నేటి నుంచి టీడీపీ – జనసేన ఆత్మీయ సమావేశాలు..
రాష్ట్రస్థాయిలో ఇప్పటికే టీడీపీ-జనసేన ఉమ్మడి సమావేశాలు జరగగా.. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ – జనసేన పార్టీల నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నారు.. 14, 15, 16 తేదీల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.. నియోజకవర్గ స్థాయిలో ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు.. ఇక, ఈ నెల 17వ తేదీ నుంచి చేపట్టే ఇంటింటి ప్రచారంపై సమీక్ష చేపట్టనున్నారు నేతలు. టీడీపీ – జనసేన మినీ మేనిఫెస్టోపై ప్రజల్లో అవగాహన కల్పించే అంశంపై చర్చ కూడా టీడీపీ – జనసేన పార్టీల నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశాల్లో చర్చిస్తారు.. ఇప్పటికే 11 అంశాలతో మినీ మేనిఫెస్టోను సిద్దం చేసింది టీడీపీ – జనసేన.. ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలను సిద్దం చేసుకోనున్నారు.. ఓటర్ వెరిఫికేషన్ పై ఫోకస్ పెట్టేలా కార్యాచరణ రూపొందించబోతున్నారు.. మరోవైపు.. ఇవాళ్టి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు జనసేన నేతలు వరుస ప్రెస్‌మీట్లు నిర్వహించనున్నారు.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో వివిధ అంశాల్లో కుంభకోణాలు జరిగాయంటూ వరుస ప్రెస్ మీట్లు పెట్టబోతున్నారు.. టోఫెల్, ఐబీ ఒప్పందాలు, జగనన్న పాల వెల్లువలో అవినీతి జరిగిందంటూ ఇప్పటికే జనసేన ఆరోపణలు చేస్తున్న విషయం విదితమే.
సీఎం ఎక్కడ నుంచి చేయమంటే అక్కడి నుంచే పోటీ..!
ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల వాతావరణం వచ్చేసింది.. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నా.. అప్పుడే.. నేతలు ఎక్కడ నుంచి పోటీ చేయాలి.. ఏ స్థానం నుంచి బరిలోకి దిగితే బెటర్.. ఆ నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేసుకుంటే మంచిదా? అనే విషయాలపై నేతలు ఫోకస్ పెట్టారు. అయితే, ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. తన పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేయనున్నట్టు ప్రకటించారు.. వచ్చే ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకే సీఎం జగన్ టికెట్లు కేటాయిస్తారన్న ఆయన.. ప్రజలకు చేసిన కార్యక్రమాలు చూసి మరోసారి ఆశీర్వదించాలని సీఎం జగన్ ప్రజలను కోరుతున్నారు.. సామాజిక, సాధికార యాత్రకు వస్తున్న విశేష స్పందన చూస్తే విపక్షాలకు మైండ్ బ్లాక్ అవుతుందన్నారు. మా కార్యక్రమాలను చూసి.. వాళ్లు మేనిఫెస్టోలు తయారు చేసుకుంటున్నారు అంటూ విపక్షాలపై సెటైర్లు వేశారు. మా పథకాలను చూసి మాకు ప్రజలు పట్టం కడతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక ఉచితమంటూనే దోచుకున్నారని ఆరోపణలు గుప్పించారు. గతం కన్నా ఇప్పుడు ఇసుక మెరుగ్గా దొరుకుతుందని తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ఏ మేరకు అవసరం ఉంటుందో ఆ మేరకు ఇసుక సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి.
