బీజేపీకి బిగ్ షాక్.. పార్టీకి వివేక్ గుడ్ బై
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. పార్టీలు ప్రకటించే అభ్యర్థుల జాబితాపై ఆయా పార్టీల్లో అంతర్గత వివాదం నెలకొంది. టికెట్ రాని నేతలు మీడియా ముందు, అనుచరుల ముందు రోదిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ వైపు సీనియర్ నేతలు అసంతృప్త నేతలను బుజ్జగిస్తూనే మరోవైపు పలు పార్టీలు ఇతర పార్టీల్లో టికెట్లు రాని నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాయి. ఈనేపథ్యంలో బీజేపీకి వివేక్ వెంకటస్వామి షాక్ ఇచ్చారు. బీజేపీకి పార్టీకి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బీజేపీకి రాజీనామా చేశారు. ఈ విషయంపై వివేక్ క్లారిటీ ఇచ్చారు. రాజీనామా చేస్తున్నట్లు కేంద్రమంత్రికి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. బాధతో బీజేపీ పార్టీని వీడుతన్నట్లు ఆయన లేఖలో ప్రస్తావించారు. వివేక్ వెంకట స్వామి, ఆయన కుమారుడు వంశీ త్వరలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. శంషాబాద్‌లోని నోవాటెల్‌లో రాహుల్ గాంధీతో వివేక్, వంశీ భేటీ కానున్నారు. ఇటీవల వివేక్ రేవంత్ రెడ్డిని కలిసి చెన్నూరు నుంచి పోటీ చేయాలని కోరగా, పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తానని వివేక్ క్లారిటీ ఇచ్చారు. అలాగే వివేక్ కుమారుడిని చెన్నూరు నుంచి పోటీకి దింపాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది.
కేంద్రం సహకారంతోనే రాష్ట్ర అభివృద్ధి.. ఆ విషయం ప్రజలకు ఎందుకు చెప్పరు..?
కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.. కానీ, ఆ విషయం ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు ? అని నిలదీశారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. తిరుపతి రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వ సహకారంతోనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.. ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్థికి పెద్దపీట వేస్తున్నారు. కానీ, కేంద్ర సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రజలకు చెప్పడం లేదు..? అని ప్రశ్నించారు. అందుకే.. ఆంధ్ర రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరించే కార్యక్రమం చేపట్టాం.. తిరుపతి నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం అన్నారు. 1700 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి నిర్మాణం జరుగుతోందన్నారు పురంధేశ్వరి.. అంతర్జాతీయ హంగులతో తిరుపతి రైల్వే స్టేషన్ రూ.311 కోట్లతో నిర్మాణం జరుగుతోందన్న ఆమె.. ఐఐటీ, ఐజర్ లాంటి విద్యాసంస్థలకు రూ.600 నుంచి 800 కోట్ల రూపాయలను అందించాం.. మెరుగైన ప్రమాణాలతో విద్యను విద్యార్థులకు అందిస్తున్నాం అన్నారు. స్మార్ట్ సిటీగా తిరుపతిని మార్చేందుకు రూ.1,695 కోట్లను కేటాయించి 87 అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నాం.. తిరుపతిలో 21 వేల తాగునీటి కనెక్షన్లు, 16 వేల మురుగునీరు కాలువల నిర్మాణానికి సహకారం అందించాం అన్నారు. అభివృద్ధిలో ప్రపంచంలోనే ఐదవ స్థానంలో ఉన్న భారతదేశాన్ని మూడో స్థానానికి తీసుకొచ్చే ప్రయత్నం ప్రధాని మోడీ చేస్తున్నారు.. అన్ని రాష్ట్రాల సహకారం ఉంటేనే భారతదేశం అభివృద్ధిలో మూడో స్థానంలోకి రాగలదు అన్నారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.
