ఫిషింగ్ హార్బర్‌లో భారీ అగ్నిప్రమాదం.. సీఎం జగన్ దిగ్భ్రాంతి
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో బోట్లు దగ్ధమైన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. బాధితులను ఆదుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని స్పష్టం చేశారు.. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని మంత్రి సీదిరి అప్పలరాజుని ఆదేశించారు సీఎం జగన్. ఇక, బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలని, తగిన విధంగా వారికి సహాయం చేయాలని అధికారులకు సూచించారు. కాగా, విశాఖ ఫిషింగ్ హార్బర్లో అర్ధరాత్రి చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదం మత్స్యకారులకు తీవ్ర విషాదాన్ని మిగిలిచింది.. మత్స్యకారులందరూ గాఢ నిద్రలో ఉండగా జరిగిన ఘోర అగ్నిప్రమాదం గంగపుత్రులకు కాళరాత్రిగా మారింది.. ఒకటి కాదు రెండు కాదు సుమారు 50 బోట్లు అగ్నికి ఆహుతి అయిపోయాయి.. ఈ ప్రమాదంలో 40 కోట్ల రూపాయలు వరకు ఆస్తినష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు.. ఎవరో ఆకతాయిలు చేసిన పని వందలాదిమంది మత్స్యకార కుటుంబాలకు కడుపు కోతను మిగిల్చింది. కన్న బిడ్డల్లా చూసుకుంటున్న జీవనాధారమైన బోట్లు కళ్ల ఎదుట అగ్నికి ఆహుతి అయిపోవడంతో జీర్ణించుకోలేకపోతున్నారు.
రేపు తిరుపతిలో సీఎం జగన్ పర్యటన..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిత్యం బిజీగా గడుపుతున్నారు.. ప్రతీరోజూ ఏదోఒక కార్యక్రమం.. అటు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణపై కూడా ఫోకస్ పెడుతున్నారు.. ఇక, రేపు సీఎం జగన్ తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు సీఎం వైఎస్ జగన్.. రేపు ఉదయం 8 గంటల 30 నిమిషాలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం.. పదిన్నరకు సూళ్లూరుపేట తడ మండలం మమ్ బెట్టా సెజ్ కు చేరుకుంటారు.. అక్కడ ఫిషరీస్, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్ శాఖకు చెందిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు.. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభను ఉద్దేశించి సీఎం ప్రసంగం కొనసాగనుంది.. సభ అనంతరం గంట పాటు స్థానిక నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు సీఎం జగన్.. ఇక, ఈ పర్యటన ముగించుకుని మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు సీఎం వైఎస్ జగన్.
ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం.. అసలు కారణం ఇదా..?
విశాఖ ఫిషింగ్ హార్బర్లో అర్ధరాత్రి చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదం మత్స్యకారులకు తీవ్ర విషాదాన్ని మిగిలిచింది.. మత్స్యకారులందరూ గాఢ నిద్రలో ఉండగా జరిగిన ఘోర అగ్నిప్రమాదం గంగపుత్రులకు కాళరాత్రిగా మారింది.. ఒకటి కాదు రెండు కాదు సుమారు 50 బోట్లు అగ్నికి ఆహుతి అయిపోయాయి.. రూ. 40 కోట్ల వరకు ఆస్తినష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు.. ఎవరో ఆకతాయిలు చేసిన పని వందలాదిమంది మత్స్యకార కుటుంబాలకు కడుపు కోతను మిగిల్చింది.. కన్న బిడ్డల్లా చూసుకుంటున్న జీవనాధారమైన బోట్లు కళ్ళ ఎదుట అగ్నికి ఆహుతి అయిపోవడంతో జీర్నించుకోలేకపోతున్నారు. అయితే, అగ్నిప్రమాదం జరగగానికి ఓ మందు పార్టీ, ఆ తర్వాత జరిగిన ఘర్షణే కారణంగా తెలుస్తోంది.. యుట్యూబర్ కి బాలాజీ అనే వ్యక్తి కి నిన్న రాత్రి ఒకటో నెంబర్ జెట్టి లో గొడవ జరిగిందట.. యుట్యూబర్ బోటుని అమ్మకానికి పెట్టడంతో కొనుగోలు చేసిన బాలాజీ అనే వ్యక్తి.. అడ్వాన్స్ గా కొంత సొమ్ము ఇచ్చాడట.. కానీ, కొద్ది రోజులకి అడ్వాన్సు తిరిగి అడిగాడట బాలాజీ.. ఈ విషయంలోనే నిన్న రాత్రి అదే గొడవ జరిగినట్టుగా సమాచారం.. దీంతోనే మద్యం మత్తులో బోటు తగలుబెట్టి ఉంటారు అని పోలీసులు అనుమానిస్తున్నారు..