టీటీడీ స్కంద పుష్కరిణి సాక్షిగా మతమార్పిడి..! వాగ్వాదానికి దిగిన స్థానికులు
తిరుమలతో పాటు.. టీటీడీకి చెందిన ఏ ఆలయం అయినా.. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఆలయాలు అయినా.. అక్కడ ఉండే పుష్కరిణిలను చాలా పవిత్రంగా చూస్తారు భక్తులు.. అలాంటి టీటీడీ పుష్కరిణినే మత మార్పిడికి అడ్డాగా మార్చుకున్నారు.. ఇది గమనించిన స్థానికులు.. వారితో వాగ్వాదానికి దిగిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.. చిత్తూరు జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కార్వేటినగరం మండలంలో టీటీడీ స్కంద పుష్కరిణిలో అపచారం జరిగింది.. కార్వేటి నగరం మండలం టీటీడీ అనుబంధ వేణుగోపాలస్వామి ఆలయ స్కంద పుష్కరిలో మతమార్పిడికి తెరలేపారు.. హిందువుల పవిత్రంగా పూజించే స్నానమాచరించి స్కంద పుష్కరణిలో క్రైస్తవ మత మార్పిడికి బాప్తిజం చేశారు.. ఇది గమనించిన స్థానికులు కొందరు అక్కడికి చేరకుని క్రైస్తవులతో వాగ్వాదానికి దిగారు.. హిందువులను బలవంతంగా క్రైస్తవ మతంలోకి మత మార్పిడి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు.. అక్కడి బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.. బలవంతంగా మత మార్పిడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
బైక్‌పై టపాసులు కాల్చుడేంటి..? ఆ స్టంట్స్ ఏంటి..? దూలతీరిందా..?
దీపావళి వచ్చిందంటే చాలు.. ఇంటిల్లిపాది ఆనందంగా గడుపుతారు.. కుటుంబ సభ్యులంతా కలిసి ఉత్సాహంగా టపాసులు పేలుస్తుంటారు.. అయితే, కొందరు యువకులు టపాసులతోనూ విచిత్రమైన వేషాలు వేస్తున్న ఘటనలు కొన్ని చూస్తూనే ఉన్నాం.. ఈ మధ్యే టైగర్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌లో సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ బాణాసంచా కాల్చి.. ప్రేక్షకులను భయబ్రాంతులకు గురిచేసిన ఘటన మరువక ముందే.. కొందరు యువకులు బైక్‌పై డేంజర్స్ స్టంట్స్ చేయడమే కాదు.. ఆ స్టంట్స్‌లో బాణాసంచా కాల్చుతూ.. దారిన పోయేవారికి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారు.. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.. రోడ్డుపై వెళ్తూ బైక్‌పై స్టంట్స్ చేస్తేనే.. వెనుక.. ముందు వెళ్లే వారికి ఇబ్బందికరంగా ఉంటుంది.. అంతేకాదు.. అదుపుతప్పితే ప్రమాదాలు కూడా కొనితెచ్చుకున్నట్టు అవుతుంది.. అయితే.. ఓ యువకుడు తన బైక్‌కు ముందు ఉన్న లైట్ భాగంలో టపాసులను అమర్చాడు. ఇక, ఆ తర్వాత వాటికి నిప్పు పెట్టి.. రోడ్డుపై వేగంగా దూసుకెళ్లాడు. అంతటితో ఆగకుండా.. బైక్ ముందు టైర్లను గాల్లోకి లేపి ప్రమాదకర స్టంట్స్ చేశాడు. బైక్‌పై స్టంట్స్ చేస్తూ.. బాణాసంచా కాల్చుతూ.. ఆనందం పొందాడేమో.. కానీ, అది ఇతరులకు ఇబ్బందిగా మారింది.. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాకు ఎక్కి వైరల్‌గా మారిపోయింది.. రంగంలోకి దిగిన తమిళనాడులోని తిరుచ్చి పోలీసులు.. ఆ యువకుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.. మరోవైపు.. గురుగ్రామ్‌లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది.. ఓ వ్యక్తి కారు పైకప్పుపై పటాకులు కాలుస్తూ.. సైబర్ సిటీ ప్రాంతంలో హల్‌చల్ చేశాడు.. ఈ దృశ్యాలుకూడా సోషల్ మీడియాకు ఎక్కాయి.. ఆ వీడియోపై స్పందించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీపావళి అంటే ఆనందంగా జరుపుకోవాలి.. ఇలాంటి పైశాచిక ఆనందం దేనికి.. ఊచలు లెక్కపెట్టడం దేనికోసం.. దూల తీరిందా? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ పాలకమండలి.. ఉద్యోగులకు శుభవార్త..
