స్కూల్ ఆటోను ఢీకొట్టిన లారీ.. రోడ్డుపై పల్టీలు కొట్టింది..!
విశాఖపట్నంలో స్కూల్ ఆటోలు ప్రమాదాలకు గురయ్యాయి. వేరు వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో 20 మంది స్కూల్ విద్యార్తులకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు.. సంగం శరత్ థియేటర్ కూడలిలో స్కూల్ ఆటోను లారీని వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఓ వైపు లారీ వేగంగా వస్తుండగా.. మరోవైపు, ఆటో డ్రైవర్ కూడా అంతే వేగంతో రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు.. లారీ దూసుకురావడంతో.. ఆటో కంట్రోల్ చేయలేక లేరుగా వెళ్లి ఢీకొట్టాడు.. ఈ ప్రమాదంలో ఆటో పల్టీలు కొట్టగా అందులో ప్రయాణిస్తున్న బేతనీ స్కూల్ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. తలకు బలమైన దెబ్బ తగిలిన ఇద్దరు పిల్లల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్షతగాత్రులను సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. లారీని క్లీనర్ నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. డ్రైవర్, క్లీనర్ పారిపోయే ప్రయత్నం చేయగా దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు స్థానికులు. ఇక, మధురవాడ, నగరపాలెం దగ్గర మరో స్కూల్ ఆటో బోల్తా పడింది. పందులు అడ్డుగా రావడంతో వాటిని తప్పించే ప్రయత్నంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏడుగురు పిల్లలకు దెబ్బలు తగిలాయి. వీరంతా భాష్యం స్కూల్ విద్యార్థులుగా చెబుతున్నారు స్థానికులు.. ఒకే రోజు రెండు చోట్ల అది కూడా స్కూల్ ఆటోలు ప్రమాదాలకు గురికావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.
కోటంరెడ్డి కొత్త కార్యక్రమం.. ‘ఒక్కడే.. ఒంటరిగా..’
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో కొత్త కార్యక్రమానికి సిద్ధం అవుతున్నారు.. ప్రజాప్రతినిధిగా ప్రజల్లో ఉండడం నాకు ఇష్టం.. గత పదేళ్ల నుంచి ఎమ్మెల్యేగా ప్రజల కోసం పనిచేస్తున్నా.. ఇందులో భాగంగా ఈ నెల 25వ తేదీ నుంచి 33 రోజుల పాటు ‘ఒక్కడే.. ఒంటరిగా..’ పేరుతో కార్యక్రమం చేపట్టనున్నట్టు ప్రకటించారు.. ఇందులో భాగంగా లక్ష మందిని కలిసి చర్చిస్తా.. అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతా.. 25వ తేదీన ఉదయం నా సతీమణి సుజిత ఉప్పుటూరులో పెద్ద కుమార్తె హైందవి కోడూరు పాడు గ్రామం నుంచి.. చిన్న కూతురు వైష్ణవి.. దొంతాలి గ్రామం నుంచి.. ఇంటింటికీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలిపారు. ఇక, వీళ్ల కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆ ప్రాంతాల్లో నేను పర్యటిస్తా.. మీడియా కూడా లేకుండా కార్యక్రమం నిర్వహిస్తాను అని వెల్లడించారు కోటంరెడ్డి.. ఎవరూ లేకుండా ఒంటరిగా వెళ్తేనే ప్రజలు నాతో ఎలాంటి ఇబ్బంది లేకుండా మాట్లాడుతారని తెలిపారు.. అయితే, తన కార్యక్రమంలో అప్పుడప్పుడు మీడియాతో అనుభవాలు పంచుకుంటానని చెప్పుకొచ్చారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. కాగా, గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించిన ఆయన.. ఆ తర్వాత వైసీపీకి గుడ్‌బై చెప్పి.. టీడీపీకి దగ్గరైన విషయం విదితమే.
ఏఏజీ పొన్నవోలుపై కోర్టు ధిక్కరణ కేసుకు టీడీపీ డిమాండ్..
ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూర్ సభ్యులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ చౌదరి డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎటువంటి సాక్షాదారులు లేకుండా కేసులు నమోదు చేసి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ వ్యవస్థలను మేనేజ్ చేసి సీఐడీలను ప్రయోగించి ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు.. తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన జడ్జిని ఆయన ఇచ్చిన జడ్జిమెంట్‌ను తప్పుబడుతూ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడటం కోర్టు ధిక్కరణ అవుతుందన్నారు. ముందు కేసులు పెట్టి తరువాత విచారణ చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఇక, పదేళ్లుగా వైఎస్ జగన్ అక్రమ ఆస్తుల కేసులో డిశ్చార్జి పిటిషన్లు వేస్తూ వాయిదాలు తీసుకుంటూ కోర్టుకు హాజరు కాకపోవడాన్ని తప్పుబట్టారు ఎమ్మెల్యే గోరంట్ల.. సీఐడీని దుర్వినియోగం చేస్తున్న మీకు ఎన్ని నోటీసులు ఇవ్వాలలని ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థ కాపాడుతుందు.. జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు. చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై సుప్రీంకోర్టులో సవాల్ చేయడాన్ని ఆక్షేపించారు. మరోవైపు.. ఈ నెల 24వ తేదీ నుంచి లోకేష్ యువగళం పాదయాత్ర పునః ప్రారంభం అవుతుందని వెల్లడించారు. రానున్న ఎన్నికల విధుల్లో వాలంటీర్లను దూరంగా ఉంచాలని టీడీపీ నాయకులు ఎన్నికల కమిషన్ ను కోరినట్లు తెలిపారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
సీఎం జగన్ గొప్ప సంఘ సంస్కర్త, చరిత్రకారుడు..
సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గొప్ప సంఘ సంస్కర్త, చరిత్రకారుడు అంటూ ప్రశంసలు కురిపించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గత పాలకులు ఎవ్వరూ ఆంధ్రప్రదేశ్‌లో విద్యను ప్రోత్సహించిన దాఖలాలు లేవు అన్నారు. ఇక, దేశం మొత్తం కులగణన జరగాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో.. సీఎం వైఎస్ జగన్.. కులాల లెక్కలు తీయాలని నిర్ణయించడం గర్వకారణం అన్నారు. దేశ వ్యాప్తంగా కులసంఘాలు అన్నీ సీఎం జగన్ ను అభినందిస్తున్నాయని తెలిపారు.. సీఎం జగన్ గొప్ప సంఘ సంస్కర్త, చరిత్రకారుడిగా అభివర్ణించిన ఆయన.. మరో 20 ఏళ్ళలో ఏపీ దేశంలోనే ప్రథమ స్ధానంలో ఉంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విదేశాల్లో చాలామంది ఏపీ నుంచి వెళ్లిన వాళ్లే ఉన్నారని తెలిపారు.. ఇక, వైసీపీ మంత్రి వర్గంలో 11 మంది మంత్రులు బీసీలే అని.. ఏపీలో కలపాలని పక్క రాష్ట్రాల వారంటున్నారని చెప్పుకొచ్చారు. బీసీ సీఎంలు ఉన్న చోట కూడా బీసీల పరిస్ధితి బాగోలేదన్నారు. టీడీపీ పేరుకే బీసీల పార్టీ.. ఓట్ల కోసం బీసీలను వాడుకున్నారని దుయ్యబట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు జగన్ పాలన కావాలని కోరుతున్నారు అని పేర్కొన్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య.
ఓటమి భయంలో వివేక్.. చెన్నూరులో ఓడిపోతారంటూ బాల్క సుమన్ కామెంట్స్
మంచిర్యాల జిల్లాలో కేంద్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్ పై ఆగ్రవం వ్యర్తం చేశారు. సీఎం కేసీఆర్ ను పట్టుకుని ఆరే కేసీఆర్ అని మాట్లాడుతున్నారు.. వివేక్ మాట్లాడిన వీడియోను మీడియాను ముందు ఆయన వినిపించారు. తెలంగాణ కోసం చావు నోట్లో తలపెట్టిన నాయకుడిని పట్టుకొని అలా మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి లాంటి నాయకుడిపై మాట్లాడటం దుర్మార్గం.. మాకు మాట్లాడ వచ్చు.. కానీ సంస్కారం ఉంది.. ఓటమి భయంతో అట్లా వివేక్ మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. వివేక్ సంస్థలోని ఉద్యోగులు చెన్నూర్ లోనే పని చేస్తున్నారు.. డబ్బులతో మా లీడర్లను కొంటున్నారు.. నేను అటు తిరిగితే ఇటు నాయకులను కొంటున్నారు అంటూ బాల్క సుమన్ మండిపడ్డారు.