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో భారీ అగ్నిప్రమాదం.. కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన జీవీఎల్
విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. ఈ విషయంపై కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలతో సంప్రదింపులు జరిపారు.. విశాఖలో జరిగిన నష్టంపై వివరణ ఇచ్చారు.. తగిన సహాయం కోసమై విజ్ఞప్తి చేశారు.. దీనిపై కేంద్రం మంత్రి సానుకూలంగా స్పందించినట్టు ఆ తర్వాత జీవీఎల్ తెలిపారు.. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన ఘటన దురదృష్టకరమన్న జీవీఎల్.. అటు బోట్లను, ఇటు ఉపాధిని కోల్పోయిన మత్స్యకారులకు మత్స్యకార కుటుంబాలకు అండగా ఉంటాను. ఇప్పటికే ఈ విషయం మీద కేంద్ర మత్స్యకార మంత్రిత్వ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలకి జరిగిన సంఘటన గురించి వివరించాను.. కేంద్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర మత్స్య శాఖ నుంచి నష్టపోయిన మత్స్యకారులకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరాను అన్నారు. మంగళవారం ఉదయం ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో బాధిత కుటుంబాలతో, బాధిత మత్స్యకారులతో సమావేశం నిర్వహించి వారికి తగిన సహాయం కోసమై తోడుగా నిలబడతాను అని ప్రకటించారు. మత్స్యకారులు ఈ సమయంలోనే ధైర్యాన్ని కోల్పోకుండా నిబ్బరంగా ఉండాలని.. వారికి కేంద్ర స్థాయిలో ఏమేమి చేయగలనో అన్నీ చేస్తాను అన్నారు.
వారి తాటాకు చప్పుళ్లకు బెదరం.. వార్నింగ్ ఇచ్చిన పురంధేశ్వరి
వ్యక్తిగత దూషణలకు దిగినా.. బీజేపీ వారి తాటాకు చప్పుళ్లకు బెదరదు అంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆమె.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుంది అన్నారు. ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోడీకి స్పష్టత ఉందన్న ఆమె.. తొమ్మిదిన్నరేళ్ళలో అనినీతిరహిత పాలన చేసిన మోడీ.. దేశంలో సుపరిపాలన అందిస్తుంటే రాష్ట్రంలో అధికార పార్టీ స్వపరిపాలన చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో అరాచక, విధ్వంసకర, వినాశకర పాలన సాగిస్తున్నారు.. దేవుడి విగ్రహాల నుంచి, గర్బ గుడిలో ఉన్న విగ్రహాలను కూడా ధ్వంసం చేస్తున్నారు.. మోడీ అన్నీ కులాలకు న్యాయం చేయాలని పాలన చేస్తుంటే.. సీఎం జగన్ సామాజిక, సాధికార యాత్రల పేరిట మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు.. సామాజిక, సాధికార యాత్రలు చేసే నైతిక హక్కు ఉందా..? అని నిలదీశారు. రాష్ట్రంలో విపక్షాలపై జరుగుతున్న దాడులు అందరికీ తెలుసు.. ఎస్సీ, బీసీలకు న్యాయం చేసే పరిస్థితి లేదు అన్నారు పురంధేశ్వరి.. రాష్ట్రంలో శాంతి భద్రతలు సక్రమంగా అమలు కాకుండా హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు.. రాష్ట్రంలో కరువు విలయ తాండవం చేస్తుంది.. కరువు మండలాలపై సీఎం జగన్ శీతకన్ను వేశారని విమర్శించారు. రాష్ట్రంలో రైతులను అన్యాయం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం.. కరువు ప్రాంతాల్లో బీజేపీ ప్రతినిధులు తిరిగి అధ్యయనం చేసి కేంద్రం దృష్టికి తీసుకెళ్తుందన్నారు. ఇక, టీటీడీలో అన్యమతస్తులను చైర్మన్లుగా నియమిస్తున్నారు.. టీటీడీ హుండీ మీద వచ్చిన ఒక శాతం ఆదాయాన్ని దారి మళ్ళించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. మున్సిపల్ శాఖ మీద వచ్చే ఆదాయాన్ని ఎందుకు దారి మళ్లించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలో అవినీతి పెట్రేగి పోయి పరాకాష్టకు చేరింది.. గ్రామీణ అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చారని దుయ్యబట్టారు. సర్పంచ్ లకు ప్రభుత్వం చేసిన అన్యాయాలను తట్టుకోలేక ముగ్గురు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్న ఆమె.. వ్యక్తిగత దూషణలకు దిగినా బీజేపీ వారి తాటాకు చప్పుళ్లకు బెదరదు.. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.