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.. సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి.. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలరైజ్ చెయ్యాలన్న ప్రభుత్వ జీవో నెంబర్ 114 మేరకు అర్హత వున్న ఉద్యోగులను టీటీడీలో రెగ్యులరైజ్ చేస్తాం అని తెలిపారు. శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాని అలిపిరి వద్ద 23వ తేది నుంచి ప్రారంభిస్తున్నాం.. హోమంలో పాల్గొనే భక్తులు వెయ్యు రుపాయాలు చెల్లించిటికెట్లు పొందవలసి ఉంటుందన్నారు.. హోమాన్ని నిరంతరాయంగా నిర్వహించే ఏర్పాట్లు చేస్తామన్నారు. టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించిన వడమాల పేట వద్ద గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి రూ. 25.67 కోట్లు కేటాయింపునకు టీటీడీ పాలకమండలి ఆమోద ముద్రవేసింది.. వీటిని తిరిగి ఉద్యోగులు నుంచి రీఎంబర్స్ చేసూకుంటాం అని తెలిపారు. ఇక, టీటీడీలో ప్రతి ఒక్క ఉద్యోగికి ఇంటి స్థలాలు కేటాయిస్తాం.. తిరుపతిలోని రామ్ నగర్ క్వార్టర్స్ అభివృద్ది పనులుకు రూ.6.15 కోట్లు కేటాయించినట్టు టీటీడీ చైర్మన్ తెలిపారు. టీటీడీ ఉద్యోగులుకు బ్రహ్మోత్సవ బహుమానంగా రూ.14 వేలు.. కాంట్రక్ట్ ఉద్యోగులుకు రూ.6,850 చెల్లిస్తాం అన్నారు. ప్రసాదాలు ముడిసరుకులు నిల్వ వుంచడానికి రూ.11 కోట్లతో అలిపిరి వద్ద గోడౌన్ల నిర్మాణం చేపట్టనున్నట్టు వెల్లడించారు.. మంగళం నుంచి రేణిగుంట వరకు రోడ్డు అభివృద్ది పనులుకు రూ.15 కోట్లు కేటాయించింది పాలకమండలి.. ఎంఆర్ పల్లి జంక్షన్ నుంచి అన్నమయ్య వరకు రోడ్డు అభివృద్ది పనులకు రూ.4.5 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోగా.. పుదిపట్ల జంక్షన్ నుంచి వకులామాత ఆలయం వరకు రోడ్డు నిర్మాణానికి రూ. 21 కోట్లు కేటాయించారు. ఆయుర్వేద హస్పిటల్ లో రూ.1.65 కోట్లతో నూతన భవనం నిర్మాణం చేపట్టనున్నారు. రుయాలో టీబీ రోగుల కోసం రూ.1.79 కోట్లతో నూతన వార్డు నిర్మించాలని నిర్ణయించారు.
