నన్ను మా బిడ్డల్లాంటి కార్యకర్తలు కలవకూడదా..?
చంద్రబాబుకు మద్దతుగా రాజమండ్రిలో ఉన్న నన్ను మా బిడ్డల్లాంటి కార్యకర్తలు కలవకూడదా..? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. నాకు మనోధైర్యం కలిగించేలా టీడీపీ శ్రేణులు సంఘీభావ యాత్ర చేపడితే తప్పేముంది..? అని నిలదీశారు.. బాధలో ఉన్న అమ్మను కలుస్తామంటే చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులివ్వడమేంటీ..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, మద్దతుదారులు నన్ను కలవకూడదని చెప్పే హక్కు ఈ ప్రభుత్వానికి ఎక్కడిది..? అంటూ ప్రశ్నించారు నారా భువనేశ్వరి.. తన ట్వీట్‌కు పోలీసు నోటీసును కూడా జత చేశారు.. ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు రాజమండ్రి నిర్వహించే ఏ కార్యక్రమానికి అనుమతులు లేవు అంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు.
పవన్ కల్యాణ్‌కి అoత పవనం లేదు.. టీడీపీ పని క్లోజ్..!
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం.. శ్రీకాకుళం పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబును చంపితే మాకు ఏం వస్తుంది? అని ప్రశ్నించారు.. ఆయన ఎక్కడ ఉన్న ఒక్కటేనన్న ఆయన.. జైలులో సదుపాయాలపై కోర్టు ద్వారా వారు ఏమి కోరుతున్నారో అవన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.. దేశంలోని నేరగాల్లకి ఎలాగో చంద్రబాబుకి అలాగే అన్నారు. అతను ఆర్థిక నేరగాడు , మహాత్మా గాంధీనా, నెహ్రూ నా..? అంటూ ఎద్దేవా చేశారు.. అంతే కాదు.. టీడీపీ పని క్లోజ్.. పని అయిపోయిందని వ్యాఖ్యానించారు.. ఇక, చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ వాళ్లు ఇన్ని చేస్తున్నా సామాన్య ప్రజలలో ఎలాంటి రెస్పాన్స్ లేదన్నారు తమ్మినేని.. ఆర్థిక నేరగాళ్లకు ప్రజలు సపోర్ట్ చేయరన్న ఆయన.. 16 నెలలు వైఎస్ జగన్ ని జైలులో పెట్టారు.. కానీ, కేసులో ఏం నిరూపించుకాలేకపోయారని తెలిపారు.. మరోవైపు.. ఎంపీ స్థానంపై పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే అదే ఫాలో అవుతాను అని స్పష్టం చేశారు.. మా పార్టీ రాష్ట్రంలోని 175 స్థానాల్లో పోటీ చేస్తుంది.. మరి.. టీడీపీ, జనసేన, బీజేపీలు దమ్మున్న పార్టీలయితే అనీ స్థానాల్లో ఆయా పార్టీలు పోటీ చేయాలని సవాల్ చేశారు. ఎంత మంది కలసి వచ్చినా ఓకే.. సీఎం వైఎస్ జగన్ సింహం.. సింహం సింగిల్ గానే వస్తుందన్నారు.. ఇక, పవన్ కల్యాణ్‌కి అంత పవనం లేదు.. చమడాలన్ని ఊడిపోయాయి అంటూ ఎద్దేవా చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం.
మగాళ్లయితే నేరుగా రండి.. ఆడాళ్లపై అసభ్యకరమైన పోస్టులు పెట్టడం కాదు..!