బీజేపీకి మరో షాక్.. పార్టీకి రాజీనామా చేసిన అశ్వత్థామరెడ్డి
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కమలం పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. తాజాగా, వనపర్తి అసెంబ్లీ స్థానాన్ని ఆశించిన టీఎస్ ఆర్టీసీ టీఎంయూ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. వనపర్తి అసెంబ్లీ స్థానం ఇచ్చినట్టే ఇచ్చి చివరి క్షణంలో అనుజ్ఞ రెడ్డికి బీజేపీ అధిష్టానం కన్ఫార్మ్ చేసింది. దీంతో వనపర్తి అసెంబ్లీ స్థానం టికెట్ దక్కకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇక, ఇవాళ అశ్వత్థామ రెడ్డి బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు. ఇక, బీజేపీ పార్టీకి వరుస షాక్స్ తగులుతున్నాయి. ఇప్పటికే కమలం పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామితో పాటు విజయశాంతి కూడా రాజీనామాలు చేశారు. దీంతో బలంగా కనిపించిన కాషాయం పార్టీ పూర్తిగా బలహీన పడింది. ఈ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని చూసిన కమలం పార్టీకి బంగపాటు తప్పదని పార్టీ మారిన నేతలు అంటున్నారు.
రెండేళ్లలో ప్లాంట్ ఏర్పాటుకు టెస్లా – భారత్ మధ్య కుదిరిన ఒప్పందం
ఎలాన్ మస్క్ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీ కంపెనీ టెస్లా. వచ్చే ఏడాది భారతదేశంలోకి ప్రవేశించబోతోంది. భారత్‌తో టెస్లా ఒప్పందం చివరి దశలో ఉంది. ఎలోన్ మస్క్ కూడా వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించబోతున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది నుండి దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను దిగుమతి చేసుకోవడానికి.. రెండేళ్ల వ్యవధిలో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ఈ అమెరికన్ EV కంపెనీని భారతదేశం అనుమతిస్తుంది. జనవరిలో జరిగే వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌లో దీనిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. టెస్లా గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడులో తన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయగలదు. భారతదేశంలో కొత్త ప్లాంట్ కోసం టెస్లా ప్రారంభంలో దాదాపు 2 బిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ. 16,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. వారు భారతదేశం నుండి 15 బిలియన్ డాలర్లు లేదా దాదాపు రూ. 1.2 లక్షల కోట్ల విలువైన ఆటో విడిభాగాలను కొనుగోలు చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడానికి భారతదేశంలో కొన్ని బ్యాటరీలను తయారు చేయాలని ఆలోచిస్తోంది.
