‌కు బయలుదేరింది. ఈ నాసా అంతరిక్ష నౌక బృహస్పతి రహస్యాలను ఛేదించే బాధ్యతను కలిగి ఉంది. జూనో 2016 నుండి నిరంతరం ఈ పనిలో నిమగ్నమై ఉంది. ఇటీవలే ఇది 54వ సారి బృహస్పతి గ్రహం సమీపంలోకి వెళ్లింది. ఆ సమయంలోనే ఈ భయానక చిత్రం కెమెరాలో బంధించబడింది. NASA జూనో అంతరిక్ష నౌక అందించిన ఈ చిత్రం బృహస్పతి ఉత్తర ధృవాన్ని చూపిస్తోంది. దీనిలో గ్రహం మీద పగలు, రాత్రి విభజన రేఖ స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కాకుండా, అల్లకల్లోలమైన మేఘాలు కూడా చిత్రంలో కనిపిస్తాయి. చిత్రంలో కనిపించే అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే గ్రహం మీద వచ్చే తుఫానులు. ఇది ఈ చిత్రాన్ని భయపెట్టేలా చేస్తోంది. ఈ ఫోటో సూర్యకాంతి కోణం నుండి తీయబడింది. ఇది శాస్త్రవేత్తలకు గ్రహం వాతావరణ ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. బృహస్పతి ఈ చిత్రం 2400 మైళ్ల నుండి అంటే 7700 కి.మీ పైన తీయబడింది. శాస్త్రవేత్తల ప్రకారం, ఇది ఈ గ్రహం మీద పరేడోలియాను చూపిస్తుంది, దీనిలో యాదృచ్ఛిక నమూనా ముఖాలు కనిపిస్తాయి. నాసా 2011లో ఈ మిషన్‌ను ప్రారంభించింది. ఇది జూలై 2016లో బృహస్పతి కక్ష్యకు చేరుకుంది. అప్పటి నుండి దాని చుట్టూ తిరుగుతోంది.
మధ్యప్రాచ్యంలో మూడో ప్రపంచ యుద్ధం.. 200 హెలికాప్టర్లతో ఇరాన్ విన్యాసాలు
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఓ వైపు భీకరంగా జరుగుతుండగా మరో వైపు ఇరాన్ సైన్యం 200 హెలికాప్టర్లతో విన్యాసాలు ప్రారంభించింది. ఇరాన్ మీడియా శుక్రవారం ఈ సమాచారాన్ని ఇచ్చింది. మధ్యప్రాచ్యంలో యుద్ధ భయాల మధ్య ముందుగా అనుకున్న ప్రకారం ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఎస్ఫహాన్‌లో రెండు రోజుల సైనిక విన్యాసాలను ప్రారంభించింది. ఇరాన్ ఆర్మీ కమాండర్లు అమీర్ చేషాక్ ఇరాన్ ప్రభుత్వ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ మాక్ డ్రిల్ వెనుక ఉన్న మొత్తం ఉద్దేశ్యం ఇరాన్ శత్రువులను హెచ్చరించడం. ఈ రోజుల్లో ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఇరాన్ హమాస్‌కు బహిరంగంగా మద్దతు ఇస్తోంది. తన విన్యాసాలతో ఇరాన్ శత్రు దేశాలకు ఓ సంకేతాన్ని పంపించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ ఒక ప్రకటన విడుదల చేసి ఇజ్రాయెల్‌కు బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. ‘గాజాపై ఇజ్రాయెల్ తన యుద్ధ నేరాలకు పాల్పడటం ఆపకపోతే, అది అనేక ఇతర రంగాలలో కూడా పోరాడవలసి వస్తుంది’ అని అతను చెప్పాడు. గాజాపై ఈ యుద్ధాన్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నాడు. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్యప్రాచ్యంలో ఒకరికొకరు బద్ధ శత్రువులని తెలిసిందే. మధ్యప్రాచ్య నిపుణులు కూడా టెహ్రాన్-టెల్ అవీవ్ తమ శత్రుత్వంతో చాలా వేగంగా నష్టపోయాయని.. ఇరాన్ హమాస్‌తో చేతులు కలిపిందని, ఇప్పుడు దానికి బహిరంగ మద్దతు కూడగడుతోందని చెప్పారు. అంతేకాదు టెల్ అవీవ్‌ను కూడా హెచ్చరించాడు.
వరుణ్ పెళ్లి కోసం ఇటలీ బయలుదేరిన పవన్ కళ్యాణ్ దంపతులు.. ఫోటోలు వైరల్..
మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి నెలకొంది. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి పీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా లావణ్య-వరుణ్ జంటగా ఇటలీకి పయనమయ్యారు..నవంబర్ 1న వరుణ్ తేజ్ ఇటలీలో వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.. మిస్టర్ చిత్ర షూటింగ్ సమయంలో వరుణ్ తేజ్, లావణ్య మొదట కలుసుకుంది ఇటలీలోనే. అందుకే సెంటిమెంట్ గా మ్యారేజ్ వెన్యూని కూడా అక్కడే సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పటికే బ్యాచిలర్ పార్టీలు పూర్తయ్యాయి.. ఇక వీరిద్దరి వివాహం మాత్రం మిగిలి ఉంది.. ఇటలీలో వివాహం కావడంతో మూడు రోజుల ముందుగానే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి అక్కడికి వెళ్లారు. నాగబాబు కుటుంబ సభ్యులంతా ఇటలీ చేరుకున్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి కూడా ఒక్కొక్కరు ఇటలీ వెళుతున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తన భార్య అన్నా లెజినోవాతో కలసి సతీసమేతంగా ఇటలీ బయలుదేరారు..ఎయిర్ పోర్ట్ లో వీరిద్దరూ వెళుతున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. అన్నా లెజినోవా మీడియాకి కనిపించడం, పబ్లిక్ లో తిరగడం చాలా తక్కువ. దీనితో పవన్, లెజినోవా కనిపించడంతో కెమెరా కంటికి చిక్కారు.. ఈ ఫోటోలను ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు..
ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న హీరోయిన్ శ్రీలీల.. ఫోటోలు వైరల్..
విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను భగవంత్ కేసరి చిత్ర బృందం శనివారం దర్శించుకుంది. హీరోయిన్ శ్రీలీలా ఆమె తల్లి, చిత్ర దర్శకుడు అనిల్ రావీపూడితో పాటు పలువురు చిత్ర బృంద సభ్యులు అమ్మవారి దర్శనానికి విచ్చేయగా, ఆలయ అధికారులు వారికి సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న వారికి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.. అనంతరం ఆలయ అధికారులు వారిని సత్కరించి అన్న, ప్రసాదాలను అందజేశారు.. శ్రీలీలా తో సెల్ఫీలు దిగడానికి భక్తులు ఎగబడ్డారు.. హీరోయిన్ అందరితో మాట్లాడుతూ ఓపిగ్గా సెల్ఫీలు దిగారు.. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇకపోతే దసరా కానుకగా బాలయ్య, శ్రీలీలా నటించిన భగవంత్ కేసరి సినిమా విడుదలైంది.. భారీ విజయాన్ని అందుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది.. ఇక శ్రీలీలా సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తుంది.. ప్రస్తుతం తొమ్మిది సినిమాలు చేతిలో ఉన్నాయని తెలుస్తుంది..