నువ్వు ఆర్‌ఎస్‌ఎస్ కీలుబొమ్మవి.. బీజేపీ- కాంగ్రెస్‌ల మధ్య ఎలాంటి తేడా లేదు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నాయకుల మధ్య విమర్శల దాడి మరింతగా పెరుగుతుంది. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఓ ఆర్ఎస్ఎస్ తోలుబొమ్మ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై విమర్శలు చేయడానికి మీకు ఏమీ లేదు.. మీరు మా బట్టలు, గడ్డాల గురించి మాట్లాడి మాపై దాడులు చేస్తున్నారని ఓవైసీ వ్యాఖ్యనించారు. దీనినే డాగ్ విజిల్ పాలిటిక్స్ అంటారు అంటూ ఎంఐఎం చీఫ్ తెలిపారు. నీవు ఆర్‌ఎస్‌ఎస్ కీలుబొమ్మవి.. ఇందులో బీజేపీ- కాంగ్రెస్‌ల మధ్య ఎలాంటి తేడా లేదని అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. అయితే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓవైసీ కుటుంబంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక ఎన్నికల సమయంలో మోడీ, అమిత్ షా సన్నిహితుడికి ఒవైసీ తన ఇంట్లో పార్టీ ఇచ్చారని రేవంత్ ఆరోపించారు. దీనిపై దర్గా దగ్గరికి రమ్మన్నా.. భాగ్యలక్ష్మీ టెంపుల్ దగ్గరకి రమ్మన్నా వస్తాను.. మరి మసీదులో ప్రమాణం చేసేందుకు అసదుద్దీన్ ఒవైసీ రెడీనా అని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. ఆయన ఒంటిపై షెర్వాణీ ఫైజామా ఉందని అనుకున్నా.. కానీ షెర్వాణీ కింద ఖాకీ నిక్కర్ కూడా ఉందని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.
ప్రతి పక్ష పార్టీలకు 11 సార్లు అవకాశం ఇస్తే ఏం పీకారు..?
తాజ్ డెక్కన్ లో జరిగిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రతి పక్ష పార్టీలకు 11 సార్లు అవకాశం ఇస్తే ఏం పీకారు? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి వీళ్లకు?.. బోర్ కొట్టిందనీ కొత్త ప్రభుత్వం రావాలని కోరుకుంటారా?.. అభివృద్ది చేసే వాడు ఇంకొన్నేళ్లు ఉంటే తప్పేంటి?.. కర్ణాటకలో బిల్డర్స్ నుంచి కమిషన్ 40 నుంచి 400 కు పెరిగింది అని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ లో అభివృద్ది ఇప్పటి దాకా చేసింది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందుంది అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. వచ్చే ప్రభుత్వంలో మరింత వేగంగా హైదరాబాద్ అభివృద్ధి చేసి చూపిస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 332 కిలో మీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు నిర్మిస్తాం.. ఓఆర్ఆర్, త్రిపుల్ ఆర్ మధ్యలో కొత్త హైదారాబాద్ నిర్మాణం చేసి చూపిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. త్రిపుల్ ఆర్ బయట కూడా కొత్త రింగ్ రోడ్డు.. తెలంగాణ జిల్లాలకు వెళ్లే మార్గం సులభం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం.. అభివృద్ది, రాష్ట్ర ప్రగతి కొనసాగాలంటే కేసిఆర్ మళ్ళీ రావాలి అని మంత్రి కేటీఆర్ సూచించారు.
కోహ్లీ, కేన్, బాబర్‌లా కాదు.. రోహిత్ చాలా ప్రత్యేకం!
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మపై పాకిస్తాన్ మాజీలు వసీమ్ అక్రమ్, షోయబ్ మాలిక్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచ క్రికెట్‌లో ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు ఉన్నా.. రోహిత్ వారందరికంటే ప్రత్యేకమని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచ మేటి బ్యాటర్లు అయిన విరాట్ కోహ్లీ, జో రూట్, కేన్ విలియమ్సన్, బాబర్ అజామ్‌ల కంటే ఎంతో ప్రత్యేకం అని పొగడ్తల్లో ముంచెత్తారు. హిట్‌మ్యాన్ ఏ బౌలర్నీ వదిలిపెట్టలేదని అక్రమ్, మాలిక్ అన్నారు. ఓ క్రీడా ఛానల్‌తో పాక్ మాజీలు మాట్లాడుతూ రోహిత్ ఆట గురించి స్పందించారు. ‘అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మ లాంటి ఆటగాడు మరొకరు లేరు. విరాట్ కోహ్లీ, జో రూట్, కేన్ విలియమ్సన్, బాబర్ అజామ్ గురించిమనం మాట్లాడతాం. కానీ వారందరికంటే హిట్‌మ్యాన్ ఎంతో ప్రత్యేకం. ప్రత్యర్థి ఎవరైనా, ఎలాంటి బౌలింగ్ ఉన్నా దీటుగా ఎదుర్కొంటూ సునాయాసంగా పరుగులు చేస్తాడు’ అని వసీమ్ అక్రమ్ అన్నాడు. ‘ప్రత్యర్థి బౌలర్లు ఐదుగురినీ రోహిత్ ఆడేస్తాడు. కోహ్లీ, రూట్, కేన్, బాబర్ లాంటి వాళ్లు 3-4 బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటే.. రోహిత్ ఐదుగురిని టార్గెట్ చేస్తాడు. హిట్‌మ్యాన్ ఏ ఒక్కరినీ వదిలిపెట్టడు’ అని మాలిక్ పేర్కొన్నాడు.
