16వ రోజుకు చేరిన వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర.. ఈ రోజు షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నాలుగున్నరేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును వివరిస్తూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది.. తొలి విడుదల రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నిర్వహించి.. ఆ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి మళ్లీ రెండో దశలో ఈ బస్సు యాత్రలు నిర్వహిస్తున్నారు. ఇలా ఇవాళ్టితో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర 16వ రోజుకు చేరింది.. ఈ రోజు విశాఖ జిల్లాలో విశాఖపట్నం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు, కర్నూలు జిల్లాలో పత్తికొండ నియోజకవర్గాల్లో సామాజిక సాధికార యాత్ర సాగనుంది.. విశాఖపట్నం జిల్లా విశాఖ తూర్పు నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర సాగనుండగా.. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు సీదిరి అప్పలరాజు, మేరుగ నాగార్జున, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. తదితర నేతలు పాల్గొననున్నారు. ఆరిలోవ లాస్ట్ బస్టాప్ దగ్గర నుంచి ఏఎస్ రాజా గ్రౌండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. నాడు నేడులో తోట గురువు హైస్కూల్లో పనులను పరిశీలించనున్నారు నేతలు.. ఏఎస్ రాజా గ్రౌండ్ లో బహిరంగ సభ జరగనుంది.. ఇక, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరగనున్న సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా.. తణుకు వి మాక్స్ థియేటర్ ఏరియా నుంచి తణుకు నరేంద్ర సెంటర్ వరకు బైక్స్ ర్యాలీ నిర్వహిస్తారు.. అనంతరం నరేంద్ర సెంటర్ వద్ద భారీ బహిరంగ సభ ఉంటుంది.. మరోవైపు.. కర్నూలు జిల్లా పత్తికొండలో వైయస్సార్ సామాజిక సాధికారిక బస్సు యాత్రలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఎమ్మెల్సీలు, వైసీపీ నాయకులు పాల్గొననున్నారు.
టీడీపీ-జనసేన ఉమ్మడి ఆందోళన.. రోడ్ల దుస్థితిపై రెండో రోజుల నిరసన
వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించిన తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీ.. కలిసి కార్యాచరణ రూపొందించుకున్నాయి.. ఇక, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి సిద్ధం అవుతున్నాయి.. అందులో భాగంగా టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి పోరాట కార్యాచరణ ఈ రోజు మొదలుకానుంది. తొలిగా రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై శని, ఆదివారాల్లో రెండ్రోజులపాటు ఆందోళన చేపట్టాలని నిర్ణయించాయి.. ఇందులో భాగంగా ధ్వంసమైన రోడ్ల వద్దకు వెళ్లి నిరసనలు తెలపడం, ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించడం, అధికారులకు రోడ్ల దుస్థితిపై వినతి పత్రాలు అందించాలని ఉభయపార్టీలు నిర్ణయించాయి.. 18,19 తేదీలలో రోడ్ల దుస్థితిపై ఆందోళనలు చేపట్టనున్న టీడీపీ – జనసేన జేఏసీ.. గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేదీ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. రెండు పార్టీల శ్రేణులు ఐకమత్యంతో కలిసి పనిచేసేలా ఉమ్మడి ఆందోళనలకు నాయకత్వాలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రజా సమస్యలపై ఉమ్మడిగా కదిలితే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని ఈ ఆలోచన చేశామని, వరుస క్రమంలో వివిధ సమస్యలపై ఆందోళనలు చేపడతామని ఆయా పార్టీల వర్గాలు తెలిపాయి. గుంతలు పడ్డ రోడ్లు.. ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రజలు పడుతోన్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ సోషల్ మీడియా క్యాంపెయిన్ కూడా చేయాలని నిర్ణయించారు.. #GunthalaRajyamAP, #WhyAPHatesJagan హ్యాష్ ట్యాగులతో సోషల్ మీడియా వేదికగా టీడీపీ – జనసేన ప్రచారం చేయనుంది.. కాగా, ఇప్పటికే రాష్ట్రస్థాయి ఉమ్మడి సమావేశాలతో పాటు.. నియోజకవర్గాల స్థాయిలోనూ టీడీపీ-జనసేన పార్టీలు ఉమ్మడి సమావేశాలు నిర్వహించి ప్రజాపోరాటాలపై నిర్ణయం తీసుకుంది.