పథకాల పేరుతో మోసం చేశారు.. ఎన్నికల ప్రచారంలో అందెల శ్రీరాములు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు హీట్ పెంచుతున్నాయి. ఎన్నికలకు 8రోజులు సమయం ఉండటంతో పార్టీ నేతలంతా ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. పగలు రాత్రి అనే తేడాలేకుండా ఇంటింటికి వెళుతూ ప్రజలకు పార్టీ చేసే అభివృద్ధి పనులను వివరిస్తూ ఓటు వేయాలని ముందుకు సాగుతున్నారు. ఈనేపథ్యంలోనే మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరాములు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీలలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరాములు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించలని ప్రజలను కోరారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అందెల శ్రీరాములు ధ్వజమెత్తారు. ఎంఐఎం కోటాలో మంత్రి పదవి పొందిన సబితా ఇంద్రారెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో కేంద్రం వాటా ఉందని అందెల శ్రీరాములు తెలిపారు. దళిత బంధు,బీసీ బంధు, గృహలక్ష్మి పథకం అంటూ అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. లోకల్ వ్యక్తిగా, మహేశ్వరం నియోజకవర్గంలో సమస్యలు తెలిసిన వ్యక్తిగా ప్రజలు ఆదరిస్తున్నారని శ్రీరాములు అన్నారు. నియోజకవర్గంలో ఏ ఒక్కరికీ బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వలేదని అందెల శ్రీరాములు ఆరోపించారు. బీజేపీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మీర్ పేట్ డివిజన్ పరిధిలోని న్యూ గాయత్రినగర్ లో కొలువైన కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బీజేపీ అధికారంలోకి రాక పోతే.. కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
బీజేపీ అధికారం లోకి రాక పోతే రాష్ట్రము అధోగతి పాలు అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. వరి ధాన్యం మద్దతు ధర 3,100 కు కొంటామన్నారు. రైతుల నుండి భారీ స్పందన వస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రస్తుత స్కీమ్స్ కంటిన్యూ చేస్తూ.. ఇన్పుట్ సహాయంగా అదనంగా మరో 2 వేల 500 రూపాయల ఇస్తామన్నారు. రైతుల మీద భారం పడకుండా పంటల భీమా అమలు చేస్తామన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామన్నారు. కేసీఆర్ సింగరేణిని ప్రైవేట్ పరం చేసి బీజేపీ పై నెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. అధికారం లోకి వస్తె సింగరేణినీ పటిష్టం చేస్తామన్నారు. ఐటీ ను రిటర్న్ చేస్తామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మహిళలకు 10 లక్షలు ఉద్యోగాలని హామీ ఇచ్చారు. తెలంగాణను ఆదుకోకపోతే ప్రజలకు నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపారు. కర్ణాటకలో 5 గ్యారంటీలకు దిక్కులేదు… ఇక్కడ 6 గ్యారంటీ లు ఎలా అమలు చేస్తారని కాంగ్రెష్ పై మండిపడ్డారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ కోసం ముందుకు వెళ్తామన్నారు. ఈ పార్టీ నీ నడిపించలేను అంటూ విదేశాలకు రాహుల్ గాంధీ పారిపోయాడని, ఆ పార్టీ నా మాకు నీతులు చెప్పేదంటూ మండిపడ్డారు. డిపాజిట్ రాని బీజేపీ బీసీనీ ఎలా సీఎం చేస్తుందని బీసీలను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీకి జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజురాబాద్ లలో డిపాజిట్ రాలేదని, వాళ్ళు ఎలా 6 గ్యారంటీ లు అంటున్నారని తెలిపారు. కేసీఆర్ ది ఫ్యూడలిస్ట్ మెంటాలిటీ… ఒక ఫ్యుడలిస్ట్ పోతే మరో ప్యూడలిస్ట్ వస్తాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుండి ప్రచారం చేస్తుందని, ఆ నలుగురే మిగతా వాళ్ళను తిరగనియ్యరని తెలిపారు. తను రెడ్డినీ ఒక రెడ్డి నీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ప్రకటించిన తర్వాత బీసీనీ సీఎం చేస్తామని చెప్పిందని.. ఇది బీజేపీ సమాజిక న్యాయమన్నారు.