సెమీస్ మ్యాచ్‌లపై వరుణుడి కన్ను.. వర్షం పడితే ఫలితం ఎలా నిర్ణయిస్తారు?
భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో సెమీ ఫైనల్ మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. నవంబర్ 15న ముంబై వేదికగా జరిగే సెమీ ఫైనల్-1 మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడనుండగా.. నవంబర్ 16న కోల్‌కతాలో జరిగే సెమీ ఫైనల్-2లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. సెమీ ఫైనల్ మ్యాచ్‌ల కోసం నాలుగు జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సెమీస్ మ్యాచ్‌లకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో వర్షం పడితే ఏం జరుగుతుందనే అనుమానాలు అందరిలో ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రపంచకప్ 2023 సెమీ ఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉంది. నవంబర్ 15న భారత్, న్యూజిలాండ్ పూర్తిగా జరగకపోతే.. రిజర్వ్ డే (నవంబర్ 16)న మ్యాచ్ కొనసాగుతుంది. అదే సమయంలో నవంబర్ 16న దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మ్యాచ్ మధ్యలో ఆగిపోతే.. మరుసటి రోజు (నవంబర్ 17)న కొనసాగుతుంది. ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉంది. సెమీ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా మధ్యలో ఆగిపోతే.. మరుసటి రోజు అక్కడి నుంచే కొనసాగుతుంది. ఉదాహరణకు ముందుగా బ్యాటింగ్ చేస్తున్న జట్టు 20 ఓవర్లలో 150 పరుగులు చేసిన సమయంలో వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోతే.. మరుసటి రోజు 21వ ఓవర్ నుంచి ఇన్నింగ్స్ ఆరంభిస్తుంది. ఆపై ఛేజింగ్‌కు ప్రత్యర్థి జట్టు దిగుతుంది.
ఏజెంట్ లుక్ లో వెన్నెల కిషోర్.. చారి 111 ఫస్ట్ లుక్ రిలీజ్.