ప్రారంభమైన టాటా కంపెనీ ఐపీవో.. లాభాల కోసం పోటీపడుతున్న ఇన్వెస్టర్లు
దాదాపు 20 ఏళ్ల తర్వాత నేడు టాటా కంపెనీ ఐపీఓ ప్రారంభమైంది. టాటా ఈ IPO గురించి పెట్టుబడిదారులు అత్యంత ఉత్సాహంగా ఉన్నారు. టాటాతో సహా 5 ఐపిఓలు ఈరోజు బుధవారం ప్రారంభించబడ్డాయి. ఈ రోజు నుండి ఈ IPOలకు సభ్యత్వం పొందవచ్చు. వీటిలో టాటా టెక్నాలజీ, ఫ్లెయిర్ రైటింగ్, గాంధార్ ఆయిల్ రిఫైనరీ, ఫీడ్‌బ్యాక్ ఫైనాన్షియల్ సర్వీసెస్, రాకింగ్ డీల్స్ సర్క్యులర్ IPO ఉన్నాయి. వీటిలో చాలా కంపెనీల షేర్లు గ్రే మార్కెట్‌లో ఆకట్టుకునే ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. మీరు టాటా టెక్నాలజీస్ IPO కోసం బుధవారం, నవంబర్ 22, 2023 – నవంబర్ 24, 2023 మధ్య వేలంలో పాల్గొనవచ్చు. ఐపీఓ ద్వారా మార్కెట్ నుంచి రూ.3,042.51 కోట్లు వసూలు చేసేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. టాటా టెక్ IPO యాంకర్ నవంబర్ 21న పెట్టుబడిదారుల కోసం తెరవబడింది. 67 మంది యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా కంపెనీ మొత్తం రూ.791 కోట్లను సమీకరించింది. కంపెనీ ఒక్కో షేరును రూ.500 చొప్పున యాంకర్ ఇన్వెస్టర్లకు విక్రయించింది. ఈ 67 మంది యాంకర్ ఇన్వెస్టర్లకు మొత్తం 1,58,21,071 ఈక్విటీ షేర్లు విక్రయించబడ్డాయి. టాటా టెక్ IPO పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రారంభించబడుతోంది. ఈ ఐపీఓలో టాటా మోటార్స్, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్-1, ఆల్ఫా టీసీ హోల్డింగ్ తమ వాటాను విక్రయిస్తున్నాయి. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారులకు 50 శాతం, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారులకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం రిజర్వ్ చేసింది. కంపెనీ తన వాటాదారుల కోసం 6,085,027 ఈక్విటీ షేర్లను, ఉద్యోగుల కోసం 2,028,342 ఈక్విటీ షేర్లను రిజర్వ్ చేసింది.
నువ్ క్రికెట్‌లో ఎలా భాగమయ్యావో తెలియడం లేదు.. పాకిస్తాన్ మాజీపై షమీ ఫైర్!
వన్డే ప్రపంచకప్ 2023లో బీసీసీఐ చీటింగ్ చేస్తోందని, భారత జట్టుకు స్పెషల్ బాల్స్ ఇస్తోందని పాకిస్తాన్ మాజీ ఆటగాడు హసన్ రజా ఇటీవల సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. లీగ్ దశలో భారత్ వరుస విజయాలు చూసి ఓర్వలేని హసన్.. తన అక్కసు వెళ్లగక్కాడు. తాజాగా హసన్ వ్యాఖ్యలపై భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ స్పందించాడు. హసన్ చేసిన వ్యాఖ్యలను చూసి తాను ఆశ్చర్యపోయానన్నాడు. హసన్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఎలా భాగమయ్యాడో తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని షమీ అన్నాడు. స్పోర్ట్స్‌వేర్ దిగ్గజం పుమా నిర్వహించిన చాట్‌లో హసన్ రజా వ్యాఖ్యలపై మహ్మద్ షమీ స్పందించాడు. ‘ప్రపంచకప్ 2023లో మొదట జరిగిన మ్యాచ్‌లలో నేను ఆడనప్పుడు కూడా ఈ ఆరోపణలను విన్నా. నా తొలి మ్యాచ్‌లో 5 వికెట్లు తీశా. తర్వాతి మ్యాచ్‌లో 4, ఆ తర్వాతి మ్యాచ్‌లో 5 వికెట్లు తీశాను. ఇది కొందరు పాకిస్తాన్ ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోయారు. దానికి నేనేం చెయ్యగలను. వారి మనస్సులో మేము అత్యుత్తమం అని అనుకున్నారు. అయితే సరైన సమయంలో ప్రదర్శన చేసే ఆటగాళ్లే అత్యుత్తమమని నేను భావిస్తున్నాను’ అని షమీ అన్నాడు.
శివాజీ, ప్రశాంత్ లకు బిగ్ బాస్ షాక్.. ఆ ఇద్దరు ఎలిమినేట్ పక్కా..