విజయనగరం ఆస్పత్రికి మంత్రి బొత్స.. రైలు ప్రమాద క్షతగాత్రులకు పరామర్శ
విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైలు ప్రమాద క్షతగాత్రులను పరామర్శించారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విజయనగరం వచ్చి వెళ్లిన తర్వాత పరిహారం విడుదల చేశారు అని తెలిపారు.. రెండు మూడు నెలలు ఆసుపత్రిలో ఉన్న వారికి రూ.5 లక్షలు, పది రోజులు ఉన్నవారికి రూ. 2 లక్షలు.. అందజేస్తున్నాం.. ఇక, 13 మందికి రూ. 10 లక్షల చొప్పును పరిహారాన్ని ఇవ్వనున్నామని వెల్లడించారు.. 12 మందికి రూ. రెండు లక్షల చొప్పున ఇచ్చాం.. మూడు నెలల పాటు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఉన్న పదిహేను మందికి రూ.75 లక్షలు ఇస్తున్నట్టు తెలిపారు.. రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. వికలాంగులుగా మిగిలిపోయిన వారికి రూ.10 లక్షలు ఇస్తున్నాం.. 43 మందికి పరిహారం అందజేస్తున్నాం అన్నారు మంత్రి బొత్స.. ఎవ్వరికైన ఇబ్బంది వస్తే ఆదుకోవాలన్న అలోచనతోనే పరిహారం అందిస్తున్నాం.. ఈ పరిహారంతో వారి జీవితాలు మారిపోతాయని మేం భావించడం లేదు.. కాస్త వారికి సహాయం మాత్రమే అన్నారు. రైలు ప్రమాదంలో గాయపడున వారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధితన వైద్యులను ఆదేశించినట్టు వెల్లడించారు మంత్రి బొత్స సత్యనారాయణ.
క్యాంపు కార్యాలయంలో ఏపీ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు..
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా క్యాంపు కార్యాలయంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు సీఎం జగన్.. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు.. ఆంధ్రప్రదేశ్ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లిఖార్జునరావు రచించిన స్వాతంత్రోద్యమంలో ఆంధ్రులు పుస్తకాన్ని ఈ సందర్‌భంగా ఆవిష్కరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇక, తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో మంత్రులు ఆర్కే రోజా, ఉషాశ్రీ చరణ్, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
చంద్రబాబుపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇన్నాళ్లు చంద్రబాబు కోర్టులను మేనేజ్ చేస్తూ వచ్చారు.. ఇప్పుడు కంటి పరీక్ష కోసం చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇచ్చిందన్నారు. అయితే, కంటి పరీక్షల తర్వాత మళ్లీ చంద్రబాబు జైలుకే అని చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఈ రోజు కంటి పరీక్షలు అన్నారు.. రేపు హార్ట్ ఎటాక్ అంటారు.. మళ్లీ కిడ్నీ సమస్య అంటారు.. ఆ తర్వాత దేశంలోని ఉన్న అన్ని రోగాలు ఉన్నాయని చెబుతూ బెయిల్ కోసం డ్రామాలు ఆడతారు అని సంచలన ఆరోపణలు చేశారు. మరి కళ్లు, లివర్, హార్ట్ పనిచేయకుండా ఉండేవారు ఎలా రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు? అని ప్రశ్నించారు. ఇక, హమాస్ ఉగ్రవాదుల్లా టీడీపీ నేతలు ఆలోచిస్తూన్నారు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో నిజం గెలవాలనే భువనేశ్వరి.. ముందుగా నారా చంద్రబాబు నాయుడు చేసిన మోసాన్ని గ్రహించాలని సూచించారు.. చంద్రబాబు చేసిన అక్రమాలు, దౌర్జన్యాలు నిజామా? కాదా? అనేది భువనేశ్వరి చెప్పాలని డిమాండ్ చేశారు..