రాజస్థాన్‌లో రూ.20 వేల కోట్ల నీటి కుంభకోణం ?
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 25న జరుగనున్నాయి. అంతకుముందే రూ.20 వేల కోట్ల నీటి కుంభకోణం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఐఏఎస్ అధికారుల నుంచి మొదలుకొని సీనియర్ అధికారులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉచ్చు బిగిస్తోంది. నవంబర్ 3న జైపూర్, దౌసాలోని 23 చోట్ల ఐఏఎస్ ర్యాంక్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ సుబోధ్ అగర్వాల్ నివాసంపై ఈడీ దాడులు చేసింది. ఈ విషయం కేంద్రం జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుకు సంబంధించినది. రాజస్థాన్‌లో కేంద్రం చేపట్టిన ప్రాజెక్టు అమలులో అక్రమాలు జరిగాయని, వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఆగస్టులో అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించింది. తరువాత విషయం ఈడీకి చేరింది. ఇప్పటి వరకు 25 చోట్ల ఈడీ దాడులు చేసింది. జల్ జీవన్ మిషన్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్, దీని లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు స్వచ్ఛమైన, తగినంత నీటిని అందించడం. తద్వారా ఎవ్వరికీ నీటి కొరత ఉండకుండా చూడాలన్నది కేంద్ర ఉద్దేశం. ప్రాజెక్టు మొత్తం బడ్జెట్‌లో సగం కేంద్ర ప్రభుత్వం, సగం రాష్ట్ర ప్రభుత్వం నిధులను సమకూరుస్తుంది. రాజస్థాన్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన కిరోరి లాల్ మీనా ఈ మిషన్‌లో అక్రమాలపై తొలిసారిగా మాట్లాడారు. ప్రాజెక్టు అమలులో రూ.20 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు.