కంపెనీ పేరు లేకుండా బిల్స్.. అక్రమంగా ఇసుక తవ్వకాలు..!
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక అక్రమాలపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఫైర్ అయ్యారు. కడియం మండలం బుర్రి లంక ఇసుక ర్యాంపులను జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ తో కలిసి పరిశీలించారు పురంధేశ్వరి.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..బుర్ర లంకలో ఇసుక ర్యాంపుల్లో అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి ర్యాంపును పరిశీలించామని తెలిపారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు.. నాలుగు ఐదు కిలో మీటర్ల మేర లారీలు క్యూ లైన్లో ప్రమాదకరంగా ఉన్నాయని ఆరోపించారు. వైసీపీ ఆగడాలకు కడియం నర్సరీ రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. పర్యావరణ నిబంధనల ప్రకారం మిషనరీతో తవ్వకాలు జరుగుతున్నాయని.. దీనివల్ల ధవళేశ్వరం బ్యారేజ్ తో పాటు పర్యావరణానికి ముప్పు ఉందన్నారు. కంపెనీ పేరు లేకుండా బిల్స్ ఉన్నాయని, ఢిల్లీలో ఉన్న వారి పేరుతో ఇక్కడ తవ్వకాలు ఇల్లీగల్ గా జరుగుతున్నాయని ఆరోపించారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. కాగా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలను చుట్టేస్తున్న పురంధేశ్వరి.. ఓవైపు కేంద్ర ప్రభుత్వం చేపడుతోన్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తూనే.. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై అసత్య ప్రచారాలు చేస్తోందని.. కేంద్రం నిధులు ఇస్తోందన్న మాటను కూడా దాస్తోందని కూడా మండిపడుతోన్న విషయం విదితమే.
కుదిరిన ఎంవోయూ.. ఏపీలో ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ వాహన యూనిట్
రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు, పరిశ్రమలకు తెచ్చేందుకు, ఉద్యోగాల కల్పనకు ప్రత్యేక చర్యలు ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అందులో భాగంగా విశాఖ వేదికగా జరిగిన సదస్సులో పలు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం.. అందులో కొన్ని సంస్థలు తమ పనులను కూడా ప్రారంభించాయి.. ఇక, ఇతర పెట్టుబడుల కోసం కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి.. ఇప్పుడు జర్మనీకి చెందిన ప్రముఖ విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీ సంస్థ పెప్పర్ మోషన్.. ఏపీలో భారీ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది.. ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనుంది.. చైనా వెలుపల ఈ స్థాయిలో భారీ యూనిట్ ఏర్పాటు కానుండడం ఏపీలోనే కావడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరినట్లు పెప్పర్ మోషన్ జీఎంబీహెచ్ ప్రకటించింది. అయితే, పెప్పర్ మోషన్ సంస్థకు ఏపీ ప్రభుత్వం చిత్తూరు జిల్లా పుంగనూరులో 800 ఎకరాల భూమిని కేటాయించింది.. దాంతో పాటు పలు రాయితీలను కూడా ప్రకటించింది.. 600 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే దాదాపు రూ.4,640 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది.. ఈ పరిశ్రమ ద్వారా 8,080 మందికి ఉపాధి లభిస్తుందని చెబుతున్నారు… టెస్లా మాదిరి అంతర్జాతీయ ప్రమాణాలతో సమీకృత ఎలక్ట్రిక్ బస్ అండ్ ట్రక్ తయారీ యూనిట్‌తో పాటు డీజిల్ బస్సులు, ట్రక్కులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే రిట్రో ఫిట్టింగ్, 20 జీడబ్ల్యూహెచ్ సామర్థ్యం ఉండే బ్యాటరీ తయారీ యూనిట్, విడిభాగాల తయారీ యూనిట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నట్టు పెప్పర్ మోషన్ పేర్కొంది. ఈ నెలాఖరులో యూనిట్ నిర్మాణ పనులు ప్రారంభంకానుండగా.. 2025 ప్రారంభం నాటికి వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాలని టార్గెట్‌గా పెట్టుకుంది ఆ సంస్థ.. ఇక, 2027 నాటికి ఏటా 50,000 కంటే ఎక్కువ బస్సులు, ట్రక్కులు తయారు చేసే సామర్థ్యానికి యూనిట్ చేరుకుంటుందని పేర్కొంది..
నోరు అదుపులో పెట్టుకోండి.. రాములమ్మ మాస్ వార్నింగ్..
కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత విజయశాంతి తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాత మిత్రులను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ కోసం 25 ఏళ్ళు పని చేశా.. కాంగ్రెస్ విడిచి బీజేపీలోకి వెళ్ళాను.. బీజేపీ, కేసీఆర్ అవినీతిని బయటకు తీసి లోపల వేస్తామన్నారు.. బీజేపీ హైకమాండ్ మాకు మాట ఇచ్చారు.. మాటకు కట్టుబడి ఉంటారు అనుకున్నా.. నెలలు గడిచాయి కానీ చర్యలు తీసుకోలేదు అని ఆమె మండిపడ్డారు. ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది అర్థం కాలేదు.. మోడీ, అవినీతికి వ్యతిరేకం అంటారు.. కేసీఆర్ అవినీతి పరుడు అని చెప్పారు.. మోడీ దగ్గర, కేసీఆర్ కుటుంబ అవినీతి వివరాలు అన్ని ఉన్నాయని విజయశాంతి తెలిపారు. అమిత్ షా, జేపీ నడ్డా, నరేంద్ర మోడీ అందరూ కేసీఆర్ అవినీతి పరుడు అంటారు.. ఎందుకు చర్యలు తీసుకోలేదు అని విజయశాంతి ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటనేది అర్థం అయ్యింది.. తెర ముందు ఒకటి, తెర వెనుక ఒకటి మాట్లాడుతున్నారు.. బీజేపీ కార్యకర్తలు, నాయకులను మోసం చేస్తుంది.. నమ్మించి మోసం చేస్తున్నారు.. కాంగ్రేస్ అధికారంలోకి వస్తుంది అని ఆమె పేర్కొన్నారు. కేసీఆర్ అవినీతిని కక్కిస్తుంది.. బండి సంజయ్ ని మార్చారు.. వొద్దు అని చెప్పిన.. ఎన్నికలకు నాలుగు నెలల ముందు వద్దు అన్నాను.. అయినా నా మాట వినలేదు అని విజయశాంతి తెలిపారు.
పొంగులేటిపై తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు.. మేం శత్రువులం కాదు.. కానీ..!
పొంగులేటి నేను ఎప్పటికి శత్రువులం కాదు కేవలం ప్రత్యర్థులం మాత్రమే అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలంలో ముఖ్యకార్యకర్తల సమావేశంలో తుమ్మల మాట్లాడుతూ… నేను బయట అయితే మాట్లాడతాను కాని నన్ను పెంచిన వాళ్ళ ముందు మాట్లాడాలి అంటే కొంచెం కష్టమే అన్నారు. టిడిపి జెండా జన్మనిచ్చిందని అన్నారు. పామ్ ఆయిల్ మొక్క నాటింది మొదటిగా ఎన్.టి. రామారావు గారే అన్నారు. నన్ను మొదటి సరిగా నాకు అవకాశం ఇచ్చి నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడే అనుకున్నాం మనకు ఈ పరిస్థితి వస్తుందని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 5 మండలాల ప్రజలు ప్రతి మండలానికి నేను అభివృద్ధి చేసానని అన్నారు. మేము శత్రువులం కాదు ప్రత్యర్థులం మాత్రమే అందుకే గ్రామ స్థాయి కార్యకర్త నుండి అందరు నన్ను పొంగులేటిని కాంగ్రెస్ పార్టీ లోకి రమ్మని ఆహ్వానించారని అన్నారు. 40 సంవత్సరాలుగా మేమిద్దరం ఎలా అభివృద్ధి చేసామో అలాగే అభివృద్ధి చేస్తాం అన్నారు. ఏ గ్రామానికి ఏమి కావాలో మీకన్నా మాకే ఎక్కువ తెలుసన్నారు. మేము మీ మనుషులం ఇన్ని రోజులు రాజకీయాల్లో బ్రతికి ఉన్నాం ఆంటే కేవలం మీ వల్లే అన్నారు. మమ్మల్ని ఎలా ఆదరించారో అలాగే జారే ని కూడా ఆధారించాలని కోరుకుంటున్నామన్నారు. పామ్ ఆయిల్ రేటు కాని నర్సరీలకు ఉన్న సమస్యలు కాని రాహుల్ గాంధీతో మాట్లాడి అన్ని సమస్యలు తీరుస్తా అని మాటిస్తున్న అన్నారు.