సోషల్ మీడియాలో పోస్టులపై ఆంధ్రప్రదేశ్‌లో అధికార, విపక్షాల మధ్య వార్ నడుస్తూనే ఉంది.. ఎవరైనా ఏదైనా కామెంట్ చేశారంటే.. వారికి మద్దతుగా పోస్టులు పెట్టేవారు కొందరైతే.. వాటిని తప్పుబడుతూ పోస్టులు పెట్టేవారు మరికొందరు.. అంతేకాదు.. ఫేక్ ఐడీలతో సోషల్ మీడియాలో అసభ్యకమైన పోస్టులు పెట్టేవారు లేకపోలేదు.. అయితే, వారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.. నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులపై ఓ రేంజ్‌లో ధ్వజమెత్తారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే.. ఐటీడీపీ తరపున ఫేక్ ఐ.డీ.లతో మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు.. మగాళ్లయితే నేరుగా రావాలి అంటూ సవాల్ చేశారు. మగాళ్లయితే నేరుగా రండి.. చూసుకుందాం.. మీరో మేమో తేల్చుకుందాం.. కానీ, దొంగచాటుగా ఇంట్లోని మహిళలపై పోస్టులు పెట్టడం ఏంటిరా..? ఇది సరైన పద్దతేనా? అని మండిపడ్డారు అనిల్‌కుమార్ యాదవ్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనలేక దొడ్డి దారిన దుష్ప్రచారం చేయాలని చూస్తున్నారు.. మేం రాజకీయాల్లో ఉంటే మా ఇంట్లోని మహిళలు, పిల్లలు ఏం చేశారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లోవారిని విధుల్లోకి లాగడం ఎంతవరకు సబబు అని నిలదీశారు. మంత్రి ఆర్కే రోజాతో పాటు పలువురు మహిళలను లక్ష్యంగా చేసుకొని ఈ విధంగా చేస్తున్నారు.. ఫేక్ ఐడీలతో సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు, అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు.. వారిని వదిలిపెట్టేదే లేదంటూ వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.
బీఆర్‌ఎస్‌కు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత రాజీనామా.. సీఎంకు లేఖ..!
నిజామాబాద్ బీఆర్‌ఎస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత జిల్లా పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ మహిళా సహకార సంఘం చైర్మన్ పదవిని కూడా వదులుకున్నారు. ఈ మేరకు ఆమె సీఎం కేసీఆర్‌కు రాజీనామా లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆకుల లలిత మాట్లాడుతూ బీఆర్‌ఎస్ హయాంలో పూర్తిగా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే పరిపాలన సాగిందని గుర్తు చేశారు. స్థానిక సంస్థల పాలన ఎమ్మెల్యేల బానిస పాలనగా మారిందని దుయ్యబట్టారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలు తనను ఇబ్బంది పెడుతుండడంతో బీఆర్‌ఎస్ నుంచి వైదొలగుతున్నట్లు తెలిపారు. కాగా, ఆకుల లలిత కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఆకుల లలిత ఎన్నికల అనంతరం బీఆర్ ఎస్ పార్టీలో చేరారు. మళ్లీ ఎన్నికల సమయంలో అధికార పార్టీని వీడి సొంత ఇంట్లో చేరుతారన్న వర్గాలు తాజాగా ఊపందుకున్నాయి. అక్టోబర్ 20 నుంచి నిజామాబాద్ జిల్లాలో రాహుల్ పర్యటన నేపథ్యంలో మరిన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
నల్గొండలో మరొక్కసారి అవకాశం ఇవ్వండి..
నల్గొండలో మరొక్కసారి అవకాశం ఇవ్వాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజలను కోరారు. ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో.. నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్,కౌన్సిలర్లు భేటీ అయ్యారు. కోమటి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాకప్పుకున్నారు. అనంతరం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. పేదలకు ఇండ్లు లేవు.. ఉద్యోగాలు ఇవ్వలేదు కేసీఆర్ అంటూ మండిపడ్డారు. నల్గొండలో మరొక్కసారి అవకాశం ఇవ్వండి అని కోరారు. కేసీఆర్.. సిరిసిల్ల.. సిద్దిపేట..గజ్వెల్ కె సీఎం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ దత్తత తీసుకున్న కేసీఆర్ ఒక్క ఇల్లు కట్టారా..? అని ప్రశ్నించారు. రోడ్డు ఒక్కటి వేసి.. అభివృద్ధి అంటున్నాడు అంటూ వ్యంగాస్త్రం వేశారు. 10 నెలల్లో సెక్రటేరియట్ ఎలా కట్టావు? అంటూ ప్రశ్నించారు. పేదల ఇండ్లు కట్టాలంటే కంట్రాక్టర్ రాలేదు అంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి సెక్రటేరియట్ ఎలా పూర్తి అయ్యింది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నల్గొండ గౌరవం దక్కేలా పని చేస్తా అని అన్నారు. కేసీఆర్ సిలిండర్ 400 కె ఇస్తా అన్నారని గుర్తు చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి ఎందుకు ఇవ్వలేదు? అంటూ ప్రశ్నించారు. పదేళ్ల క్రితం నీకు ఎందుకు ఆలోచన రాలేదు? అని కోమటి రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పథకాలు కాపీ కొట్టాడు కేసీఆర్ అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హామీలు అమలు చేస్తామని తెలిపారు. హరీష్..కేటీఆర్ తప్పా..మంత్రులు అంతా ఇంటికే పరిమితం అయ్యారు అన్నారు. వరంగల్ డాక్టర్ ప్రీతి ఆత్మహత్య మరిచిపోక ముందే..ప్రవల్లిక ఆత్మహత్య బాధాకరం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్.. పరీక్ష రాయలేదు అంటున్నాడు? లవ్ ఎఫైర్ అని డీసీపీ అంటారు? దీనిపై సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. చనిపోయిన అమ్మాయి పై ఆబండాలు వేయడం సరికాదని మండిపడ్డారు. కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బ్లాక్ లిస్ట్ లో ఉన్న కంపనీకి ఇంటర్ ఫలితాలు ఇచ్చే బాధ్యత ఇచ్చి విద్యార్థులతో చెలగాటం ఆడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్వలింగ సంపర్కుల వివాహాలపై సుప్రీంకోర్టు తీర్పు.. నాలుగు వేర్వేరు తీర్పులు..!