ప్రపంచంలోనే అతి పెద్ద గంటను ఏర్పాటు చేస్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి
రాజస్థాన్‌లోని కోటా నగరంలో చంబల్ రివర్ ఫ్రంట్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద గంటను ఏర్పాటు చేస్తున్నారు. అయితే దానిని బిగిస్తున్న టైంలో పెను ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక ఇంజినీర్ తో పాటు మరో కార్మికుడు మృతి చెందారు. మరికొందరు గాయపడినట్లు సమాచారం. కోచింగ్ సిటీ కోటాలో ప్రసిద్ధ చంబల్ రివర్ ఫ్రంట్‌లో ఈరోజు భారీ ప్రమాదం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అతి పెద్ద గంట అచ్చును తెరుస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో బెల్ మేకింగ్ ఇంజనీర్ దేవేంద్ర ఆర్య, ఓ కూలీ చనిపోయారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అధికార యంత్రాంగంలో భయాందోళన నెలకొంది. ఈ గంట బరువు దాదాపు 79000 కిలోలు. పోలీసు యంత్రాంగం మొత్తం విచారణలో నిమగ్నమై ఉంది. ఈ గంట తయారైనప్పటి నుంచి చాలా వార్తల్లో నిలుస్తోంది. చంబల్ రివర్ ఫ్రంట్‌ను ఇటీవల సీఎం అశోక్ గెహ్లాట్ ప్రారంభించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అర్ధాంగి రోజలిన్ కార్టర్ కన్నుమూత
రోజుకి వేల మంది పుడతారు. వందల మంది మరణిస్తారు. కానీ కొందరు మాత్రం మరణించి కూడా ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచే ఉంటారు. ఇలా పుట్టుకకు మరణానికి మధ్య ఉన్న చిన్న జీవితంలో మనం ఎలా జీవించాం.. నలుగురికి ఎలా ఉపయోగ పడ్డాం అనేదే మరణించిన తరువాత కూడా బ్రతికి ఉండేలా చేస్తుంది. ఈ కోవలోకే వస్తుంది రోజలిన్ కార్టర్ అనే మహిళ. వివరాలలోకి వెళ్తే.. అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అర్ధాంగి రోజలిన్ కార్టర్ మంచి మనసున్న వ్యక్తి. ఆమె మానవతా దృక్పధంతో ఎన్నో సేవాకార్యక్రమాలు చేసింది. ప్రజలకు ఆమె అందించిన సేవల తో గొప్ప మానవతావాదిగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. అలానే మనిషికి మానసిక ఆరోగ్యం చాల అవసరమని.. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శారీరక ఆరోగ్యం బావుంటుందని.. మానసిక ఆరోగ్యం పైన అవగాహన కలిపించేందుకు రోజలిన్ తన భర్త జిమ్మీ కార్టర్‌తో కలిసి కార్టర్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. కాగా గత కొంత కాలంగా డిమెన్షియాతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఆదివారం 96 ఏళ్ళ వయసులో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని తాజాగా కార్టర్ సెంటర్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆమె భర్త జిమ్మీ మాట్లాడుతూ భావోద్వేగానికి గురైయ్యారు. 77 ఏళ్ళ తమ వైవాహిక బంధంలో తన ప్రతి విజయంలో తన భార్య తోడుగా ఉందని.. తన విజయాల్లో తన భార్య కూడా సమాన భాగస్వామి అని పేర్కొన్నారు. తన భార్య తనను విడిచి వెళ్లడంపైన విచారం వ్యక్తం చేశారు.
ఆస్ట్రేలియాకు 33 కోట్లు.. వన్డే వరల్డ్‌కప్ ప్రైజ్ మనీ వివరాలు ఇవే!
ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ 2023 సమరానికి తెరపడింది. భారత్ వేదికగా అక్టోబరు 5న మొదలైన వరల్డ్‌కప్ పండుగ.. నవంబర్ 19తో ముగిసిపోయింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో టైటిల్ ఫేవరెట్ టీమిండియాను ఓడించిన ఆస్ట్రేలియా.. ఆరోసారి విశ్వవిజేతగా అవతరించింది. భారత్ నిర్ధేశించిన 241 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ట్రావిస్ హెడ్ (137; 120 బంతుల్లో 15×4, 4×6) సూపర్ సెంచరీ బాదాడు. అంతకుముందు భారత్ 50 ఓవర్లలో 240 పరుగులకే ఆలౌటైంది. వన్డే ప్రపంచకప్ 2023 విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు 4 మిలియన్ల డాలర్ల (సుమారు రూ. 33 కోట్లు) ప్రైజ్ మనీ దక్కింది. రన్నరప్ టీమిండియాకు 2 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 16 కోట్లు) ప్రైజ్ మనీ వచ్చింది. సెమీ ఫైనల్లో ఓడిన న్యూజిలాండ్ మరియు దక్షిణాఫ్రికా జట్లు చెరో 8,00,000 డాలర్లు (సుమారు రూ. 6.5 కోట్లు) అందుకుంటాయి. నాకౌట్‌లకు చేరుకోవడంలో విఫలమైన ఒక్కో జట్టుకు 1,00,000 డాలర్లు (దాదాపు రూ. 83 లక్షలు) ప్రైజ్ మనీ దక్కుతుంది. ప్రతి గ్రూప్ స్టేజ్ విజయానికి 40,000 డాలర్లు (సుమారు రూ. 33 లక్షలు) దక్కుతాయి. ఇక వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలోప్లేయర్స్ కూడా అవార్డులు గెలుచుకున్నారు. ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు విరాట్ కోహ్లీకి దక్కింది. విరాట్ 11 మ్యాచ్‌లలో 765 పరుగులు, 1 వికెట్, 5 క్యాచ్‌లు అందుకున్నాడు. అత్యధిక పరుగుల అవార్డు కోహ్లీని వరించగా.. అత్యధిక వికెట్ల అవార్డు మహ్మద్ షమీకి దక్కింది. షమీ (7 ఇన్నింగ్స్‌లో 24 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ అవార్డు గ్లెన్ మాక్స్‌వెల్ (అఫ్గనిస్తాన్‌పై 201 పరుగులు- నాటౌట్), అత్యధిక సెంచరీల అవార్డు క్వింటన్ డికాక్ (4 శతకాలు)కు దక్కింది.