మేనిఫెస్టో కమిటీ చైర్మనే పార్టీకి గుడ్‌బై.. బీజేపీ మేనిఫెస్టో పరిస్థితి ఏంటి..?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. ఇదే సమయంలో పార్టీల్లో జంపింగ్ నేతల జోరు కొనసాగుతోంది.. అధికార పక్షం నుంచి ప్రతిపక్ష పార్టీల్లోకి ప్రతిపక్షాల నుంచి అధికార పక్షంలోకి నేతలు చేరుతూనే ఉన్నారు. సాధారణ లీడర్లు పార్టీలు మారితే.. సీట్ల ఎంపికలో తేడా కొట్టొచ్చు.. కానీ, కీలక బాధ్యతల్లో ఉన్న నేతలే పార్టీకి గుడ్‌బై చెబితే పరిస్థితి మరోలా ఉంటుంది.. ఇప్పుడు ఆ పరిస్థితి తెలంగాణ బీజేపీకి వచ్చింది.. ఎందుకంటే.. ఎన్నికల సమరంలో దూసుకుపోతున్న వేళ.. ఇప్పటికే అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీలు కొన్ని ఎన్నికల మేనిఫెస్టోలు ప్రకటించాయి.. తామ హామీలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి.. ప్రచార అస్త్రాలుగా ఉపయోగించుకుంటున్నాయి.. ఇలాంటి కీలక సమయంలో బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్న మాజీ ఎంపీ వివేక వెంకటస్వామి పార్టీకి రాజీనామా చేశారు. దీంతో.. బీజేపీకి గట్టి షాక్ తగిలినట్టు అయ్యింది. బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా ఉన్న వెంకటస్వామి.. మార్పు మార్పుపై ఎప్పటి నుంచో ప్రచారం సాగుతూనే ఉంది.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మేనిఫెస్టోలతో ప్రజల్లోకి వెళ్తున్నా.. బీఎస్పీ లాంటి పార్టీలు కూడా మేనిఫెస్టోలు ప్రకటించినా.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది మేమే.. కింగ్ మేకర్స్ కాదు.. మేమే కింగ్‌లం అంటూ ప్రకటనలు చేస్తున్న ఆ పార్టీ నేతలు ఇప్పటికీ మేనెఫెస్టో తీసుకురాలేకపోయారు.. ఇప్పటి వరకు వివేక్ నేతృత్వంలో మేనిఫెస్టోపై ఏదైనా కసరత్తు జరిగినా.. ఆయనే పార్టీకి గుడ్‌బై చెప్పడంతో ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చినట్టు అయ్యింది.. తెలంగాణలో అసలైన ప్రత్యామ్నాయం తామే అంటున్న బీఆర్ఎస్.. ఎప్పుడు మేనిఫెస్టోపై కసరత్తు ప్రారంభించి.. ఇంకా ఎప్పుడు మేనిఫెస్టో తీసుకు వస్తుంది అనేది ప్రశ్నగా మారింది.
అన్నారం సరస్వతి బ్యారేజీ లీక్.. క్లారిటీ ఇచ్చిన అధికారులు..
మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ డ్యామేజ్ ఘటన మరిచిపోకముందే అన్నారం సరస్వతి బ్యారేజ్ లీకేజీ కలకలం రేపుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారం సరస్వతి బ్యారేజీలో 28, 38 నంబర్ గల రెండు గేట్ల వద్ద లీకేజీతో వాటర్ ఉబికి వస్తుంది. దీంతో ఇంజనీరింగ్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇసుక సంచులు వేసి ఊటలను నిలువరించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం 5.71 టిఎంసీలు ఉన్న నీరు కాగా.. ఒక గేటు ఎత్తి 2,357 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా 10.87 టిఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో అన్నారం సరస్వతి బ్యారేజ్ నిర్మించారు అధికారులు. అయితే ప్రతి యేటా జరిగే మెయింటెనెన్స్ లో భాగంగా ఇలా చేస్తామని అధికారులు తెలిపారు. దీంతో నష్టం ఏమీ లేదని వివరించారు. గత సంవత్సరం కూడా ఇలానే లీకేజీ జరిపి దానిని పరిశీలించామని వెల్లడించారు. కావున ఈ లీకేజీ మేము పరిశీలించేందుకే తప్ప అన్నారం సరస్వతి బ్యారేజీ లీకేజీ ఏమీ జరగలేదని, భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
చివరి నిమిషంలో బీసీసీఐ కీలక నిర్ణయం.. లీగ్, తొలి సెమీస్ మ్యాచ్‌లకు..!
