ఇదేమి చట్టం.. ఇదెక్కడి న్యాయం..? భువనేశ్వరి ఆవేదన
సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి.. తల్లి వర్ధంతి కార్యక్రమానికీ నేతలను వెళ్లనీయరా..? ఇదెక్కడి న్యాయం? అని నిలదీశారు.. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసు నిర్భంధం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది.. తల్లి వర్ధంతి కార్యక్రమాలకు కూడా వెళ్లనీయకుండా ఒక మాజీ మంత్రిని అడ్డుకోవడం దేశంలో మరెక్కడైనా ఉంటుందా..? అని మండిపడ్డారు. ఇదేమి చట్టం.. ఇదెక్కడి న్యాయం? అని ప్రశ్నించారు భువనేశ్వరి.. కొల్లు రవీంద్ర పట్ల ప్రభుత్వం అనుసరించిన వైఖరి ఎంతో బాధించింది అని పేర్కొన్నారు. వ్యవస్థల నిర్వీర్యమని చంద్రబాబు ఎందుకు ఆందోళన వ్యక్తం చేసేవారో ఈ ఘటన చూస్తే అర్థం అవుతుందన్నారు. కుటుంబ వ్యవహారాలను, వ్యక్తిగత హక్కులను, సంప్రదాయాలను రాజకీయాలతో ముడి పెట్టవద్దని ఉన్నతాధికారులను కోరుతున్నాను అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు నారా భువనేశ్వరి. కాగా, ఏపీ స్కిల్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు రిమాండ్ ఇవాళ్టితో 40వ రోజుకు చేరింది.. ఈ నెల 19వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించిన విషయం విదితమే.
నీటి వాటాలు తేలేనా..? కృష్ణా జలాల పంపిణీపై నేటి నుంచి ట్రిబ్యునల్ విచారణ
కృష్ణా జలాల పంపిణీపై నేటి నుంచి ట్రిబ్యునల్ విచారణ జరగనుంది.. కేంద్ర ప్రభుత్వ తాజా ఆదేశాల మేరకు ట్రిబ్యునల్ విచారణ చేపట్టనుంది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వాటాలు తేల్చనుంది ట్రిబ్యునల్.. మరోవైపు.. ట్రిబ్యునల్ విధివిధానాలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల ఏపీకి తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.. నదీ జల వివాదాల చట్టం ప్రకారం బ్రిజేష్ ట్రిబ్యునల్‌కు అదనపు బాధ్యతలు అప్పగించే అధికారం లేదని.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం నీటి కేటాయింపులకు రక్షణ ఉందని.. విభజన చట్టం సెక్షన్ 89(ఏ) – 89(బీ) కింద ట్రిబ్యునల్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటిని ప్రాజెక్టుల వారీగా కేటాయించే అంశం పరిశీలనలో ఉందని.. ఇప్పుడు కొత్త అంశాలు చేర్చి వాటాలు పంచాలని సూచించడం తగదని ఏపీ వాదనగా ఉంది.. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం ఈ అభ్యంతరాలనే పేర్కొంది. దీంతో.. కృష్ణా జలాల పంపిణీపై ట్రిబ్యునల్‌లో విచారణ ఎలా జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.
విశాఖలో పోలీస్ స్టేషన్‌కే తాళం వేసిన మహిళ.. స్పృహ కోల్పోయిన సీఐ..!