కొంతకాలంగా ఉత్కంఠ రేపుతోన్న స్వలింగ సంపర్కుల వివాహాల చట్టబద్దతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం నాలుగు వేర్వేరు తీర్పులు ఇచ్చింది. స్వలింగ సంపర్కం అనేది కేవలం పట్టణాలు లేదా సమాజంలో ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైందని కాదని స్పష్టం చేసింది. లైంగిక ధోరణి ఆధారంగా వ్యక్తుల పట్ల ఎలాంటి వివక్ష చూపకూడదని పేర్కొంది. కోర్టులు చట్టాలను రూపొందించవని, కానీ వాటిని అర్థం చేసుకుని అమలు చేస్తాయని సీజేఐ డీవై చంద్రచూడ్ చెప్పారు. వివాహ వ్యవస్థ స్థిరమైనదని, దాన్ని మార్చలేమని అనుకోవడం సరికాదన్నారు. స్వలింగ సంపర్కుల కోసం ప్రత్యేక వివాహ చట్టాన్ని తీసుకురాకపోతే మనం స్వాతంత్ర్యానికి ముందు రోజులకు వెళ్లినట్లేనన్నారు. ప్రత్యేక వివాహ చట్టం అవసరమా? లేదా? అనేది పార్లమెంట్ నిర్ణయిస్తుందని, దీని చట్టపరిధిలోకి కోర్టు వెళ్లాలనుకోవట్లేదని సీజేఐ తెలిపారు.
చైనా పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్..
రష్యా అధ్యక్షుడు వ్లాదిపూర్ పుతిన్.. చైనాకు చేరుకున్నారు.. డ్రాగన్ కంట్రీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బెల్డ్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పథకం ప్రారంభించి పదేళ్లు పూర్తవుతోన్న సందర్భంగా.. దీనిని పురస్కరించుకుని బీజింగ్‌లో అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సును నిర్వహిస్తున్నారు.. ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. పుతిన్‌ను ఆహ్వానించారు.. చైనా ఆహ్వానం మేరకు ఈ రోజు బీజింగ్ చేరుకున్నారు పుతిన.. ప్రత్యేక విమానంలో పుతిన్ ఈ రోజు బీజింగ్‌లో అడుగుపెట్టారు.. చైనా మంత్రులు, ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతం పలికారు. మొత్తంగా తన ప్రియమైన స్నేహితుడు జిన్‌పింగ్‌ను కలవడానికి రష్యాకు చెందిన పుతిన్ చైనా చేరుకున్నారు. పుతిన్ తన కమ్యూనిస్టు పొరుగు దేశమైన చైనాతో ఇప్పటికే బలమైన సంబంధాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఉన్నాడు.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో కప్పివేయబడే శిఖరాగ్ర సమావేశంలో వారి సంబంధాన్ని బలపరిచారు. బీజింగ్ తన ప్రపంచ ప్రభావాన్ని విస్తరించడానికి ఉపయోగిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనే ప్రెసిడెంట్ జి యొక్క మైలురాయి ప్రాజెక్ట్ ఫోరమ్ కోసం చైనా ఈ వారం 130 దేశాల ప్రతినిధులను స్వాగతించింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తర్వాత అంతర్జాతీయంగా పుతిన్‌పై ఒత్తిడి పెరిగిపోయింది.. యుద్ధ నేరాల కేసులో పుతిన్‌ను అంతర్జాతీయ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఆయన అరెస్టుకు ఆదేశాలు కూడా జారీచేసింది. దీంతో పుతిన్ విదేశీ పర్యటనలకు దూరంగా ఉంటున్నారు.. భారత్‌లో జరిగిన జీ20 సమావేశాలకు కూడా ఆయన హాజరుకాలేదు. కానీ, మొదటి చైనాలో పర్యటిస్తున్నారు.. చైనా ఆహ్వాన జాబితాలో పుతిన్ అగ్రస్థానంలో ఉన్నారు. పుతిన్ ప్రత్యేక విమానం ఈ రోజు ఉదయం 09:30 గంటలకు ముందు చైనాలో ల్యాండ్ అయింది.. అతను బుధవారం చర్చల కోసం జిన్‌పింగ్‌ను కలవబోతున్నాడు.. చర్చల సందర్భంగా అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది..