సీఎం పోస్ట్ వద్దు.. ఆశాఖే కావాలంటున్న కేటీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికార బీఆర్ఎస్ చురుగ్గా పాల్గొంటుంది. సీఎం కేసీఆర్ ప్రతిరోజూ నాలుగు నియోజకవర్గాల్లో బహిరంగ సభలకు హాజరవుతుండగా, మంత్రులు హరీశ్, కేటీఆర్, కవితలు పలు నియోజకవర్గాలు, కార్నర్ మీటింగ్‌లలో మాట్లాడుతున్నారు. మంత్రి కేటీఆర్ తన తొమ్మిదిన్నరేళ్ల పాలనను ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందిస్తున్నారు. బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ (బీఎన్ఐ) శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఐటీ, పురపాలక శాఖ మంత్రిగా ఉన్న ఆయన మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తాను తీసుకునే శాఖ విషయమై కీలక కామెంట్స్ చేశారు. మళ్లీ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే టూరిజం శాఖ ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరతానని కేటీఆర్ వెల్లడించారు. దీంతో సీఎం పదవి వద్దంటూ టూరిజం శాఖ కావాలని కేటీఆర్ చెప్పడం ఆశక్తి కరంగామారింది. సీఎం కేసీఆర్ కొడుకు అయి వుంది.. ఆయన బాటలో నడవాల్సిన కేటీఆర్ సీఎం పదవి కాకుండా.. టూరిజం శాఖ కావాలనడంపై సర్వత్రా ఆశక్తి కరంగా మారింది. ఆరు దశాబ్దాల్లో కాంగ్రెస్ సాధించలేని అభివృద్ధిని తమ ప్రభుత్వం ఆరున్నరేళ్లలో సాధించిందన్నారు. తెలంగాణలో పర్యాటక రంగానికి అపారమైన అవకాశాలున్నాయని, పెద్దఎత్తున రిజర్వాయర్ల నిర్మాణం తర్వాత మరింత మెరుగుపడిందన్నారు.
అమ్మమ్మకు మళ్ళీ పెళ్లి.. అసలేం జరిగిందంటే..
అమ్మాయి అయినా.. అబ్బాయి అయినా పెళ్లి గురించి ఎన్నో కలలు కంటారు. ఎలాంటి వ్యక్తి జీవిత భాగస్వామిగా వస్తాడా అని అనుకుంటూ తన ఎక్సపెక్టేషన్స్ కి తగిన వ్యక్తి రావాలని కోరుకుంటారు. అయితే కొందరికి పెళ్ళికి అర్ధం తెలియని వయసులోనే పెళ్లి జరిగి పోతుంది. తనకు పెళ్లి వయసు వచ్చేసరికి ఆమె అమ్మ అవుతుంది. అమ్మ వయసుకు అమ్మమ్మ అవుతుంది. ఇలాంటి ఘటనలు కోకొల్లలు. అయితే తాజాగా ఓ అమ్మమ్మ రెండో పెళ్ళికి రెడీ అవుతుంది. వివరాలలోకి వెళ్తే.. యునైటెడ్ కింగ్డమ్కు చెందిన రేచెల్ మెక్‌ఇంటైర్ అనే మహిళకి ఆడుకునే వయసులో అంటే కేవలం 13 సంవత్సరాలకే పెళ్లి జరిగింది. కాగా ఆమె 15 ఏళ్ళ వయసులోనే ఓ పాపకు జన్మనిచ్చి అమ్మ అయింది. కాగా ఆ పాప పెరిగి పెద్దదైంది. ఈ నేపథ్యంలో రేచెల్ తన కూతురికి కూడ పెళ్లి చేసింది. కాగా రేచెల్ కూతురు కూడా ఓ పాపకు జన్మనిచ్చింది. దీనితో 33 సంవత్సరాలకే రేచెల్ అమ్మమ్మ అయింది. అయితే రేచెల్ కొంతకాలం క్రితం మూరత్ అనే యువకుడిని చూసింది. తొలి చూపులోనే రేచెల్ ఆ యువకుడి ప్రేమలో పడింది. కాగా ఆ తరువాత ఇద్దరి మధ్య పెరిగిన పరిచయం ప్రేమగా మారింది. ఇదే విషయాన్నీ రేచెల్ తన కూతురుకు చెప్పగా ఆమె పెళ్ళికి ఓకే అన్నది. దీనితో రేచెల్ తన ఆనందాన్ని మీడియా తో పంచుకుంది. ఈ నేపథ్యంలో రేచెల్ మాట్లాడుతూ.. మూరత్ ప్రవర్తన తనను ఎంతగానో ఆకట్టుకుందని.. అందుకే అతనిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. కాగా తన నిర్ణయానికి ఆమె కుమార్తె కూడా మద్దతు తెలిపిందంటూ’ పెళ్లి కుమార్తెగా మారబోతున్న రాచెల్ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.