ఏపీలో జరిగిన ఈ ఘటనకు సంబంధిచిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నంలోని పెందుర్తిలో విచిత్ర ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ గత ఐదారు రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతోంది.. తన సమస్యను పరిష్కరించండి అంటూ పోలీసులకు విజ్ఞప్తి చేసింది.. నా ఇంటికి తాళం వేశారు.. నేను రోడ్డుపై పడ్డాను.. కనీసం బాత్‌రూమ్ కూడా లేకుండా పోయిందన్న ఆమె.. ఈ వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవడం లేదని.. ఐదారు రోజులుగా తిరుగుతున్నా.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కూడా తనకు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.. సీపీ ఆఫీసుకు వెళ్తే అక్కడికి వెళ్లొద్దు అంటారు.. పీఎస్‌కు వస్తే న్యాయం చేయడం లేదంటున్నారు. దీంతో విసుగుచెందిన ఆ మహిళ ఏకంగా పోలీస్ స్టేషన్ కే తాళం పెట్టింది.. ఊహించని ఘటనతో షాక్ తిన్న పోలీసులు.. ఆ మహిళకు నచ్చజెప్పి.. మొత్తానికి తాళం తీశారు.. అయితే, తనకు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ఎదురుగా దీక్షకు దిగుతానని పోలీసులను హెచ్చరించింది ఆ మహిళ.. మరోవైపు.. పెందుర్తి పోలీసు స్టేషన్ కి తాళంవేసిన ఘటనతో అవాక్కయిన సీఐ శ్రీనివాసరావు.. భయంతో స్పృహ కోల్పోయారు.. దీంతో.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మొత్తంగా ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చంద్రబాబుపై పెద్దిరెడ్డి ఫైర్.. నమ్మి మోసపోవద్దు..!
చిత్తూరు పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. పుంగనూరులో ఏరియా ఆసుపత్రి ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు పై ఫైర్ అయ్యారు.. చంద్రబాబు మేనిఫెస్టోలో ఇంటికి ఒక బంగారు ముద్ద ఇస్తానని చెప్తాడు.. ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ట్రాక్టర్ ఇస్తానంటాడు.. యువకులకు మోటార్ సైకిల్ ఇస్తాను అంటాడు.. చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలు నమ్మి మోసపోవద్దు అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.. ఇక, సదుంలో నూతనంగా నిర్మించిన 50 పడకల ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఇసుక పాలసీపై మాట్లాడారు.. ఇసుక సీఎం వైఎస్ జగన్ తమ్ముడికి ఇస్తున్నాం అని విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇప్పటికే టెండర్లు పిలిచాం, నాలుగు కంపెనీలు ముందుకు వచ్చాయి.. టెండర్లకు ఇంకా సమయం ఉంది… ఇంకా ఏమి కాకముందే సీఎం సోదరుడి పేరు చెప్పి విమర్శిస్తున్నారని మండిపడ్డారు.. కనీసం ఒక్కసారి కూడా సచివాలయం మొహం చూడని వైఎస్ జగన్ ను 16 నెలలు జైలు లో పెట్టారు.. కానీ, ఆధారాలతో దొరికిపోయిన కూడా చంద్రబాబు తప్పు ఏం చేయలేదు అంటున్నారని దుయ్యబట్టారు.. కొంత మంది ఏదో అన్యాయం జరిగింది అని రాద్ధాంతం చేస్తున్నారంటూ టీడీపీ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనానికి సీఎం జగన్..
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.. రోజుకో రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.. నాలుగో రోజు శ్రీమహాలక్ష్మీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు దుర్గమ్మ.. ఇక, కనకదుర్గమ్మ దర్శనానికి రానున్నారు సీఎం వైఎస్ జగన్.. ఈ నెల 20న మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కనకదుర్గమ్మ వారిని దర్శించుకుంటారు అని తెలిపారు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. సీఎం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించటం ఆనవాయితీగా వస్తోంది.. మూలా నక్షత్రం రోజు అమ్మవారిని లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు దర్శించుకుంటారని అంచనా వేస్తున్నాం అన్నారు. దానికి తగినట్లు అదనపు కౌంటర్లు, తాగు నీరు, ప్రసాదాలు వంటి ఏర్పాట్లు చేస్తున్నాం.. మొదటి రోజు చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యాయి.. ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షించుకుంటున్నాం అని ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.