బిగ్ బాస్ ప్రస్తుతం రసవత్తరంగా సాగుతుంది.. ఈ వారం 12 వారానికి నామినేషన్స్ జరుగుతున్నాయి.. హౌస్ లో ప్రస్తుతం 10 మంది ఉన్నారు.. మంగళవారం రాత్రి నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ఈసారి ఫలితాలు అనూహ్యంగా ఉన్నట్లు తెలుస్తుంది. టైటిల్ ఫేవరేట్స్ కి షాక్ తగిలిందని అంటున్నారు.. గత వారం ఎవరూ ఎలిమినేట్ కాలేదు. అవిక్షన్ పాస్ గెలిచిన యావర్ దాన్ని తిరిగి ఇచ్చేశాడు. ఈ కారణంగా బిగ్ బాస్ ఎలిమినేషన్ రద్దు చేశాడు. వచ్చే వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ అన్నారు. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది.. శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్, అర్జున్, అశ్విని, రతిక, గౌతమ్ నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. మంగళవారం రాత్రి 10:30 నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి.. తమకు కావలసిన వాళ్లకు ఓట్లు వేశారు బిగ్ బాస్ ఆడియన్స్.. ఈ నామినేషన్స్ లో అనూహ్య పరిణానామాలు చోటు చేసుకున్నాయి.. ఈ వారంకు శివాజీ, పల్లవి ప్రశాంత్ లను వెనక్కి నెట్టి అమర్ దీప్ టాప్ లోకి వచ్చాడట. శివాజీ, పల్లవి ప్రశాంత్ టైటిల్ ఫెవరేట్స్ గా ఉన్నారు. వారు ఎప్పుడు నామినేషన్స్ లోకి వచ్చినా టాప్ లో కొనసాగుతున్నారు. ఈసారి మాత్రం వారు 2, 3 స్థానాలకు పడిపోయారని సమాచారం…
దేవర గెటప్ ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ అవుతుందా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ దేవర షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. ఎన్టీఆర్, శ్రీకాంత్… ఇతర మెయిన్ కాస్ట్ ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో… దేవరపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని కీలక భారీ యాక్షన్ షెడ్యూల్స్ కంప్లీట్ చేశాడు కొరటాల. రీసెంట్‌గా జరిగిన గోవా షెడ్యూల్ లో శ్రీకాంత్‌కు గాయాలు కూడా అయ్యాయి. ఇదే విషయాన్ని బిగ్‌బాస్ స్టేజ్ మీద చెప్పాడు శ్రీకాంత్. గోవాలో దేవర షూటింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగిందని… ఇసుక దిబ్బలో పరిగెడుతుంటే కాలు బెణికిందని చెప్పాడు. అయినా కూడా షూటింగ్ చేశాడట శ్రీకాంత్… నిలబడే డైలాగ్స్ చెప్పాడట. ఇదిలా ఉంటే దేవరకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వినిపిస్తోంది. దేవర సినిమాలో యంగ్ టైగర్ డ్యూయెల్ రోల్ చేస్తున్నట్టుగా ముందు నుంచి ప్రచారంలో ఉంది. అందులో ఓ లుక్ ఓల్డ్ గెటప్‌లో ఉంటుందని తెలుస్తోంది. అందుకు సంబంధించిన సీక్వెన్స్ ఇంటర్వెల్‌లో గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందట. శ్రీకాంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఈ ట్విస్ట్… ఫ్లాష్ బ్యాక్‌కి లీడ్ ఇస్తుందని… సినిమాలో ఇది గొప్ప థ్రిల్లింగ్ ఎలిమెంట్‌గా నిలుస్తుందని అంటున్నారు. అసలు… ఈ ట్విస్ట్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుందని, ఎన్టీఆర్ ఓల్డ్ లుక్ అదిరిపోనుందని టాక్. అయితే ఓల్డ్ గెటప్ అంటూ దేవర సినిమాలో ప్రత్యేకంగా లేకపోవచ్చు ఎందుకంటే ఎన్టీఆర్ రెండు లుక్స్ లో ఒకటి యంగ్ లుక్ అవ్వగా… ఇంకొకటి ఫస్ట్ లుక్ పోస్టర్ లో చూసిన లుక్. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో కనిపించే అతనే దేవర టైటిల్ రోల్ ప్లే చేస్తుండొచ్చు. ఈ రెండు లుక్స్ కాకుండా ఆడియన్స్ కి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కొరటాల శివ నుంచి వస్తే చెప్పలేం.