వెన్నెల కిశోర్..ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం వెన్నెల కిషోర్ టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా రానిస్తున్నారు.వెన్నెల కిషోర్ తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు.వెన్నెల సినిమాతో తన కెరీర్ ను మొదలు పెట్టిన ఆయన అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో కమెడియన్ గా తనదైన కామెడీ తో ప్రేక్షకులను నవ్వించారు. కమెడియన్ గానే కాకుండా దర్శకుడి గా అలాగే హీరోగా కూడా రాణించారు.ఇప్పుడు ఆయన హీరోగా ఓ చిత్రంలో నటిస్తున్నారు.. స్పై యాక్షన్ కామెడీ జోనర్‌లో ‘చారి 111’ అనే సినిమా ను చేస్తున్నారు. గతంలో ఈ చిత్ర అనౌన్స్‌మెంట్ ను చిత్ర యూనిట్ ఓ వీడియో రూపంలో తెలియజేసింది.చారి 111 చిత్రంలో స్పై ఏజెంట్‍గా ప్రధాన పాత్రలో వెన్నెల కిశోర్ నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రసాద రావుగా మురళీ శర్మ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.అలాగే సంయుక్త విశ్వనాథన్ మరియు మహీగా ప్రియామాలిక్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని ‘మళ్లీ మొదలైంది’ ఫేమ్ డైరెక్టర్ టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సిమోన్ కే కింగ్ సంగీతం అందిస్తున్నారు. స్పై ఏజెంట్ గా కన్‍ఫ్యూజ్ అవుతూ.. నవ్వించేలా వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఈ సినిమా లో ఉంటుందని అనౌన్స్‌మెంట్ వీడియో ద్వారా మేకర్స్ తెలియజేశారు.. కామిక్‍లా వున్న ఆ అనౌన్స్‌మెంట్ వీడియోకు కమెడియన్ సత్య వాయిస్ ఓవర్ ను ఇచ్చారు. ‘చారి 111’ క్యారెక్టర్ గురించి ఆ వీడియోలో వివరించారు. అలాగే కొన్ని పాత్రలను కూడా పరిచయం చేశారు.స్పై ఏజెంట్ గా తన యాక్షన్ విన్యాసాలతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించేందుకు వెన్నెలకిషోర్ సిద్ధం అవుతోన్నాడు.ఇదిలా ఉంటే తాజాగా చారి 111 మూవీ ఫస్ట్ లుక్ ను మంగళవారం రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో వెన్నెలకిషోర్ ఏజెంట్ లుక్ లో కనిపించాడు.స్పైగా రివాల్వర్ గురిపెట్టి సీరియస్ లుక్‌లో కనిపించాడు.
మరో యుద్ధానికి వీరుడు సిద్ధం…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో భారీ యుద్ధానికి సిద్ధమయ్యాడు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో భయానికి భయం పుట్టించే వీరుడి కథగా దేవర తెరకెక్కుతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, దేవరకి విలన్ గా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. దేవరగా పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకి రాబోతున్న ఎన్టీఆర్ గోవా షెడ్యూల్ కంప్లీట్ చేసుకోని హైదరాబాద్ వచ్చేసాడు. మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన దీపావళి పార్టీలో ఫ్యామిలీతో సహా పాల్గొన్న ఎన్టీఆర్… ఇక మళ్లీ మేకప్ వేసుకోడానికి రెడీ అయ్యాడు. ఫెస్టివల్ బ్రేక్ కి ఎండ్ కార్డ్ వేసి దేవర సెట్స్ లో పాల్గొంటున్నాడు. ఈ విషయమై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తూ “ఎపిక్ షెడ్యూల్” జరుగుతుందని ట్వీట్ చేసారు. కొరటాల శివ ఫుల్ స్వింగ్ అండ్ స్పీడ్ లో దేవర షూటింగ్ చేస్తున్నాడు. పార్ట్ 1ని ఎట్టి పరిస్థితిలో ఏప్రిల్ 5న రిలీజ్ చేయడమే టార్గెట్ గా దేవర షూటింగ్ జరుగుతోంది. అందుకే ఎక్కువ గ్యాప్స్ లేకుండా షూటింగ్స్ చేస్తున్నారు. ఒక హ్యూజ్ యాక్షన్ ఎపిసోడ్ తో పాటు కొంత టాకీ పార్ట్ ని కూడా ఈ షెడ్యూల్ లో షూట్ చేస్తున్నాడు కొరటాల శివ. నవంబర్ చివరి నాటికి లేదా డిసెంబర్ మిడ్ కి దేవర సినిమాలో ఎన్టీఆర్ పార్ట్ కాంప్లీట్ చేయడానికి టీమ్ అంతా కష్టపడుతున్నారు. అక్కడి నుంచి 2024 ఏప్రిల్ వరకూ రిలీజ్ కి గ్యాప్ ఉంది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ లో క్వాలిటీ అవుట్పుట్ తీసుకోని రావడానికి కొరటాల శివకి కూడా కావాల్సినంత సమయం దొరుకుతుంది.