గజ్వేల్ బరిలో బండి సంజయ్.. కామారెడ్డి నుండి విజయశాంతి..! క్లారిటీ ఇచ్చిన రాములమ్మ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. అభ్యర్థుల ప్రకటన, బీఫారాల పంపిణీతో పాటు ప్రచారంలో బీఆర్‌ఎస్ ఇప్పటికే ముందుంది. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థుల వేటలో ఉండగానే కేసీఆర్ రాష్ట్రంలో పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇలా ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్ తాను పోటీ చేసే నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టకపోవచ్చు. దీంతో బలమైన అభ్యర్థులను నిలబెట్టి కేసీఆర్ ను ఓడించాలని… తద్వారా జాతీయ రాజకీయాలకు సిద్ధమైన బీఆర్ ఎస్ పార్టీని నైతికంగా దెబ్బతీయాలని బీజేపీ భావిస్తోంది. కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో కూడా బలమైన నేతలు పోటీ చేయాలని బీజేపీ కార్యకర్తలు కోరుతున్నారు. అయితే కేసీఆర్‌పై పోటీ చేస్తామని బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్ ఇప్పటికే సవాల్ చేశారు. అలాగే గతంలో మెదక్ ఎంపీగా ఉన్న విజయశాంతి కూడా కామారెడ్డి నియోజకవర్గంపై కొంత ప్రభావం చూపారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ పై గజ్వేల్ నుంచి సంజయ్, కామారెడ్డి నుంచి విజయశాంతి పోటీ చేయాలని బీజేపీ శ్రేణులు కోరుతున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ పై పోటీపై విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌పై రాజీలేని పోరాటంలో బీజేపీ వెనక్కి తగ్గదని కార్యకర్తలు భావిస్తున్నారు. అందుకే గజ్వేల్ నుంచి బండి సంజయ్, కామారెడ్డి నన్ను కేసీఆర్‌పై పోటీ చేయాలన్నారు. ఈ విషయమై గత కొద్ది రోజులుగా కార్యకర్తలు వివిధ మీడియా, సోషల్ మీడియా ద్వారా అడుగుతున్నారు. ఇలా అడగడం తప్పు కాదు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనేది నా ఉద్దేశ్యం కాదు.. అయితే వ్యూహాత్మక నిర్ణయాలను పార్టీ ఎప్పుడూ శాసిస్తుందనేది వాస్తవ వాస్తవం’’ అంటూ కేసీఆర్ పోటీపై సస్పెన్స్ కొనసాగిస్తూనే ఉన్నారు విజయశాంతి.
బీసీల గురించి రాహుల్ చెప్పాల్సిన అవసరం లేదు.. కవిత పైర్..
బీసీల గురించి మాకు రాహుల్ చెప్పాల్సిన అవసరం లేదని ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. నిజామాబాద్ జిల్లా బోధన్ లో పర్యటనలో వున్న కవిత మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై మండిపడ్డారు. గత పదేళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని అన్నారు. సాగు, తాగు నీటికి ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. మహిళా బీడీ కార్మికులకు సౌభాగ్య పథకం వర్తింపజేస్తామన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో చూసి ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయిందని అన్నారు. మా పార్టీ బలంగా ఉంది కాబట్టే మోడీ, రాహుల్, ప్రియాంక ఇక్కడ ప్రచారానికి వస్తున్నారని తెలిపారు. బీసీల గురించి మాకు రాహుల్ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మాది బీసీ ప్రభుత్వం.. రాహుల్ గాంధీ కాదు ఎన్నికల గాంధీ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులను సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా ఆదుకుంటున్నారన్నారు. రైతు బంధు 16 వేలకు పెంచుతాం. బీజేపీ, కాంగ్రెస్ నేతలు టూరిస్ట్ లీడర్లని విమర్శించారు. రాష్ట్రంలోని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎన్నికల వాతావరణాన్ని చెడగొట్టవద్దని సూచించారు. నీటి ఛార్జీలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. బీసీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. బీఆర్‌ఎస్ అంటే బీసీల ప్రభుత్వమని స్పష్టం చేశారు. వేలాది గురుకుల పాఠశాలలను నెలకొల్పిన ఘనత బీఆర్‌ఎస్‌దేనన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు బీఆర్‌ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా నిలిచిందన్నారు. సీఎంలను మార్చేటప్పుడు గొడవలు సృష్టించడం కాంగ్రెస్‌కు అలవాటు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రగతికి నిదర్శనం. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అమలు చేస్తున్న పథకాలను బీజేపీ కాపీ కొడుతుందని ఆరోపించారు. 65 ఏళ్లలో కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందో చెప్పాలి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే తరాలు మారాలని తెలిపారు. కేవలం మూడేళ్ళలో తాము కాళేశ్వరం నిర్మించామన్నారు. నిజాంసుగర్ ఫ్యాక్టరీ సంక్షోభానికి టిడిపి, కాంగ్రెస్ లే కారణం అంటూ మండిపడ్డారు. పదేళ్లలో ఎక్కడా మతకలహాలు లేవని, మతకలహాల చరిత్ర కాంగ్రెస్ ది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బొగ్గు కుంభకోణం చేసిన అదానీ.. అందుకే కరెంట్ రేటు పెరిగింది
అదానీ గ్రూప్ యజమాని గౌతమ్ అదానీపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ పెద్ద ఆరోపణ చేశారు. బొగ్గు వ్యాపారంలో గౌతమ్ అదానీ పెద్ద తప్పులు చేశారని రాహుల్ అన్నారు. ఇందులో రూ.32000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడంటూ ఆరోపించారు. విద్యుత్తు ఖరీదు కావడానికి ఇదే కారణమన్నారు. దీంతో ప్రజల కరెంట్ బిల్లులు అమాంతం పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యుత్ ఖరీదు కావడంతో అదానీ లాభపడ్డాడని రాహుల్ అన్నారు. ప్రధాని మోడీ నేరుగా అదానీకి లబ్ధి చేకూరుస్తున్నారని విమర్శించారు. ఫైనాన్షియల్ టైమ్స్‌ను ఉటంకిస్తూ రాహుల్ అదానీపై ఈ ఆరోపణ చేశారు. ఫైనాన్షియల్ టైమ్స్ కు అన్ని పత్రాలు అందాయని తెలిపారు. బొగ్గు వ్యాపారంలో పెద్ద కుంభకోణం జరిగింది. ఇది తాను చెప్పడం లేదని. లండన్‌లోని ఓ వార్తాపత్రికలో వచ్చిన వార్త అని తెలిపారు. ఇంత జరిగినా అతడి పై విచారణ తీసుకోకపోవడం ఆశ్చర్యకరమని.. మోడీనే అదానీని కాపాడుతున్నారన్నారు. ఇంతకుముందు 20 వేల కోట్లు అనుకున్నాం.. ఇప్పుడు దానికి 12 వేల కోట్లు కలిపి ఇప్పుడు 32 వేల కోట్లు అవుతుందని రాహుల్ అన్నారు. అంటే అదానీ 32000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడు. అదానీ భారతదేశ ప్రజల జేబుల నుండి సుమారు 12000 కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆయన అన్నారు. ఆయనకి ప్రధాని మోడీ రక్షణ ఉంది. మీరు కరెంటు వాడిన వెంటనే పవర్ బటన్ నొక్కిన వెంటనే అదానీ జేబులో డబ్బు పడుతుందని ఎద్దేవా చేశారు.
20న బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తా…21 న కాంగ్రెస్‌లో చేరుతా
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓ వైపు పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తూనే మరోవైపు పార్టీ ఫిరాయించే వారి సంఖ్య పెరుగుతోంది. అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాథోడ్ బాపు రావ్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా మీడియా ముఖంగా వెల్లడించారు. బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాథోడ్ బాపు రావ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈనెల 20వ తేదీన బీ ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేస్తానని.. ఢిల్లీలో 21న కాంగ్రెస్ పార్టీలో చేరుతానని స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు ట్రైబల్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వపోవడంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు సార్లు ఓడిపోయిన వాళ్లకు, అమెరికానుంచి వచ్చిన వారికి టికెట్ ఇచ్చారంటే.. బీఆర్ఎస్ కు గిరిజనుల మీదున్న ప్రేమ ఏంటో అర్థం చేసుకోవాలని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది.. అందుకే పార్టీ మారుతున్నానని స్పష్టం చేశారు. 56 రోజులు వేచి చూసినా.. అయినా లాభం లేదు..అందుకే పార్టీ మారుతున్నానని ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ రాకుండా కొంత మంది అడ్డుకున్నారు.. కుట్రలు చేసారని మండిపడ్డారు. నాది క్లీన్ ఇమేజీ.. ఒక్క కేసు కూడా లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. నా పై కొంత మంది దొంగలు వివిధ ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వాళ్లను మా కార్యకర్తలు బట్టలిప్పి కొడుతారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తది.. మరో సారి పోటీ చేసి గెలిచి తిరుతా అని రథోడ్ బాపురావు స్పష్టం చేశారు.