విరాట్ ‘దబాంగ్’, రోహిత్ ‘బజరంగీ భాయిజాన్’.. సల్మాన్ ఖాన్ ఫిదా!
ప్రపంచకప్ 2023లో భారత్ దూసుకుపోతుంది. మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో గెలిచిన టీమిండియా (6 పాయింట్స్) టాప్ ప్లేస్‌లో ఉంది. భారత్ తన తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ధి కొడుతుంది. భారత ఆటగాళ్ల ఫామ్ చూస్తే.. ఈ మ్యాచ్ కూడా సునాయాసంగా గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రపంచకప్ 2023లో భారత్ అన్ని విభాగాల్లో రాణిస్తూ విజయాలు సాధిస్తోంది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు సత్తాచాటుతున్నారు. ఈ ఇద్దరి ఆటకు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఫిదా అయ్యాడు. దబాంగ్, భజరంగి భాయిజాన్ క్యారెక్టర్లు వారికి సరిగ్గా నప్పుతాయని పేర్కొన్నాడు. స్టార్ స్పోర్ట్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రపంచకప్ 2023లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల ప్రదర్శనల గురించి సల్మాన్ ఖాన్ స్పందించాడు. ఈ క్రమంలో ఈ ఇద్దరు మీ సినిమాల్లోని ఏ క్యారెక్టర్‌కు సూట్ అవుతారని యాంకర్ అడగ్గా.. విరాట్ ‘దబాంగ్’, రోహిత్ ‘బజరంగీ భాయిజాన్’ క్యారెక్టర్‌కు సెట్ అవుతారని చెప్పాడు. ‘విరాట్ కోహ్లీ శారీరకంగా, మానసికంగా చాలా దృఢంగా ఉంటాడు. అతను చాలా అంకితభావంతో ఆడతాడు. కోహ్లీ తన పనిని సీరియస్‌గా తీసుకుంటాడు. జట్టులో తన రోల్ ఏంటో కోహ్లీకి బాగా తెలుసు. తన పనిని సమర్థవంతంగా నిర్వర్తించడానికి చాలా కష్టపడతాడు’ అని సల్లూ భాయ్ అన్నాడు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఏ క్యారెక్టర్‌కు సూట్ అవుతాడని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అడగ్గా.. ‘బజరంగీ భాయిజాన్’ అని సల్మాన్ ఖాన్ పేర్కొన్నాడు. ‘రోహిత్ శర్మ ఓ అద్భుతమైన ఆటగాడు. కెప్టెన్సీ బరువును మోస్తూ ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ.. జట్టును విజయ తీరాలకు చేర్చాలనే తపన అతడిలో ఉంది’ అని చెప్పాడు. దబాంగ్ సినిమాలో సల్మాన్ పాత్ర (చుల్బుల్ పాండే) దూకుడుగా ఉంటుంది. బజరంగీ భాయిజాన్ సినిమాలో సల్మాన్ పోషించిన పాత్ర ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో రోహిత్ 217 పరుగులు చేయగా.. కోహ్లీ 156 రన్స్ బాదాడు.