మిచెల్ మార్ష్.. అంత ‘బలుపు’ అనవసరం! మండిపడుతున్న క్రికెట్ ఫాన్స్
ఆదివారం నరేంద్ర మోడీ స్టేడియంలో టీమిండియాతో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలిచి విశ్వవిజేతగా నిలిచింది. దాంతో ఆస్ట్రేలియా ఆరోసారి వన్డే ప్రపంచకప్‌ను అందుకుంది. ప్రపంచ క్రికెట్‌లో మరే జట్టుకూ సాధ్యం కాని రీతిలో ఆసీస్ విశ్వవిజేతగా నిలిచింది. ప్రపంచకప్ 2023 ట్రోఫీ గెలిచిన ఆసీస్ ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మైదానంలో ట్రోఫీ పట్టుకుని సందడి చేశారు. ఒక్కొక్కరుగా ఫొటోస్ దిగుతూ సంబరాలు చేసుకున్నారు. అయితే ఆసీస్ బ్యాటర్ మిచెల్ మార్ష్ చేసిన ఓ పని క్రికెట్ అభిమానులకు కోపం తెప్పిస్తోంది. వన్డే ప్రపంచకప్ 2023 ట్రోఫీని మైదానం నుంచి ఆస్ట్రేలియా ఆటగాళ్లు హోటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆసీస్ ప్లేయర్స్ మరోసారి ట్రోఫీతో ఫొటోస్ దిగారు. మిచెల్ మార్ష్ సోఫాలో కూర్చుని.. ప్రపంచకప్ 2023 ట్రోఫీపై తన రెండు కాళ్లు పెట్టి ఫొటోలకు పోజులిచ్ఛాడు. ఆస్ట్రేలియా ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకున్న కొన్ని గంటల తర్వాత ఈ ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది. ఈ ఫోటోను తొలుత ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. ఆపై వైరల్ అయింది. ఇది చూసిన ఫాన్స్ అతడిపై మండిపడుతున్నారు. ప్రపంచకప్‌కు కాస్త గౌరవం ఇవ్వు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మిచెల్ మార్ష్.. అంత బలుపు అనవసరం అంటూ ఇంకొందరు మండిపడుతున్నారు. ఆస్ట్రేలియన్ జట్టు ప్లేయర్స్ హోటల్ గదిలో కూర్చుని ఆహ్లాదంగా సంభాషించుకుంటున్న ఫోటో కనిపిస్తోంది. ఆపై ప్లేయర్స్ అందరూ పార్టీ చేసుకున్నారట. భారత గడ్డపై ట్రోఫీ కైవసం చేసుకున్న ఆసీస్.. టీమిండియాతో టీ20 సిరీస్ ఆడనుంది. ఇక ప్రపంచకప్ 2023 ఫైనల్లో మిచెల్ మార్ష్ 15 రన్స్ చేశాడు. 15 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ బాదిన మిచెల్.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో క్యాచ్ ఔట్ అయ్యాడు. మెగా టోర్నీలో మిచెల్ మార్ష్ 441 రన్స్ చేశాడు.