భారీ అంచనాలతో వచ్చాం.. మరిన్ని షాక్‌లు ఇస్తాం: నెదర్లాండ్స్ కెప్టెన్
భారత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023లో తాము భారీ అంచనాలతో బరిలోకి దిగాం అని నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ తెలిపాడు. భీకర ఫామ్‌లో ఉన్న అగ్రశేణి జట్టు దక్షిణాఫ్రికాపై విజయం సాధించడం చాలా గర్వంగా ఉందని, మరిన్ని షాక్‌లు (మరిన్ని విజయాలు) ఇస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ధర్మశాలలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు నెదర్లాండ్స్ భారీ షాక్ ఇచ్చింది. ప్రొటీస్‌పై 38 పరుగుల తేడాతో గెలిచి.. ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని అందుకుంది. మ్యాచ్ అనంతరం నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ మాట్లాడుతూ… ‘చాలా గర్వంగా ఉంది. భారీ అంచనాలతో వన్డే ప్రపంచకప్ 2023కు వచ్చాం. జట్టులో చాలా మంచి ఆటగాళ్లు ఉన్నారు. తొలి విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. మరికొన్ని విజయాలు సాధిస్తామనే నమ్మకం ఉంది. మేము కొన్ని ప్రణాళికలతో ముందుకు వచ్చాం. అవి కొన్ని మ్యాచ్‌లలో సఫలం కావొచ్చు, మరికొన్ని మ్యాచ్‌లలో విఫలం కావొచ్చు’ అని అన్నాడు.
వామ్మో.. ఏంటి హృతిక్ ఐదు వారాల్లోనే ఇంత మార్పా…
బాలీవుడ్ రొమాంటిక్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు.. వరుస సినిమాలను చేస్తూ తెగ బిజీగా ఉన్నాడు.. హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు.. అమ్మాయిలకు హృతిక్ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎప్పుడూ ఫిట్ గా ఉండాలని హృతిక్ తెగ కష్ట పడతాడు.. ఈ మధ్యకాలంలో ఫిట్‌నెస్‌కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో అతడి సిక్స్ ప్యాక్ కనిపించకుండా పోయింది. ఈ మధ్యకాలంలో ఆయన ఫిట్ నెస్ ను కోల్పోయాడు. అంతేకాదు కాస్త బొద్దుగా మారిపోయాడు. కానీ ఇప్పుడు తిరిగి తన సిక్స్ ప్యాక్ లుక్ లోకి వచ్చాడు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అది కూడా కేవలం ఐదు వారాల్లోనే సిక్స్ ఫ్యాక్ ను తిరిగి పొందడం అంటే అంత ఈజీ కాదు.. ప్రస్తుతం హృతిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.. హృతిక్ రోషన్ హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా లు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇతని డ్యాన్స్ కు ఫిదా అవ్వని వాళ్లు ఉండరు.. అమ్మాయిలు అయితే హృతిక్ అంటే పడి చచ్చిపోతారు.. ఆగస్టు నెలలో హృతిక్ సిక్స్ ప్యాక్ మాయమైంది. అయితే అక్టోబర్ 7 నాటికి మళ్లీ సిక్స్ ప్యాక్ చేశాడు. ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టకపోవడంతో ఇలా జరిగిందని చెప్పుకొచ్చాడు.. మళ్లీ ఫిట్ అవ్వడానికి అతనికి కేవలం ఐదు వారాలు పట్టిందని కూడా పోస్ట్ లో పేర్కొన్నాడు.. ఇలానే ఉండటానికి ట్రై చేస్తానని పేర్కొన్నాడు.. మొత్తానికి అతని ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.. ప్రస్తుతం వరుస సినిమాల పై ఫోకస్ పెట్టాడు..