వన్డే ప్రపంచకప్ 2023లో లైటింగ్ షో, మ్యాచ్ అయ్యాక స్టేడియంలో టపాసులను పేలుస్తూ సంబరాలు నిర్వహిస్తోంది బీసీసీఐ. లైటింగ్ షో వల్ల పెద్దగా నష్టం లేదు కానీ.. టపాసులను కాల్చడం వల్ల గాలి కాలుష్యం అవుతోంది. అత్యంత దారుణ గాలి కాలుష్యం ఉండే ఢిల్లీ, ముంబై నగరాల్లో టపాసులను పేల్చడం వల్ల మరింత వాతావరణానికి హాని చేసినట్లే అవుతుందని పర్యావరణ అధికారులు, అభిమానుల నుంచి బీసీసీఐకి విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో చివరి నిమిషంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ, ముంబై మైదానాల్లో జరిగే మ్యాచ్‌ల సందర్భంగా టపాసులను కాల్చడంపై బ్యాన్ విధిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ కీలక ప్రకటన చేశారు. ‘వాతావరణంను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ, ముంబై మైదానాలో టపాసుల ప్రదర్శన నిర్వహించడం లేదు. వాతావరణ సమస్యలపై బీసీసీఐ కూడా తన వంతు కృషి చేస్తుంది. ఇదే విషయాన్ని ఐసీసీకి వివరించాం. వన్డే ప్రపంచకప్‌ను అద్భుతంగా నిర్వర్తించడం వల్ల భవిష్యత్తులో క్రికెట్‌కు అదనపు ప్రయోజనం చేకూరనుంది. అదే సమయంలో అభిమానులు, ఆటగాళ్లు, ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. అందుకే ఫైర్ వర్క్స్‌ను నిలిపివేస్తున్నాం’ అని జై షా తెలిపారు.
జర్నలిస్ట్ అవతారమెత్తిన టీమిండియా స్టార్ బ్యాటర్.. అమ్మాయికి షాక్ ఇస్తూ..! జడేజా కూడా గుర్తుపట్టలే
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో గెలిచి సెమీస్ బెర్త్ దాదాపుగా ఖాయం చేసుకుంది. లీగ్ దశలో భారత్ ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. టీమిండియా తన తదుపరి మ్యాచ్‌ను గురువారం (నవంబర్ 2) శ్రీలంకతో ఆడనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు ఆరంభం అవుతుంది. భారత్ ఫామ్ చూస్తే శ్రీలంకపై విజయం పెద్ద కష్టమేమి కాదు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు లోకల్ ప్లేయర్, టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ జర్నలిస్ట్ అవతారం ఎత్తాడు. ఈ మ్యాచ్ కోసం భారత్, శ్రీలంక జట్లు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నాయి. అయితే మ్యాచ్‌కు కాస్త సమయం దొరకడంతో టీమిండియా ప్లేయర్స్ ముంబై వీదుల్లో సరదాగా గడుపుతున్నారు. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అయితే తన ఇలాకాలో మారు వేషంలో చక్కర్లు కొట్టాడు. తనను ఎవరూ గుర్తు పట్టకుండా.. టాటూలు కనపడకుండా ఫుల్ హ్యాండ్స్ షర్ట్, నెత్తిన టోపీ, కళ్లకు గ్లాసెస్, ముఖానికి మాస్క్ ధరించాడు. రెడీ అయ్యాక తన హోటల్ రూమ్ నుంచి బయటికి వచ్చి.. పక్క రూంలో ఉన్న రవీంద్ర జడేజాను పిలిచాడు. వీడు ఎవడ్రా అన్నట్లు జడ్డు కాసేపు చూసి.. ఆపై గుర్తుపట్టాడు.
సంక్రాంతి సినిమాల గురించి వాళ్లు నన్ను అడగాలి కానీ నేను ఎందుకు అడుగుతా?
ప్రొడ్యూసర్ నాగ వంశీ… ఎప్పటిలాగే కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడాడు. తనకి అనిపించింది, తన సినిమా గురించి చాలా ఓపెన్ గా మాట్లాడే నాగ వంశీ… రిలీజ్ కి రెడీగా ఉన్న ఆదికేశవ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా నాగ వంశీ ‘గుంటూరు కారం’ సినిమా గురించి కూడా మాట్లాడాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా గుంటూరు కారం. ఈ మూవీపై అనౌన్స్మెంట్ తోనే భారీ అంచనాలు ఏరపడ్డాయి. 12 ఏళ్ల తర్వాత సెట్ అయిన కాంబినేషన్ 2024 సంక్రాంతికి బాక్సాఫీస్ ని షేక్ చేయడం గ్యారెంటీ. ఈ సినిమా జనవరి 12న రిలీజ్ అవుతుందని మహేష్ బాబు ఇటీవలే కన్ఫర్మ్ చేసాడు. స్వయంగా మహేష్ బాబు సంక్రాంతికి వస్తున్నాం అనే విషయం చెప్పినా కూడా సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ ఒకటి ఆరు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. మహేష్ బాబు సినిమా రిలీజ్ రేస్ లో ఉంటే… ఒకటీ రెండు సినిమాలు, అది కూడా పండగ సీజన్ కాబట్టి రిలీజ్ అవుతాయేమో కానీ లేదంటే మహేష్ సినిమా ఉండగా ఇంకో సినిమా అదే డేట్ కి రిలీజ్ అవ్వడం అనేది జరగని పని. ఇదే విషయాన్నీ నాగ వంశీ కూడా మరోసారి పక్కాగా చెప్పాడు. సంక్రాంతి సినిమాల గురించి గిల్డ్ తో ఏమైనా చర్చించారా అని మీడియా పర్సన్ అడగ్గా… దానికి సమాధానంగా నాగ వంశీ “నేను ఎందుకు అడుగుతాను. సంక్రాంతి సినిమాల్లో ఆడియన్స్ ఫస్ట్ ప్రయారిటీ గుంటూరు కారం సినిమానే కాబట్టి ముందు వాళ్లు మాట్లాడనివ్వండి. నా సినిమా సంక్రాంతికి వస్తుంది” అని తేల్చి చెప్పేసాడు. ఇంతక ముందు మ్యాడ్ సినిమా ప్రమోషన్స్ అప్పుడు కూడా నాగ వంశీ “జనవరి 12 డేట్ ని మిస్ అయ్యే ప్రసక్తే లేదు. కొందరికి మేము వస్తామో రామో అనే డౌట్ ఉందేమో… మేము కచ్చితంగా వస్తున్నాం. మహేష్ బాబు ఈ మధ్య కాలంలో లేనంత ఎనర్జీ గుంటూరు కారం సినిమాలో చూస్తారు. మహేష్ బాబు కెరీర్ బిగ్గెస్ట్ రిలీజ్ జరగబోతుంది” అని నాగ వంశీ కుండా బద్దలుకొట్టినట్లు… మాతో జాగ్రత్త అనే విషయాన్నీ చెప్పేసాడు.
కింగ్ ఖాన్ బర్త్ డేకి డంకీ టీజర్ వస్తోంది…
సలార్ సినిమా సోలోగా వస్తే బాక్సాఫీస్ రికార్డులు లేస్తాయ్ కానీ కావాలనే షారుఖ్ ఖాన్ సినిమాకు పోటీగా సలార్ రిలీజ్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. డంకీ సినిమా పోస్ట్ పోన్ అవుతుందా? లేదా? అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి… ఇప్పటివరకైతే సలార్ వర్సెస్ డంకీ వార్ పీక్స్‌లో ఉంటుందని నార్త్, సౌత్ ఇండస్ట్రీలు ఫిక్స్ అయిపోయాయి. అయితే డంకీ డేట్‌పై ఇంకాస్త క్లారిటీ రావాలంటే… మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే నవంబర్ 2న డంకీ టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు షారుఖ్ ఖాన్ బర్త్ డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే టీజర్ కట్ చేసినట్టుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అది కూడా రెండు టీజర్స్ కట్ చేశారని… ఒకటి 58 సెకన్లు, మరోటి 109 సెకన్ల రన్ టైం లాక్ చేశారట. ఇందులో ఏదో ఒక టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్టు టాక్.