చాట్‌జీపీటీ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ ను తొలగించిన ఓపెన్ఏఐ.. కారణం ఇదే?
చాట్‌జీపీటీ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ ఉద్యోగం పోయిందని ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.. తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయిన ఓపెన్ ఎఐ సంస్థ అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.. సంస్థ కార్యక్రమాలను సరిగ్గా నిర్వహించక పోవడంతో, ఆయన పనితీరుపై నమ్మకం లేకపోవడంతోనే అతన్ని విధుల నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు ప్రకటించింది.. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవ్వడంతో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.. ఇకపోతే చాట్‌జీపీటీలో బిలియన్ల డాలర్లను ఇన్వెస్ట్ చేసింది మైక్రోసాఫ్ట్. ఏఐ టెక్నాలజీని బింగ్ సెర్చ్ ఇంజిన్‌తో పాటు మైక్రోసాఫ్ట్‌లోని ఇతర ప్రాడక్ట్స్‌కి కూడా తీసుకొస్తామని గతంలో హామీ ఇచ్చింది.. అయితే కొత్త సీఈఓ ఎవరా అనే ఆలోచనలు జనాల్లో మొదలు కావడంతో సంస్థ ఆ స్థానంలో మీరా మారుతిని నియమించింది. ఆమె.. ఇప్పటివరకు అదే సంస్థలో సీటీఓ (చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్)గా బాధ్యతలు నిర్వహించారు.. ఇదిలా ఉండగా.. ఆల్ట్మాన్ తనను కంపెనీ నుంచి తొలగించడం పై తాజాగా స్పందించారు.. ఓపెన్ఏఐ టీమ్‌ని నేను ప్రేమించాను. వ్యక్తిగతంగా చాలా వృద్ధి సాధించాను. ప్రపంచానికి కూడా కొంత మంచి చేశానని విశ్వసిస్తున్నాను. అద్భుత టాలెంట్ ఉన్న వారితో పనిచేయడాన్ని ప్రేమించాను, అని ట్విట్టర్ వేదికగా స్పందించారు సామ్ ఆల్ట్మాన్. ఇక సామ్ ఆల్ట్మాన్ని ఫైర్ చేయడంతో.. ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు గ్రేగ్ బ్రూక్మాన్కు తన పదవికి రాజీనామా చేశారు.. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ఓపెన్ఏఐని నా అపార్ట్మెంట్లో ప్రారంభించాము. అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. చాలా కఠినమైన పరిస్థితులను, సంతోషకరమైన సందర్భాలను ఎదుర్కొన్నాము అని బ్రూక్మాన్ తెలిపారు.. ఇప్పుడు ఈ కంపెనీ అధ్యక్షులుగా ఎవరిని నియమిస్తారో తెలియాల్సి ఉంది..
వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా ట్రాక్ రికార్డ్ ఇదే..?
వన్డే ప్రపంచ కప్ 2023 చివరి అంకానికి చేరుకుంది. రేపు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో టీమిండియా పోటీ పడుతుంది. 20 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియాలు ఫైనల్లో తలపడుతున్నాయి. ఆసీస్ ఐదుసార్లు టైటిల్ గెలుచుకోగా.. భారత్ రెండుసార్లు ట్రోఫీని గెలుచుకుంది. ఇక, ప్రపంచకప్ టోర్నీ 1975లో ప్రారంభం అయింది. ఇంగ్లండ్‌లో తొలిసారి ఈ ప్రపంచ కప్ టోర్నమెంట్ జరిగింది. 48 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఆస్ట్రేలియా అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా నిలిచింది. ఈ వరల్డ్ కప్ లో బ్యాడ్ స్టార్ట్ తర్వాత ఆస్ట్రేలియా మళ్లీ లయను అందుకుంది. ఈ 13వ ఎడిషన్ లో టీమిండియా జరిగిన మ్యాచ్ మినహాయిస్తే.. వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లో కంగారుల జట్టు విజయం సాధించింది. సెమీస్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి నేరుగా ఆసీస్ ఫైనల్‌కు చేరుకుంది. ఇక, ఆస్ట్రేలియా జట్టు 1987, 1999, 2003, 2007తో పాటు 2015లో ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో వరుసగా మూడుసార్లు విజయం సాధించిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. అలన్ బోర్డర్, స్టీవ్ వా, రికీ పాంటింగ్ రెండుసార్లు, మైకేల్ క్లార్క్ కెప్టెన్సీలో ఒక్కసారి ఆస్ట్రేలియా ఛాంపియన్‌గా నిలిచింది. 2003 ప్రపంచకప్ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించింది. దీంతో ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి భారత్‌కు ఇప్పుడు సువర్ణావకాశం.