మంగళవారం ట్రైలర్ శనివారం వస్తుంది… థ్రిల్ అవ్వడానికి రెడీగా ఉండండి
ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఆడియన్స్ ని మెప్పించిన దర్శకుడు అజయ్ భూపతి, రెండో సినిమాకే ఆడియన్స్ కి ఊహించని షాక్ ఇచ్చాడు. ‘మహా సముద్రం’ సినిమాతో చెడ్డ పేరుని మూటగట్టుకున్న అజయ్ భూపతి… దీంతో కాస్త గ్యాప్ తీసుకోని ‘మంగళవారం’ సినిమా చేస్తున్నాడు. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పాయల్, మంగళవారం పోస్టర్ లో బ్యాక్ లెస్ గా న్యూడ్ గా కనిపించింది. పాయాల్ రాజ్ పుత్ ‘శైలజ’ అనే పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి విరుపాక్షకి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేసిన అజ్నీష్ లోకనాథ్, మ్యూజిక్ అందిస్తున్నాడు. నవంబర్ 17న ఆడియన్స్ ముందుకి రానున్న మంగళవారం సినిమా థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ మంగళవారం ప్రమోషన్స్ ని స్పీడప్ చేస్తున్నారు. ఇటీవలే రిలీజైన మంగళవారం టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ లో మేకింగ్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ చేసిన హైప్ ని మరింత పెంచుతూ ఇటీవలే “గణగణా మోగాలిరా” సాంగ్ బయటకి వచ్చి సూపర్ క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఈ సాంగ్ తో మంగళవారం సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరిగాయి. లేటెస్ట్ గా మంగళవారం సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని ఇస్తూ అజయ్ భూపతి ట్వీట్ చేసాడు. నవంబర్ 21న మంగళవారం సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారు. ఈ అనౌన్స్మెంట్ ఇస్తూ మేకర్స్ వదిలిన పోస్టర్ లో ఇద్దరు ఒక పెద్ద చెట్టుకి ఉరేసుకోని ఉన్నారు. పోస్టర్ తో స్పైన్ చిల్స్ ఇచ్చిన అజయ్ భూపతి ట్రైలర్ తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
పఠాన్, జవాన్ రికార్డ్స్ కి చెక్ పెట్టిన టైగర్…
పఠాన్, జవాన్, గదర్ 2 సినిమాలో 2023లో బిగ్గెస్ట్ గ్రాసర్స్ గా నిలిచాయి. బాలీవుడ్ బిజినెస్ ని పూర్తిగా రివైవ్ చేసిన ఈ సినిమాలు ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. ఇక 2023లో ఈ సినిమాలదే టాప్ ప్లేస్ అనుకుంటుంటే… సల్మాన్ ఖాన్ సాలిడ్ గా బయటకి వచ్చాడు. గత కొంతకాలంగా సరైన హిట్ లేని సల్మాన్ ఖాన్, టైగర్ 3 సినిమాతో కంబైక్ ఇస్తాడని ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ టైగర్ 3 ట్రైలర్ ని వదిలాడు సల్మాన్ ఖాన్. యష్ రాజ్ స్పై యూనివర్స్ కి స్టార్టింగ్ పాయింట్ అయిన టైగర్, జోయా కథకి నార్త్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇండియన్ స్పై, పాకిస్థాన్ స్పై ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అనే దగ్గర మొదలైన టైగర్ ఫ్రాంచైజ్ నుంచి ఇప్పుడు మూడో సినిమాగా టైగర్ 3 వస్తుంది. గతంలో వచ్చిన రెండు సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి హిట్ అయ్యాయి. ఇప్పుడు టైగర్ 3 పఠాన్ జవాన్, గదర్ 2 సినిమాలని దాటి ఈ ఇయర్ హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుందని సమాచారం. ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లో 41 మిలియన్ వ్యూస్, 1.5 మిలియన్ లైక్స్ వచ్చాయి అంటే టైగర్ 3 పై ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. రిపీట్ మోడ్ లో ట్రైలర్ ని చూస్తూ వ్యూస్ పెంచుతున్నారు సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్. హ్యుజ్ సెటప్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఏ స్పై సినిమాలో అయినా ఉంటాయి కానీ టైగర్ ఫ్రాంచైజ్ లో మాత్రమే హ్యూమన్ ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. మరోసారి దాన్ని నిజం చేయడానికి నవంబర్ 12న టైగర్ 3 రిలీజ్ కానుంది. మరి సల్మాన్ దెబ్బకి ఎన్ని రికార్డులు లేస్తాయో చూడాలి.