పొట్టి డ్రెస్ లో మలైక స్టన్నింగ్ పోజులు.. అలా చూపిస్తే ఎలా అమ్మడు..
బాలీవుడ్ హాట్ బ్యూటి మలైక అరోరా గురించి పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న బ్యూటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లతో హీటేక్కిస్తుంది.. ఎప్పటికప్పుడు ఈ అమ్మడి ఫొటోస్ యువతను ఆకట్టుకుంటూనే ఉంటాయి.. తాజాగా అదిరిపోయే అవుట్ ఫిట్ లో పొట్టి డ్రెస్సులో న్యూ స్టిల్స్ ను వదిలింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఎక్కువగా ఐటెం సాంగ్స్ తో కుర్రాళ్లను ఆకట్టుకున్న మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది..ఈమె హాట్ నెస్ చూస్తే స్టార్ హీరోయిన్లకి కూడా అసూయ కలుగుతుంది. ఈ వయస్సులో కూడా ముద్దుగుమ్మ అందాలకు బీటౌన్ జనాలు ఫిదా అవుతున్నారు.. అందానికి మంత్ర ముగ్దలు అవుతున్నారు.. ఫిట్ నెస్ గ్లామర్ విషయంలో ఎప్పుడూ కేరింగ్ గా ఉంటుంది. మతిపోగొట్టే ఒంపు సొంపులతో ఆకట్టుకుంటోందంటే అందుకు కారణం గ్లామర్ విషయంలో ఆమె తీసుకుంటున్న కేరింగ్.. జనాలను తెగ ఆకట్టుకుంటుంది.. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న గ్లామర్ ఫొటోస్ కు అభిమానులతో పటు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. లేటెస్ట్ ఫొటోషూట్ స్టన్నింగ్ గా మారింది.. అటు సినిమాలు, ఇటు టీవీ షోల్లోనూ సందడి చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు తన గురించి ఏదొక అప్డేట్స్ ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటూ వస్తోంది.. ఓ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ ఈ ముద్దుగుమ్మ చేసిన ఫొటోషూట్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. లోదుస్తులు లేకుండానే బోల్డ్ గా దర్శనమిచ్చింది. షర్ట్ బటన్స్ తీసేసి మరీ ఫొటోలకు ఘాటుగా స్టిల్స్ ఇచ్చింది. మెరిసిపోయే అందంతో మంత్రముగ్ధులను చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఆ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్న ప్రభాస్..?
పాన్ ఇండియా స్టార్ హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తున్నారు.. ఈ మధ్య విడుదల అవుతున్న సినిమాలన్నీ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి.. బాహుబలి తర్వాత వచ్చిన సినిమాలు అన్నీ కూడా భారీ యాక్షన్ సినిమాలే.. కథ పరంగా ఆకట్టుకోకపోయినా కూడా కలెక్షన్ల సునామిని సృష్టించాయి.. ఇక ఇప్పుడు సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు డార్లింగ్.. కేజీఎఫ్ తో సంచలన విజయం సాధించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇక ఈ సినిమాకు కేజీఎఫ్ కు లింక్ ఉందంటూ కొద్దిరోజులుగా ఫిలిం సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ పై అంచనాలను పెంచేశాయి. ఇక సలార్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న విడుదల కానుంది.. సలార్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తర్వాత చాలా సినిమాలను లైన్లో పెట్టాడు ప్రభాస్.. మారుతి దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. అలాగే నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఓ చేస్తున్నాడు. అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో దర్శకుడితో ప్రభాస్ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రభాస్ చేయనున్నాడని వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. యూవీ క్రియేషన్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ త్రివిక్రమ్, ప్రభాస్ లతో చేయాలనీ భావిస్తోందట.. వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా ఫ్యామిలి ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతుందని సమాచారం.. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే..